హైదరాబాద్ : తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను టీఆర్‌ఎస్ పరిష్కరిస్తుందని ఆపార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ఇవాళ తెలంగాణభన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల సమస్యలు, వాళ్లు ఏం కోరుకుంటున్నారో కూడా టీఆర్‌ఎస్‌కే తెలుసునని వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్ రాక ముందు తెలంగాణ భాష, యాస, సంస్కృతికి అన్యాయం జరిగిందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ వచ్చాకే ఈ పరిస్థితిలో మార్పు వచ్చిందని వెల్లడించారు. పేదల బతుకుల్లో నవ్వులు నింపేందుకే తెలంగాణ వచ్చిందని తెలిపారు. బంగారు తెలంగాణ సాధిద్దాం, తెలంగాణలో బడుగు, బలహీన వర్గాలవారు ఆత్మగౌరవంతో బతికేలా ప్రణాళికలు రూపొందించుకుందామని అన్నారు. రూ.2 లక్షల 75 వేల కోట్ల ఖర్చుతో వారికి పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక పిల్లల తిండి, చదువు, బట్టలు, పుస్తకాలు అన్ని ప్రభుత్వమే భరించేలా చూస్తామన్నారు.