Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్‌గా రసమయి

తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో తన పాటతో ఉద్యమాన్ని రగిలించిన ప్రజా వాగ్గేయకారుడు, మానుకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం సమున్నత గౌరవం కల్పించింది.

CM-KCR-nominates-Rasamai-Balakishan-as-Telangana-Cultural-Chairman

-ప్రజా వాగ్గేయకారుడికి పట్టంగట్టిన ప్రభుత్వం -ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం సూచన -కళాకారులు, ధూంధాంకు దక్కిన గౌరవం: రసమయి ఆయనను తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్‌గా నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సంతకం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన కళాకారులు రాష్ట్ర పునర్నిర్మాణంలో కూడా ముఖ్యపాత్ర పోషించాలని కోరారు. జూబ్లీహిల్స్‌లోని సాంస్కృతికశాఖ భవనాన్ని తెలంగాణ సాంస్కృతిక సారధి కార్యక్రమాల నిర్వహణకు వినియోగించాలని అధికారులను సీఎం ఆదేశించారు. చెరువుల పునరుద్ధరణ, హరితహారం, వాటర్‌గ్రిడ్ తదితర కార్యక్రమాలతోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడా విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. సాంఘిక దురాచారాలు, మూఢనమ్మకాలపై కూడా ప్రచారయుద్ధం సాగించాలని సూచించారు.

కూలిబిడ్డపాటకు దక్కిన గౌరవం: రసమయి తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్మన్‌గా నియమించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రసమయి బాలకిషన్ కృతజ్ఞతలు తెలిపారు. ఉపముఖ్యమంత్రి రాజయ్య, మంత్రులు ఈటెల రాజేందర్, జగదీశ్‌రెడ్డి తదితరులతో కలిసి శుక్రవారం సచివాలయంలో ఆయన సీఎంను కలిశారు. ఉద్యమకారుడికి ఉన్నత పదవి ఇచ్చారని తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక సారధి సంస్థను సమున్నత ఆశయంతో స్థాపించామని, దానికి అనుగుణంగా పనిచేయాలని బాలకిషన్‌కు సీఎం సూచించారు.

అనంతరం రసమయి టీ మీడియాతో మాట్లాడుతూ ఒక కళాకారుడిగా ఎమ్మెల్యేను అయినందుకు సంతోషంగా ఉందని అదే సమయంలో ప్రభుత్వం తెలంగాణ సాంస్కృతిక సారధికి చైర్మన్‌గా నియమించడం అంటే కూలిబిడ్డ పాటకు దక్కిన గౌరవమేనని అభిప్రాయపడ్డారు. ఈ పదవి కళాకారులకు, ధూంధాంకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఉద్యమంలో, ప్రభుత్వంలో కళాకారులను భాగస్వాములను చేస్తున్నందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. తనపై ముఖ్యమంత్రి ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానని తెలిపారు. తెలంగాణ పునర్నిర్మాణంలో బంగారు తెలంగాణకు బాటలు వేసేలా, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యక్రమాలు చేపడతామన్నారు. తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్మన్‌గా రసమయిని నియమించటంతో మెదక్ జిల్లా సిద్దిపేట మండలంలోని ఆయన స్వగ్రామం రావురూకులలో సంతోషం వెళ్లివిరిసింది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.