-మన విధానాలకు విశేష ఆదరణ -ప్రఖ్యాత సంస్థల అధినేతల ప్రశంసలు -పరిశ్రమల స్థాపన, విస్తరణకు ఆసక్తి -ఈ పర్యటన గొప్ప ఉత్సాహాన్నిచ్చింది -దావోస్ నుంచి ‘ఈనాడు’తో మంత్రి కేటీఆర్ ప్రత్యేక ముఖాముఖి
వైమానిక రంగంలో లాకిడ్ మార్టిన్, ఏయిర్ ఆసియా, ఔషధ రంగంలో నొవార్టిస్, ఫైజర్.. ఐటీలో హెచ్‌పీ, సేల్స్ ఫోర్స్ వంటి సంస్థలు, హిటాచి, మిత్సుబిషి, ఎరిక్సన్ వంటి వాహన, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థలు ఇక్కడ పెట్టుబడులకు ఆసక్తి చూపాయి.ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుతో మనమేంటో ప్రపంచానికి తెలిసిందని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పెట్టుబడుల సాధనతోపాటు ఉద్యోగాలు, ఉపాధి కల్పన లక్ష్యంగా సాగిన దావోస్ పర్యటన విజయవంతమైందని.. తనకు గొప్ప సంతృప్తినిచ్చిందన్నారు. ఈ ఉత్సాహంతో మరింత ముందుకు సాగుతామని చెప్పారు. దావోస్ పర్యటన ముగింపు సందర్భంగా కేటీఆర్ శనివారం అక్కడి నుంచి ‘ఈనాడు’కు ఫోన్లో ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. విదేశీ పర్యటన.. ఫలితాలు.. అనంతర కార్యాచరణ తదితర అంశాలను సమగ్రంగా వివరించారు.
ఆర్థిక వేదిక సదస్సుతో పెట్టుబడులకు మరింత ఊతమిచ్చిందని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. దావోస్ నుంచి ‘ఈనాడు’కు ఆయన ఫోన్లో ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు..
దావోస్ పర్యటన ఎలా సాగింది? ప్రపంచంలోని ప్రముఖ పారిశ్రామిక, ఐటీ సంస్థల ఛైర్మన్లు, సీఈవోలు, ఇతర ప్రముఖులను ఒకేసారి కలిసే అవకాశం దక్కింది. అయిదు రోజుల్లోనే సాధ్యమైనంత ఎక్కువ మందితో భేటీ అయ్యాం. నొవార్టిస్, ఫైజర్, సీఏ, లాకిడ్ మార్జిన్, హ్యుందాయ్, హిటాచి, మిత్సుబిషి, పెప్సికో, సుజుకి, ఎయిర్ ఆసియా వంటి ప్రసిద్ధి చెందిన సంస్థల అధినేతలను, సీఈవోలకు తెలంగాణ పారిశ్రామిక విధానం, ఇక్కడ వనరులు, మౌలిక వసతులు, ప్రత్యేకతలను కళ్లకు కట్టినట్లు తెలియజేశాం. మన విధానాలకు విశేష ఆదరణ కనిపించింది. చర్చల్లో వక్తగా మాట్లాడడంతోపాటు తెలంగాణకు ఉపయుక్తమైన అంశాలకు సంబంధించిన ఇతర సెషన్లలోనూ పాల్గొన్నా.
ఈ సందర్భంగా మీ అనుభవాలు..? దావోస్ పర్యటన సంతృప్తిని మిగిల్చింది. ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్, పలు దేశాల ఉపాధ్యక్షులు, ఉప ప్రధానులు, కేంద్ర మంత్రులు పాల్గొన్న సదస్సులో నేను పాల్గొనడం మంచి అవకాశం. కేంద్ర మంత్రులు, పరిశ్రమల శాఖ అధికారులతో వివిధ విషయాలను చర్చించా.
తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేస్తామన్న లక్ష్యాన్ని ఏ మేరకు సాధించారు? మనది వినూత్నమైన పారిశ్రామిక విధానం. ఎన్నో వసతులు, భారీగా మానవ వనరులున్నాయి. ఈ అంశాలకు విస్తృత ప్రచారం లభించడం ద్వారా ఫలాలు పొందే వీలుంటుంది. ఇదే భావనతో దావోస్‌కు పయనమయ్యా. వినూత్నమైన తెలంగాణ పారిశ్రామిక విధానాన్ని ప్రపంచానికి తెలియజేశా. పక్షం రోజుల్లో అనుమతులు, రంగాలవారీగా రాయితీలు, ప్రోత్సాహకాల గురించి వివరించా. ప్రభుత్వపరంగా చూపుతున్న చొరవతోపాటు భూముల లభ్యత, నీటి వసతులు.. విమానాశ్రయం, రహదారులు ఇతర సానుకూలతలను వివరించాం. రాజధాని హైదరాబాద్ ప్రపంచంలోని అన్ని అనుకూలతలు గల నగరాల్లో ఒకటిగా సదస్సులో ఆవిష్కరించగలిగాం. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోనూ వివిధ రంగాల్లో అవకాశాల గురించి వెల్లడించాం.
ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు నిర్వహణ తీరు ఎలా ఉంది? సదస్సు నిర్వహణ తీరు చాలా బాగుంది. పెట్టుబడులు, వ్యాపారాభివృద్ధి మాత్రమే కాకుండా సమ్మిళిత అభివృద్ది, వాటి ఫలాలను ప్రజల వద్దకు తీసుకెళ్లడంలో ఎదురవుతున్న సవాళ్లు.. పరిష్కారాల గురించి విస్తృత స్థాయి చర్చ జరిగింది. సాంకేతిక పరంగా ఆటోమేషన్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, డిజిటల్ మాధ్యమాలు, పరిశోధనలు, అంకుర పరిశ్రమల ప్రాధాన్యతల గురించి చర్చలు జరిగాయి. ఈ సదస్సులో ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. ఇందులో భాగస్వామ్య అనుభవం తెలంగాణలో మున్ముందు జరిగే ప్రపంచ స్థాయి సదస్సుల నిర్వహణకు ఉపయుక్తంగా ఉంటుంది.
ఈ పర్యటన వల్ల తెలంగాణకు ప్రయోజనాలు? తెలంగాణలో వైమానిక, జౌళి, ఐటీ, ఔషధ తదితర రంగాల్లో పెట్టుబడుల సమీకరణతోపాటు విస్తరణకు అవకాశం ఉంది. కొత్త సంస్థలు పరిశ్రమలను స్థాపించనున్నాయి. ఇప్పటికే హైదరాబాద్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న పలు సంస్థలు విస్తరణ కోసం ముందుకొచ్చాయి. వైమానిక రంగంలో లాకిడ్ మార్టిన్, ఏయిర్ ఆసియా, ఔషధ రంగంలో నొవార్టిస్, ఫైజర్.. ఐటీలో హెచ్‌పీ, సేల్స్ ఫోర్స్ వంటి సంస్థలు, హిటాచి, మిత్సుబిషి, ఎరిక్ సన్ వంటి వాహన, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థలు పెట్టుబడులకు ఆసక్తి చూపాయి. ఇండోరమా వెంచర్స్ అనే జౌళి ఉత్పత్తుల సంస్థ వరంగల్‌లోని కాకతీయ మెగా జౌళి పార్కులో పరిశ్రమ ఏర్పాటుకు సమ్మతి తెలిపింది. టెక్ మహీంద్రా సంస్థ వరంగల్‌లో 500 మందితో ఐటీ కేంద్రాన్ని నెలకొల్పేందుకు అంగీకరించింది. దీని ద్వారా విశేష ఫలితాలు వస్తాయని విశ్వసిస్తున్నాం
మీ తదుపరి కార్యాచరణ ఏమిటి? ఆసక్తి వ్యక్తీకరించిన సంస్థలతో మా శాఖ ద్వారా నిరంతర సంప్రదింపులను కొనసాగిస్తాం. పెట్టుబడుల సాధన మా లక్ష్యం. అభివృద్ధితోపాటు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించడానికి కృషి చేస్తాం. వైమానిక, ఐటీ, జౌళి, ఆహార శుద్ధి లాంటి రంగాల్లో మరింత ప్రగతికి కృషి చేస్తాం. మౌలిక వసతులతో పాటు రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు శిక్షణ ఇప్పించి మానవ వనరులు కల్పిస్తామని కొత్త సంస్థలకు హామీ ఇచ్చాం. ఇందు కోసం టాస్క్ లాంటి సంస్థలను ఉపయోగిస్తాం.
తెలంగాణ విధానాలపై పారిశ్రామికవేత్తల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? ప్రసిద్ధ సంస్థలతోపాటు పలు దేశాల పారిశ్రామికవేత్తలను మన విధానం ఎంతగానో ఆకర్షించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో చేపట్టిన విధానాల ద్వారా తెలంగాణ ప్రతిష్ఠ ఇనుమడిస్తోంది. నిరంతర విద్యుత్, సత్వర అనుమతులపై పరిశ్రమల ప్రతినిధులు ఆనందం వ్యక్తంచేశారు. గతంలో అనుమతుల్లో జాప్యం, విద్యుత్ కోత సమస్యలుండేవని.. వాటిని సత్వరమే అధిగమించి, గొప్ప ప్రగతిని సాధించారంటూ అభినందించారు. సీఏ వంటి పెద్ద సంస్థల ప్రతినిధులు హైదరాబాద్ గురించి గొప్పగా పొగిడారు. వారి ప్రశంసలు కొత్త ఉత్సాహాన్నిచ్చాయి.
కృత్రిమ మేధతో సత్ఫలితాలు -దావోస్‌లో చర్చాగోష్ఠిలో మంత్రి కేటీఆర్
కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్)తో చక్కటి ఫలితాలు వస్తాయని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో శనివారం ‘స్థానిక సమస్యలకు ప్రపంచ స్థాయి పరిజ్ఞాన వినియోగం’ అంశంపై జరిగిన చివరి చర్చాగోష్ఠిలో ఆయన పాల్గొని ప్రసంగించారు. వ్యక్తులు, సమాజం, ప్రభుత్వాల సమస్యలను పరిష్కరించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలన్నారు. ఇందులో సార్వత్రిక గణాంకాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం 2016లో సార్వత్రిక గణాంక విధానాన్ని అమల్లోకి తెచ్చిందని.. ఇప్పటి వరకు ప్రజాసంబంధ]మైన 50 పత్రాలను విడుదల చేసిందని చెప్పారు. ఈ గణాంకాల ద్వారా సామాజిక సమస్యలను గుర్తించి, పరిష్కరించొచ్చని చెప్పారు.
నిర్వాహకులకు కేటీఆర్ కృతజ్ఞతలు ఈ నెల 23 నుంచి జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు శనివారం రాత్రి ముగిసింది. మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. అయిదురోజుల పాటు జరిగిన సదస్సులో కేటీఆర్ ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వ బృందం పాల్గొంది. కేటీఆర్ మూడు గోష్ఠుల్లో పాల్గొన్నారు. పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు.