Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

తెలంగాణ శత్రువు మోదీ

-8 ఏండ్లలో కల్లబొల్లి కథలు చెప్పడం తప్ప చేసిందేమిటి?
-ఎవరిని ఉద్ధరించిండు.. ఏం మేలు చేసిండు?
-ప్రజలకు టోపీ పెట్టి.. సావుకార్లకు పెడుతున్నడు
-తప్పకుండా బీజేపీని ఇంటికి సాగనంపుదాం
-జెండా చూసి మోసపోతే కథ మళ్లీ మొదటికే..
-దుష్ట శక్తులను తరిమి తరిమి కొట్టాల్సిందే..
-లేకుంటే కైలాసం ఆటలో పెద్దపాము మింగినట్టే
-కృష్ణా వాటా తేల్చనందువల్లే ‘పాలమూరు’ ఆలస్యం
-ఢిల్లీకి వెళ్లి అడిగే ధైర్యం రాష్ట్ర బీజేపీ నేతలకు లేదు
-అడ్డంకులు ఎదురైనా ధైర్యంగా ముందుకెళ్తున్నం
-కృష్ణా నది జలాలు తెస్తాం.. పాలమూరు కడతాం
-వికారాబాద్‌ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌

ఇయ్యాల ప్రధాన మంత్రే మనకు శత్రువు అయ్యిండు. కేంద్ర ప్రభుత్వం తెలివి తక్కువతనం వల్ల, నిర్ణయం తీసుకోలేని నిష్క్రియాపరత్వం వల్ల వికారాబాద్‌కు కృష్ణా నీళ్లు రావడం ఆలస్యం అవుతున్నది. కేంద్రం ఎన్ని అడ్డంకులు పెట్టినా నేను ధైర్యంగా ముందుకు వెళుతున్న. తప్పకుండా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కడతం. వికారాబాద్‌, తాండూరు, పరిగి, చేవెళ్ల నియోజకవర్గాల్లో నాలుగు లక్షల ఎకరాలకు నీళ్లు తెచ్చి మీకు అప్పగిస్త్త. ఇక్కడ పొలాల్లో కృష్ణా నది నీళ్లు పారించి చూపిస్త. నేను మాట ఇస్తున్నా.

– సీఎం కేసీఆర్‌..

రాష్ట్రంలో మనం ఎంత బాగున్నా, కేంద్ర ప్రభుత్వం బాగాలేకపోతే ఆశించిన అభివృద్ధి కాదు. కేంద్రంలో రాష్ట్రాల హక్కులను గౌరవించే, ప్రజల సంక్షేమాన్ని చూసే ఉత్తమమైన ప్రభుత్వం రావాలి. ఆ దిశగా మనం సిద్ధం కావాలి. మనందరం ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపి, మంచి ప్రజల ప్రభుత్వాన్ని తెచ్చే క్రతువులో భాగస్వాములం కావాలి. ప్రధాన మంత్రి చెప్పిన ఏ ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చలేదు. ఇటువంటి దుర్మార్గులను తరిమికొట్టి అద్భుతమైన భారతదేశాన్ని మనం నిర్మించుకోవాలి.
– వికారాబాద్‌ సభలో సీఎం కేసీఆర్‌..

తెలంగాణకు ప్రధాని మోదీ శత్రువుగా మారారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. గత ఎనిమిదేండ్లలో మోదీ కల్లబొల్లి కథలు చెప్పడం తప్ప చేసిందేమీ లేదన్నారు. ప్రజలకు టోపీ పెట్టి పెద్ద పెద్ద సావుకార్ల కడుపు నింపుతున్నడని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలివితక్కువతనం వల్లనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఆలస్యం అవుతున్నదని.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ధైర్యంగా ముందుకు పోతున్నమని చెప్పారు. మంగళవారం వికారాబాద్‌లో కలెక్టరేట్‌ భవన సముదాయం, టీఆర్‌ఎస్‌ కార్యాలయ ప్రారంభంతోపాటు.. మెడికల్‌ కళాశాలకు శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనంతరం బహిరంగసభలో చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే..

ఉచిత పథకాలంటూ సన్నాయి నొక్కులు
ప్రధానమంత్రిని నేను అడిగిన. ఎనిమిదేండ్లు మీరు ప్రధానిగా ఉండి ఈ దేశానికి ఏం చేశారు? రైతులకా? మహిళలకా? గిరిజనులకా? ముస్లిం మైనార్టీలకా? దళితులకా? ఎవరికి మేలుచేశారు? దేనిలో మంచి చేశారు? సాగునీటి రంగంలోనా? కరెంటు రంగంలోనా? ఎవరిని ఉద్ధరిచ్చిండ్రు? ఏం లాభం చేసిండ్రు? ఒక్కటంటే ఒక్క మంచి పని చేసిండ్రా? దేనిలోనూ మేలు జరుగకపోగా రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలో కొంత సంక్షేమానికి చర్యలు తీసుకొంటుంటే అడ్డు పడుతున్నరు. వ్యవసాయ స్థిరీకరణ కోసం రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు పెడితే.. ఇవి ఉచిత పథకాలంటూ రద్దు చేయాలని సన్నాయి నొక్కులు నొక్కుతున్నరు. కరెంటు మీటర్లు పెట్టి రైతుల మెడమీద కత్తి పెట్టి బిల్లులు వసూలు చేయాలని చెప్తున్నరు.

మన కడుపులు కొడతరు
ఈ బీజేపీ జెండాను చూసి మోసపోతే ఏం జరుగుతదంటే ట్రాన్స్‌ఫార్మర్ల కాడ, బాయిల కాడ మోటర్లకు మీటర్లు పెడతరు. సంస్కరణల పేరుతో మనకు టోపీ పెట్టి, పెద్ద పెద్ద సావుకార్ల కడుపులు నింపుతరు. మన కడుపులు కొడతరు. రైతులకు ఉచిత కరెంటు ఇవ్వొద్దంట. పెద్ద పెద్ద సావుకార్లకు మాత్రం రూ.20 లక్షల కోట్లు దోచిపెడుతుండ్రు. ఇప్పటివరకు రూ.10 లక్షల కోట్లు ఎన్‌పీఏల పేరుమీద ఆ సావుకార్లకు ఇచ్చినమని కేంద్రమే పార్లమెంట్‌లో బాజాప్తాగా ఢంకా బజాయించి చెప్తా ఉన్నది. ఇవ్వాళ గ్యాస్‌ సిలిండర్‌, పెట్రోల్‌ ధర ఎంత? గతంలో ఎంత ఉండె? ఇవాళ బ్యాంకులు ఏ విధంగా దోచుకోబడుతున్నయి? మనకు సింగరేణి బొగ్గు ఉండంగ కూడా సావుకార్లు అమ్మే బొగ్గే కొనాలని చెప్తున్నరు. ఇండోనేషియా, ఆస్ట్రేలియా నుంచే బొగ్గు కొనాలని కేంద్రం చెప్తున్నది. మనకు రూ.4 వేలకు టన్ను ఇక్కడే దొరుకుతున్నది. బయటి దేశం వాళ్లు అమ్మేది టన్ను రూ.30 వేలు. మరి కొందామా? బీజేపీ జెండాతో ఆ ప్రమాదం వస్తది. అందుకే ఈ జెండా, ఆ జెండా (బీజేపీ జెండాలు చూసి) చూసి మోసపోతే.. మళ్లా మొదటికే వస్తం. మళ్లా తెలంగాణలో పాత కథనే వస్తది. కేసీఆర్‌ ఏం తప్పు చేసిండని కొందరు బీజేపీ వాళ్లు జెండాలు పట్టుకుని నా బస్సుకు అడ్డం వస్తున్నరు? వికారాబాద్‌కు కేసీఆర్‌ మంచినీళ్లు ఇవ్వలేదా? ఉచిత కరెంటు ఇవ్వట్లేదా? వికారాబాద్‌ను జిల్లా చేయలేదా? కేసీఆర్‌ ప్రభుత్వంలో ఇవ్వాళ భూముల ధరల పెరగలేదా? తెలంగాణలో మూడెకరాలున్న రైతు కోటీశ్వరుడు కాలేదా? ఇవన్నీ చూసుకుంట కూడా ఏం తెల్వనట్టు తమాషా లెక్కన కూర్చుంటే ఏమైతది? మళ్లా మొదటికే వస్తది. కైలాసం ఆటల పెద్దపాము మింగినట్టు అయితది. అది పెద్ద ప్రమాదం. నేను అందుకే మిమ్మల్ని కోరుతున్న. ఎవరివో మాటలు పట్టుకుని గోల్‌మాల్‌ అయితే మళ్లా గోస పడ్తం.

ఒక్క మంచి మాటా లేదు
నిన్న ప్రధాని మోదీ మాట్లాడింది అంతా నేను విన్న. గడిచిన 8 ఏండ్లలో దేశానికి ఏమీ చేయలేదు. మిగిలిన రెండేండ్ల కోసం ఏమన్న చెప్త్తరేమో అని ఆశతో విన్న. కానీ ఏం లేదు. గంటసేపు మాట్లాడి ఊదరగొడితే, ఒక్క పథకం ప్రకటించలేదు. ప్రజలకు ఏం రాలేదు. అంతా గుంపులో గోవింద. నెత్తికో రుమాల్‌ కట్టి వేషమేసి.. ఓ కథ.. డైలాగులు చెప్పిండే తప్ప దేశానికి ఉపయోగపడే ఒక్క మంచి మాట చెప్పలేదు. ఇదేనా దేశానికి కావాల్సింది? చదువుకున్న వాళ్లు, కవులు, కళాకారులు, మేధావులు, ప్రజలు అంతా దీని గురించి ఆలోచించాలి. అందరూ చైతన్యవంతులు కావాలి. రాష్ట్రంలో మనం ఎంత బాగున్నా, కేంద్ర ప్రభుత్వం బాగాలేకపోతే ఆశించిన అభివృద్ధి కాదు. కేంద్రంలో రాష్ర్టాల హక్కులను గౌరవించే, ప్రజల సంక్షేమాన్ని చూసే ఉత్తమమైన ప్రభుత్వం రావాలి. ఆ దిశగా మనం సిద్ధం కావాలి. దేశ పరిస్థితి దిగజారుతున్నది. నిరుద్యోగం పెరుగుతున్నది. రూపాయి విలువ పడిపోతున్నది. ఏనాడూ లేనటువంటి పరిస్థితులు వస్తున్నయి. అందుకే మనందరం ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపి, మంచి ప్రజల ప్రభుత్వాన్ని తెచ్చే క్రతువులో భాగస్వాములం కావాలి. ప్రధాన మంత్రి చెప్పిన ఏ ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చలేదు. ఇటువంటి దుర్మార్గులను తరిమికొట్టి అద్భుతమైన భారతదేశాన్ని మనం నిర్మించుకోవాలి. అందుకు తగినట్లు మనం తయారు కావాలె. ఆ దిశగా ముందుకు తీసుకుపోవాలె. వికారాబాద్‌ చాలా చైతన్యవంతమైన జిల్లా. మీరంతా విజ్ఞతతో ఆలోచించి ఈ దుష్టశక్తులకు తగిన బుద్ధి చెప్పాలి. కలెక్టరేట్‌ భవనం ప్రారంభించుకొన్న ఈ సందర్భంలో ప్రజాప్రతినిధులు, జిల్లా ప్రజలు, అధికారులందరికీ అభినందనలు. భవిష్యత్తులో ఉజ్వల భారత నిర్మాణం దిశగా మనందరం కంకణబద్ధులం కావాలి.. ముందుకు సాగాలి.

పాలమూరు ఆపిందెవరు?
వికారాబాద్‌ జిల్లాకు కృష్ణా నీళ్లు రావాలె. వందకు వందశాతం తెచ్చి ఇచ్చే బాధ్యత నాది. పాలమూరు రంగారెడ్డి పథకం పనులు ఇప్పటికే మొదలు పెట్టినం. కానీ పనులు ఆపినవాళ్లు ఎవరు? కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చాలని అడిగితే తేల్చని వాళ్లెవరు? ఇవాళ నా బస్సుకు అడ్డంగా బీజేపీ జండా పట్టుకొని వచ్చిన వాళ్లు. మా నీళ్ల వాటా తేల్చాలని ప్రధానికి దాదాపు వంద దరఖాస్తులు ఇచ్చిన. ‘అయ్యా మేం కరువులో ఉన్నం. బాధలో ఉన్నం. మాకు ఎన్ని నీళ్లు ఇస్తరో చెప్పండి.. దాని ప్రకారం ప్రాజెక్టులు కట్టుకొంటమని ప్రధానిని అడిగితే కాలికి పెడితే మెడకు.. మెడకు పెడితే కాలికి అన్నట్టు చేస్తున్రు. ఇవాళ ప్రధానమంత్రే మనకు శత్రువు అయ్యిండు. కేంద్రం తెలివి తక్కువతనం వల్ల నిర్ణయం తీసుకోలేని నిష్క్రియాపరత్వం వల్ల వికారాబాద్‌కు కృష్ణా నీళ్లు ఆలస్యమవుతున్నాయి. కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకొంటున్నరు. దీనిపైన మనమంతా నిలదీయాలి. వికారాబాద్‌ జిల్లా బీజేపీ అధ్యక్షుడిని, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని నేను అడుగుతున్న.. దమ్ముంటే ఢిల్లీకి పోయి ‘కృష్ణా నదిలో నీళ్ల వాటా తేల్చడం లేదు. కేంద్రం దద్దమ్మ, తెలివితక్కువతనం వల్ల మా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఆలస్యం అవుతున్నది. మా వికారాబాద్‌ జిల్లాకు నీళ్లు వస్తలేవు. ఆ విషయం త్వరగా తేల్చండి’ అని అడిగి తెచ్చే మొగోళ్లు కావాలి. అక్కడికి పోయి మోదీని చూడంగనే వీళ్లకు లాగులు తడిసిపోతయ్‌.. మాటలు రావు. మీరు తెలంగాణ ప్రజలే అయితే కేంద్రంలో ఉన్న మీ పార్టీని ఎందుకు అడగరు? ఈ కలెక్టరేట్‌ ప్రారంభోత్సవానికి నేను వస్తే.. చిల్లరమల్లర బీజేపీగాళ్లు రెండు, మూడు జెండాలు పట్టుకుని నా బస్సుకు అడ్డం వచ్చిండ్రు.. ఒక ఐదు పది మంది పిలగాళ్లు వచ్చిండ్రు. ఒకవేళ మన మంది అంతా కొడితే వాళ్లు తుక్కుతుక్కు కారా?

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.