-2/3 మెజారిటీ సాధిస్తున్నాం -పెరిగిన ఓటింగ్ శాతం మాకే అనుకూలం -జాతీయ స్థాయిలోనూ కీలక పాత్ర పోషిస్తాం -గవర్నర్‌గారూ.. రెచ్చగొట్టే ప్రసంగాలు ఆపించండి -టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కే కేశవరావు

తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని టీఆర్‌ఎస్ పార్టీ ఏర్పాటు చేయబోతోంది. జాతీయ రాజకీయాల్లో కూడా టీఆర్‌ఎస్ కీలక పాత్ర పోషించనుంది..ఇప్పటికే జాతీయ పార్టీలతో ప్రాథమిక చర్చలు ప్రారంభించాం.. కేంద్రంలో ఏ కూటమి అధికారంలోకి రావాలనే విషయంలో టీఆర్‌ఎస్ పాత్ర కీలకంగా ఉంటుంది అని ఆ పార్టీ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు స్పష్టం చేశారు. గురువారం ఆయన తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో పెరిగిన ఓటింగ్ శాతం తమకే అనుకూలిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఎన్నికల్లో మూడింట రెండు వంతుల సీట్లు టీఆర్‌ఎస్ గెలువబోతున్నదని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధే టీఆర్‌ఎస్ లక్ష్యం.. ప్రజల ఆకాంక్షలు, వారి అభీష్టం మేరకే తమ పాలన ఉంటుందని అన్నారు. ప్రతి పౌరుడు ఇది మా ప్రభుత్వం అనుకునేలా పాలన ఉంటుందన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి తీరతామని ఆయన చెప్పారు. తమ ప్రభుత్వం అధికారం చేపట్టిన మొదటిరోజునుంచే హామీలు నెరవేర్చే కార్యాచరణ చేపడతామన్నారు. టీఆర్‌ఎస్ విజయం తెలంగాణ ప్రజా విజయమని అభివర్ణించారు. తమపై రెండు బాధ్యతలు ఉన్నాయని చెప్పిన ఆయన.. ప్రభుత్వంలో ప్రజా భాగస్వామ్యం, మేనిఫెస్టోలో చెప్పిన అన్ని అంశాలను పూర్తి చేయడమే ఆ బాధ్యతలని వివరించారు. రాజీ అనేది లేకుండా చెప్పిన ప్రతి మాటకు కట్టుబడి ఉంటామని ప్రకటించారు. తెలంగాణపై ఆంక్షలు, వివక్ష ఇంకా కొనసాగుతున్నాయని, వీటిపై రాజ్యాంగ పద్ధతిలో ప్రజాస్వామ్యయుతంగా కొత్త సర్కార్ ఏర్పాటు ద్వారా నిర్ధిష్ట గడువుతో పోరాటం చేస్తామని వెల్లడించారు.
రెచ్చగొట్టేవారిని అదుపు చేయండి… ఇదిలా ఉంటే కొందరు జోకర్లు ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని, వారిపై ఎన్నికల సంఘం, గవర్నర్ సుమోటాగా కేసులు నమోదు చేయాలని కేకే డిమాండ్ చేశారు వారు స్థాయిని మరిచి చేస్తున్న రెచ్చగొట్టే ప్రసంగాలకు మేం ఉద్రేకపడటంలేదని ఆయన చెప్పారు. శాంతిభద్రతలు చేతిలో ఉంచుకున్న గవర్నర్ సమస్యలు రాకుండా చూసుకోవాలని సూచించారు. ఉద్రిక్తతలకు కారణమవుతున్న జోకర్లపై చర్యలు తక్షణమే చేపట్టాలని ఆ బాధ్యత గవర్నర్‌పైనే ఉందని గుర్తు చేశారు అయితే తెలంగాణ వ్యతిరేకుల మాటలు నిన్నటితో పూర్తి కాలేదు..వారి మాటలు మా సెంటిమెంట్‌ను కించపరుస్తున్నాయి. 60 ఏళ్ల తర్వాత సాధించిన తెలంగాణను అవమానిస్తున్నారు.