Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదు

-ఆరేండ్లలో 1.32 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాం
-తప్పని రుజువు చేస్తే పోటీ నుంచి తప్పుకుంటా
-మీట్‌ ది ప్రెస్‌లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా

తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిందేమీ లేదు.. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలో పేర్కొన్న గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు పరి శ్రమ, కాజీపేట రైల్వే కోచ్‌ పరిశ్రమ ఏర్పాటులో తాత్సారం చేస్తున్నది. గిరి జన వర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 450 ఎకరాల భూమిని కేటాయించినా.. కేంద్రం పట్టనట్టు వ్యవహరిస్తున్నది. ఇటీవల దేశవ్యాప్తంగా 170 మెడికల్‌ కళాశాలలకు అనుమతి ఇవ్వగా.. తెలంగాణకు మొండిచెయ్యి చూపింది. సింగరేణి, భెల్‌, ఆర్టీసీ సంస్థలను తెలంగాణ ప్రభుత్వం కాపాడుకోగా.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 23 ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తూ ఊపిరి తీసేందుకు చూస్తున్నది. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని అధికారంలోకి వచ్చిన బీజేపీ.. ఎన్ని ఉద్యోగాలిచ్చిందో వెల్లడించాలి.

స్వరాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆరేండ్లలో 1.32 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసింది.. మేం చెప్పేది తప్పని నిరూపిస్తే ఎమ్మెల్సీ ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటా’ అని నల్లగొండ-వరంగల్‌- ఖమ్మం పట్టభద్రుల స్థానం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి సవాల్‌ విసిరారు. శనివారం వరంగల్‌ ప్రెస్‌క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్‌ ది ప్రెస్‌లో పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడారు. ఉద్యోగాల భర్తీపై తాను చెప్పిన వివరాలు తప్పు అని వరంగల్‌ జర్నలిస్టుల సమక్షంలో ఎవరు రుజువు చేసినా సవాల్‌కు కట్టుబడి ఉంటానని స్పష్టంచేశారు. ఆరేండ్లలో రాష్ట్ర అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాలను పరిశీలించాలని పట్టభద్రులు, మేధావులను కోరారు.

పారదర్శకంగా పోస్టుల భర్తీ
దేశంలోనే అత్యంత పారదర్శకంగా పోస్టులను భర్తీ చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని పల్లా చెప్పారు. గడిచిన ఆరేండ్లలో అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థల్లో 1,32,899 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసిందని వెల్లడించారు. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో 30,594 పోస్టులు, పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఆధ్వర్యంలో 31,972.. విద్యుత్‌ శాఖలో 22,637 .. సింగరేణిలో 12,500, ఆర్టీసీలో 4,756 పోస్టులను భర్తీ చేసిందని స్పష్టంచేశారు. గురుకులాలు, డీసీసీబీ, జలమండలి, యూనివర్సిటీల్లోనూ పోస్టులు భర్తీ అయ్యాయనని తెలిపారు. ఇతర పరిశ్రమల్లో 14.59 లక్షల మంది ఉద్యోగాలు పొందారని తెలిపారు. ఐటీ రంగంలో దాదాపు 2 లక్షల 11 వేల మందికి ఉద్యోగాలు లభించాయని చెప్పారు. త్వరలోనే మరో 50 వేల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నదని తెలిపారు.

కోటి ఎకరాలకు సాగునీరు
వరి సాగులో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని పల్లా చెప్పారు. యాసంగి సీజన్‌లో 55 లక్షల ఎకరాల్లో వరి సాగైందని, తెలంగాణ తర్వాత స్థానంలో ఉన్న నాలుగు రాష్ర్టాల్లో కలిపినా ఇంత విస్తీర్ణం లేదని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా కాళేశ్వరం ప్రాజెక్టును అతి తక్కువ సమయంలో పూర్తి చేసిందని స్పష్టంచేశారు.

ఆర్థిక వృద్ధిరేటులో అగ్రగామి
14.2 శాతం ఆర్థిక వృద్ధిరేటుతో తెలంగాణ దేశంలోనే మూడో స్థానానికి ఎగబాకిందని పల్లా పేర్కొన్నారు. రూ.2.28 లక్షల తలసరి ఆదాయంతో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ నిలబడిందని చెప్పారు. మన నిధులను మనకే అన్న నినాదం సాకారం చేసుకున్నామని స్పష్టమైందన్నారు. తలసరి ఆదాయంలో దేశ సగటు కంటే తెలంగాణ రెట్టింపు స్థాయిలో ఉన్నదని చెప్పారు.

సంక్షేమంలో నంబర్‌వన్‌
సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్‌వన్‌ స్థానంలో నిలిచిందని పల్లా రాజేశ్వర్‌రెడ్డి చెప్పారు. 40 లక్షల మందికి ఆసరా పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనని అన్నారు. ఆసరా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, కేసీఆర్‌ కిట్‌, ఉచిత కరెంటు, రైతుబంధు, రైతుబీమా, మిషన్‌ భగీరథ, ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ వంటి ఎన్నో పథకాలతో సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని వివరించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.