
-హైదరాబాద్‌కు ఇచ్చిన నిధులెన్ని? -బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి -పసుపుబోర్డుపై బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్యం -బీజేపీ దక్షిణాదిలో పెరగలేదు.. ఉత్తరాదిన తగ్గుతున్నది -మే 23 తర్వాత దేశ రాజకీయాలు మారుతాయి -16 స్థానాల్లో గులాబీ జెండా ఎగురుతుంది -కేంద్రంలో సంకీర్ణమే.. టీఆర్ఎస్ది కీలకపాత్ర -ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ కకావికలం -ఇన్నాళ్లు అన్యాయం చేసి ఇప్పుడు న్యాయ్ -ఏపీలో చంద్రబాబు రిటైర్మెంట్ ఖాయం -మీడియా ఇష్టాగోష్ఠిలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకుగానీ హైదరాబాద్‌కుగానీ ప్రత్యేకంగా ఏమైనా నిధులు ఇచ్చిందా? అని రాష్ట్ర బీజేపీ నాయకులను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు సూటిగా ప్రశ్నించారు. బీజేపీ పాలిత మహారాష్ట్రలో ముంబై మెట్రోకు రూ.17వేల కోట్లు ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించిన కేటీఆర్.. తెలంగాణకు ఐటీఐఆర్ ఇవ్వలేదు, బయ్యారం ఉక్కు పరిశ్రమ ఇవ్వలేదని చెప్పారు. ఈ ఐదేండ్లలో ప్రధాని మోదీ కేవలం రెండుసార్లే తెలంగాణకు వచ్చారని గుర్తుచేశారు. కేంద్రంలో తెలంగాణకు ప్రాతినిధ్యం లేకుండాచేశారని విమర్శించారు. తెలంగాణలోని నాలుగుకోట్ల మందిలో ఒక్కరు కూడా కేంద్రమంత్రి పదవికి అర్హులు కాకుండాపోయారా? అని నిలదీశారు. రాష్ర్టానికి ఒక్క మంచిపనికూడా చేయలేదన్న కేటీఆర్.. ఎన్నికలు రాగానే బీజేపీకి రామమందిరం గుర్తుకు వస్తుందని ఎద్దేవాచేశారు.
ఇన్నాళ్లు పసుపుబోర్డు గురించి స్పందించని బీజేపీ.. రైతులు ఎన్నికల్లో నిలబడితే ఇప్పుడు హామీ ఇస్తున్నారని విమర్శించారు. కేంద్ర వాణిజ్యశాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ ఉన్నప్పుడు ఎంపీ కవిత అనేకమార్లు కలిసి వినతిపత్రం ఇచ్చినా స్పందనలేదని అన్నారు. ఇప్పు డు మాత్రం గుర్తుకు వచ్చిందా? అని ప్రశ్నించారు. ఎన్నికల అనంతరం కేంద్రంలో టీఆర్ఎస్ నిర్ణయాత్మక పాత్ర పోషించనున్నదని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు స్పష్టమైన మెజార్టీరాదని చెప్పారు. బీజేపీ దక్షిణాదిలో పుంజుకోలేదని, ఉత్తరాదిలో సీట్లు తగ్గుతాయ ని ఆయన అభిప్రాయపడ్డారు. మే 23 తరువా త దేశ రాజకీయాలు మారుతాయని, కేం ద్రం లో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమేని స్పష్టంచేశారు. రాష్ట్రంలో 16 స్థానాల్లో గులాబీ జెండా ఎగురటం ఖాయమన్నారు. ఈ సీట్లే కేంద్రంలో కీలకంగా మారుతాయని చెప్పారు. రాబోయే ప్రభుత్వంలో నియోజకవర్గాల పునర్విభజన సాధిస్తామని విశ్వాసం వ్యక్తంచేశారు. ఎన్నికల తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ కకావికలమవుతుందని, ఏపీలో చంద్రబాబు రిటైర్ అవుతారని అన్నారు. తెలంగాణభవన్‌లో గురువారం మీడియాతో కేటీఆర్ ఇష్టాగోష్ఠిలో మాట్లాడారు. సమకాలిన రాజకీయ అంశాలపై స్పందించారు. వివరాలు.. ఆయన మాటల్లోనే..
బీజేపీకి బిల్డప్ ఎక్కువ బీజేపీకి బిల్డప్ ఎక్కువ ఉంటుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన ముషీరాబాద్ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థికి వచ్చిన మెజార్టీ కంటే ఆయనకు వచ్చిన ఓట్లు తక్కువ. దేశంలో బీజేపీకి 300 సీట్లు వస్తాయని చెప్తున్న ఆయన తెలంగాణలో మూడు తెచ్చుకోమనండి చూద్దాం! గత అసెంబ్లీ ఎన్నికల్లోనే ఆ పార్టీ దెబ్బతిన్నది. నైతికత ఉంటే ఆయన పదవికి ఎప్పుడో రాజీనామా చేయాలి. బీజేపీకి హడావుడి ఎక్కువ. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో అదే చేశారు. ప్రధాని మోదీతోపాటు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, ఆరుగురు సీఎంలు, 11 కేంద్రమంత్రులు వచ్చి ప్రచారం చేశారు. ఏమైంది? రాష్ట్రంలో ఎప్పుడూ బీజేపీని ప్రజలు ఆహ్వానించరు. తెలంగాణ మొదటి నుంచి ఉద్యమాల చరిత్ర కలిగిన ప్రాంతం. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, తెలంగాణ ఉద్యమం.. వాటి మూలాలు ఎప్పుడూ ఉంటాయి. కాబట్టి రాష్ట్రంలో బీజేపీకి ఎప్పుడైనా అవకాశాలు తక్కువే.
ఉత్తరాదిలో తగ్గుతుంది.. దక్షిణాదిలో పుంజుకోలేదు దక్షిణాదిలో బీజేపీ పుంజుకోలేదు. ఉత్తరాదిన బాగా తగ్గింది. ఉత్తరప్రదేశ్‌లో 71 సీట్లు బీజేపీకి ఉన్నా.. ఎస్పీ, బీఎస్పీ పొత్తుతో తీవ్రంగా నష్టపోనున్నది. బీహార్‌లోనూ ఇదే పరిస్థితి ఉన్నది. ఇటీవలే మూడు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కోల్పోయింది. ప్రస్తుతం 44 సీట్లున్న కాంగ్రెస్‌కు 80-90 సీట్లకంటే ఎక్కువ వచ్చే అవకాశంలేదు. 20 రాష్ట్రాల్లో కాంగ్రెస్ లేదు. కాంగ్రెస్ ఏదైనా రాష్ట్రంలో 20 ఎంపీ సీట్లు గెలుచుకునే పరిస్థితి ఉన్నదా? దక్షిణాదిలో 130 సీట్లు ఉంటే కాంగ్రెస్, బీజేపీలకు పదిసీట్లు వస్తాయా? దేశవ్యాప్తంగా బీజేపీకి 150, కాంగ్రెస్‌కు వందలోపు సీట్లు వస్తాయి.
అన్యాయం చేసి న్యాయ్.. దేశానికి అన్యాయంచేసిన కాంగ్రెస్.. ఇప్పుడు న్యాయ్ అంటూ వస్తే ప్రజలు నమ్మరు. రాహుల్ నాయనమ్మ నుంచి ఇప్పటివరకు వారే పాలించి మళ్లీ ఇప్పుడు న్యాయ్ అంటున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తుంటారు. అంత సులువుగా మరిచిపోరు. ప్రజలు మ్యానిఫెస్టోను చూసి ఓట్లు వెయ్యరు. నమ్మిన నాయకులు, వారు అమలుచేసిన అంశాలను చూస్తారు. నాయకుల మీద విశ్వసనీయతను బట్టి ఓట్లువేస్తారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టో ఎవరికీ ఆర్థంకాలేదు.
మే 23 తర్వాత దేశరాజకీయాలు మారుతాయి దేశంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమే. కేంద్రంలో ఒక ఎంపీ ఓటు తేడాతో ప్రభుత్వం పడిపోయిన విషయాన్ని గుర్తించుకోవాలి. రాష్ట్రంలో టీఆర్ఎస్ గెలిచే 16 సీట్లు కీలకంగా మారబోతున్నాయి. మే 23 తరువాత దేశ రాజకీయాలు ఏ విధంగా ఉంటాయో చూస్తారు. దేశానికి రాహుల్, మోదీల నాయత్వమే దిక్కు అంటూ ప్రచారంచేస్తున్నారు. కానీ వారికంటే ఎక్కువమంది నాయకులు ఉన్నారు. కేంద్రంలో టీఆర్ఎస్ క్రియాశీల పాత్ర పోషిస్తుంది. ప్రభుత్వ ఏర్పాటుసమయంలో రాష్ట్ర ప్రయోజనాలకోసం పట్టుబడుతాం. విభజన చట్టంలో పేర్కొన్న నియోజకవర్గాల పునర్విభజన సాకారమయ్యేలా చూస్తాం. చిన్న నియోజకవర్గాలు ఉంటే కూడా మంచిదే కదా. కుత్బుల్లాపూర్ లాంటి నియోజకవర్గంలో ఐదులక్షల మందికిపైగా ఓటర్లు ఉన్నరు. ఇలాంటి నియోజకవర్గాలు ఎన్నో ఉన్నాయి. నియోజకవర్గాల పునర్విభజన చేస్తే చిన్న నియోజకవర్గాలు ఉంటాయి.
టీఆర్ఎస్లోకి వచ్చినోళ్లంతా కలిసి పనిచేస్తారు టీఆర్ఎస్లోకి ఎంతమంది వచ్చినా అందరూ సర్దుకుంటారు. కలిసి పనిచేస్తారు. వారికి సరైన సమయంలో అవకాశాలు వస్తాయి. రకరకాల కారణాలతో పలువురికి టికెట్లు ఇవ్వలేకపోయాం. అంతమాత్రాన వేరే పార్టీలోకి వెళ్లి టీఆర్ఎస్పై ఆరోపణలు చేయటాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నా. టికెట్లు ఇవ్వలేకపోయిన ఇద్దరు ఎంపీలు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతారాంనాయక్ ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. వారికి తగిన గుర్తింపు, సముచిత స్థానం, గౌరవం కేసీఆర్ కల్పిస్తారు.
ఓటింగ్ తగ్గే అవకాశం పార్లమెంట్ ఎన్నికలు మాత్రమే జరిగినప్పుడు సహజంగానే ఓటింగ్ శాతం తగ్గుతుంది. గతంలోనూ ఇది జరిగింది. అభ్యర్థులు లోకల్, నాన్ లోకల్ అనేది సమస్య కాదు. అలా అయితే నరేంద్రమోదీ వారణాసికి లోకల్‌కాదు, రాహుల్‌గాంధీ వాయనాడ్‌కు లోకల్‌కాదు. మల్కాజిగిరిలో పోటీచేసే రేవంత్, నల్లగొండలో పోటీచేసే ఉత్తమ్, మహబూబ్‌నగర్‌లో పోటీచేసే వంశీచంద్.. ఇలా అనేకమంది లోకల్ కాదు. ఇది సమస్య కాదు. ప్రజలకు ఏమి చేశామో? ఏమి చేస్తామో చెప్పాలి.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికీ బీఫాం ఇవ్వలేదు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎవ్వరికీ బీ ఫాం ఇవ్వలేదు. ఆ విభాగానికి చెందిన ఓటర్లు గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఓటేశారు. టీఆర్ఎస్కు పేదలు, రైతులు, మైనార్టీలు పెద్దఎత్తున మద్దతు తెలిపారు.


ఎన్నికల తరువాత కాంగ్రెస్ కకావికలమైతది.. కాంగ్రెస్‌కు కిందిస్థాయిలో ప్రచారం చేయడానికి క్యాడర్ లేదు. ఆ పార్టీకి యంత్రాంగం లేదు. లోక్‌సభ అభ్యర్థి ఒక్కరే నేరుగా ఓటర్లను కలువడం సాధ్యంకాదు. పార్టీ నాయకులు, క్యాడర్ ప్రచారం చేయాల్సి ఉంటుంది. పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రభావం చాలా తక్కువ ఉంటుంది. పార్టీలు, ఆ పార్టీల నాయకత్వాల ప్రభావమే ఎక్కువ ఉంటుంది. గత అసెంబ్లీ ఎన్నికలకు, ఇప్పటికీ ప్రజల్లో పెద్దగా మార్పురాలేదు. ఖమ్మంలో అక్కడ ప్రధాన సామాజిక వర్గం ఉన్న వారికి టికెట్ ఇచ్చాం. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీచేసింది. ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు స్వయంగా వచ్చి ప్రచారంచేశారు. కానీ ఈసారి టీడీపీ పోటీ చేయడంలేదు. ఆ పార్టీ స్థాపించిందే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా. పైస్థాయిలో కాంగ్రెస్, టీడీపీ నేతలు కలిసినా, కిందిస్థాయిలో క్యాడర్ కలువదు. లోక్‌సభ ఎన్నికల్లో 16 స్థానాల్లో టీఆర్ఎస్ గెలుస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల నాటికి ఇప్పటికి ఇంకా పుంజుకున్నాం. పార్టీ బలం పెరిగింది. అనేకమంది పార్టీలో చేరారు. చేరుతూనే ఉన్నారు. కాంగ్రెస్ నాయకత్వ సమస్యతో కకావికలమవుతున్నది. ఆ పార్టీ నాయకత్వంపై విశ్వాసం, నమ్మకం లేదు. భవిష్యత్ నిరాశజనంగా ఉన్నది. ఆ పార్టీ నాయకులకు విషయం అర్థమైంది. డీకే అరుణలాంటి నాయకురాలు టికెట్ ఇస్తామన్నా.. బీజేపీలో చేరి పోటీచేస్తున్నారు. మరో పది సంవత్సరాలు కూడా కాంగ్రెస్ అధికారంలోకి రాదు. ఎంపీగా గెలుస్తానని ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ధీమా ఉంటే ఎమ్మెల్యే పదవికి ఎందుకు రాజీనామా చేయలేదు? కాంగ్రెస్ అభ్యర్థులు ప్రచారం మానేసి ఇంట్లో కూర్చుంటున్నారు. ఎవరూ దొరక్క ఖమ్మంలో రేణుకాచౌదరికి టికెట్ ఇచ్చారు. మా పార్టీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి టికెట్ ఇస్తామంటూ ప్రయత్నించారు.
బాబు రిటైర్మెంట్ ఖాయం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబుకు రిటైర్మెంట్ ఇవ్వటం ఖాయం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు విజ్ఞులు. పరిపాలకుడిగా ఎవరైతే బాగుంటారో వారే నిర్ణయిస్తారు. దివాలాకోరుతనం, భావదారిద్య్రానికి కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు. హుద్‌హుద్ తుఫాన్ సమయంలో కేసీఆర్ ఏపీకి సాయం చేయలేదా? అమరావతి శంకుస్థాపనకు హాజరై శుభాకాంక్షలు చెప్పలేదా? కేసీఆర్, టీఆర్ఎస్పై ఏపీ ప్రజలకు కోపం ఉండి ఉంటే హైదరాబాద్‌లో, తెలంగాణలో ఉంటున్న సీమాంధ్ర ప్రజలు జీహెచ్ఎంసీ, అసెంబ్లీ ఎన్నికల్లో అంత ఏకపక్షంగా ఓటువేసేవారు కాదు. చంద్రబాబు తెలంగాణలో ప్రచారం చేయడంవల్ల టీఆర్ఎస్కు లాభం ఏమీజరుగలేదు. అసెంబ్లీ రద్దుచేసిననాడు టీఆర్ఎస్కు 95 నుంచి 104 స్థానాలు వస్తాయని కేసీఆర్ చెప్పా రు. ఈ విషయాన్ని అందరూ గుర్తించాలి. కానీ టీఆర్ఎస్కు 88 సీట్లు మాత్రమే వచ్చా యి. చంద్రబాబు రావడం వల్ల నష్టమే జరిగింది కానీ లాభం జరుగలేదు.