-220 కోట్ల పెట్టుబడితో విప్రో సబ్బుల పరిశ్రమ ఏర్పాటు -మహేశ్వరంలో సబ్బులు, సౌందర్య ఉత్పత్తుల యూనిట్ -మంత్రి కేటీఆర్‌తో విప్రో సీఎస్‌వో రిషద్ ప్రేమ్‌జీ భేటీ -పరిశ్రమ ఏర్పాటుకు సహకరిస్తామన్న మంత్రి -టీ హబ్, టీ వర్క్స్, ఇన్నోవేషన్ రంగంలో అవకాశాలపై వివరణ -వీహబ్‌తో భాగస్యామ్యానికి విజ్ఞప్తి -సిస్టర్ స్టేట్‌గా తైవాన్ రాష్ట్రం తయువాన్ -పరస్పర వ్యాపార సహకారానికి ఒప్పందం -ఘనంగా ముగిసిన ఐటీ కాంగ్రెస్, నాస్కాం ఇండియా లీడర్‌షిప్ సదస్సు -వచ్చే ఏడాది ఆర్మేనియాలో నిర్వహణ -సదస్సు విజయవంతంపై నాస్కాం కృతజ్ఞతలు
తెలంగాణకు మరో మెగా ప్రాజెక్టు రానున్నది. ప్రఖ్యాత విప్రో సంస్థ తన ఉత్పత్తి యూనిట్‌ను మన రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నది. మూడురోజుల పాటు ఘనంగా జరిగిన వరల్డ్ ఐటీ కాంగ్రెస్ చివరి రోజైన బుధవారం తెలంగాణ ప్రభుత్వం రెండు కీలక ఒప్పందాలు చేసుకొన్నది. విప్రో సౌందర్య ఉత్పత్తుల తయారీ యూనిట్ ఏర్పాటు ఒప్పందంతోపాటు తైవాన్‌లోని తయువాన్ రాష్ట్రంతో సిస్టర్‌స్టేట్ ఒప్పందం కుదుర్చుకొన్నది. బుధవారం విప్రో సంస్థ ముఖ్య ప్రణాళికాధికారి (సీఎస్‌వో) రిషద్ ప్రేమ్‌జీతో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి తారకరామారావు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తాము తెలంగాణలో ఒక తయారీ కేంద్రాన్ని నెలకొల్పనున్నట్లు మంత్రికి రిషద్ ప్రేమ్‌జీ తెలిపారు. విప్రో వినియోగదారుల సంరక్షణ ఉత్పత్తుల విభాగం ఆధ్వర్యంలో సబ్బులు, ఇతర సౌందర్య ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని మహేశ్వరం మండలంలో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
ఇందుకు కోసం విప్రో సంస్థ దాదాపు రూ. 220 కోట్లను పెట్టుబడి పెట్టనున్నది. 40 ఎకరాల్లో నిర్మించనున్న ఈ తయారీ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా 300 మందికి, పరోక్షంగా 200 మందికి ఉపాధి కల్పించనున్నారు. ఇప్పటికే ఇతర విభాగాల్లో తెలంగాణలో పెద్ద ఎత్తున కార్యకలాపాలు నిర్వహిస్తున్న విప్రో సంస్థ నూతనంగా ఈ తయారీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చినందుకు మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. టీఎస్‌ఐపాస్ ద్వారా ఇప్పటికే అనేక మెగా ప్రాజెక్టులకు అనుమతులిచ్చామని, ఇప్పుడు మరో మెగాప్రాజెక్టు రావడం రాష్ట్రంలో పెట్టుబడుల అనుకూల వాతావరణానికి అద్దం పడుతున్నదని తెలిపారు. దీంతోపాటు తెలంగాణలో ఉన్న పలు ఇతర పెట్టుబడి అవకాశాలను మంత్రి కేటీఆర్.. ఈ సందర్భంగా రిషద్ ప్రేమ్‌జీకి వివరించారు. ద్వితీయ శ్రేణి నగరాల్లోకి ఐటీ పరిశ్రమను తీసుకుపోయేందుకు ప్రయత్నం చేస్తున్నామని, ఇందుకోసం ఇప్పటికే పలు జిల్లాల్లో ఐటీ టవర్లు నిర్మిస్తున్నామని, టాస్క్ ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని రిషద్‌కు తెలిపారు. వరంగల్ పట్టణంలో సైయెంట్ తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నదని, తాజాగా టెక్ మహీంద్రా క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిందని తెలిపిన మంత్రి కేటీఆర్.. విప్రో కంపెనీని వరంగల్‌కు ఆహ్వానించారు. టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగంలో దేశంలోనే తెలంగాణ ముందువరుసలో ఉన్నదని రిషద్‌కు తెలిపారు. టీహబ్, టీ వర్క్స్ వంటి కార్యక్రమాలపై ఈ సమావేశంలో రిషద్ ప్రేమ్‌జీకి వివరించారు. త్వరలో ఏర్పాటు చేయనున్న మహిళా ఇంక్యుబేటర్ వి హబ్ తో విప్రో భాగస్వామ్యానికి మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
తయువాన్‌తో తెలంగాణ ప్రభుత్వ ఒప్పందం తైవాన్ దేశానికి చెందిన తయువాన్ రాష్ట్రంతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నది. వరల్డ్ ఐటీ కాంగ్రెస్ సందర్భంగా మూడో రోజైన బుధవారం ఈ రెండు రాష్ర్టాల మధ్య సిస్టర్ స్టేట్ ఒప్పందం కుదిరింది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, తయువాన్ సిటీ బోర్డ్ డైరెక్టర్ రాబర్ట్ హ్యువాంగ్ ఒప్పంద పత్రాలను పరస్పరం అందించుకొన్నారు. ఇంటర్నెట్ ఓవర్‌థింగ్స్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంశాల్లో తయువాన్ వేగంగా వృద్ధి చెందుతున్నది. ఈ ఒప్పందం ద్వారా రెండు రాష్ర్టాలకు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మేలు జరుగుతుంది. రెండు రాష్ర్టాల్లో ఎక్కడ తమ వ్యాపారాలను ప్రారంభించాలన్నా సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు విధానపరమైన మద్దతును అందిస్తాయి. ప్రత్యేక సౌలభ్యాలను కల్పిస్తాయి. స్టార్టప్‌లు లేదా ఉత్పత్తిదారులతో ఇప్పటికే తయారైన వాటిని తెలంగాణలో పరీక్షించేందుకు అవకాశం దక్కుతుంది. టీహబ్, టీ ఫైబర్, టీ వర్క్స్, టీ బ్రిడ్జిల ద్వారా తయువాన్ రాష్ర్టానికి తగిన సహకారాన్ని తెలంగాణ ఐటీ శాఖ అందిస్తుంది. పరిశోధనల్లో.. తెలంగాణలోని విద్యాసంస్థలతో తయువాన్ కలిసి ముందుకు సాగుతుంది.
ఘనంగా ముగిసిన వరల్డ్ ఐటీ కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మక వరల్డ్ కాంగ్రెస్ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (డబ్ల్యూసీఐటీ)-2018తో పాటు నాస్కాం ఇండియా లీడర్‌షిప్ ప్రోగ్రాం హైదరాబాద్‌లో విజయవంతంగా ముగిసింది. వచ్చే ఏడాది అర్మేనియాలో ఈ సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు. మూడురోజుల పాటు సాగిన ఈ ఐటీ ఒలింపిక్స్‌కు 30 దేశాల నుంచి 2500 మందికి పైగా అతిథులు హాజరయ్యారు. ముగింపు కార్యక్రమంలో నాస్కాం చైర్మన్ రమన్‌రాయ్, నాస్కాం అధ్యక్షుడు ఆర్ చంద్రశేఖర్, వరల్డ్ ఐటీ కాంగ్రెస్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్ జిమ్ పోషియంట్, చైర్మన్ యువాన్ చూ, తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమన్ రాయ్ మాట్లాడుతూ తెలంగాణలో రెండు ప్రతిష్ఠాత్మక సదస్సులను ఏకకాలంలో విజయవంతంగా నిర్వహించిందని ప్రశంసించారు. హైదరాబాద్ టీ రంగం విశేషవృద్ధిని కనబర్చడంతోపాటుగా ప్రతిష్ఠాత్మక సదస్సుల నిర్వహణలో సైతం అదేరీతిలో తన ముద్రను వేసుకుంటున్నదని పేర్కొన్నారు. రెండు సదస్సులను విజయవంతంగా నిర్వహించడం పట్ల నాస్కాం తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ నుంచి ఎంతో నేర్చుకున్నాం: అలెగ్జాండర్ యషుయాన్ హైదరాబాద్‌లో ప్రస్తుత వరల్డ్ ఐటీ కాంగ్రెస్ నిర్వహణ ద్వారా తాము ఎంతో నేర్చుకున్నట్లు వచ్చే ఏడాది నిర్వహించనున్న ఆర్మేనియా దేశానికి చెందిన ప్రతినిధి అలెగ్జాండర్ యషువాన్ తెలిపారు. సదస్సు అనంతరం ఆయనతో నమస్తే తెలంగాణ ప్రత్యేకంగా ముచ్చటించగా హైదరాబాద్ వాసులు అద్భుతమైన ప్రేమ, గౌరవానికి చిరునామా. తాజాగా జరిగిన సదస్సు నిర్వహణతో మేం ఎంతో నేర్చుకున్నాం. తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు. మా దేశంలో వచ్చే ఏడాది నిర్వహించేందుకు తగిన అవగాహనను కలిగించారు. మంత్రి కేటీఆర్ కృషి ప్రశంసనీయం అని అన్నారు.
మనస్పూర్తిగా చెప్తున్నా.. హైదరాబాద్ ఆతిథ్యం అదుర్స్ వరల్డ్ ఐటీ కాంగ్రెస్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్ జిమ్ పోషియంట్ ఈ సందర్భంగా ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. ఇప్పటివరకు తాను పది వరల్డ్ ఐటీ కాంగ్రెస్ నిర్వహణల్లో పాలుపంచుకొన్నానని అత్యుత్తమంగా, అద్భుతంగా నిర్వహించిన కేంద్రంగా హైదరాబాద్ నిలుస్తుందని తన హృదయాంతరాల్లోంచి చెప్తున్నానని అన్నారు. సదస్సు ప్రారంభ చర్చ నుంచి మొదలుకొని ముగింపు వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిందని వివరించారు. అత్యుత్తమ మౌలిక సదుపాయాలు, మెరుగైన మానవ వనరులకు హైదరాబాద్ వేదిక అని పేర్కొంటూ రాబోయే కాలంలో ఐటీ రంగం విశేష వృద్ధి సాధిస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు.
ప్రతిష్ఠాత్మక సదస్సుల వేదిక హైదరాబాద్: కేటీఆర్ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ అద్భుతమైన సదస్సుకు ఆతిథ్యం ఇచ్చే అవకాశం కల్పించిన నాస్కాం, విట్సాకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సదస్సు ద్వారా ప్రపంచ ఐటీ ముఖచిత్రంపై హైదరాబాద్ మరోమారు తన గుర్తింపును చాటుకున్నదని సంతోషం వ్యక్తంచేశారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ ప్రతిష్ఠాత్మక సదస్సుల వేదికగా నిలుస్తున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. సదస్సు ముగిసిన అనంతరం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఒక్క ఫిబ్రవరి నెలలోనే నాలుగు ప్రతిష్ఠాత్మక సదస్సులు నిర్వహించినట్లు తెలిపారు. ఈ సదస్సులో పలు ఒప్పందాలు కుదిరినట్లు వెల్లడించారు. నాస్కాంతో కలిసి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేయనున్నామని, విప్రో తన ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించనున్నదని, అడోబీ కూడా తన సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నదని వెల్లడించారు.
గత మూడేండ్లలో దేశంలోని అన్ని రాష్ర్టాలకంటే ఐదు శాతం ఎక్కువ వృద్ధితో తెలంగాణ ఐటీ రంగం అభివృద్ధి చెందుతున్నదని వివరించారు. కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్ వంటి ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ విస్తరణ ప్రారంభమైందని వివరించారు. తద్వారా ఆయా ప్రాంతాల యువకులకు అవకాశాలు దక్కుతాయని వెల్లడించారు. టీహబ్2 సిద్ధమవుతున్నదని, టీ వర్క్స్ ప్రొటోటైప్ ల్యాబ్ తీర్చిదిద్దనున్నామని వివరించారు. ఈ చర్యలు ఐటీని కొత్తపుంతలు తొక్కిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ముద్రను వేస్తాయని వెల్లడించారు. అన్ని దేశాల్లోని ఐటీ దిగ్గజాల దృష్టిలో హైదరాబాద్‌ను ఉంచాలన్న తమ ఆశయాలు నెరవేరబోతున్నాయని అన్నారు. త్వరలోనే వాటి ఫలాలు ప్రజల ముంగిట్లో ఆవిష్కృతం అవుతాయని ధీమా వ్యక్తంచేశారు.