-ఏపీకి హోదా ఇస్తే ఇక్కడి పరిశ్రమలు అక్కడికి తరలిపోవా?
-సీడబ్ల్యూసీ తీర్మానంపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలు స్పందించాలి
-కాళేశ్వరానికి జాతీయహోదా ఇవ్వరా?
-కాంగ్రెస్, బీజేపీల తీరుపై మండిపడిన మంత్రి హరీశ్‌రావు
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వాలని తీర్మానం చేసిన సీడబ్ల్యూసీకి తెలంగాణకు కూడా హోదా ఇవ్వాలని ఎందు కు గుర్తుకురాలేదని నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తే తెలంగాణాకు కూడా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశా రు. ఈ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు తమ స్పష్టమైన వైఖరి ప్రకటించాలన్నారు. ప్రత్యేక హోదాతో పరిశ్రమలు స్థాపించుకునేవారికి ఇన్సెంటివ్‌లు, పన్ను మినహాయింపు సౌకర్యం కల్పిస్తారని, దీంతో ఇక్కడి పరిశ్రమలు ఏపీకి తరలిపోవా? అని మంత్రి ప్రశ్నిం చారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ వద్ద 65వ జాతీయ రహదారిపై రూ.26.73 కోట్లతో నిర్మించనున్న అండర్‌పాస్ రోడ్డుకు, అమీన్పూర్ చౌరస్తాలో రూ.12.63 కోట్లతో చేపట్టనున్న రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి ఈ సందర్భంగా జరిగిన బహిరంగసభల్లో మా ట్లాడారు. కాంగ్రెస్, బీజేపీలు ఇప్పటికే తెలంగాణకు ఎంతో అన్యాయం చేశాయని విమర్శించారు.
పోలవరం ప్రాజెక్టుకు జాతీయహోదా కల్పించిన కేంద్రం తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎందుకు ఇవ్వదని ప్రశ్నించారు. హైకోర్టును విభజిస్తామని ఇచ్చిన హామీ ఇంకా నెరవేరలేదని, తెలంగాణలోని 7 మండలాలను రాత్రికి రాత్రే ఏపీలో కలిపేసుకున్నారని గుర్తు చేశారు. పోలవరంతోపాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు ఏపీకి ఇచ్చిన ఇన్సెంటివ్‌లు, పన్ను రాయితీలు తెలంగాణకు ఇవ్వాలని, ఈ అంశం విభజన నిబంధనల్లో ఉన్నదని మంత్రి చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా పేరుతో తెలంగాణలో సమస్యలు సృష్టిస్తారా? అని కాంగ్రెస్ నేతలపై మంత్రి మండిపడ్డారు.
కాలుష్య నియంత్రణకు చర్యలు పటాన్చెరు, పాశమైలారం వంటి పారిశ్రామిక ప్రాంతా ల్లో కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రూ.104 కోట్లతో పాశమైలారంలో వ్యర్థజలాల శుద్ధి కేంద్రం నిర్మాణం చేపట్టామని చెప్పారు. మిషన్ భగీరథ, డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం ఇతర అభివృద్ధి పనులపై సంగారెడ్డి కలెక్టరేట్లో జిల్లా అధికారులతో కలిసి మంత్రి సమీక్షించారు. పాశమైలారం నుంచి ఔటర్ రింగురోడ్డు వరకు ఫోర్లైన్ల రహదారి కోసం రూ.46 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. రాయసముద్రం, సాకి చెరువులను రూ.15 కోట్లతో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
రామచంద్రాపురం పరిధిలో ఐటీ పరిశ్రమలు నెలకొల్పుతున్నవారికి ప్రభుత్వం ఎన్నో రకాలుగా రాయితీలు కల్పిస్తుందని చెప్పారు. మంత్రి కేటీఆర్‌తో మాట్లాడి కొత్తగా ఏర్పడనున్న మున్సిపాలిటీలకు రూ.20 కోట్లు ఇచ్చేలా చూస్తామని హామీఇచ్చారు. సంగారెడ్డి- నాందేడ్-అకోలా నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణానికి టెండర్లు పూర్తయ్యాయని, త్వరలోనే పనులు మొదలవుతాయని తెలిపారు. కార్యక్రమాల్లో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ రాజమణి మురళీయాదవ్, ఎమ్మెల్యేలు మహిపాల్‌రెడ్డి, చింతా ప్రభాకర్, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్సీ ఆర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.