తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలని కోరుతూ టీఆర్‌ఎస్ ఎంపీ బీ వినోద్‌కుమార్ శుక్రవారం లోక్‌సభలో ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణకు సంబంధించి ఒక బిల్లు పార్లమెంటు ముందుకురావటం ఇదే తొలిసారి. -లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఎంపీ వినోద్‌కుమార్ -రాష్ట్ర అవతరణ తర్వాత పార్లమెంటులో తొలి తెలంగాణ బిల్లు

ది స్టేట్ ఆఫ్ తెలంగాణ (స్పెషల్ క్యాటగిరీ స్టేటస్ అండ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్) బిల్లు – 2015 అనే పేరుతో పిలిచే ఈ బిల్లులో రాష్ర్టానికి ప్రత్యేక హోదాను ప్రకటించాలని, వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డు కులాలు, తెగల సంక్షేమానికి కేంద్రం ప్రత్యేక ఆర్థిక సాయాన్ని ప్రకటించాలని, రాష్ట్రంలోని వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి, సహజ వనరుల సమర్థవినియోగానికి ఆర్థిక సాయం ప్రకటించాలని ప్రతిపాదించారు. ఇది ప్రైవేటు బిల్లు కాబట్టి రాష్ట్రపతి ఆమోదం తీసుకున్నారు. బిల్లును ఎంపీ వినోద్‌కుమార్ ప్రతిపాదించగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్‌సిన్హా దానిని రాష్ట్రపతి ఆమోదం కొరకు జూలై 23వ తేదీ (నం. 42(4)పీఎఫ్-1/2015) పంపారు., రాజ్యాంగంలోని ఆర్టికల్ 117(1), 274(1), 117(3) ప్రకారం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టడానికి సిఫారసు చేశారు.
-బిల్లు ఎందుకంటే.. 50 ఏండ్లకు పైబడిన ప్రజాస్వామిక పోరాటం తర్వాత గత సంవత్సరం జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రం ఊపిరిపోసుకుంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నకాలంలో తెలంగాణ మౌలిక సదుపాయాల రూపకల్పన, అభివృద్ధిలో వెనుకబాటుకు గురైంది. కరువు, నీరు, విద్యుత్ కొరతల కారణంగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడేవారు. రాష్ట్రంలోని పది జిల్లాల్లో తొమ్మిది వెనుకబడినవేనని, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులను (బీఆర్‌జీఎఫ్) పొందేందుకు అర్హమైనవని కేంద్రం కూడా గుర్తించింది. ఈ నేపథ్యంలో రాష్ర్టానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అనివార్య పరిస్థితి తలెత్తింది అని బిల్లులో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 91(4)(2) ప్రకారం కొత్తగా ఏర్పడిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల అభివృద్ధికి కేంద్రం ఆర్థిక సాయాన్ని, పన్ను ప్రోత్సాహకాలను అందించాల్సి ఉన్నది.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రతిపాదనను తెలంగాణకు విస్తరించాల్సి ఉన్నది. ఒడిషాలో అమలవుతున్న కోరాపుట్-బోలాంగిర్-కలహండి (కేబీకే) తరహా ప్రత్యేక ప్రణాళిక, మధ్యప్రదేశ్-ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌లకు అమలవుతున్న తరహా ప్రత్యేక ప్రణాళికను తెలంగాణకు కూడా వర్తించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం భారీగా ఆర్థిక వనరులని సమకూర్చుకోడానికి ఎఫ్‌ఆర్‌బీఎం (ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్) రుణపరిమితిని 3.49% వరకు పెంచాల్సిన అవసరం ఉంది. అని ఆ బిల్లులో ఎంపీ వినోద్‌కుమార్ స్పష్టం చేశారు.
-ఆర్థిక సహాయం ఇలా.. ఈ బిల్లులోని క్లాజ్-2 కింద రాష్ట్రంలో నిర్దిష్ట ప్రాజెక్టుల కోసం నిధులు కేటాయించాలని, ఆర్థికాభివృద్ధి, పారిశ్రామికీకరణ కోసం ఎక్సయిజ్, కస్టమ్స్, ఆదాయపు పన్ను, కార్పొరేట్ పన్నుల్లో రాయితీలు ఇవ్వాలని ప్రతిపాదించారు. ప్రత్యేక ఆర్థికసాయం కింద గ్రాంట్లు, రుణాలు, ప్రోత్సాహకాలు ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా వల్ల గ్రాంట్లు లేదా పన్నుల ద్వారా 90% నిధులు కేంద్రం నుంచి అందుతాయని, మిగిలిన 10% రాష్ట్రం భరిస్తుందని వివరించారు. క్లాజ్-3లో పేర్కొన్నట్లుగా ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి రాష్ర్టానికి డబ్బును చెల్లించాలని పేర్కొన్నారు. వీటికి అదనంగా నాన్ రికరింగ్ ఖర్చును కూడా కేంద్రం కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి రాష్ర్టానికి అందజేయాలని పేర్కొన్నారు.
-కేంద్రానికి మేలుకొలుపు: వినోద్‌కుమార్ బిల్లును ప్రవేశపెట్టిన అనంతరం వినోద్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో వెనుకబాటుకు గురైన కారణంగా రాష్ర్టానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ బిల్లు ద్వారా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని పార్లమెంటు దృష్టికి తద్వారా యావత్తు దేశానికి వివరిస్తామని, కేంద్రానికి మేలుకొలుపు పాడుతామని అన్నారు. కేవలం నిధుల కోసం ఈ బిల్లు పెట్టలేదని, రాష్ట్రంలో వెనకబాటుతనానికి కేంద్రం నుంచి తగిన పరిష్కారం పొందాల్సి ఉందని అన్నారు. ప్రజా ప్రతినిధులుగా పార్లమెంటులో ప్రజల అభిప్రాయాలను, ఆకాంక్షలను తెలియజేసి న్యాయం పొందడం. రాష్ర్టానికి న్యాయబద్ధంగా రావాల్సిన నిధులను రాబట్టుకోవడం తమ బాధ్యత అని చెప్పారు.