-28 రాష్ర్టాలకు భిన్నంగా మా పాలన -ఆకలి కేకలు లేని సుసంపన్న బంగారు తెలంగాణే లక్ష్యం -టీఆర్ఎస్ ఎల్పీ మాజీ నేత ఈటెల రాజేందర్

తెలంగాణలో టీఆర్ఎస్ ఆత్మ ఆవిష్కృతమైంది..మంత్రి పదవులు వెలగబెట్టి..ఆంధ్రా నేతల ముందు మోకరిల్లి మమ్మల్ని వెక్కిరించిన వారి కోటలు బీటలు వారనున్నాయి. తెలంగాణలో ఉన్న 80శాతం మంది మాజీమంత్రులు మట్టి కరువబోతున్నారు. మమ్మల్ని అవహేళనలు చేసిన వారికి చెంపపెట్టులా టీఆర్ఎస్ విజయదుందుభి మోగించనుంది అని టీఆర్ఎస్ ఎల్పీ మాజీ నేత ఈటెల రాజేందర్ అన్నారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో 70 నుంచి 80 స్థానాలు సాధించి మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో మిడిసిపడుతున్నవారికి సమాధానం చెప్పనున్నామని అన్నారు.
అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని.. అవినీతి, దోపిడీ లేని సుపరిపాలన టీఆర్ఎస్ ఎజెండా అని చెప్పారు. 28 రాష్ర్టాలకు భిన్నంగా టీఆర్ఎస్ పాలన ఉండబోతుందన్నారు. ఆకలికేకలు లేని సుసంపన్న తెలంగాణ మా లక్ష్యం అని ఈటెల ప్రకటించారు. పూర్తిస్థాయిలో ప్రజావిశ్వాసం పొందేలా మా పనితీరు ఉంటది. ఇకమీదట 10 జిల్లాల్లో టీఆర్ఎస్ను పటిష్ఠం చేస్తామని చెప్పారు. ఉద్యమపార్టీ నుంచి రాజకీయపార్టీగా ఎదిగి ప్రజల సమస్యలు తీర్చే పార్టీగా టీఆర్ఎస్ అవతరించనుందని వెల్లడించారు. 13ఏళ్ల అకుంఠిత దీక్షతో సాధించుకున్న తెలంగాణను అదే పట్టుదలతో పునర్నిర్మించుకుని బంగారు తెలంగాణను సుసాధ్యం చేసుకుంటామని తెలిపారు.
తెలంగాణ ఉద్యమానికి పట్టుదలలేదని, లక్ష్యం లేదని, క్లారిటీ లేదని అడ్డగోలుగా మాట్లాడిన పార్టీలకు 16న ప్రజలే సమాధానం చెప్తారని అన్నారు. ఫలితాలు అనుకూలంగా వస్తే పొంగిపోవడం.. తిరగబడితే కుంగిపోవడం టీఆర్ఎస్ నైజం కాదు అని అన్నారు. భావసారూప్యత కలిగిన వారితో కలిసి మరో ఐదారు జిల్లాపరిషత్లపై గులాబీ జెండా ఎగురవేయనున్నామని వెల్లడించారు. టీఆర్ఎస్ ధ్యాస, శ్వాస అంతా ప్రజా కోణంలో ఉంటది.. మా శక్తి నిజాయితీగా, పారదర్శకంగా ఉంటది. టీఆర్ఎస్ శాసనసభా పక్షం కూర్చొని ప్రజాస్వామ్యయుంతగా ఎల్పీ నేతను ఎన్నుకుంటాం.. మా నేత ఎప్పటికీ కేసీఆరే అని అన్నారు. ఖమ్మం జిల్లాలో స్థానిక ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటీ చేయలేదని, తెలంగాణ ఉద్యమం మీద ఉన్న శ్రద్దతో పార్టీపై దష్టి పెట్టలేకపోయామని చెప్పారు. ఇంతటి విజయాన్ని ఇచ్చిన గ్రామీణ ప్రాంత ప్రజలకు రుణపడి ఉంటామని అన్నారు.