Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

తెలంగాణలో ఏపీ వార్తలెందుకు?

– తెలంగాణ వార్తలు ఆంధ్రా ఎడిషన్లలో ఎందుకు కనిపించవు?
– తెలంగాణవాదాన్ని తొక్కిపట్టే ఆధిపత్య ధోరణికి ముగింపు పలుకాలి
– టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు
-తెలంగాణ భావజాల పత్రికలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది
-జర్నలిస్టులకు సముచిత స్థానం కేసీఆర్ నిబద్ధతకు నిదర్శనం
-ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా తెలంగాణలో జర్నలిస్టుల సంక్షేమం
-ఎమ్మెల్యే క్రాంతికిరణ్ అభినందనసభలో కేటీఆర్
-100 కోట్ల జర్నలిస్టు సంక్షేమ నిధి మరెక్కడా లేదు: అల్లం నారాయణ

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఐదేండ్లు గడుస్తున్నా కొన్ని పత్రికలు, మీడియా సంస్థలు ఆంధ్ర భావజాల ఆధిపత్యాన్ని ప్రదర్శించే ప్రయత్నాన్ని మార్చుకోవడం లేదని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విమర్శించారు. వాళ్లు ఏం చెప్తే అదే కరెక్ట్.. అదే వేదం అన్నట్టు ప్రవర్తిస్తున్నారని, ఆ ఆధిపత్య ధోరణికి ముగింపు పలుకాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. తాము ఎవరితోనూ వివాదాన్ని కోరుకోవటంలేదని, అదే సమయంలో ఎవరిపైనా ఆధిపత్యం చెలాయించాలని కూడా అనుకోవటంలేదని స్పష్టంచేశారు. శాసనసభ్యుడిగా ఎన్నికైన జర్నలిస్టు క్రాంతికిరణ్ అభినందన సభ బుధవారం పబ్లిక్‌గార్డెన్స్‌లోని ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలో టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అస్తిత్వ పోరాటంచేసి రాష్ర్టాన్ని సాధించుకున్న తర్వాత కూడా తెలంగాణలో తెల్లారిలేస్తే ఆంధ్రవార్తలే కనిపిస్తున్నాయి.

ఇక్కడి పత్రికల్లో ఆంధ్ర వార్తలు ప్రచురిస్తే మాకేమీ అభ్యంతరం లేదు. కానీ.. ఆంధ్ర ఎడిషన్‌లోనూ తెలంగాణ వార్తలు ప్రచురించాలి కదా? ఢిల్లీకి పోయి తెలుగు పత్రికలు చూస్తే తెలంగాణ వార్తలే ఉండవు. ఆంధ్రా ఎడిషన్‌లో తెలంగాణ వార్తలు రాయనప్పుడు.. తెలంగాణలో ఆంధ్రా వార్తలెందుకు? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌కు వంతపాడుతున్న పత్రికల గురించి సీఎం కేసీఆర్ మాట్లాడితే కొంతమందికి కోపం వస్తున్నదని అన్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని అణువణువునా నింపుకొని పనిచేస్తున్న పత్రికలను ప్రభుత్వం తప్పకుండా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని గతంలో సీఎం కేసీఆర్ చెప్పిన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. కొన్ని పత్రికలు, మీడియా సంస్థలు ఆధిపత్య ధోరణిని అవలంబిస్తూ తెలంగాణవాదాన్ని తొక్కిపట్టే ప్రయత్నం చేస్తున్నాయని, ఈ డ్రామాలు ఇంకా నడువబోవని హెచ్చరించారు. తెలంగాణ భావజాల పత్రికలకు పెద్దపీట వేయాల్సిన బాధ్యత తమపై ఉన్నదన్న కేటీఆర్.. దీనికి తెలంగాణ జర్నలిస్టుల సహకారం కూడా అవసరమన్నారు. ఆధిపత్య ధోరణిపై ఎలాంటి చర్యలు తీసుకున్నా.. మీడియా హక్కులను హరిస్తున్నారు.. మీడియా గొంతు నొక్కేస్తున్నారు.. మొత్తం మీడియా మీద దాడి.. అంటూ చిత్రీకరిస్తారని చెప్తూ.. అలాంటి అరాచకపు ప్రయత్నానికి మన జర్నలిస్టులు లొంగిపోవద్దని కోరారు.

టీఆర్‌ఎస్‌లో జర్నలిస్టులకు సముచిత స్థానం
ఉద్యమ సమయం నుంచీ కూడా సీఎం కేసీఆర్ జర్నలిస్టుల పాత్రను గుర్తిస్తూ, ఎప్పటికప్పుడు అవకాశాలు కల్పించారని కేటీఆర్ గుర్తుచేశారు. 2004లో దుబ్బాక నుంచి పోటీకి అనేకమంది కోటీశ్వరులు దరఖాస్తు చేసుకున్నా పేద జర్నలిస్టు రామలింగారెడ్డికి అవకాశం ఇవ్వటం కేసీఆర్ నిబద్ధతకు నిదర్శనమన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా సంగారెడ్డికి చెందిన ఆర్ సత్యనారాయణకు అవకాశం ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఘంటా చక్రపాణి వంటి ఎంతోమంది జర్నలిస్టులను ప్రభుత్వం తగిన గుర్తింపునిచ్చిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ విద్యార్థి నాయకులు బాల్క సుమన్, గ్యాదరి కిశోర్, పిడమర్తి రవి తదితరులకు టిక్కెట్లు ఇచ్చినట్టు చెప్పారు. జర్నలిస్టులకు ఏ రాష్ట్రప్రభుత్వమూ చేయనన్ని సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నదన్నారు.

ప్రభుత్వంలో ఉన్నా… లేకున్నా… మీకు నేనున్నా…
జర్నలిస్టులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని కేటీఆర్ పునరుద్ఘాటించారు. గతంలో చెప్పిన. ఇప్పుడు చెప్తు న్న.. నేను ప్రభుత్వంలో ఉన్నా లేకున్నా, మీ సమస్యల పరిష్కార బాధ్యత నాది. అన్ని సమస్యలు పరిష్కరించుకుందాం అని జర్నలిస్టులకు భరోసానిచ్చారు.

టీఆర్‌ఎస్ పథకాలను కాపీ కొడుతున్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు టైమ్ దగ్గర పడిందని, ఎన్నికల్లో గెలిచేందుకు తెలంగాణలో టీఆర్‌ఎస్ అమలుచేసిన పథకాలను కాపీ కొడుతున్నారని కేటీఆర్ ఎద్దేవాచేశారు. ఏపీలో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తూ చంద్రబాబు జీవో ఇచ్చిండని క్రాంతి చెప్తున్నడు.. చంద్రబాబువి ఆపదమొక్కులు. ఆయన ఓడిపోయే టైం దగ్గరపడ్డది కాబట్టి ఆ విధంగా చేస్తున్నడు. టీఆర్‌ఎస్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను యథాతథంగా కా పీ చేస్తున్నడు అని విమర్శించారు. చిత్తశుద్ధితో, కోర్టు వి వాదాలకు తావులేకుండా, భవిష్యత్‌లో ఎవరూ వేలెత్తి చూపకుండా మన జర్నలిస్టుల కోసం ఇండ్ల స్థలాలు, హెల్త్‌కార్డుల విషయంలో చర్యలు తీసుకుంటామని కేటీఆర్ చెప్పారు. వర్కింగ్ జర్నలిస్టుల సంఘ భవనం కోసం సీఎంను ఒప్పించేందుకు ప్రయత్నిస్తానన్నారు.

100 కోట్ల సంక్షేమ నిధి ఏ రాష్ట్రంలోనూ లేదు
జర్నలిస్టులకు వంద కోట్ల సంక్షేమ నిధి తెలంగాణలో మినహా మరెక్కడా లేదని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ చెప్పారు. కాంగ్రెస్‌కు అమ్ముడుపోయినోళ్లు, కాంగ్రెస్ కండువా కప్పుకొన్నోళ్లు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. జర్నలిస్టులకు అండగా సీఎం కేసీఆర్, కేటీఆర్ ఉన్నారని చెప్పారు.

ప్రజలతోపాటు జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తా : ఎమ్మెల్యే క్రాంతి కిరణ్
శాసనసభ్యునిగా ఎన్నికైనప్పటికీ జర్నలిస్టుల సమస్యలను పరిష్కారానికి కృషిచేస్తానని ఎమ్మెల్యే క్రాంతికిరణ్ హామీ ఇచ్చారు. దుష్ప్రచారాలను తీవ్రంగా ఖండించాలని టీయూడబ్ల్యూజే సభ్యులకు సూచించారు. పూర్వ జర్నలిస్టు, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ రవాణాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు జర్నలిస్టు లకు అక్రిడిటేషన్ కార్డులు, బస్‌పాసులను ఇప్పించారని గుర్తుచేశారు. టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ.. క్రాంతికిరణ్ ఎమ్మెల్యే గా గెలిచిన తర్వాత కూడా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికే పరిమితం కావద్దని, ప్రజాసమస్య లపై ఎక్కువ దృష్టిపెట్టాలని సూచించారు. తెలంగాణ టుడే ఎడిటర్ శ్రీనివాస్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన క్రాంతికిరణ్‌కు అభినందనలు తెలిపారు. జర్నలిస్టులెప్పుడూ ఫాల్ట్ ఫైండింగ్ మిషన్‌గానే కాకుండా ఫ్యాక్ట్ ఫైండింగ్ మిషన్‌లా కూడా పనిచేయాలన్నారు. ఈ సందర్భంగా క్రాంతికిరణ్‌ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు బండారు శ్రీనివాస్‌రావు, కే శ్రీనివాస్, రమణ, ఇస్మాయిల్ పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.