Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

తాజా గజినీలు మీరు

రైతు సమస్యల మీద కాంగ్రెస్ నిర్వహిస్తున్న సభలు.. హత్యలు చేసినవారే సంతాప సభలు పెడుతున్నట్టుగా ఉందని రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. నలభై ఏండ్లు రాష్ర్టాన్ని సర్వనాశనం చేసినవారు నాలుగు నెలల నవజాత శిశువుపై నెపం మోపుతున్నారని ధ్వజమెత్తారు. ఖమ్మంలో రైతులను కాల్చిచంపి, ఆర్మూర్‌లో బుల్లెట్లు కురిపించినవారు ఇవాళ వగలమారి ప్రేమ ఒలకబోస్తున్నారని కాంగ్రెస్

ktr

నాయకులపై విరుచుకుపడ్డారు. -మీ నిర్వాకంవల్లే శ్రీశైలం కష్టాలు -హంతకులే సంతాప సభలు పెడతరా? -నలభై ఏండ్ల పాపం నవజాత శిశువుకా? -రైతుల్ని పొట్టనపెట్టుకున్న నరహంతకులు -హంద్రీనీవాకు హారతిపట్టింది అరుణ కాదా? -కేంద్రంలో ఉండీ జైపాల్ ఒక్క లీటరు గ్యాస్ తెచ్చిండా? -కాంగ్రెస్ నేతలకు మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ కేంద్రంలో మంత్రిగా ఉండీ ఒక్క లీటరు గ్యాస్‌ను తెలంగాణకు ఇప్పించలేని జైపాల్‌రెడ్డి ముందుచూపుల గురించి మాట్లాడటం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. అధికారంలో నుంచి దిగగానే తమ పాపాలు వీరు మరిచినా ఈ లేటెస్ట్ గజినీల నిర్వాకాలు ప్రజలు మరిచిపోరని హెచ్చరించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరునిమిషం నుంచే రైతులకోసం కార్యక్రమాలు చేపట్టిందని, ఇన్‌పుట్ సబ్సిడీ, ఎర్రజొన్నలకు పరిహారం చెల్లింపుతోపాటు, రుణమాఫీ అమలు చేసిందని అన్నారు.

రైతు సమస్యల మీద కాంగ్రెస్ నాయకులకు పలు ప్రశ్నలు సంధిస్తూ రాసిన బహిరంగ లేఖను ఆయన మంగళవారం మీడియాకు విడుదల చేశారు. తాను రాసిన గత లేఖకు బదులివ్వలేక ముఖం చాటేశారని కనీసం ఈ లేఖకైనా జవాబు ఇవ్వకపోతే ప్రజలు అసహ్యించుకుంటారని పేర్కొన్నారు. లేఖలోని ముఖ్యాంశాలు..

ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే.. : గంధపు చెట్లను తెగనరికిన వీరప్పన్.. ఆ చెట్ల సంరక్షణ మీద లెక్చర్ ఇస్తే ఎలా ఉంటది? అచ్చంగా కాంగ్రెస్ నేతలు రైతులు, కరెంటు సమస్య మీద మాట్లాడినట్లుంటది. నాలుగు దశాబ్దాలు కరెంటును పట్టించుకోకుండా ఆనాడు ధర్నాలు, ఆందోళనలు చేసిన రైతుల్ని పొట్టనపెట్టుకొని ఇప్పుడు ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్లు… హత్య చేసినవారే సంతాపసభలు పెడుతున్నరు. తెలంగాణలో చోటుచేసుకుంటున్న ప్రతి రైతు ఆత్మహత్యా నిన్నటి కాంగ్రెస్ పాపాల ఫలితమే.

అధికారంలో ఉన్నన్ని రోజులు రైతులను వెన్నుపోటు పొడిచిన దగాకోరు ముఠా ఈ కాంగ్రెస్ నేతలది. అయ్య, అవ్వని చంపిన హంతకుడిని జడ్జి ముందు ప్రవేశపెడితే అయ్యా, అవ్వలేని అనాథని ఆదుకోండయ్యా అని జడ్జిని వేడుకున్నట్టుగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. నీళ్లు పోతుంటే కళ్లు మూసుకున్నరు..:

రైతుల పంటలను, జనం గొంతును ఎండబెట్టి సీమాంధ్రకు అక్రమంగా జలాలను తీసుకుపోయిన ముఖ్యమంత్రులకు అండగా నిలబడిన తెలంగాణ ద్రోహులు మీరు కాదా? ఇవాల్టి కరెంటు సంక్షోభం ముదిరేందుకు కారణమైన శ్రీశైలం కనీస నీటిమట్టాన్ని పెంచే జీవో 107ను ఇచ్చిన రాజశేఖర్‌రెడ్డికి ఊడిగం చేసింది పొన్నాల అండ్ కో కాదా?శ్రీశైలం నీటి దోపిడీకి కనీస నీటిమట్టం పెంచినపుడు కళ్లకి గంతలు కట్టుకున్న అభినవ ధృతరాష్ర్టులు మీరు కాదా?

పొన్నాల ఇచ్చిన నీరెంత? ఇరిగేషన్ శాఖ మంత్రిగా పొన్నాల లక్ష్మయ్య తెలంగాణలోని ఎన్ని ఎకరాలకు సాగునీరు అందించిండో చెప్పగలడా? పోతిరెడ్డిపాడుకి పొక్కపెట్టి శ్రీశైలం నీళ్లెత్తుకుపోయినపుడు, పులిచింతల ప్రాజెక్టు కట్టినపుడు వైఎస్‌కు చెక్కభజన చేసింది.. ఈ పొన్నాల బ్యాచ్ కాదా? భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులకు మొండిచెయ్యి చూపినా, సుక్క నీరు కేటాయింపులేని హంద్రీనీవా అక్రమ ప్రాజెక్టుకు ఆంధ్రా ఆడబిడ్డలా హారతి పట్టి, బొట్టుపెట్టింది డీకే అరుణ కాదా?

కేంద్రంలో ఉండీ గ్యాస్ ఇచ్చారా? తెలంగాణ కరెంటుని బ్లాక్‌మెయిల్ చేస్తూ రాష్ర్టాన్ని అంధకారంలోకి నెట్టి, తెలంగాణ రైతుల పంటలను ఎండబెట్టేందుకు కుట్ర పన్నుతున్న పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గుండాయిజంలో మాజీ కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డికి చొరవ కనిపించింది. మరి ఇంత జరుగుతున్న ఈయన చొరవ ఎక్కడికి పోయింది? పెట్రోలియం, గ్యాస్ మంత్రిగా ఉండి తెలంగాణలోని నేదునూర్, శంకర్‌పల్లి గ్యాస్ ఆధారిత కేంద్రాలకు గ్యాస్ ఇవ్వకపోవడం చొరవ లేకపోవడమా? చేతగానితనమా? పెట్రోలియం శాఖా మంత్రిగా ఉండి తెలంగాణకు ఒక్క లీటర్ గ్యాస్ ఇవ్వని ఆ పెద్ద మనిషికి ముందుచూపు ఎంత ఉందో మహబూబ్‌నగర్ ప్రజలు గుర్తించారు. అందుకే ఆయన్ని ఎన్నికల్లో ఓడగొట్టి అది యాదృశ్చికం కాదని పాలమూరు జనం రుజువు చేశారు.

రైతు హత్యల్లో టీడీపీతో పోటీ… కరెంటు ఉద్యమంలో ముగ్గురు రైతుల్ని బషీర్‌బాగ్‌లో కాల్చి చంపిన టీడీపీ రికార్డును చెరిపేందుకు పోటీ పడిన నరహంతకులు మీరు. ఖమ్మంలో, ముదిగొండలో ఐదుగుర్ని కాల్చి చంపిన కర్కోటక రైతు హంతకులు ఈ కాంగ్రెస్ నేతలు. ఇప్పుడు రైతు ఆత్మహత్యల గురించి మాట్లాడటం హంతకులే సంతాప సభలు పెట్టినంత నీచంగా ఉంది. రూ.10 కోట్ల ఎర్రజొన్న బకాయిలను అడిగిన ఆర్మూర్ రైతులపై బుల్లెట్ల వాన కురిపించిన చరిత్ర మీది కాదా?

లేటెస్ట్ గజినీలను ప్రజలు మరచిపోరు… నలభై ఏండ్ల కాంగ్రెస్ పాపాల ఫలితంగా ఏర్పడిన విద్యుత్తు సంక్షోభాన్ని నాలుగు నెలల టీఆర్‌ఎస్ ప్రభుతానికి అంటగట్టి కొత్తగా ఏర్పడిన తెలంగాణ నవజాత శిశువుని హత్య చేస్తున్న క్రూరులు ఈ నేతలు. వారు అధికార విరహవేదనతో రగిలిపోతున్నారు. పాలకపక్షం నుంచి ప్రతిపక్ష పాత్రలోకి మారగానే తాము చేసిన పాపాల్ని మరచిపోయారని, తమ కాలంలో చేసిన పాపాలన్నీ భారా ఖూన్ మాఫ్ అని అనుకుంటున్నా ప్రజలు మాత్రం ఈ లెటెస్ట్ గజినీల వంచనను మరచిపోరు. ఇంతగా రైతుల్ని వంచించిన చరిత్ర ఉన్నందుకే రూ. రెండు లక్షల రుణ మాఫీ అన్నా నమ్మకుండా.. నిజాయితీగా రూ.లక్ష రుణ మాఫీ అన్న మమ్మల్ని ప్రజలు నమ్మి గెలిపించారు.

ఇది మా నిజాయితీ… ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచి రైతుల సంక్షేమం కోసం కంకణం కట్టుకున్న ప్రభుత్వం మాది. అందుకే ఇచ్చిన హామీ మేరకు రూ.17వేల కోట్ల రైతు రుణమాఫీ భారాన్ని తలకెత్తుకున్నం. రూ.4,250 కోట్లను విడుదల చేసి మాటల సర్కారు కాదు… చేతల ప్రభుత్వం అని నిరూపించుకున్నం. నీలం, లైలా తుపానుల దెబ్బకి సర్వం కోల్పోయిన రైతులకు చిల్లిగవ్వ ఇవ్వని కాంగ్రెస్ నేతలు ఆంధ్ర ప్రాంతానికి మాత్రం ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చిన అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి వంత పాడారు.

కానీ మేం అధికారంలోకి వచ్చిన రోజుల వ్యవధిలోనే రూ.486 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని విడుదల చేసినం. వ్యవసాయ ట్రాక్టర్లపై పూర్తి రవాణా పన్ను మాఫీ చేసినం. ఏళ్ల తరబడి పెండింగులో ఉన్న ఎర్రజొన్న రైతుల రూ.10 కోట్ల బకాయిలను చెల్లించినం. చెరువుల పునరుద్ధరణకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నం. కరెంటు కష్టాలను ఎన్నికల్లోనే నిజాయితీగా వివరించినం.

అవసరమైతే అప్పటి సీడీలను మీ ఇంటికి పంపుతం. మాయ మాటలు చెప్పేది, ప్రజల్ని వంచించేది, మోసపుచ్చుతున్నది ముమ్మాటికీ మీరే. అందుకే ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. ఇప్పటికైనా బూటకపు నాటకాలు కట్టిపెట్టి, రైతు సమస్యలను తీర్చేందుకు ప్రతిపక్షంగా ముందుకు రండి. లేకుంటే మీ అవకాశవాద రాజకీయాల్ని ప్రజలు ఈసడించుకోవడం ఖాయం.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.