-గ్రేటర్‌లో అలకవీడిన టీఆర్‌ఎస్ టికెట్ ఆశావహులు -ఇంటింటికీ వెళ్లి ఆప్యాయంగా పలకరించిన మంత్రి -నేనున్నానంటూ భరోసా.. -కడుపులో పెట్టుకొని చూసుకుంటామని హామీ -శాంతించి అభ్యర్థులతో కలిసి ప్రచారం చేసిన నేతలు

గ్రేటర్ ఎన్నికల్లో పటాన్‌చెరు, రామచంద్రాపురం, భారతీనగర్ డివిజన్‌లకు టీఆర్‌ఎస్ పార్టీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు రాకతో అలకవీడారు. టికెట్ రాకపోవడంతో ఇంటికే పరిమితం అయిన వాళ్లు చిరునవ్వుతో అభ్యర్థులతో కలిసి ప్రచారంలోకి దిగారు. శనివారం మంత్రి హరీశ్‌రావు స్వయంగా టికెట్ ఆశించిన ప్రతి నాయకుడి ఇంటికి వెళ్లి ఆప్యాయంగా పలకరించి.. వారి కుంటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. కొన్ని పరిణామాలతో టికెట్ రాలేదని నచ్చజెప్పి.. నేనున్నానంటూ భరోసానిచ్చారు. పార్టీ మిమ్మల్ని కడుపులో పెట్టుకుని చూసుకుంటుందని హామీ ఇచ్చారు. కలిసి పనిచేసి బరిలో ఉన్న అభ్యర్థిని గెలిపించుకోవాలని కోరడంతో వారు సరేనంటూ మంత్రికి హామీ ఇవ్వడమే కాక ఆదివారం ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు. టీఆర్‌ఎస్ నేతల అలక తమకు లాభం చేకూరుతుందని మురిసిపోయిన ప్రతిపక్ష పార్టీల నేతలు.. గంటల వ్యవధిలోనే తన్నీరు మంత్రంతో పరిస్థితి మారడంతో ఆశ్చర్యపోతున్నారు.
పార్టీ కోసం ఎంతో సేవ చేశా.. తెలంగాణ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాల్గొన్నాం. ఎలాంటి అవినీతికి పాల్పడలేదు. పార్టీనే నమ్ముకున్న మాకు అన్యాయం జరిగింది. టిక్కెట్ మాకు ఇవ్వకుండా ఇతరులకు ఇచ్చారు. అభ్యర్థులతో కలిసి మేం ప్రచారం చేయం. పటాన్‌చెరు, రామచంద్రాపురం, భారతీనగర్ డివిజన్ల కార్పొరేటర్ టిక్కెట్ ఆశించి భంగపడిన వారి ఆవేదన ఇది. వారి అలకతో ఓట్లపై తీవ్ర ప్రభావం చూపుతుందని బరిలో నిలిచిన అభ్యర్థుల ఆందోళన. ఇదంతా శనివారం మధ్యాహ్నం వరకు ఉన్న పరిస్థితి. మంత్రి హరీశ్‌రావు రాకతో అంతా మారిపోయింది. అలకతో కన్నీళ్లు పెట్టిన వారి ముఖాల్లో చిరునవ్వులు విరిశాయి. తాము ప్రచారానికి వెళ్లమన్న వాళ్లంతా ఇప్పుడు అభ్యర్థులతో కలిసి జోరుగా ప్రచారం చేస్తున్నాం.
తమకు లాభం చేకూరనున్నదని మురిసిపోతున్న ప్రతిపక్ష పార్టీల నేతలు గంటల వ్యవధిలోనే తన్నీరు ఏ మంత్రం వేశాడని ఆశ్చర్యపోతున్నారు. హరీశ్‌రావు అంటే అంతే మరి అని టీఆర్‌ఎస్ నేతలు మురిసిపోతూ ప్రచారంలో పాల్గొంటున్నారు. రామచంద్రాపురం, భారతీనగర్ డివిజన్ల టికెట్ ఆర్సీపురం మాజీ కార్పొరేటర్ పుష్పానాగేష్‌యాదవ్ ఆశించారు. భారతీనగర్‌లో పుష్పా, ఆర్సీపురంలో నాగేష్‌యాదవ్‌లు నామినేషన్లు దాఖలు చేశారు. మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి సూచనల మేరకు నామినేషన్ల ఉపసంహరణకు ఒక రోజు ముందే భారతీనగర్‌లో పుష్ప తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఆర్సీపురంలో నాగేష్‌కు టిక్కెట్ వస్తుందని ఆశించారు. వివిధ కారణాలతో ఇద్దరికీ టిక్కెట్ లభించలేదు.
భారతీనగర్‌లో సింధు ఆదర్శరెడ్డికి, రామచంద్రాపురంలో తొంట అంజయ్యకు పార్టీ బీఫారాలు అందించింది. దీంతో తాను రెబల్‌గా బరిలో ఉంటానని నాగేష్ ప్రకటించుకున్నారు. మంత్రి నచ్చజెప్పడంతో చివరిరోజు నామినేషన్ల ఉపసంహకరించుకున్నారు. అయితే తీవ్ర ఆవేదనతో భార్యాభర్తలిద్దరూ ఇంటికే పరిమితమయ్యారు. వీరితో పాటు ఈ డివిజన్ టిక్కెట్ ఆశించిన కుమార్‌గౌడ్, యాదయ్యగౌడ్‌లు కూడా నామినేషన్ దాఖలు చేసి టిక్కెట్ రాకపోవడంతో నామినేషన్లు ఉప సంహరించుకున్నారు. అలకతో వారు ఇంటికే పరిమితమయ్యారు. అలాగే పటాన్‌చెరు డివిజన్ టిక్కెట్‌ను టీఆర్‌ఎస్ నాయకుడు శ్రీధర్‌చారి, బసవేశ్వర్, అశోక్ తదితరులు పార్టీ నుంచి నామినేషన్లు వేశారు. వీరికి అవకాశం దక్కలేదు. కుమార్‌గౌడ్‌కు పార్టీ టిక్కెట్ ఇచ్చింది. దీంతో తమకు అన్యాయం జరిగిందని తీవ్ర ఆవేదన చెందారు. భారతీనగర్‌లో పుష్పకు రాకపోవడంతో ఆమె ఆవేదన చెందింది. ఇదిలా ఉండగా పటాన్‌చెరులో పార్టీకి సంబంధించిన వారు కూడా అలకలో ఉన్నట్లు మంత్రి హరీశ్‌రావు తెలుసుకున్నారు.
నేనున్నాంటూ భరోసా… అలకవీడిన పార్టీ నేతలు… టిక్కెట్ రాకపోవడంతో అలకవీడిన అందరినీ మంత్రి హరీశ్‌రావు ఇంటింటికీ వెళ్లి కలుసుకున్నారు. మంత్రి స్వయంగా ఇంటింటికీ వస్తారని ఎవ్వరూ ఊహించలేదు. శనివారం ఒంటిగంట నుంచి రాత్రి 8గంటల వరకు అందరినీ పలకరించడానికే మంత్రి సమయం కేటాయించారు. పటాన్‌చెరులోని శ్రీధర్‌చారితో పాటు ఇతరుల ఇంటికి వెళ్లారు. వారి కుటుంబ సభ్యులతో కలిసి భోజనాలు చేశారు. పార్టీలో జరిగిన కొన్ని పరిణామాలతో టిక్కెట్ రాలేదని నచ్చజెప్పారు. మీకు నేనున్నా అంటూ హామీ ఇచ్చారు. కలిసి పనిచేసి బరిలో ఉన్న అభ్యర్థిని గెలిపించుకోవాలని కోరడంతో వారు సరేనంటూ హామీ ఇచ్చారు. పుష్పనాగేష్‌యాదవ్ ఇంటివద్ద కూడా హరీశ్‌రావు చాలా సేపు ఉన్నారు. వారితో కలిసి భోజనం చేశారు. అవినీతికి పాల్పడలేదని, ఆర్సీపురం ఎంతో అభివృద్ధి చేశామని, తెలంగాణ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాల్గొన్నామని పుష్ప కన్నీళ్లు పెట్టుకుంది.
హరీశ్‌రావు నేనున్నానంటూ ఓదార్చారు. నేను హామీ ఇస్తున్నా.. పార్టీ మిమ్మల్ని కడుపులో పెట్టుకుని చూసుకుంటుందని హామీ ఇచ్చారు. దీంతో నాగేష్, పుష్పలు మీరు చెప్పినట్లు వింటామన్నా అంటూ చేతులు కలిపారు. ప్రచారంలో పాల్గొంటామని హామీ ఇచ్చారు. ఆ తరువాత కుమార్‌గౌడ్ ఇంటికి వెళ్లి అతడికి హామీ ఇచ్చారు. ఇలా అందరి ఇంటికీ వెళ్లి ఒక్కరితో మాట్లాడడంతో అందరూ అలకవీడారు. ప్రచారానికి రారనుకున్న వారంతా ఆదివారం ఉదయం నుంచి ప్రచారం మొదలు పెట్టడంతో ప్రతిపక్ష పార్టీలు పరేషాన్‌లో పడ్డాయి.
అమ్మో హరీశ్‌రావు ఏదో మంత్రం వేస్తాడు..ప్రతిపక్షాలను ఆగం చేస్తాడంటూ కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నాయకుల్లో చర్చ జరుగుతున్నది. ఇదిలా ఉండగా మంత్రి హరీశ్‌రావు గంటల వ్యవధిలోనే వివిధ సంఘాల నాయకులతో కూడా సమావేశమయ్యారు. ఆయన సమక్షంలో శనివారం రాత్రి బీహెచ్‌ఈఎల్ కార్మిక సంఘం నాయకులు, పారిశ్రామిక వేత్తలు సాయికృష్ణ, మహిపాల్‌రెడ్డితో పాటు పలువురు చేరారు. మైనార్టీ నేతలు ఫహీం, సత్తార్, అనంతరెడ్డి, రమేశ్‌గౌడ్‌లు ఇతర పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిపోవడంతో మూడు డివిజన్లలో ఆదివారం నుంచి టీఆర్‌ఎస్ ప్రచారం ఊపందుకుంది. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డిలు అభ్యర్థులతో కలిసి ఆదివారం మూడు విడిజన్లలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.