Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

తెరవెనుక చంద్రబాబు కుట్రలు

-తెలంగాణపై పెత్తనం కొనసాగించే ఎత్తులు -కేంద్రాన్ని, గవర్నర్‌ను అడ్డం పెట్టుకుంటున్నారు -హైదరాబాద్‌ను గుప్పెట్లో పెట్టుకోవడానికి పన్నాగం -ఒక్క సీమాంధ్ర పౌరుడికైనా నష్టం జరిగిందా? -గవర్నర్ పాలనపై టీడీపీ విధానం ఏమిటి? -రాష్ట్ర భారీ నీటిపారుల శాఖ మంత్రి హరీశ్‌రావు

Harish Rao

టీడీపీ అధినేత చంద్రబాబు ఒకవైపు చర్చల ప్రతిపాదన చేస్తూనే మరోవైపు తెరవెనుక కుట్రలకు ఆజ్యం పోస్తున్నాడని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల, మార్కెటింగ్, మైనింగ్, శాసనసభ వ్యవహారాల మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతల నిర్వాహణ గవర్నర్ చేతికి అప్పగించటం చంద్రబాబు కుట్రేనని, కేంద్రాన్ని, గవర్నర్‌ను అడ్డుపెట్టుకుని తెలంగాణపై సీమాంధ్ర పెత్తనం కొనసాగించేందుకు కుట్ర జరుగుతున్నదని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌పై గవర్నర్ పాలనకు ప్రధానికి చంద్రబాబు లేఖ రాయడాన్ని ఆయన ఖండించారు. ఈ మేరకు సోమవారం రాత్రి ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన సారాంశం ఇది..

మొన్న చంద్రబాబు చర్చిద్దాం రమ్మని పిలిచిండు. ఇటు చర్చల ప్రతిపాదన చేస్తూనే అటూ తెరవెనుక కుట్రలు చేసిండు. హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతల నిర్వహణ గవర్నర్ చేతికి అప్పగించటం చంద్రబాబు కుట్రే. కేంద్రాన్ని, గవర్నర్‌ను అడ్డంపెట్టుకుని తెలంగాణపై సీమాంధ్ర పెత్తనాన్ని కొనసాగించటానికి కుట్ర జరుగుతోంది. రాష్ట్రం విడిపోతే ఇప్పటికిప్పుడు నాకు కార్యాలయాలు లేవు. నాలుగు రోజులు ఇక్కడ తలదాచుకుంటాం అంటే ఒప్పుకున్నాం. కానీ ఇసుంట రమ్మంటే ఇల్లంత నాదేనన్న చందంగా సీమాంధ్ర నాయకులు వ్యవహరిస్తున్నారు. మొన్న మమ్మల్ని వెళ్లగొడతరా? అన్నారు. మేము తెలుగువాళ్ళమే కదా, కలిసి ఉంటే నష్టమేంటన్నారు? పదేళ్ళు ఉండి మా ఊళ్లకు మేము పోతామన్నారు. కానీ ఇప్పుడేం చేస్తున్నారు? ఏకంగా హైదరాబాద్‌నే తమ గుప్పిట్లో పెట్టుకోవాలని పన్నాగం పన్నిండ్లు.

సీమాంధ్ర ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కావాలంటే గవర్నర్ పాలన ఉండాలని చంద్రబాబు ప్రధానికి లేఖ రాసిండు. తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు దాటింది. ఒక్క సీమాంధ్ర పౌరుడికైనా చిటికెన వేలి గోరంత నష్టమైనా జరిగిందా? ఒక్క సీమాంధ్ర పౌరుడైనా పోలీసుస్టేష్‌కు వెళ్ళి ఫిర్యాదు చేసిండా? ప్రశాంతంగా ఎవరి బతుకు వారు బతకటం లేదా? మరి ఎందుకింత గగ్గోలు? కుట్రంతా కేవలం హైదరాబాద్‌లో అధికారంలో ఉన్నప్పుడు కూడబెట్టిన అక్రమ ఆస్తులను కాపాడుకోవటానికే. సచివాలయంలో బారికేడ్లు పెడితేనే చంద్రబాబు గండమోర్లు పెట్టిండు. తెలంగాణ, ఆంధ్రావాళ్లు ఏమైనా ఇండియా, పాకిస్థాన్‌లాంటి దేశాలా? అని అడిగిండు.

ఇనుప కంచెలు వేస్తారా? అని ఎగిరిండు. మరి ఇప్పుడెందుకు హైదరాబాద్‌లో కూడా ఆంధ్రా పోలీసులుండాలని డిమాండ్ చేస్తున్నడు? బారికేడ్లు పెడితేనే మీరు భరించరు.. కానీ మీరు బందూకులు పట్టుకుని మా చుట్టూ తిరిగితే మేం సహించాలా? తెలంగాణ అన్ని రాష్ట్రాలలాగానే ఓ ప్రత్యేక రాష్ట్రం. ఒక్క తెలంగాణ రాజధానిలోనే గవర్నర్‌కు ఎందుకు ప్రత్యేక అధికారాలుంటాయి? ఇది రాజ్యాంగ విరుద్ధం. చట్ట విరుద్ధం. అనైతికం. అసలు గవర్నర్ పాలన, కేంద్ర ప్రభుత్వ జోక్యంపై టీడీపీ విధానమేమిటి? ఎన్టీఆర్ బతికున్నప్పుడు కేంద్రం మిధ్య అనలేదా? గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేయలేదా? మీ పార్టీ విధాన పత్రాల్లో కూడా గవర్నర్ ఎప్పుడూ కేంద్రం చేతిలో కీలుబొమ్మ కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థలో గవర్నర్ ఉండవద్దని స్పష్టం చేయలేదా? ఎన్టీఆర్ ఆశయ సాధనే టీడీపీ లక్ష్యమని చెప్పుకున్న మీరు ఇప్పుడెందుకు మాటమారుస్తున్నారు? ఏది అనుకూలంగా ఉంటే అవే మాట్లాడుతారా? నాలికా? తాటి మట్టా? మీది పొలిటికల్ పార్టీయా? చెత్తబుట్టా? హైదరాబాద్‌లో కేవలం ఆంధ్రోళ్లే కాదు, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పంజాబ్, కాశ్మీర్‌ల నుంచి వచ్చి స్థిరపడ్డవారు కూడా ఉన్నారు.

మరి ఆ రాష్ట్రాల ప్రజల రక్షణ కోసం ఆయా రాష్ర్టాల పోలీసు అధికారులను ఇక్కడ నియమించాలా? ముంబై, చెన్నై, బెంగుళూరు, సూరత్, బరంపురం, భీవండిలాంటి చాలా నగరాల్లో కూడా తెలంగాణ, ఆంధ్రకు చెందిన వారున్నారు. అక్కడికి మన పోలీసులను పంపితే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఊరుకుంటాయా? అమెరికాలో 20 లక్షల మంది భారతీయులున్నారు. వాళ్ల రక్షణ కోసం మన దేశం నుంచి మిలిటరీనో, పోలీసులనో పంపితే ఆ దేశాలు ఊరుకుంటాయా? మరి ఎక్కడా లేని విధానం ఒక్క హైదరాబాద్ విషయంలోనే ఎందుకు? తెలంగాణలోని ప్రతి జిల్లాలో సీమాంధ్రులు వచ్చి స్థిరపడ్డారు. ఉద్యోగమో, వ్యాపారమో, వ్యవసాయమో చేసుకుంటూ బతుకుతున్నారు. మరి వాళ్లకు వద్దా రక్షణ? ఒక్క హైదరాబాద్‌లో ఉన్న వారి గురించే మీకు పట్టింపా? ఇది కేవలం హైదరాబాద్‌పై పెత్తనం కొనసాగించడానికి మాత్రమే.

రాష్ట్ర విభజన సందర్భంలో చంద్రబాబు దేశమంతా తిరిగి ఏం చెప్పిండు? కొత్త రాష్ర్టాల ఏర్పాటు అంశం రాష్ట్ర పరిధిలోనిది కానప్పటికీ, రాష్ర్టాల అనుమతి లేకుండా ఏ పని చేయవద్దన్నాడు. మరి ఇప్పుడు తెలంగాణ రాజధానిలో మా అనుమతి లేకుండా గవర్నర్‌కు అధికారాలు ఎలా ఇస్తారు? చంద్రబాబు తెలంగాణ ప్రజలను అవమానించాడు. సీమాంధ్ర పౌరులకు తెలంగాణ ప్రజలతో ముప్పు ఉందనే విధంగా లేఖలు రాసిండు. దీనిని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి ఉండే అధికారాలను హరించటమంటే ఇక్కడి ప్రజల హక్కులను కాలరాయటమే. మాపై నమ్మకం లేకపోతే హైదరాబాద్ వదిలి వెళ్లిపోండి. అంతే తప్ప మీ పెత్తనం కొనసాగించాలనుకుంటే సహించేది లేదు.

హైదరాబాద్‌లో దేశ రక్షణ శాఖకు సంబందించిన పరిశోధన కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతున్నాయి. మరి ఎవరికీ రాని కష్టం ఒక్క ఆంధ్రోళ్ళకే ఎందుకు వస్తున్నది? ఎవరికీ లేని భయం ఒక్క ఆంధ్రోళ్ళకే ఎందుకు కలుగుతున్నది? చంద్రబాబు మోసకారితనం మరోసారి బయటపడింది. దీనికి తెలంగాణ టీడీపీ నాయకులు సమాధానం చెప్పాలి. చంద్రబాబు కోరుకున్నట్లే మీరు కూడా హైదరాబాద్‌లో గవర్నర్ పాలన కోరుకుంటున్నారా? కోరుకుంటే ప్రజల ముందు ధైర్యంగా ఒప్పుకోండి. లేదంటే టీడీపీ నుంచి తప్పుకోండి. ఇంకా సీమాంధ్ర నాయకుడి మోచేతి నీళ్లు తాగుతామంటే అది మీ ఖర్మ. బీజేపీ నాయకులు దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌లను కూడా నేను డిమాండ్ చేస్తున్నా.

కేంద్రం గవర్నర్‌కు పగ్గాలు అప్పగిస్తామంటే మీరు మౌనంగా ఉండటం ఆత్మవంచనే. కేంద్రంలో ఉన్నది మీ ప్రభుత్వమే కాబట్టి ఇప్పుడు మీరు గట్టిగా కొట్లాడాలి. తెలంగాణ ప్రజల హక్కులను కాపాడటానికి టీఆర్‌ఎస్, కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం రాజీలేని పోరాటం చేస్తుంది. హైదరాబాద్‌లో గవర్నర్ పాలన ఉండదు గాక ఉండదు. చట్టసభల్లో పోరాడతాం. న్యాయపోరాటం చేస్తాం. ఎంతకైనా తెగిస్తాం. ఇలాంటి కుతంత్రాలతో తెలంగాణ ప్రజలను కవ్వించి శాంతిభద్రతల సమస్యలు కల్పించాలనే చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడు. కానీ తెలంగాణ ప్రజలు చంద్రబాబు వలలో పడరు. చంద్రబాబు నీ కుట్రలు ఫలించవు గాక ఫలించవు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.