-జూబ్లీ హిల్స్ టు ఔటర్ 10 నిమిషాల్లో
-సత్ఫలితాలిస్తున్న ‘వ్యూహాత్మక’ వంతెనలు
-నేడు శిల్పా లే అవుట్ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
-ఎస్‌ఆర్‌డీపీలో 17వ వంతెన అందుబాటులోకి
ప్రాజెక్టు విశేషాలు
-ప్రాజెక్టు వ్యయం రూ.466 కోట్లు (పొడవు 2810 మీటర్లు)
-ఓఆర్‌ఆర్ నుంచి శిల్పా లేఅవుట్ మెయిన్ ఫ్లై ఓవర్ నాలుగు లేన్లతో 956 మీటర్లు
ఎగువ ర్యాంపు 458.64 మీటర్లు (రెండు లేన్లు)
-దిగువ ర్యాంపు రెండు లేన్లతో 399.95మీటర్లు
-మైండ్‌స్పేస్ వద్ద రెండు లేన్లతో ఎగువ ర్యాంపు 473 మీటర్లు
-మైండ్‌స్పేస్ వద్ద డౌన్ ర్యాంపు ఫ్లై ఓవర్ రెండు లేన్లతో 522 మీటర్లు
-వంతెన పై వంతెన చూస్తుంటే.. అద్భుతంగా ఉంది కదూ.. గచ్చిబౌలి ఫ్లైఓవర్ మీదుగా నిర్మించిన శిల్పా లేవుట్ పై వంతెన ఇది. రూ.466 కోట్ల వ్యయంతో 1.75 కిలోమీటర్ల పొడవుతో దీనిని నిర్మించారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న సమగ్రమైన అభివృద్ధి వ్యూహంతో నగరం నలు దిశల విస్తరిస్తున్న వేళ.. ఎస్‌ఆర్‌డీపీలో వడివడిగా సిద్ధమైన 17వ వంతెన ఇది. ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తే ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్య మరింత తగ్గుతుంది. గచ్చిబౌలి ఔటర్ ఎగ్జిట్ నుంచి శిల్పా లే అవుట్ ఫ్లై ఓవర్ నుంచి మైండ్ స్పేస్, దుర్గం చెరువు వంతెనల మీదుగా ప్రయాణిస్తే జూబ్లీహిల్స్ చెక్‌పోస్టుకు పది నిమిషాల్లో చేరుకోవచ్చు. గతంలో ఈ దూరానికి 45 నిమిషాలకు పైగా సమయం పట్టేది.
హైదరాబాద్ మహానగరం రోజురోజుకు విస్తరిస్తున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా వాహనాలు కూడా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు జీహెచ్‌ఎంసీ విశేషంగా కృషి చేస్తున్నది. రవాణా సౌకర్యం, వాహన కాలుష్యాన్ని తగ్గించడం, సిగ్నల్ ఫ్రీ రవాణా వ్యవస్థను మెరుగుపరిచి వాహనదారులు చేరుకోవాల్సిన గమ్యస్థానానికి సకాలంలో చేరడానికిగాను స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ (ఎస్‌ఆర్‌డీపీ) ప్రోగ్రామ్ ద్వారా చేపట్టిన పనులను ఒక్కొక్కటిగా అందుబాటులోకి తీసుకువస్తున్నారు.
ఎస్‌ఆర్‌డీపీ పథకంలో జీహెచ్‌ఎంసీ 41 పనులు, మిగతా 6 పనులు ఆయా శాఖలైన హెచ్‌ఎండీఏ, ఆర్‌అండ్‌బీ, నేషనల్ హైవే ద్వారా మొత్తం 47 పనులు చేపట్టారు. మొత్తం 47 పనుల్లో 32 పనులు పూర్తి కాగా మరో 15 పనులు వివిధ అభివృద్ధి దశల్లో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. పూర్తయిన 32 పనుల్లో 16 ఫ్లై ఓవర్లు, 5 అండర్ పాసులు, 7 ఆర్‌ఓబీలు, ఆర్‌యూబీలు, కేబుల్ బ్రిడ్జి, పంజాగుట్ట స్టీల్ బ్రిడ్జి, పంజాగుట్ట వైడెనింగ్, ఓఆర్‌ఆర్ నుంచి మెదక్ రిహబిటేషన్ పనులు పూర్తి చేసుకుని అందుబాటులోకి వచ్చి ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపారు. 17వ ఫ్లై ఓవర్ అయిన గచ్చిబౌలి ఐటీ కారిడార్ మీనాక్షి, ఐకియాలను కలుపుతూ రూ.466 కోట్ల వ్యయంతో 1.75 కిలో మీటర్ల పొడవున చేపట్టిన శిల్పా లే అవుట్ ఫ్లై ఓవర్‌ను శుక్రవారం (నేడు) పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు ప్రారంభించనున్నారు. గచ్చిబౌలి ఫ్లై ఓవర్ మీదుగా ఈ ఫ్లై ఓవర్ ఉండటం గమనార్హం.
అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు ఔటర్ రింగు రోడ్డు ద్వారా గచ్చిబౌలి వరకు ఎలాంటి సమస్యలు లేకుండా నేరుగా చేరుకున్నప్పటికీ అకడ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు. అయితే శిల్పా లే అవుట్ ఫ్లై ఓవర్ అందుబాటులోకి రానుండటంతో ఇక ప్రయాణికులకు ట్రాఫిక్ సమస్య తప్పనున్నది. జూబ్లీహిల్స్, పంజాగుట్ట నుంచి గచ్చిబౌలి మీదుగా పఠాన్ చెరువు, కోకాపేట్, నార్సింగ్‌తో పాటు అంతర్జాతీయ విమానాశ్రయం వెళ్లేందుకు ఒక మార్గం, అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జూబ్లీహిల్స్, పంజాగుట్ట, కూకట్‌పల్లి, మాదాపూర్ ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు గచ్చిబౌలి ఓఆర్‌ఆర్ నుంచి గ్రేడ్ సపరేట్ మరొక ఫ్లై ఓవర్ బ్రిడ్జిని చేపట్టారు.
ఎస్‌ఆర్‌డీపీలో 17వ ఫ్లై ఓవర్
ఓఆర్‌ఆర్ మీదుగా గతంలో ఉన్న గచ్చిబౌలి ఫ్లై ఓవర్ పై నుంచి శిల్పా లే అవుట్ వరకు అకడి నుంచి ఓఆర్‌ఆర్ వరకు(రెండు వైపులా) మొత్తం 956 మీటర్ల పొడవు 16.60 మీటర్ల వెడల్పు గల ఫ్లై ఓవర్‌ను నిర్మించారు.
ఎగువ ర్యాంపు ఓఆర్‌ఆర్ నుంచి శిల్పా లే అవుట్ ఫ్లై ఓవర్ వరకు 458.64 మీటర్ల వెడల్పు, శిల్పా లే అవుట్ నుంచి ఓఆర్‌ఆర్ వరకు దిగువ ర్యాంపు ఫ్లై ఓవర్ 399.952 మీటర్ల వెడల్పుతో రెండు ఫ్లై ఓవర్‌లను చేపట్టారు.
సర్వీస్ రోడ్డుగా ఉపయోగించబడే గచ్చిబౌలి నుంచి మైండ్ స్పేస్ వరకు 473 మీటర్ల పొడవు 8.50 మీటర్ల వెడల్పుతో అప్ ర్యాంపు ఫ్లై ఓవర్‌ను చేపట్టారు.
మైండ్ స్పేస్ నుంచి గచ్చిబౌలి వరకు డౌన్ ర్యాంపు ఫ్లై ఓవర్ 522 మీటర్ల పొడవు 8.50 మీటర్ల వెడల్పుతో చేపట్టారు.
ఈ శిల్పా లే అవుట్ ఫ్లై ఓవర్ వలన ఫైనాన్స్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీ మధ్య రోడ్ కనెక్టివిటీ పెరుగుతుంది. దీంతో గచ్చిబౌలి జంక్షన్‌లో ట్రాఫిక్‌కు సమస్యలకు ఉపశమనం కలుగుతుంది. హెచ్‌కేసీ, మీనాక్షి టవర్ ప్రాంతంలో అభివృద్ధి పెరిగే అవకాశం ఉంటుంది.