-అసైన్డ్ భూములు కొనటం నేరమని తెలియదా?.. మంత్రుల ప్రశ్న -బడుగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్న ఈటల -దళితుల భూములను కాజేయటం నిజంకాదా? -ఈటలకు టీఆర్ఎస్ అత్యున్నత గౌరవమిచ్చింది -మంత్రి కొప్పుల ఈశ్వర్

ప్రభుత్వాన్ని అస్థిరపర్చడం, టీఆర్ఎస్ను విచ్ఛిన్నం చేసేలా ఈటల రాజేందర్ వ్యవహారం ఉన్నదని ఎస్సీ కులాల అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. సీఎం కేసీఆర్ టీఆర్ఎస్లో ఈటలకు మొదటినుంచీ అత్యున్నత గౌరవం ఇచ్చారని.. ఆయన మాత్రం బడుగుల అత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించారని మండిపడ్డారు. మంగళవారం తెలంగాణభవన్‌లో మంత్రి కొప్పుల మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ టీఆర్ఎస్ను 2001లో స్థాపిస్తే ఈటల రాజేందర్ 2003లో పార్టీలోకి వచ్చారని తెలిపారు. అప్పటినుంచే ఆయనకు కేసీఆర్ సముచిత స్థానమిస్తూ వచ్చారని చెప్పారు. ఈటల చేరేనాటికే కమలాపూర్ (ప్రస్తుత హుజూరాబాద్) నియోజకర్గంలోని 4 జడ్పీటీసీ, 4 ఎంపీపీ స్థానాలు టీఆర్ఎస్ కైవసం చేసుకోవడంతోపాటు, ఉమ్మడి కరీంనగర్ జడ్పీపైనా గులాబీ జెండా ఎగురవేసిందని గుర్తుచేశారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కమలాపూర్ నుంచి పార్టీ అభ్యర్థిత్వం కోసం 23 మంది పోటీపడినా.. అప్పుడే పార్టీలో చేరిన ఈటలకే కేసీఆర్ టికెట్ కేటాయించి ఆదరించారని తెలిపారు. బీసీ నాయకుడిగా ఎదిగేందుకు ఎంతో ప్రోత్సహించారని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పార్టీ అసెంబ్లీ ఫ్లోర్‌లీడర్‌గా, స్వరాష్ట్రంలో రెండు పర్యాయాలు మంత్రిగా అవకాశం కల్పించారని చెప్పారు.
దళితుల భూములను ఎలా కాజేస్తారు? ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతికి తెచ్చిన చట్టాలు తెలిసిన వ్యక్తిగా, అసెంబ్లీలో పలు ఉపసంఘాలకు ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన వ్యక్తి దళితుల భూములను ఎలా కొంటారని మంత్రి కొప్పుల ప్రశ్నించారు. ఎవరైనా అలాంటి చర్యలకు పాల్పడితే వద్దంటూ సూచించాల్సిందిపోయి.. వాటిని కొనుగోలు చేశానని తానే చెప్పటాన్ని ఏమనుకోవాలని మండిపడ్డారు. కోటి, కోటిన్నర పలికే భూములను రూ.6 లక్షలకే కొనుగోలు చేయడం వెనుక ఈటల లాభాపేక్ష, సంస్థ ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయని ఇట్టే తెలిసిపోతున్నదన్నారు. చేయరాని తప్పులన్నీ చేసి ఇరుకున్న ఈటల ప్రభుత్వంపై ఆరోపణలు చేయటం సరికాదని హితవుపలికారు.
ప్రజాప్రయోజనాలే ముఖ్యం మంత్రిగా బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూనే ఈటల ఏడాదికాలంగా ప్రభుత్వంపై పలుమార్లు విమర్శలు చేశారని.. దేశానికే ఆదర్శంగా నిలిచిన ఆసరా, కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతుబీమా, మిషన్‌భగీరథ వంటి పథకాలకు వ్యతిరేకంగా మాట్లాడారని మంత్రి కొప్పుల గుర్తుచేశారు. పార్టీని, ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయాలనే కుట్రలో భాగంగానే ఇలా చేశారని పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన వ్యక్తిగా తనపై వచ్చిన ఆరోపణలపై సమాధానాలు చెప్పాల్సిందిపోయి, ఏమి మాట్లాడినా చెల్లుతుందన్నట్టు ఈటల వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సొంతలాభం కోసం ప్రజాప్రయోజనాలకు భంగం కలిగించాలని చూస్తే ఏ ప్రభుత్వమూ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. అందులో భాగంగానే ఈటల భూ ఆక్రమణలపై కమిటీ వేసినట్టు తెలిపారు. ఈటల తనకు తాను అతిగా ఊహించుకుంటున్నారని మంత్రి కొప్పుల ఎద్దేవాచేశారు. మందుగా ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిదని హితవుపలికారు.
చట్టాలు తెలిసిన వ్యక్తిగా, అసెంబ్లీలో పలు ఉపసంఘాలకు ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన ఈటల దళితుల భూములను ఎలా కొంటారు? మంత్రిగా ఉంటూనే ఈటల ఏడాదికాలంగా ప్రభుత్వంపై పలుమార్లు విమర్శలు చేశారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన ఆసరా, కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతుబీమా, మిషన్‌భగీరథ వంటి పథకాలకు వ్యతిరేకంగా మాట్లాడారు. పార్టీని, ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయాలనే కుట్రలో భాగంగానే ఇలా చేశారు. -మంత్రి కొప్పుల ఈశ్వర్