Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

తిరుగులేని శక్తిగా టీఆర్‌ఎస్

-అవినీతిరహిత పాలన అందిద్దాం
-జూలై చివర్లో మున్సిపల్ ఎన్నికలు
-టీఆర్‌ఎస్ శ్రేణులు సిద్ధంకావాలి
-జూలై 20 కల్లా సభ్యత్వాలు పూర్తికావాలి
-నియోజకవర్గస్థాయిలోనూ పార్టీ కార్యాలయాలు
-ఆగస్టులో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
-ధర్మగంటతో రెవెన్యూ సమస్యలు కొంతమేర పరిష్కారం
-టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు
-సభ్యత్వ నమోదును ప్రారంభించిన గులాబీ దళపతి

రాష్ట్రంలో టీఆర్‌ఎస్ తిరుగులేని శక్తిగా మారిందని ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. 2001లో టీఆర్‌ఎస్‌ను స్థాపించినప్పుడు కొండా లక్ష్మణ్‌బాపూజీ ఆశ్రయం ఇస్తే నాటి పాలకులు ఖాళీ చేయించిన విషయాన్ని గుర్తుచేస్తూ.. ఆ తర్వాత పార్టీకి శాశ్వత కార్యాలయం నిర్మించుకున్నాక అందరిలోనూ ధైర్యం వచ్చిందని, ఆ పరిస్థితి నుంచి నేడు 33 జిల్లాల్లో పార్టీకి శాశ్వత కార్యాలయాలు నిర్మించుకునే స్థితికి ఎదిగామని చెప్పారు. తదుపరి దశలో నియోజకవర్గస్థాయిలోనూ కార్యాలయాలు నిర్మించుకుందామన్నారు. పార్టీకి ఫిక్స్‌డ్ డిపాజిట్లుగా రూ.255 కోట్లు ఉన్నాయని, వాటిపై వడ్డీయే నెలకు రూ.కోటి వస్తున్నాయని తెలిపారు. వాటిని ఉపయోగించుకుని కార్యకర్తల శ్రేయస్సుకోసం పనిచేద్దామన్నారు. పార్టీ సభ్యులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించామని చెప్పారు. ఒకట్రెండురోజుల్లో సభ్యత్వ నమోదు పరిశీలనకు ఇంచార్జిలను నియమించనున్నట్టు వెల్లడించారు. కొత్త సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణానికి భూమిపూజ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఈ రోజు తనకు మంచి అనుభూతి కలుగుతున్నదని చెప్పారు. అందరం కష్టపడి బంగారు తెలంగాణగా మార్చుకుందామని పిలుపునిచ్చారు.

అభివృద్ధికి ఆకాశమే హద్దని చెప్పారు. ప్రజలు కడుపు నిండా తినాలని, ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉండాలన్న సీఎం.. అదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. తెలంగాణభవన్‌లో గురువారం టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అధ్యక్షతన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, మేయర్లు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, జూలై చివరిలో మున్సిపల్ ఎన్నికలు ఉంటాయని తెలిపారు. సభ్యత్వ నమోదుతోపాటు మున్సిపల్ ఎన్నికలకు కూడా పార్టీ శ్రేణులు సిద్ధంకావాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికలు పూర్తయితే రాబోయే నాలుగున్నరేండ్లు అభివృద్ధిపైనే దృష్టి పెడుదామన్నారు. ప్రజలు టీఆర్‌ఎస్‌వైపే ఉన్నారని, మున్సిపాలిటీల్లోనూ టీఆర్‌ఎస్ బ్రహ్మాండమైన విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు. టీఆర్‌ఎస్‌కు దరిదాపుల్లో ఏ పార్టీ కూడా లేదన్న కేసీఆర్.. బీజేపీ ఏదో నాలుగు సీట్లు రాగానే ఎగిసిపడుతున్నదని, ఆ పార్టీ గురించి పట్టించుకోవాల్సిన అవసరంలేదని వ్యాఖ్యానించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ మరోసారి గెలుస్తుందని ధీమా వ్యక్తంచేశారు.

20కల్లా సభ్యత్వ నమోదు పూర్తికావాలి
పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జూలై 20 నాటికి పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ నాయకత్వానికి నిర్దేశించారు. సభ్యత్వ నమోదు పర్యవేక్షణకు ప్రతి రెండు నియోజకవర్గాలకు ఒక ఇంచార్జిని నియమిస్తామని, వారు సభ్యత్వం పూర్తయ్యేవరకు అక్కడే ఉంటారని తెలిపారు. సభ్యత్వ నమోదు ముగిసిన తర్వాత గ్రామ, మండల కమిటీలను వేసుకోవాలని చెప్పారు. గ్రామస్థాయిలో పార్టీ కమిటీనే కాకుండా సామాజికవర్గాలవారీగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ, మహిళా, రైతు, యువత ఇలా అన్ని రకాల కమిటీలను వేసుకోవాలని సూచించారు. సభ్యత్వ నమోదును పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారని చెప్పారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు అందాయని, వారు టీఆర్‌ఎస్‌ను తమ ఇంటి పార్టీగా భావిస్తున్నారని కేసీఆర్ అన్నారు. వారుసైతం టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. పార్టీ కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ సభ్యత్వం చేయించాలని సూచించారు. సభ్యత్వాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని, అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశంగా తీసుకోవాలని చెప్పారు.

ఎమ్మెల్యేలే బాస్‌లు
అసెంబ్లీ నియోజకవర్గాల్లో శాసనసభ్యులే బాస్‌లని కేసీఆర్ స్పష్టంచేశారు. వారే అన్ని బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. పార్లమెంట్ సభ్యులు కూడా వారి నియోజకవర్గ అభివృద్ధి నిధులను ఎమ్మెల్యేలకే ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్యేకు సంబంధంలేకుండా, తెలియకుండా ఎంపీలు నిధులు ఇవ్వడంవల్ల కొత్త సమస్యలు వస్తాయని, ఎమ్మెల్యేకే నిధులిస్తే ఆయనే ఎంపీని గౌరవించుకుంటారని చెప్పారు. అందరూ ఎమ్మెల్యే నాయకత్వంలో పనిచేయాల్సి ఉంటుందన్నారు. జిల్లా పార్టీకి అధ్యక్షుడు ఉంటే గ్రూపుల సమస్య వస్తుందనే ఉద్దేశంతోనే ఇప్పటివరకు వారి నియామకం చేపట్టలేదన్న సీఎం.. అధ్యక్షుడికి బదులు సమన్వయకర్తను నియమించాలని ఆలోచన చేస్తున్నామని వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌లో బీఎస్పీ ఇదే తరహా విధానంలో వెళ్తున్నదని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఇదే విధానాన్ని అవలంబించి విజయవంతమైందని చెప్పారు. పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా రాబోయే రోజుల్లో నియోజకవర్గస్థాయిలో పార్టీ కార్యాలయాలు నిర్మించుకుందామని అన్నారు.

బస్తీలపై దృష్టి పెట్టాలి
గ్రామీణ ప్రాంతాల్లో టీఆర్‌ఎస్ పూర్తి ఏకపక్షంగా ఉన్నదని సీఎం కేసీఆర్ చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్‌లోనూ బలంగా ఉందని, అయితే మరింత బలోపేతం కావడంపై దృష్టిపెట్టాలని నాయకులకు సూచించారు. బస్తీల్లో సభ్యత్వ నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. ప్రతి బస్తీలోనూ పార్టీ కమిటీతోపాటు సామాజికవర్గాలవారీగా కమిటీలు వేసుకోవాలన్నారు. గతంలో మున్సిపల్ మంత్రిగా పనిచేసిన కేటీఆర్‌కు నగరంపై పూర్తి అవగాహన, పట్టు ఉన్నందున ఆయనతో సమన్వయం చేసుకోవాలని గ్రేటర్ హైదరాబాద్ నాయకులకు సూచించారు.

అధ్యయనానికి విదేశాలకు ఎమ్మెల్యేలు
శాసనసభ్యులు కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో పర్యటించాల్సిన అవసరం ఉన్నదని కేసీఆర్ అన్నారు. అక్కడి పరిపాలన, సామాజిక పరిస్థితులు, పథకాలు, ప్రజల జీవన విధానం, మనం అనుసరించాల్సిన విషయాలు తదితర అంశాలపై అధ్యయనం చేయడానికి ఎమ్మెల్యేలను విదేశాలకు, ఇతర రాష్ట్రాలకు పంపుతామని తెలిపారు.

అవినీతిరహిత పాలన
ప్రజలకు అవినీతిరహిత పాలన అందించాల్సిన అవసరం ఉన్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు అవినీతి రహితంగా ఉండాలన్నారు. పంచాయతీరాజ్, రెవెన్యూశాఖల్లో ఇంకా పాతకాలపు విధానాలు ఉన్నాయని, వాటిన్నింటినీ ప్రక్షాళన చేయాల్సి ఉన్నదని చెప్పారు. ఈ శాఖల్లో అవినీతి లేకుండా పనులు జరుగడంలేదన్నారు. ఈవోపీఆర్డీలు, ఆర్డీవోలు, ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని విచారం వ్యక్తంచేశారు. అవినీతిని రూపుమాపడం తన ఒక్కడితోనే సాధ్యంకాదన్నారు. అవినీతిని నిర్మూలించడానికి కొత్త చట్టాలు తీసుకువస్తే కొందరు వ్యతిరేకిస్తున్నారన్న సీఎం.. చట్టాలను ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు చేయవని, చట్టసభలు చేస్తాయని స్పష్టంచేశారు. రాష్ట్రం ఆర్థిక వృద్ధిరేటు 17.5%గా ఉన్నదని, ఇది ఇంకా పెరిగే అవకాశమున్నదని చెప్పారు. అదే ఏపీలో 6-7శాతం మాత్రమే వృద్ధిరేటు ఉన్నదన్నారు. నూతనంగా ఎన్నికైన జిల్లా పరిషత్ చైర్మన్లు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నీతి నిజాయితీతో సేవలందించాలని ఉద్బోధించారు. నిజాయితీగా ఉండాలనే ఉద్దేశంతో అసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌లాంటి ప్రభుత్వ పథకాలను నేరుగా లబ్ధిదారులకు అందిస్తున్నామన్నారు. అవినీతి లేకుండా పథకాలు అమలుచేయాలనేదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.

రెండున్నరేండ్లలో ధనిక రైతులు
రాష్ట్రంలో వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకుందామని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని రైతులకు నీళ్లు అందిస్తామని, తెలంగాణను పచ్చగా చేసుకుందామని అన్నారు. వ్యవసాయానికి అవసరమైన నీటిని అందించడానికి ఇప్పటికే పనులు జరుగుతున్నాయని తెలిపారు. హైదరాబాద్‌లోని కోటీశ్వరులు తాగే స్వచ్ఛమైన నీటిని పేద ప్రజలు కూడా తాగాలనే ఉద్దేశంతోనే మిషన్ భగీరథకు రూపకల్పన చేసినట్టు చెప్పారు. ఈ పథకం పూర్తి అయిందని, ప్రజలకు మంచినీరు అందుతున్నదని తెలిపారు. గతంలో ఎండాకాలం వస్తే ఖాళీ బిందెల ప్రదర్శన ఉండేదని, కానీ.. మిషన్ భగీరథతో బిందెల ప్రదర్శన బంద్ అయిందని వ్యాఖ్యానించారు. కరంటు సమస్యను పరిష్కరించుకున్నామని, అన్నిరంగాలకు ఇప్పుడు 24 గంటల విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. సాగునీటిని కూడా అందించుకుంటే వ్యవసాయానికి మేలు జరుగుతుందన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు శరవేగంగా పూర్తిచేశామని, రాబోయే రోజుల్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును అదే వేగంతో పూర్తి చేస్తామని చెప్పారు. రెండున్నరేండ్లలో దేశంలోనే ధనికులైన రైతులు ఉండే రాష్ట్రంగా తెలంగాణ మారుతుందని సీఎం విశ్వాసం వ్యక్తంచేశారు. మనం ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులతో ఇది సాధ్యంకానున్నదని చెప్పారు. రైతుల పొలాలకు నీళ్లు రాబోతున్నందున వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతాయన్నారు. రైతులు ఏ పంట పండించాలి? వాటిని ఎప్పుడు అమ్మాలి? కనీస మద్దతు ధర.. తదితర అంశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని రైతు సమన్వయ సమితి (ఆర్‌ఎస్‌ఎస్) సభ్యులకు కేసీఆర్ సూచించారు. ఆర్‌ఎస్‌ఎస్ సభ్యులకు గౌరవ వేతనాన్ని ఇచ్చుకుందామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించాల్సిన అవసరం ఉన్నదని ఉద్ఘాటించారు. తెలంగాణ ఉద్యమాన్ని 2001లో మొదలుపెట్టానని చాలామంది అనుకుంటారని, కానీ 1996లో ఎస్సారెస్పీ ప్రాజెక్టు మీదనే ఆనాడు తాను రాష్ట్రసాధన ఉద్యమం చేపట్టాలని అనుకున్నానని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. ఎస్సారెస్పీని పూర్తిచేయడంలో నిర్లక్ష్యం వహించిన ఉమ్మడి పాలకులు.. నాగార్జునసాగర్ ప్రాజెక్టును మాత్రం పూర్తిచేసుకున్నారని అన్నారు. తెలంగాణ ప్రాజెక్టులను శివాలయాల మాదిరిగా నిర్లక్ష్యంగా చూశారని ఆవేదన వ్యక్తంచేశారు.

ఎస్సీల అభివృద్ధిపై మరింత దృష్టి
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఇప్పటికే అనేక పథకాలను ప్రవేశపెట్టామని, అయితే వారికి ఇంకా మెరుగైన పథకాలను అమలుచేయాల్సి ఉన్నదని సీఎం కేసీఆర్ అన్నారు. దీనికోసం ఇకపై ఎస్సీల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడుదామని చెప్పారు. ఎస్సీలకు భూమి లేదని, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి ఉన్నారని పేర్కొంటూ.. వారిని ప్రత్యేకంగా ఆదుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు.

మొదటి సభ్యత్వాన్ని స్వీకరించిన కేసీఆర్
తొలి సభ్యత్వాన్ని తీసుకోవడం ద్వారా టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఆయనకు పార్టీ ప్రధానకార్యదర్శి మాదిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి సభ్యత్వాన్ని అందించారు. అనంతరం పార్టీ సెక్రటరీ జనరల్ కే కేశవరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు, మాజీ మంత్రి హరీశ్‌రావు సభ్యత్వాన్ని స్వీకరించారు. అనంతరం కేటీఆర్ పలువురు పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, చైర్మన్లు, ముఖ్య నాయకులకు సభ్యత్వాన్ని అందజేశారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఇంచార్జిలకు ఒక్కో నియోజకవర్గానికి 50వేల సభ్యత్వానికి అవసరమైన పుస్తకాలను పంపిణీచేశారు. ఇందులో 32,500 సాధారణ సభ్యత్వం, 17,500 క్రియాశీల సభ్యత్వాల చొప్పున ఉన్నాయి.

ధర్మగంటతో సమస్యలు పరిష్కారం
రెవెన్యూశాఖతో సమస్యలు వస్తున్నాయని, ఈ శాఖను ప్రక్షాళన చేయాల్సి ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. కచ్చితంగా ఈ శాఖలో ప్రక్షాళన చేద్దామని అన్నారు. నమస్తే తెలంగాణలో ధర్మగంట శీర్షికన ప్రచురితమవుతున్న కథనాలను ప్రస్తావించిన సీఎం.. వాటితో కొంతవరకు సమస్యలు పరిష్కారమవుతున్నాయని చెప్పారు. అయితే ఆ శాఖలో ఇంకా మార్పు రావడంలేదన్నారు.

టీఆర్‌ఎస్ కార్యకర్తలకు జగన్ అభివాదం
తెలంగాణభవన్ వద్ద గురువారం సాయంత్రం అరుదైన దృశ్యం కనిపించింది. టీఆర్‌ఎస్ సమావేశం పూర్తవుతున్న సమయంలో అటుగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తన కాన్వాయ్‌తో లోటస్‌పాండ్‌కు వస్తున్నారు. సమావేశం నేపథ్యంలో పార్టీ కార్యాలయం వెలుపల పెద్ద సంఖ్యలో టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఉన్నారు. దీనితో జగన్ తన కాన్వాయ్‌తో నెమ్మదిగా వెళ్లారు. ఆ సమయంలో టీఆర్‌ఎస్ కార్యకర్తలవైపు చూస్తూ అభివాదం చేశారు. దీనికి ప్రతిగా టీఆర్‌ఎస్ కార్యకర్తలు కేరింతలు కొట్టారు.

ప్రజా ప్రయోజనాలకే ఏపీ సీఎంతో చర్చలు
తెలంగాణ వస్తే ఇరు రాష్ట్రాలకు మంచి జరుగుతుందని తాను అనేకమార్లు చెప్పానని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తుచేశారు. అయితే అప్పుడు ఎవరూ నమ్మలేదని, కానీ.. తెలంగాణ వచ్చాక అది నిజమైందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారి, ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రావడంద్వారా ఇరు రాష్ట్రాలకు మంచి జరుగుతున్నదన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో గిల్లికజ్జాలు పెట్టుకోవడం, గొడవలే ఆయనకు ముఖ్యంగా మారాయని విమర్శించారు. జగన్ ఏపీ ముఖ్యమంత్రి అయిన తర్వాత సచివాలయం, అసెంబ్లీలో ఏపీ వాడుకుంటున్న భవనాలను తెలంగాణకు అప్పగించారని పేర్కొన్నారు. గోదావరి నదిలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయని, వేల టీఎంసీలు సముద్రంలో కలిసే బదులు వాటిని సద్వినియోగం చేసుకోవడానికి ఏపీ సీఎం జగన్‌తో చర్చలు జరుపున్నట్టు చెప్పారు. ఈ చర్చలకు ఏపీ నుంచి 27 మంది వస్తున్నారని, వారిలో ఆరుగురు మంత్రులు, ఇతరులు అధికారులు ఉంటారని చెప్పారు. పొరుగు రాష్ట్రాలతో సామరస్యంగా ఉండాలనేదే తమ అభిమతమన్నారు. సఖ్యత ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించుకొని ప్రజలకు మంచి చేద్దామని చెప్పారు. ఆంధ్ర ప్రజలకు తాము వ్యతిరేకం కాదని ఉద్యమం సమయంలోనే చెప్పిన విషయాన్ని కేసీఆర్ గుర్తుచేశారు.

దేశానికే ఆదర్శం మన పథకాలు
రాష్ట్రంలో ఇప్పటివరకు ప్రవేశపెట్టిన పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని కేసీఆర్ చెప్పారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలు కేంద్రానికి, అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. రాష్ట్రానికి పుష్కలంగా నిధులున్నాయని, అప్పులు కూడా తీర్చగలుగుతున్నదని చెప్పారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.