-టీఆర్ఎస్ క్యాడర్లో జోష్.. నియోజకవర్గాలకు లక్ష్యాలు నిర్దేశిస్తున్న కేటీఆర్ -13 నుంచి రెండో విడుత సన్నాహక సమావేశాలు
టీఆర్ఎస్ నిర్వహిస్తున్న లోక్‌సభ నియోజకవర్గాల సన్నాహక సమావేశాలు మొదటి విడుత విజయవంతమయ్యాయి. సమావేశాలకు హాజరవుతున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు పార్టీ క్యాడర్ అడుగడుగునా బ్రహ్మరథం పట్టింది. పార్టీ క్యాడర్లో ఉత్సాహాన్ని నింపుతూ, ఊపునిచ్చేలా కేటీఆర్ ప్రసంగాలు సాగాయి. ఒక సభతో పోటీపడుతున్నట్టుగా మరో సభకు పార్టీ కార్యకర్తలు, నాయకులు హాజరయ్యారు. సమావేశం జరుగుతున్నంతసేపు కార్యకర్తల్లో ఉత్సాహం పెల్లుబికింది. ఈ నెల 6 నుంచి ప్రారంభమైన సమావేశాలు ఏడు లోక్‌సభ నియోజకవర్గాల్లో పూర్తయ్యాయి. పార్టీ ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా సెంటిమెంట్‌గా భావించే కరీంనగర్ నుంచే లోక్‌సభ సన్నాహక సమావేశాలు కూడా ప్రారంభమయ్యాయి. మరుసటిరోజు టీఆర్ఎస్కు, తెలంగాణ ఉద్యమానికి అండగా నిలుస్తున్న వరంగల్‌లో సమావేశాన్ని నిర్వహించారు. అదే రోజు భువనగిరిలో, 8న మెదక్, మల్కాజిగిరి.. శనివారంనాగర్కర్నూల్, చేవెళ్ల నియోజకవర్గాల్లో సభ లు నిర్వహించారు.
ప్రతి సమావేశానికి ఆ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సమావేశాల్లో ప్రధానంగా కేటీఆర్ ప్రసంగాలు రాబోయే రోజు ల్లో క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్ వాదనను ఏవిధంగా ప్రజల్లోకి తీసుకుపోవాలి? టీఆర్ఎస్ 16 సీట్లు గెలిస్తే రాష్ర్టానికి ఏ విధంగా మేలు జరుగుతుంది? భారీ మెజార్టీ వచ్చేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అన్న అంశాలపై సాగాయి. పార్టీ నాయకులకు వారి వారి పోలింగ్ బూత్‌ల్లో లక్ష్యాలను నిర్దేశించారు. స్థానిక నేతలను సమన్వయపరిచి, వారిలో స్ఫూర్తిని నింపారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నియోజకవర్గాల్లో లోటుపాట్లను విడమర్చి చెప్పారు. ఎన్నికల తర్వాత ఏ నియోజకవర్గాల్లో ఎంత మెజార్టీ వచ్చిందో చూస్తామని, ఇప్పుడు చెప్పిన మెజార్టీ, అప్పుడు వచ్చిన మెజార్టీని పోలుస్తామన్నారు. ప్రజాప్రతినిధులు ఎవరైనా తమ తమ బూత్‌లలో 70-75 శాతం మెజా ర్టీ సాధించే దిశగా టార్గెట్ నిర్దేశించారు. ప్రజలందరినీ పార్టీలకు అతీతంగా ఓట్లు అడగాలని.. అందరూ సీఎం కేసీఆర్‌కు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో మనకు మనమే ప్రత్యర్థులమని, నియోజకవర్గాల మధ్య మెజార్టీలు సాధించడంలో పోటీ పడాలని సూచించారు. నియోజకవర్గ బాధ్యతలను ఆయా జిల్లాల మంత్రులకు అప్పగించారు. వారే జిల్లా నేతలను సమన్వయం చేయాలని స్పష్టంచేశారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు కూడా ఇప్పటినుంచే ప్రచారం చేసుకోవాలని సూచించారు.
13 నుంచి రెండో విడుత రెండో విడుత సన్నాహక సమావేశాలు 13 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 13న జహీరాబాద్ నియోజకవర్గ సభ నిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద, సికింద్రాబాద్ నియోజకవర్గ సమావేశాలు జరుగనున్నాయి. 14న నిజామాబాద్, ఆదిలాబాద్ 15న పెద్దపల్లి నియోజకవర్గ సభ రామగుండంలో నిర్వహిస్తారు. 16న మహబూబాబాద్, ఖమ్మం, 17న నల్లగొండ, మహబూబ్‌నగర్ నియోజకవర్గా ల సమావేశాలు జరుగనున్నాయి.