Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

తూర్పు నుంచి నేర్చుకుందామా!

By Boianapally Vinod Kumar (MP, Karimnagar)

కేంద్ర సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ నేతృత్వంలో పది మంది పార్లమెంటు సభ్యుల గుడ్ విల్ డెలిగేషన్ ఇటీవల పది రోజుల పాటు సింగపూర్, మలేషియా, ఇండోనేషియా దేశాల్లో పర్యటించింది. ఈ పర్యటన చాలా కొత్త విషయాలను నేర్పింది. తూర్పు వైపు అనే మన దేశ విధానానికి, భౌగోళిక, రాజకీయ ధోరణులకు ఈ మూడు దేశాలూ ఎంతో ప్రధానమైనవి. ఆగ్నేయాసియా ఉప ఖండంలోని దేశాలతో మన దేశానికి సంస్కృతి, జీవన విధానం, వలస వారసత్వం లాంటి ఎన్నో విషయాల్లో పోలికలు ఉన్నాయి. వివిధ రంగాల్లో మన దేశం కంటే ఎక్కువ అభివృద్ధిని సాధించాయి. అందువల్లనే ఈ దేశాల నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి.

సమర్థ నీటి వినియోగం: నీటి నిర్వహణ, వినియోగం, పరిరక్షణలో సింగపూర్‌లో విధానాలను మన దేశ పరిస్థితులకనుగుణంగా స్వీకరించాల్సి ఉన్నది. సింగపూర్‌లో నీటి వనరులు చాలా స్వల్పం. మలేషియా నుంచి నీటిని దిగుమతి చేసుకుంటూ ఉన్నది. నీటిని పొదుపుగా, సమర్థవంతంగా వినియోగించుకోవడం వారి జీవన విధానంలో భాగమైంది. ప్రజలు స్వీయ క్రమశిక్షణ అలవాటు చేసుకున్నారు. అందువల్లనే 24 గంటల నీటి సరఫరా సాధ్యమవుతోంది.

MP-Vinod-Kumar

సింగపూర్‌లో నాలుగు రకాల నీరు వినియోగంలో ఉంది. మలేషియా నుంచి దిగుమతి చేసుకునే నీరు, వర్షపు నీరు, సముద్రపు నీటిని శుద్ధీకరించి (డీశాలినేషన్)న నీరు, న్యూ వాటర్. ఈ నాల్గవ రకం నీటికి ప్రత్యేకత ఉంది. పై మూడు రకాల నీటిని వినియోగించిన తర్వాత వ్యర్థంగా వెళ్ళే నీటిని శాస్త్రీయ పద్ధతుల్లో శుద్ధీకరించి వినియోగించడానికి చేసే రీసైక్లింగ్ పద్ధతి. ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు అమెరికాలోని వాతావరణ పరిరక్షణ సంస్థ 13 వేల రకాల శాస్త్రీయ పరీక్షలను నిర్వహించి, ఈ నాల్గవరకం నీరు తాగడానికి పనికొస్తుందని ధృవీకరించాయి. ఈ తరహా నీరు సింగపూర్ వాడుతున్న మొత్తం నీటిలో 30 శాతం. వర్షపు నీటిలో ప్రతి చుక్కనూ సద్వినియోగం చేసుకోవడాన్ని సింగపూర్ ఒక విధానంగా అమలుచేస్తోంది. నగరం మధ్యలో నదిపైన ఆనకట్ట నిర్మించి పదివేల మిలియన్ లీటర్ల నీరు ఎప్పుడూ అందుబాటులో ఉండేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. వర్షపు నీటిని భద్రపర్చడం, వాడిన నీరు వృథా కాకుండా చూసుకోవడం, వాడిన నీటిని రీసైక్లింగ్ చేయడం అనే మూడు రకాల నీటి నిర్వహణ పద్ధతులున్నాయి.

అవసరాలకనుగుణంగా సాంకేతిక విద్య: సింగపూర్‌లో మరో ముఖ్యమైన అంశం విద్యా రంగం. విద్యార్థులకు వివిధ రకాల ప్రావీణ్యాన్ని (స్కిల్స్) బోధించడం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఐటీఈ)ప్రత్యేకత. మన దేశంలోని ఐటీఐలకు సింగపూర్ ఐటీఈలకు సారూప్యత ఉంది. అక్కడ మాధ్యమిక విద్యాభ్యాసం పూర్తికాగానే ఐటీఈలో చేరవచ్చు. రెండు మూడు ఏండ్ల శిక్షణ తర్వాత విద్యార్థులు ఇంజినీరింగ్ డిజైన్, మాన్యుఫ్యాక్చరింగ్, మల్టీ మీడియా, ఏరో స్పేస్, మెక్‌ట్రానిక్స్ (మెకానికల్-ఎలక్ట్రానిక్స్), బిజినెస్ మేనేజ్‌మెంట్, నర్సింగ్ హాస్పిటాలిటీ, సేవలు, ఎకౌంటింగ్, మానవ వనరులు, వినియోగం, మార్కెటింగ్ తదితర విభాగాల్లో స్కిల్స్ పొందుతారు. వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలు, వాటికి తగిన అర్హతలు సాధించేలా తీర్చిదిద్దుతారు. అందువల్ల నిరుద్యోగం అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు. మన దేశంలో కనిపించే సాంస్కృతిక చిన్నచూపు (కల్చరల్ స్టిగ్మా) సింగపూర్ విద్యార్థుల్లో కనిపించదు. మన దేశంలోని సంప్రదాయక ఐటీఐలను సింగపూర్‌లోని ఐటీఈల తరహాలో అభివృద్ధి, రూపాంతరం చేయాల్సిన అవసరం ఉన్నది.

గృహవసతి ఒక సామాజిక బాధ్యత: సింగపూర్ ప్రభుత్వం అందరికీ ఇండ్లు కల్పించడానికి సెలెక్టివ్ ఎన్‌బ్లాక్ డెవలప్‌మెంట్ అనే పథకాన్ని రూపొందించింది. కుటుంబ అవసరాలు, ఆర్థిక పరిస్థితుల ఆధారంగా హౌజింగ్ బోర్డు వివిధ కాలనీల్లో సింగిల్, డబుల్, ట్రిపుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్లను నిర్మిస్తుంది. ఈ ఇండ్ల పటిష్టతపై నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. నివాసానికి యోగ్యం కాదని స్పష్టమైన వెంటనే వాటి స్థానంలో కొత్త ఇండ్లను నిర్మిస్తుంది. పాత ఇండ్లలోని వారిని తాత్కాలికంగా ఇతర కాలనీలకు తరలిస్తుంది. ఇంటి సామాన్లను తరలించడంలో కూడా హౌసింగ్ బోర్డు సహాయ పడుతుంది. కొత్త ఇంటి నిర్మాణానికి బ్యాంకు రుణం సమకూరుస్తుంది. పౌరులకు గృహవసతి కల్పించడాన్ని ఒక సామాజిక బాధ్యతగా భావించింది కాబట్టే సింగపూర్ ప్రభుత్వం ఈ పథకాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తోంది. ఇండ్లు నివాసయోగ్యం కావని భావించినప్పుడు దానికి తగిన మార్కెట్ విలువను నిర్ణయించి కొత్త ఫ్లాట్‌లను సమకూర్చడంలో చొరవ తీసుకుంటుంది.

మతసామరస్యానికి ప్రతీక ఇండోనేషియా: సింగపూర్ పర్యటన ముగించుకున్న తర్వాత మా బృందం ఇండోనేషియాకు చేరుకుంది. ఈ దేశంలో మెజారిటీ జనాభా ముస్లింలే. అయినా హిందు సంస్కృతి, సంస్కృత భాషల ప్రభావం కూడా చాలా ఉంది. పూర్వకాలం నుంచీ మనకు ఆ దేశంతో వాణిజ్య సంబంధాలు ఉండటం ఒక కారణం. చరిత్రను పరిశీలిస్తే తమిళనాడులోని చోళుల ప్రాబల్యం ఇండోనేషియా వరకూ విస్తరించినట్లు స్పష్టమవుతుంది. మెజారిటీ ప్రజలు ముస్లింలే అయినా ఈ దేశ జాతీయ వాయు సంస్థ పేరు గరుడ. చాలా మందికి రాముడు, లక్ష్మి, పార్వతి, పుత్ర, పుత్రి లాంటి పేర్లు ఉంటాయి. పిల్లలకు పేర్లు పెట్టడంలో చరిత్ర, సంస్కృతిని భావితరాలకు అందజేయాలన్న అంశానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. రామాయణం, మహాభారతం పురాణాల్లో కనిపించే అనేక ఘట్టాలు ఆట, పాటల్లో కనిపిస్తాయి. ఇండోనేషియా ప్రజలు మతాన్ని, సంస్కృతిని వేరువేరుగా చూస్తారే తప్ప కలిపి చూడరు. భారత ఉపఖండంలోని అనేక ప్రాచీన సంప్రదాయాలు ఇండోనేషియాలో ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి. చాలా చోట్ల మన దేశంలో కాలగర్భంలో కలిసిపోయినవి కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయి. జకార్తా అంతర్జాతీయ విమానాశ్రయం ముందు మనకు చాలా పెద్ద కృష్ణుడి విగ్రహం, కురుక్షేత్ర సంగ్రామాన్ని గుర్తుకుతెచ్చే రథాలు, గుర్రాలు, అర్జునుడు తదితరాలు కనిపిస్తాయి. ప్రతిరోజూ వివిధ ప్రాంతాల్లో రామాయణ, మహాభారత ఘట్టాల గురించి నూతన తరానికి తెలియజేయడం కోసం సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శితమవుతుంటాయి.

అభివృద్ధికి చిహ్నం మలేషియా: ఇండోనేషియా పర్యటన ముగించుకుని మా బృందం మలేషియాకు చేరుకుంది. మన దేశం తర్వాత పదేండ్లకు ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చినా అభివృద్ధిలో మాత్రం ముందుంది. మార్కెట్ ఎకానమీని అవగాహన చేసుకోవడం ద్వారా అనేక బహుళజాతి సంస్థలకు ఈ దేశం స్థావరంగా మారింది. ఒకప్పుడు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన, ప్రపంచంలోనే అతి ఎత్తయిన భవనంగా ఉండే పెట్రోవాస్ టవర్స్ మలేషియాకు అంతర్జాతీయ గుర్తింపును ఇచ్చింది. ఇప్పటికీ మలేషియా అభివృద్ధికి చిహ్నంగానే ఉంది. కొత్త రాజధాని నగరమైన పుత్ర జయను సందర్శించినప్పుడు ఇండోనేషియా తరహాలోనే భారతీయ సంస్కృతి ప్రస్ఫుటంగా కనిపించింది. ఆ దేశ ప్రజలు వారి ప్రధాన మంత్రిని పెర్దాన మంత్రి అని పిలుచుకుంటారు. ఈ దేశ మూడవ ప్రధానమంత్రి డాక్టర్ మహాలూర్ మహమ్మద్ భారతీయ సంతతి వారే.

ఆసియా ఉపఖండంలో చిన్నదేశాలే అయినా ఇండోనేషియా, మలేషియా, సింగపూర్ ఒక్కో రంగంలో ఒక్కో ప్రత్యేకత సాధించి మన దేశంకంటే ముందు వ రుసలో ఉన్నాయి. అల్పంగా ఉన్న వనరులను సమర్థవంతంగా నిర్వహించుకోవడంలో ప్రభుత్వపరంగా విధాన నిర్ణయాలు తీసుకోవడమే కాక ప్రజల్లో కూడా వ్యక్తిగత క్రమశిక్షణ పెంపొందించగలిగాయి. ఇండోనేషియా 2004లో సునామీతో తీవ్రంగా నష్టపోయింది. కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని యావత్తు ప్రపంచం జాలి చూపించినా అధైర్యపడకుండా, ఆత్మవిశ్వాసం కోల్పోకుండా తన కాళ్ళమీద తాను నిలబడేందుకు శక్తివంచన లేకుండా కృషి చేసింది. ఏయే రంగాల్లో ఈ దేశాలు ముందుకుపోతున్నాయో విశ్లేషించి వాటిని మన దేశానికి అన్వయించుకోవడం అవసరం. చిన్నదేశాలే అయినా వాటి నుంచి మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ముఖ్యంగా అభివృద్ధి, ఆర్థికం, సహజ వనరు ల వినియోగం, భవిష్యత్ తరాల కోసం సంస్కృతిని పదిలంగా కాపాడుకోవడం, మత సామరస్యానికి పాటుపడడం.. ఇలాంటివన్నీ మనం వాటి నుంచి గ్రహించాలి.

20వ శతాబ్దంలో అమెరికా, రష్యా దేశాలు ప్రధాన పాత్ర పోషించాయి. 21వ శతాబ్దం భారతదేశానిది కావాలి. దివంగత ప్రధాని నెహ్రూ అలీన ఉద్యమాన్ని ఇండోనేషియాలోనే మొదలుపెట్టారు. ప్రపంచమంతా భారతదేశ అభివృద్ధివైపు ప్రయాణం చేస్తోంది. ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలో మన దేశానికి ఇంకా శాశ్వత సభ్యత్వం రాకపోవడం బాధాకరం. ఆసియా ఖండలోనైనా, ఆగ్నేయాసియాలోనైనా పొరుగు దేశాలతో మంచి సంబంధాలను కొనసాగించడం నేటి అవసరం. ముందుచూపుతో గుడ్‌విల్ డెలిగేషన్ ఈ మూడు దేశాల్లో పర్యటించడం ఒక శుభ పరిణామం.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.