-వనదేవత పేరు పెట్టిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు -నేడు లక్ష్మీ బరాజ్ సందర్శన -రానున్న వానకాలం నుంచి పెరుగనున్న వరదనీటి ప్రవాహం -ప్రాణహిత నీటిని ఎప్పటికప్పుడు ఎగువకు ఎత్తిపోసేందుకు.. -కాల్వలకు మళ్లించేందుకు ఇప్పట్నుంచే అప్రమత్తం కావాలి -సమీక్షా సమావేశంలో అధికారులకు సీఎం ఆదేశం -తొలిసారిగా లక్ష్మీ బరాజ్‌లో 14 టీఎంసీల నీటినిల్వ

గోదావరినది మీద నిర్మాణమవుతున్న తుపాకులగూడెం బరాజ్‌కు ఆదివాసీ వీరవనిత, వనదేవత సమ్మక్క పేరుపెట్టాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. తుపాకులగూడెం బరాజ్‌ను సమ్మక్క బరాజ్‌గా పేరుమారుస్తూ జీవో జారీచేయాలని ఈఎన్సీ మురళీధర్‌రావును ఆదేశించారు. ముక్కోటి దేవతల కరుణాకటాక్షాలు బలంగా ఉన్నందున తెలంగాణలో అభివృద్ధి అనుకున్నరీతిలో సాగుతున్నదని ముఖ్యమంత్రి తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయి తెలంగాణ బీళ్లలోకి కాళేశ్వరం జలాలు చేరుకుంటున్న శుభసందర్భంలో ఇప్పటికే పలు బరాజ్‌లు, రిజర్వాయర్లకు దేవతామూర్తుల పేర్లు పెట్టుకున్నామని ఈ సందర్భంగా గుర్తుచేశారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగమైన లక్ష్మీ (మేడిగడ్డ) బరాజ్‌లో తొలిసారిగా అత్యధికస్థాయిలో నీటిని నిల్వచేశారు. సముద్రనీటి మట్టానికి వందమీటర్ల ఎత్తులో నిర్మించిన ఈ బరాజ్‌లో ప్రస్తుతం 99.4 మీటర్ల ఎత్తులో 14.287 టీఎంసీల నీటినిల్వ ఉన్నది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గురువారం లక్ష్మీబరాజ్‌ను సందర్శించనున్నారు.
కాళేశ్వర ముక్తేశ్వరస్వామిని దర్శించుకున్న తర్వాత ఆయన బరాజ్ వద్దకు చేరుకుంటారు. ఈ పర్యటన నేపథ్యంలో బుధవారం సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘కాళేశ్వరం ప్రాజెక్టులోకి అనుకున్నరీతిలో సాగునీరు చేరుకుంటున్నది. రానున్న వానకాలం నుంచి వరదనీటి ప్రవా హం పెరుగనున్నది. ప్రాణహిత ద్వారా లక్ష్మీబరాజ్‌కు చేరుకునే వరద నీటిని ఎప్పటికప్పు డు ఎగువకు ఎత్తిపోసుకునేందుకు, అటునుం చి కాల్వలకు మళ్లించే దిశగా నీటిపారుదలశాఖ ఇప్పట్నుంచే అప్రమత్తం కావాలి. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలి’ అని అధికారులకు సూచించారు. సమీక్షా సమావేశంలో మంత్రులు గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్‌కుమార్, రైతు సమన్వయసమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్యసలహాదారు రాజీవ్‌శర్మ, సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, నీటిపారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
గోదారమ్మ పరవశం కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా ప్రాణహితజలాల్ని ఒడిసిపట్టేందుకు గోదావరిపై నిర్మించిన లక్ష్మీబరాజ్‌లో నీటినిల్వ తొలిసారిగా 14.287 టీఎంసీలకు చేరుకున్నది. వందమీటర్ల ఎత్తులో దాదాపు 28 లక్షల క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహాన్ని తట్టుకునేలా నిర్మించిన ఈ బరాజ్‌ను గతేడాది జూన్ 21న సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఆ రోజునుంచి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా వేల టీఎంసీల గోదావరిజలాలు ఈ బరాజ్ మీదు గా ప్రవహించాయి. అధికారులు బరాజ్‌లో అవసరమైన మేరకు జలాలను నిల్వచేస్తూ.. లక్ష్మీ పంపుహౌస్ ద్వారా ఎగువకు ఎత్తిపోశారు. బరాజ్ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 16.17 టీఎంసీలు కాగా.. ఇప్పటివరకు గరిష్ఠంగా ఎనిమిది టీఎంసీల వరకు మాత్రమే నిల్వచేశారు. ప్రస్తుతం గోదావరిలో వరద తగ్గుముఖం పట్టడంతో కొన్నిరోజుల క్రితం అధికారులు బరాజ్‌కు చెందిన 85 గేట్లు మూసివేశారు. ఇప్పటికీ సరాసరి వస్తున్న 2,600 క్యూసెక్కుల వరదతో బరాజ్‌లో నిల్వ ను పెంచుతూ వచ్చారు. ఈ క్రమంలో బుధవారం రాత్రికి నీటినిల్వ 99.4మీటర్ల ఎత్తులో 14 టీఎంసీలకు చేరుకున్నది. దీని ఎగువన ఉన్న సరస్వతి (అన్నారం) బరాజ్ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 10.87 టీఎంసీలకు 6.09 టీఎంసీలు, ఆపైన ఉన్న పార్వతి (సుందిల్ల) బరాజ్‌లో 8.83 టీఎంసీలకు 4.777 టీఎంసీల నీటినిల్వలు ఉన్నాయి. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టులోని లింక్-1 పరిధిలో గోదావరిపై ఉన్న మూడుబరాజ్‌లు దాదాపు 25 టీఎంసీల నీటితో కళకళలాడుతున్నాయి.
కరీంనగర్ చేరుకున్న సీఎం పద్నాలుగు టీఎంసీల నీటినిల్వతో కనువిందుచేస్తున్న లక్ష్మీబరాజ్‌ను గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రే ఆయన కరీంనగర్ చేరుకున్నారు. తీగలగుట్టపల్లిలోని కేసీఆర్భవన్ నుంచి గురువారం ఉదయం హెలికాప్టర్లో కాళేశ్వరం చేరుకుంటారు. కాళేశ్వర ముక్తేశ్వరస్వామిని దర్శించుకున్న తర్వాత బరాజ్‌ను సందర్శిస్తారు. అక్కడే భోజనం చేసుకుని తిరిగి కరీంనగర్ చేరుకుంటారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో నీటిపారుదలశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. మూడ్రోజులుగా ఎల్లంపల్లి నుంచి గోదావరి జలాలను నంది, గాయత్రీ పంపుహౌస్‌ల ద్వారా శ్రీరాజరాజేశ్వర జలాశయం.. ఆపై లోయర్‌మానేరుకు తరలిస్తున్నారు. బుధవారం ఎల్లంపల్లిలో నీటినిల్వ 12.29 టీఎంసీలకు చేరుకున్నది. ఇందు లో నాలుగైదు టీఎంసీల మేర లోయర్‌మానేరుకు తరలించనున్నారు. లక్ష్మీబరాజ్ సందర్శన నేపథ్యంలో సీఎం కేసీఆర్ అధికారులకు పలు సూచనలు చేయనున్నట్టు సమాచారం.
అతిథిగృహం అంచనా వ్యయసవరణకు ఆమోదం కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన రంగనాయకసాగర్ రిజర్వాయర్ వద్ద అతిథిగృహం, కార్యాలయాలతోపాటు ఇతర భవనాలు, వాటిల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి సవరణ అం చనా వ్యయానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిం ది. రిజర్వాయర్ సమీపంలోని పల్లగుట్ట వద్ద అతిథిగృహం, భవనాలు, ఫర్నిచర్‌కు సంబంధించి గతంలోనే టెండర్లు పూర్తిచేశారు. నవ్‌తేజ్ ఇన్ఫ్రాకు పనులు కూడా అప్పగించారు. రూ.11.76 కోట్లతో సవరణ అంచనావ్యయంపై నీటిపారుదలశాఖ ప్రతిపాదనలు పంపగా.. ప్రభుత్వం వాటికి ఆమోదం తెలుపుతూ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది.

సీఎం కేసీఆర్‌కు మంత్రి సత్యవతి రాథోడ్ కృతజ్ఞతలు తెలంగాణలో గిరిజనులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారని.. తుపాకులగూడెం బరాజ్‌కు సమ్మక్కబరాజ్గా నామకరణం చేయడం హర్షణీయమని గిరిజనసంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. సీఎం నిర్ణయంతో అమ్మవారి కటాక్షం తెలంగాణపై సంపూర్ణంగా ఉంటుందని ఆకాంక్షించారు. సీఎం నిర్ణయం గిరిజనులందరికీ దక్కిన గౌరవంగా భావిస్తున్నామని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ సంయుక్త గౌరవ కార్యదర్శి ప్రొఫెసర్ రమణనాయక్ పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ పర్యటన షెడ్యూల్ -బుధవారం రాత్రి కరీంనగర్‌లోని తీగలగుట్టపల్లి చేరుకున్న సీఎం కేసీఆర్.. -గురువారం ఉదయం 8.50 గంటలకు అక్కడి నుంచి రోడ్డుమార్గంలో కరీంనగర్ కలెక్టరేట్లోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 9.05 గంటలకు హెలికాప్టర్లో కాళేశ్వరం బయలుదేరుతారు. -9.30 గంటలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం వద్ద ఉన్న హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడినుంచి రోడ్డుమార్గంలో కాళేశ్వరం ఆలయానికి చేరుకుని శ్రీకాళేశ్వర ముక్తేశ్వరస్వామిని దర్శించుకుంటారు. గోదావరిఘాట్‌ను కూడా సందర్శిస్తారు. -ఉదయం 10.10 గంటలకు అక్కడినుంచి తిరిగి పయనమవుతారు. -ఉదయం 10.30 గంటలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా అంబట్పల్లి గ్రామ పరిధిలోని లక్ష్మీబరాజ్‌కు చేరుకుంటారు. బరాజ్‌ను సందర్శిస్తారు. -మధ్యాహ్నం ఒంటిగంటకు భోజనం చేసి.. రెండుగంటలకు హెలికాప్టర్లో కరీంనగర్‌కు బయలుదేరుతారు. -2.40 గంటలకు కరీంనగర్‌లోని తీగలగుట్టపల్లి చేరుకుని..వీలును బట్టి హైదరాబాద్ తిరుగుపయనమవుతారు.