Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

త్వరలో రెవెన్యూ చట్టం

-బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీ ముందుకు
-రైతులకు లక్ష రూపాయల రుణమాఫీకి ఆదేశాలు
-సుపరిపాలనకు 60 రోజుల ప్రణాళిక
-ప్రజల వద్దకు పాలన కోసమే సంస్కరణలు
-రెట్టింపైన రాష్ట్ర సంపదకొత్త జోనల్ వ్యవస్థ ప్రకారమే నియామకాలు
-కరంట్ సమస్యల పరిష్కారానికి పవర్ వీక్ రాష్ట్ర ప్రజలందరికీ హెల్త్ ప్రొఫైల్
-బస్తీ దవాఖానల సంఖ్య పెంపు పాలమూరు
-రంగారెడ్డి ప్రాజెక్టు వేగంగా పూర్తి
-వచ్చే జూన్ నుంచి సాగుకోసం..
-గోదావరిలో అదనంగా 575 టీఎంసీల నీరు: సీఎం కేసీఆర్
-పల్లెలు, పట్టణాలన్నీ పరిశుభ్రంగా ఉండాలి
-బడ్జెట్‌లో 10 శాతం పచ్చదనానికి కేటాయించాలి
-బంగారు తెలంగాణకు పునాదులు పడ్డాయి
-అత్మవిశ్వాసం- సానుకూల దృక్పథంతో ముందుకు
-స్వాతంత్య్ర దిన వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్

CM KCR full speech at Golconda Fort 73rd Independence Day Celebrations

రాష్ట్ర ప్రజలకు, రైతులకు ఎలాంటి యాతన లేకుండా సేవలందించడమే లక్ష్యంగా కొత్త రెవెన్యూ చట్టం రూపుదిద్దుకొంటున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. త్వరలో జరుగునున్న బడ్జెట్ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెడతామని చెప్పారు. ప్రజలవద్దకు పాలన అందించడంకోసమే సంస్కరణలు తీసుకొస్తున్నామని, ఆత్మవిశ్వాసం- సానుకూల దృక్పథంతో సుపరిపాలనదిశగా ముందుకు సాగుతున్నామని సీఎం పేర్కొన్నారు. గోల్కొండ కోట వేదికగా గతంలో అనేక కార్యక్రమాలను ప్రారంభించుకొని ఫలితాలు సాధించామని చెప్పారు. అదే స్ఫూర్తితో ఇప్పుడు తెలంగాణ పల్లెలు, పట్టణాలను బాగుచేసుకుందామని పిలుపునిచ్చారు.

ఇందుకోసం అరవైరోజుల కార్యాచరణ ప్రణాళికను ప్రకటిస్తున్నానని తెలిపారు. ప్రభుత్వం తీసుకొచ్చిన పాలనా సంస్కరణల ఫలితంగా తండాలు, గూడేల్లో సర్పంచ్‌లు జాతీయ జెండాను ఎగురవేసిన దృశ్యం ఆవిష్కృతమైందని చెప్పారు. రైతుబంధు, రైతుబీమా పథకాలను ఐక్యరాజ్యసమితి ప్రశంసించటం ద్వారా తెలంగాణ రాష్ర్టానికి ప్రపంచవ్యాప్తంగా గౌరవం పెరిగిందన్నారు. రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ అమలుకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిందని సీఎం పేర్కొన్నారు. గురువారం 73వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చారిత్రక గోల్కొండ కోటలో సీఎం కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు జాతీయజెండాలు ఎగురవే శారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. గోల్కొండ కోటలో పతాకావిష్కరణ అనంతరం ముఖ్యమంత్రి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.. ప్రసంగం ఆయన మాటల్లోనే..

రెట్టింపైన రాష్ట్ర సంపద
తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. దేశ స్వాతంత్య్రంకోసం పోరాడిన త్యాగధనులకు ఈ సందర్భంగా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను. సాధించుకొన్న తెలంగాణ రాష్ర్టాన్ని సరైన దిశలో పెట్టేందుకు ఐదేండ్లలో మనం చిత్తశుద్ధితోచేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయి. అవుతున్నాయి. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి ఐదేండ్లుగా స్థిరంగా కొనసాగుతున్నది. కేంద్రప్రభుత్వ నివేదిక ప్రకారం, 2018-19 ఆర్థిక సంవత్సరంలో 14.84 శాతం వృద్ధిరేటుతో జీఎస్డీపీలో మన రాష్ట్రం ముందువరుసలో ఉన్నది. రాష్ట్ర సంపద ఐదేండ్లలో రెట్టింపయిం ది. రాష్ట్రం ఏర్పడిననాడు తెలంగాణలో రూ.4 లక్షల కోట్ల విలువైన సంపద ఉంటే, నేడు 8.66 లక్షల కోట్ల రూపాయలకు చేరుకోవడం మన ఆర్థిక ప్రగతికి సంకేతంగా నిలుస్తున్నది.

CMKCR1

నాటి దుష్పరిణామాలను అధిగమించాం
రాష్ట్రంలో శాంతిసామరస్యాలు వెల్లివిరుస్తున్నాయి. ఆదర్శవంత పాలనతో దేశం దృష్టిని ఆకర్షించగలిగాం. సమైక్య రాష్ట్రంలో తెలంగాణలో జరిగిన జీవన విధ్వంసం సృష్టించిన దుష్పరిణామాలను అధిగమించగలిగాం. రాష్ట్రం ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో, సానుకూల దృక్పథంతో ముందడుగు వేస్తున్నది. స్వాతం త్య్ర దినోత్సవ స్ఫూర్తితో తెలంగాణ పల్లెలను, పట్టణాలను బాగుచేసుకునే ప్రణాళికను ఆవిష్కరించాలని, సుపరిపాలన దిశగా ప్రయా ణం ప్రారంభించాలని ప్రభుత్వం తలపెట్టింది.

ప్రజల వద్దకు పాలన కోసమే సంస్కరణలు
గ్రామాలను, పట్టణాలను ఆదర్శంగా తీర్చిదిద్దడం కోసం చట్టపరమైన సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రజలకు పాలనను మరింత చేరువ చేయడంకోసం కొత్త పరిపాలనా విభాగాలను ఏర్పాటుచేసింది. గతంలో పది జిల్లాలుగా ఉన్న తెలంగాణను 33 జిల్లాలుగా చేసుకున్నాం. 43 రెవెన్యూ డివిజన్లను 69కి పెంచుకున్నాం. 459 మండలాలను 584 మండలాలుగా చేసుకున్నాం. గతంలో 68 మున్సిపాలిటీలుంటే ఇప్పుడు 142 మున్సిపాలిటీలున్నాయి. కొత్తగా 7 మున్సిపల్ కార్పొరేషన్లను ఏర్పాటు చేసుకుని, కార్పొరేషన్ల సంఖ్యను 13కు పెంచుకున్నాం. గిరిజన తండాలు, ఆదివాసీ గూడేలు, మారుమూల పల్లెలను ప్రభుత్వం ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా మార్చింది. గతంలో 8,690 గ్రామపంచాయతీలుంటే, వాటి సంఖ్యను 12,751కు పెంచాం. ఇటీవలే కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు ఇవాళ మొదటిసారిగా గ్రామపంచాయతీలుగా మారిన తమ పల్లెలు, తండాలు, గూడేల్లో సగర్వంగా జాతీయ పతాకాన్ని ఎగురేసుకుంటున్న దృశ్యం ఆవిష్కృతమైంది.

కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారమే నియామకాలు
ఉద్యోగావకాశాలు స్థానికులకే ఎక్కువ దక్కాలనే లక్ష్యంతో ప్రభుత్వం కొత్త జోనల్ వ్యవస్థను ఏర్పాటుచేసింది. లోకల్ క్యాడర్ ఉద్యోగాలు 95 శాతం స్థానికులకే దక్కేలా ప్రభుత్వం చట్టంచేసి, కేంద్ర ప్రభుత్వ ఆమోదాన్ని కూడా పొందింది. ఇప్పుడు కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారమే రాష్ట్రంలో ఉద్యోగనియామకాలు జరుగుతున్నాయి.

వచ్చే బడ్జెట్ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టం
బూజుపట్టిన పాత రెవెన్యూ చట్టాలు రైతులకు, ప్రజలకు అపార నష్టం కలిగించాయి. ఈ నష్టాన్ని నివారించుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రజలకు, రైతులకు ఎలాంటి యాతన లేకుండా సేవలందించడమే లక్ష్యంగా, కొత్త రెవెన్యూ చట్టం రూపుదిద్దుకుంటున్నది. చట్టం రూపకల్పనలో ప్రభుత్వం నిమగ్నమైంది. అవినీతికి ఆస్కారం లేని, అలసత్వానికి అవకాశం లేని నూతన రెవెన్యూ చట్టాన్ని త్వరలోనే జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెడుతామనే సంతోషకరమైన విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. అవినీతికి ఆస్కారం లేని సుపరిపాలన అందించడానికి ప్రభుత్వం నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని, నూతన పురపాలక చట్టాన్ని తీసుకొచ్చింది. నూతన రెవెన్యూ చట్టం కూడా రూపుదిద్దుకుంటున్నది. ఈ మూడు కొత్త చట్టాల వెలుగులో రాష్ట్రంలో కచ్చితంగా పరిశుభ్రమైన, పచ్చదనం వెల్లివిరిసే గ్రామాలు, మున్సిపాలిటీలను తయారుచేసుకోగలమనే దృఢమైన విశ్వాసం నాకున్నది.

CMKCR3

కరంటు సమస్యల పరిష్కారానికి పవర్ వీక్
గ్రామాలు, పట్టణాల లోపలా, పరిసరాల్లోనూ కొన్ని వంగిపోయిన కరంట్ స్తంభాలు.. తుప్పుపట్టిన పాత స్తంభాలు, వేలాడుతున్న కరంట్ వైర్లు దర్శనమిస్తున్నాయి. మూడో వైర్ (థర్డ్ వైర్) లేకపోవడం వల్ల కొన్నిచోట్ల వీధిదీపాల నిర్వహణ ఇబ్బందిగా మారింది. ఈ దుస్థితిని నివారించడానికి 60 రోజుల ప్రణాళికలో భాగంగా వారంపాటు విద్యుత్‌శాఖ, ప్రజల భాగస్వామ్యంతో పవర్‌వీక్ నిర్వహించుకోవాలి. విద్యుత్‌శాఖ సిబ్బంది వారంపాటు గ్రామాల్లో, డివిజన్లలో అందుబాటులో ఉంటారు. విద్యుత్‌కు సంబంధించిన సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవాలి.

ప్రతి ఇంటికి ఆరు మొక్కలు
60 రోజుల కార్యాచరణలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి పట్టణం, ప్రతి గ్రామం తమకు అవసరమైన నర్సరీలను స్థానిక సంస్థల ఆధ్వర్యంలోనే ఏర్పాటుచేసుకోవాలి. జిల్లా హరిత కమిటీ (గ్రీన్ కమిటీ) అందించే సూచనలను పాటించాలి. పట్టణ, గ్రామ బడ్జెట్‌లో పదిశాతం నిధులను పచ్చదనంపెంచే పనులకు కేటాయించాలి. పట్టణాల్లో, గ్రామాల్లో ప్రతి ఇంటికీ ప్రజలు కోరుకొనే ఆరు మొక్కలను సరఫరాచేయాలి. ప్రజలంతా వాటిని చక్కగా కాపాడి పెంచి, పెద్దచేసేలా ప్రేరణ కలిగించాలి. డబ్బు పెట్టి ఎన్ని సుఖాలైనా కొనుక్కోవచ్చు. వానలు కొనలేం, గాలిని కొనలేం, ప్రశాంతతను కొనలేం. రాబోయే తరానికి ఆస్తిపాస్తులిస్తే సరిపోదు. ఆకుపచ్చని పర్యావరణాన్ని వారసత్వంగా అందించడమే మన నిజమైన కర్తవ్యం కావాలి.

కార్యదీక్షతో పనిచేయాలి 60 రోజుల ప్రత్యేక కార్యాచరణలో ఒక ఆదర్శవంతమైన విధానాన్ని ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నది. ఈ విధానాన్ని అనుసరించి గ్రామాలు, పట్టణాల అభివృద్ధికోసం ఆయా పాలకమండళ్లు వార్షిక, పంచవర్ష ప్రణాళికలను రూపొందించాలి. ఈ ప్రణాళికలు ఖచ్చితంగా గ్రామసభల ఆమోదం పొందాలి. దానికి అనుగుణంగానే స్థానిక సంస్థలు నిధులు ఖర్చుచేయాలి. పంచాయతీరాజ్‌శాఖలోని అన్ని విభాగాల్లో అన్ని ఖాళీలను వేగవంతంగా భర్తీచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. నూతన చట్టాలు నిర్దేశించిన లక్ష్యాలను నెరవేర్చడంకోసం ప్రజాప్రతినిధులు, అధికారులు మరింత నిబద్ధతతో, కార్యదీక్షతో పనిచేయాలి. ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం పొందేలాగా సేవలందించాలి.

CMKCR4

మూడేండ్లలోనే పూర్తయిన కాళేశ్వరం
వడివడిగా రూపుదిద్దుకుంటున్న కృష్ణ, గోదావరి ప్రాజెక్టులు మన కండ్లముందే కనిపిస్తున్నాయి. ప్రపంచమే అబ్బురపడే కాళేశ్వరం ప్రాజెక్టును ఈ మధ్యనే మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల సమక్షంలో మనం సగర్వంగా ప్రారంభించుకొన్నాం. తెలంగాణ ప్రభుత్వ పరిపాలనా పరిణతికి, దౌత్యనీతికి, స్నేహ సంస్కారానికి ప్రతిబింబంలా నిలిచిన కాళేశ్వరం ప్రాజెక్టు దేశానికి గొప్ప సందేశం ఇచ్చిందని యావత్‌దేశం కొనియాడుతున్నది. తెలంగాణ రాష్ట్రం అవలంబిస్తున్న లివ్ అండ్ లెట్ లివ్ పాలసీ అన్ని రాష్ర్టాలకు అనుసరణీయమైన విధానమనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇంతటి భారీ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎండ, వాన, చలిని లెక్కచేయకుండా మూడు షిఫ్టులు శ్రమించి, మూడేండ్ల స్వల్ప వ్యవధిలోనే పూర్తిచేసిన ఇంజినీర్లు, అధికారులు, కార్మికులు, ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలుపుతున్నాను. శరవేగంగా పాలమూరు- రంగారెడ్డి

ఎత్తిపోతల పథకం
పాలమూరు జిల్లాలో ఆన్‌గోయింగ్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రభుత్వం చాలా వేగంగా పూర్తిచేసింది. జూరాలతో కలిపి పాలమూరు జిల్లాలో నేడు 11.20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించుకోగలుగుతున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు మాదిరిగానే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని శరవేగంగా నిర్మించి ఉమ్మడి మహబూబ్‌నగర్, వికారాబాద్, రంగారెడ్డి జిల్లా రైతులకు సాగునీరు అందిస్తాం.

906 గురుకుల పాఠశాలలు నిర్వహిస్తున్నాం
దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు, మైనార్టీలకు చెందిన పిల్లలకు ఉన్నత ప్రమాణాలతో కూడిన కార్పొరేట్ స్థాయి విద్యను అందించడానికి 906 గురుకుల పాఠశాలలు నిర్వహిస్తూ మనం దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాం. న్యాయవాదులు, జర్నలిస్టుల సంక్షేమం కోసం దేశంలో మరెక్కడాలేని విధంగా ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేసుకుంటున్నాం.

CMKCR11

హెల్త్ ప్రొఫైల్‌కు సమాయత్తం
ప్రభుత్వం అనుసరిస్తున్న వైద్యవిధానం పేదల ఆరోగ్య పరిరక్షణకు దోహదపడుతున్నది. కేసీఆర్ కిట్స్ పథకంతో రాష్ట్రంలో మాతా శిశుమరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. దృష్టి లోపాలు సరిచేసుకునేందుకు ప్రజలకు కంటివెలుగు గొప్ప అవకాశం కల్పించింది. ప్రజలందరికీ సంపూర్ణంగా ఆరోగ్య పరీక్షలు జరిపి, తెలంగాణ ఆరోగ్య సూచిక హెల్త్ ప్రొఫైల్ తయారుచేసేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతున్నది. పేదలకు ఉచిత వైద్యం అందించేందుకు నిర్వహిస్తున్న బస్తీ దవాఖానల సంఖ్యను మరింత పెంచాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది.

ఐటీ ఎగుమతులు రెట్టింపు
రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి వేగంగా పరుగులు పెడుతున్నది. ఐటీ అభివృద్ధి స్థిరంగా కొనసాగుతున్నది. గడిచిన ఐదేండ్లలో ఐటీ ఎగుమతులు రూ.52 వేల కోట్ల నుంచి 1.10 లక్షల కోట్లకు చేరుకోవడం ఐటీ రంగంలో మనం సాధించిన ప్రగతికి అద్దం పడుతున్నది.

శాంతిభద్రతల పరిరక్షణలో ప్రథమ వరుసలో రాష్ట్రం
శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ దేశంలోనే ప్రథమవరుసలో ఉన్న రాష్ర్టాల సరసన చేరింది. శాంతి భద్రతల పర్యవేక్షణతోపాటు ప్రకృతి వైపరీత్యాలు, జాతరలు, ఉత్సవాలు తదితర భారీ కార్యక్రమాలను నిశితంగా గమనించేందుకు హైదరాబాద్‌లో నిర్మిస్తున్న కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ త్వరలోనే అందుబాటులోకి రానున్నది. నేరాల అదుపులో అద్భుత పనితీరు కనబరుస్తున్న యావత్ పోలీసు యంత్రాంగాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా.

యజ్ఞంలా తెలంగాణ పునర్నిర్మాణం
పోరాడి సాధించుకున్న తెలంగాణలో గత ఐదేండ్లలో పునర్నిర్మాణ ప్రణాళికను ఒక యజ్ఞంలా నిర్వహించాం. తెలంగాణ ఒక ఆదర్శ రాష్ట్రంగా దేశం ముందు గర్వంగా నిలబడ్డది. బంగారు తెలంగాణ అనే సౌధం నిర్మించడానికి కావాల్సిన పునాదులు పడ్డాయి. స్వరాష్ట్రంలో సుపరిపాలన అనే నినాదంతో ముందుకు సాగుదాం. అందరూ ఇందులో భాగస్వాములు కావాలి అని సీఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు.

పోలీసుల గౌరవవందనం స్వీకరించిన సీఎం కేసీఆర్
-అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు

CMKCR2

స్వాతంత్య్ర దిన వేడుకల్లో భాగంగా గోల్కొండకోటలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పోలీసుల గౌరవవందనాన్ని స్వీకరించారు. గురువారం ఉదయం ప్రగతిభవన్‌లో జాతీయజెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్ అక్కడి నుంచి నేరుగా సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్‌లో ఉన్న సైనిక అమరవీరుల స్తూపం వద్దకు వెళ్లి నివాళులు అర్పించారు. అక్కడి నుంచి గోల్కొండ కోటకు చేరుకొన్న సీఎం కేసీఆర్‌కు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి స్వాగతం పలికారు. గోల్కొండ కోట ప్రధాన ద్వారం వద్ద ముఖ్యమంత్రి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవాలలో ఒడిశాకు చెందిన పోలీసుల బృందం కవాతులో పాల్గొన్నది. ఒడిశా బృందాన్ని సీఎం అభినందించారు. బృందానికి నాయకత్వం వహించిన అధికారికి సీఎం జ్ఞాపికను బహూకరించారు. స్వాతంత్య్ర దినోత్సవాల్లో భాగంగా గోల్కొండ కోటలో సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రం నలుమూలల నుంచి సాంస్కృతిక బృందాలు వచ్చి వివిధ ప్రదర్శనలు ఇచ్చాయి. తెలంగాణ సంస్కృతి, చరిత్రను అద్భుతంగా ప్రతిబింబించిన ఈ ప్రదర్శనలు ఆహూతులను ఎంతగానో అలరించాయి. గుస్సాడి, థింసా, డప్పు, బోనాలు తదితర అనేక కళారూపాలు ఆకర్షించాయి. కళాకారులు తమ నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకొన్నారు. ఈ వేడుకలకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు హాజరయ్యారు.

దేశం అబ్బురపడుతున్నది
అతితక్కువ సమయంలో విద్యుత్ సమస్యను సమర్థంగా పరిష్కరించుకొన్నాం. దేశమే అబ్బురపడి మననుంచి నేర్చుకొనే విధంగా మిషన్ భగీరథతో మంచినీటి ఎద్దడిని నివారించుకోగలిగాం. ఎన్నికల్లో ఇచ్చిన మాటప్రకారం ఆసరా పెన్షన్లను రెట్టింపు చేసుకొన్నాం. వృద్ధ్దాప్య పెన్షన్ వయోపరిమితిని 65 ఏండ్ల నుంచి 57 సంవత్సరాలకు తగ్గించి.. పెంచిన పెన్షన్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అర్హుల జాబితా రూపొందించే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది.

CMKCR9

అభివృద్ధికి 60 రోజుల ప్రత్యేక కార్యాచరణ
కొత్త చట్టాల అమలుకు శ్రీకారం చుడుతూ నూతన ఒరవడిని ప్రవేశపెట్టడంకోసం గ్రామాలు, పట్టణాల్లో 60 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వం రూపొందిస్తున్నది. ఫైనాన్స్ కమిషన్ల గ్రాంట్ నిధులను ఈ 60 రోజుల ప్రణాళిక అమలుకుముందే స్థానిక సంస్థలకు విడుదలచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామాల్లో అయినా, పట్టణాల్లో అయినా అపరిశుభ్రతే అనారోగ్యానికి కారణం. అనాగరిక వ్యవస్థకు సంకేతం. ఈ చెడ్డ పేరును మనం తొలిగించుకోవాలి. 60 రోజుల ప్రణాళికలో ప్రజాప్రతినిధులు, అధికారులు విశేషమైన ప్రజాభాగస్వామ్యం సాధించి గ్రామాలు, పట్టణాల రూపురేఖల్ని మార్చాలి. క్లీన్లీనెస్ ఈజ్ గాడ్లీనెస్ అని, పరిశుభ్రమైన పరిసరాల్లోనే పరమాత్ముడు కొలువై ఉంటాడని మనందరికీ తెలిసిన విషయమే. అలాగే నిరుపయోగంగా ఉన్న బోరుబావులను వెంటనే పూడ్చివేయాలి.

రైతుబంధు, రైతుబీమాతో ప్రపంచ ఖ్యాతి
వ్యవసాయాభివృద్ధి కోసం ప్రపంచవ్యాప్తంగా అమలయ్యే గొప్ప కార్యక్రమాల జాబితాలో మన రైతుబంధు, రైతుబీమా పథకాలను పేర్కొనడం ద్వారా ఐక్యరాజ్యసమితి తెలంగాణ కీర్తిని అంతర్జాతీయస్థాయిలో పెంచింది. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు రైతుబంధు పథకాన్ని ఎకరానికి ఏడాదికి రూ.8 వేల నుంచి రూ.10 వేలకు పెంచి అందిస్తున్నాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు లక్ష రూపాయల వరకున్న పంటరుణాలను మాఫీ చేయడం కోసం ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించుకున్నాం.

జూన్ నుంచి సాగుకు అదనంగా 575 టీఎంసీల గోదావరి నీళ్లు
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రతిఏటా 400 టీఎంసీల నీటిని నికరంగా ఉపయోగించుకునే అవకాశం మన రాష్ర్టానికి ఏర్పడింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు నీరివ్వడానికి సీతారామ ప్రాజెక్టు ద్వారా 100 టీఎంసీలు, ఉమ్మడి వరంగల్ జిల్లాకు నీరివ్వడానికి దేవాదుల ద్వారా 75 టీఎంసీల నీటిని నికరంగా వాడుకోవడానికి వీలు కలుగుతుంది. గోదావరిపై నిర్మిస్తున్న ప్రాజెక్టుల వల్ల వచ్చే జూన్ నుంచి తెలంగాణ రైతాంగం ఇప్పుడున్న గోదావరి ప్రాజెక్టులకు అదనంగా 575 టీఎంసీల నీటిని నికరంగా ఉపయోగించుకునే అవకాశం కలుగుతుంది.

గ్రామాలు, పట్టణాల్లో 60 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వం రూపొందిస్తున్నది. ఫైనాన్స్ కమిషన్ల గ్రాంట్ నిధులను ఈ 60 రోజుల ప్రణాళిక అమలుకుముందే స్థానిక సంస్థలకు విడుదలచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రణాళికలో ప్రజాప్రతినిధులు, అధికారులు విశేషమైన ప్రజాభాగస్వామ్యం సాధించి గ్రామాలు, పట్టణాల రూపురేఖల్ని మార్చాలి.
– సీఎం కే చంద్రశేఖర్‌రావు

CMKCR6 CMKCR10 CMKCR5 CMKCR7 CMKCR8
MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.