ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలు వెంటనే అమలుచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు విజ్ఞప్తిచేశారు. హైకోర్టు విభజనసహా పలు కీలక అంశాలన్నీ పెండింగ్‌లో ఉండటం వల్ల ఆచరణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. వెంటనే దృష్టి పెట్టి వీటిని పరిష్కరించాలని రాజ్‌నాథ్‌ను కోరారు. హైకోర్టు విభజనపై కేంద్ర న్యాయమంత్రి సదానందగౌడ లోక్‌సభలోనే స్పష్టమైన హామీ ఇచ్చారని, అది హామీగానే ఉండిపోయింది తప్ప ఆచరణరూపం దాల్చలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల సంఖ్య చాలా తక్కువ ఉన్న విషయాన్ని కూడా ఆయన రాజ్‌నాథ్‌సింగ్ దృష్టికి తీసుకెళ్లారు. పరిపాలన అవసరాల రీత్యా వీరి సంఖ్యను పెంచాలని విజ్ఞప్తిచేశారు.

-పునర్వ్యవస్థీకరణ చట్టం అమలుకు సీఎం కేసీఆర్ విజ్ఞప్తి -హైకోర్టును సత్వరమే విభజించండి -రాష్ర్టానికి ఐఏఎస్, ఐపీఎస్‌ల కొరత ఉంది.. -కొత్త జిల్లాలు వస్తున్నాయి.. కేటాయింపు పెంచండి -రాష్ర్టానికి సీఆర్పీఎఫ్ బెటాలియన్ ఇవ్వండి -కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ను కోరిన ముఖ్యమంత్రి -రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో భేటీ -ఆయుత మహా చండీయాగానికి రావాలని ఆహ్వానం పాలనాసౌలభ్యం కోసం రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకోబోతున్న విషయాన్ని ప్రస్తావించిన సీఎం.. ఇందుకోసం ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు మరింత మంది అవసరం అవుతారని పేర్కొన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం బుధవారం హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను, రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలిశారు. డిసెంబర్ 23నుంచి నిర్వహించనున్న ఆయుత మహా చండీయాగానికి హాజరు కావాల్సిందిగా రాష్ట్రపతిని ముఖ్యమంత్రి ఆహ్వానించారు. అంతకుముందు రాజ్‌నాథ్‌సింగ్‌ను ఆయన కార్యాలయంలో కలిసిన కేసీఆర్.. సుమారు అరగంట పాటు పలు అంశాలపై చర్చించారు.
ఐపీఎస్‌ల సంఖ్య పెంచండి: రాష్ర్టానికి 112మంది ఐపీఎస్ అధికారుల కేటాయింపు జరిగిందని, కానీ శాంతిభద్రతల నిర్వహణతోపాటు అనేక అంశాలపై దృష్టి సారించాల్సిన అధికారులకు పనిభారం ఎక్కువైందని రాజ్‌నాథ్‌కు తెలిపారు. ఈ సంఖ్య పెంచాల్సిన అవసరం ఉందని వివరించారు. మొత్తం 112 మంది అధికారుల్లో 61 మంది మాత్రమే కేడర్ అధికారులని, మిగిలినవారంతా పదోన్నతులు పొందినవారేనని వివరించారు. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్‌ల పరిధిలో 25మంది ఐపీఎస్‌లు ఉన్నారని, కానీ ఈ సంఖ్య చాలా స్వల్పమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న పది జిల్లాలకు తోడు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా కొన్ని కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలనుకుంటున్నదని, ఇందుకు కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఎస్పీ, అదనపు ఎస్పీ తదితర పోస్టులకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అవసరమవుతారని రాజ్‌నాథ్‌కు తెలిపారు. ప్రస్తుతం ఉన్న కేటాయింపులతో పోల్చుకుంటే వీరు ఏ మాత్రం సరిపోరని వివరించారు. ఈ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అధికారుల సంఖ్యను పెంచాలని కోరారు.
హైకోర్టు విభజనను తక్షణం పూర్తిచేయాలి: హైకోర్టు విభజన చాలా ప్రధానమైన సమస్య అని ప్రస్తావించిన సీఎం కేసీఆర్.. ఇప్పటికే కేంద్ర న్యాయశాఖ మంత్రి లోక్‌సభలో ఇచ్చిన హామీ మేరకు ప్రక్రియను పూర్తి చేయాలని విజ్ఞప్తిచేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన హోం మంత్రి వీలైనంత త్వరలో ప్రక్రియ పూర్తవుతుందని హామీ ఇచ్చారు. హైకోర్టు విభజన విషయమై గతంలో ప్రధాని సహా పలువురు మంత్రులకు చేసిన విజ్ఞప్తులను కేసీఆర్ ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌కు గుర్తుచేశారు. హైకోర్టు విభజన జరుగక తలెత్తుతున్న ఇబ్బందులను వివరించారు.
సీఆర్‌పీఎఫ్ బెటాలియన్‌ను ఏర్పాటుచేయండి: రాష్ట్రంలో ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో వామపక్ష తీవ్రవాద సమస్య ఉన్నదని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత కార్యకలాపాలను పునఃప్రారంభించడానికి మావోయిస్టులు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారని కేసీఆర్ వివరించారు. కనుక రాష్ట్రంలో సీఆర్పీఎఫ్ బెటాలియన్‌ను నెలకొల్పాలని విజ్ఞప్తి చేశారు. పొరుగున ఉన్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టుల కార్యకలాపాలు అధికంగా ఉన్నాయని, అక్కడ పారామిలిటరీ బలగాలు కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నా, వాటిని తెలంగాణ రాష్ట్రం నుంచే పర్యవేక్షిస్తున్నారని, అందువల్ల తెలంగాణలోనూ ఒక సీఆర్పీఎఫ్ బెటాలియన్ అవసరం అవుతుందని కోరారు. కేంద్ర సహకారంతో తెలంగాణ ప్రభుత్వం తీవ్రవాద ప్రభావిత జిల్లాల్లో రోడ్ల నిర్మాణాన్ని చేపట్టిందని, కొన్ని చోట్ల జాతీయ రహదారుల నిర్మాణం కూడా జరిగిందని హోం మంత్రికి కేసీఆర్ తెలిపారు.
ముఖ్యంగా ఖమ్మం జిల్లానుంచి ఆదిలాబాద్‌వరకు ఇలాంటి పనులు జరిగాయని వివరించారు. ఈ రోడ్ల కారణంగా మావోయిస్టుల చర్యలను ఎదుర్కోడానికి సీఆర్పీఎఫ్ బలగాలు వెంటనే ఘటనా స్థలాలకు చేరుకోగలుగుతున్నాయని తెలిపారు. ఇప్పటికీ కొన్నిచోట్ల రోడ్ల నిర్మాణం జరుగుతున్నదని చెప్పారు. వీటిని ఎప్పటికప్పుడు అడ్డుకోడానికి ప్రయత్నించే మావోయిస్టులను ఎదుర్కోడానికి పోలీసు బలగాలు శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నాయని పేర్కొన్నారు. కొన్నిచోట్ల పోలీసు క్యాంపులుకూడా ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ ఏర్పాట్లు ఎప్పుడూ ఉండేవి కాబట్టి ఒక బెటాలియన్ సీఆర్ఫీఎఫ్ బలగాలను రాష్ర్టానికి అందజేయాలని కోరారు. సదరు రోడ్ల నిర్మాణం తొలి దశ పనులకు కేంద్రం నుంచి ఇంకా నిధులు అందలేదని, వాటిని సత్వరమే అందించాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.
రెండవ దశ పనులు కూడా ప్రారంభమవుతున్నాయని, ఇవి అనుకున్న విధంగా పూర్తికావాలంటే నిధుల అవసరం చాలా ఉందని తెలిపారు. సత్వరమే పాత బకాయిలను విడుదల చేయడంద్వారా ఆశించిన లక్ష్యాన్ని పూర్తిచేయడంతోపాటు మావోయిస్టు కార్యకలాపాలను అరికట్టవచ్చని పేర్కొన్నారు. రాజ్‌నాథ్‌సింగ్‌తో జరిగిన భేటీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మ, ఎంపీలు జితేందర్‌రెడ్డి, వినోద్‌కుమార్, ప్రత్యేక ప్రతినిధులు వేణుగోపాలచారి, రామచంద్రు తెజావత్, కేఎం సహానీ తదితరులు ఉన్నారు.
పునర్వ్యవస్థీకరణ చట్టానికి సవరణలు జరగాలి: ఎంపీ వినోద్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి సవరణలు చేయాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయని, వీటి గురించి హోంమంత్రితో కూలంకషంగా చర్చించామని అనంతరం మీడియాతో మాట్లాడిన ఎంపీ వినోద్ తెలిపారు. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను పోలవరం ప్రాజెక్టు ముంపు పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో విలీనంచేసిన తర్వాత కొన్ని సాంకేతికపరమైన, క్షేత్రస్థాయి ఇబ్బందులు తలెత్తాయని చెప్పారు. వీటిని రాజ్‌నాథ్‌కు వివరించి చట్టానికి సవరణలు చేయాలని కోరామని తెలిపారు. భద్రాచలం మండలంలో పట్టణం మినహా మిగిలిన ప్రాంతమంతా ఆంధ్రప్రదేశ్‌లో కలిసిపోయిందని, ఈ కారణంగా వాజేడు, వెంకటాపురం, దుమ్ముగూడెం తదితర ప్రాంతాలకు వెళ్ళాలంటే ప్రజలు ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లోని ఐదారు గ్రామాల మీదుగా మళ్ళీ తెలంగాణలోకి వెళ్ళాల్సి వస్తున్నదని, ఇలాంటి సమస్యలను చట్ట సవరణద్వారా పరిష్కరించవచ్చునని పేర్కొన్నారు.
పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణలో శాసనసభ స్థానాల సంఖ్య పెంచాల్సి ఉన్నదని, ఇది చట్టానికి సవరణలు చేయడంద్వారానే సాధ్యమవుతుందని హోం మంత్రికి వివరించామని తెలిపారు. పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని అమలుచేసే నోడల్ ఏజెన్సీగా కేంద్ర హోంశాఖ ఉన్నందున ఇలాంటి అన్ని విషయాలను వివరించి సత్వర పరిష్కారానికి చొరవ చూపాల్సిందిగా కోరామని, సానుకూలంగా విన్న రాజ్‌నాథ్ స్పష్టమైన హామీ ఇచ్చారని అన్నారు. హైకోర్టు విభజన విషయంలో గతంలో ఇలాంటి హామీలే వచ్చాయని, కానీ ఆచరణలో అమలుకాలేకపోయాయన్న వినోద్.. ఆ హామీలను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉన్నదని స్పష్టంచేశారు. తెలంగాణ రాష్ట్ర విస్తీర్ణంతో పోలిస్తే మూడవ వంతుగా ఉన్న హర్యానాలో 20 జిల్లాలు ఉన్నాయని, పరిపాలనాపరమైన అవసరాల కోసం తగిన సంఖ్యలో ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు ఉన్నారని పేర్కొంటూ తెలంగాణకు మాత్రం ఆ స్థాయిలో అధికారులు లేరని వినోద్ అన్నారు.
ప్రస్తుత అవసరాలకు సరిపోయే సంఖ్యలోనే అధికారులు లేకపోతే ఇక కొత్తగా ఏర్పడే జిల్లాలకు ఏ విధంగా ఉంటారన్న వినోద్‌కుమార్.. ఈ అంశాలన్నింటిపై సమగ్ర నివేదికను హోంమంత్రికి సమర్పించామని తెలిపారు. కోటి జనాభా ఉన్న హైదారాబాద్ నగరంలో నలుగురు మాత్రమే నేరుగా ఐపీఎస్ కేడర్ అధికారులు ఉన్నారని, మిగిలినవారంతా పదోన్నతులపై ఐపీఎస్‌లు అయినవారేనని వివరించారు. హైదరాబాద్‌ను కేంద్రం కేవలం ఒక జిల్లాగా మాత్రమే పరిగణిస్తూ ఉన్నదని, కానీ రాష్ట్ర రాజధానిగా చూసినప్పుడు చాలా అవసరాలు ఉంటాయని, దానికి అనుగుణంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అవసరమవుతారని, కనీసంగా 60 మంది అధికారులను అదనంగా ఇవ్వాలని కోరినట్లు తెలిపారు.

డిసెంబరు 23వ తేదీనుంచి నిర్వహించనున్న ఆయుత మహా చండీ యాగానికి హాజరు కావాల్సిందిగా ప్రణబ్‌ను ఆయన ఆహ్వానించారు. సానుకూలంగా స్పందించిన రాష్ట్రపతి షెడ్యూలునుబట్టి హాజరవుతానని హామీ ఇచ్చినట్లు తెలిసింది. కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలగురించి రాష్ట్రపతికి కేసీఆర్ వివరించారు. రాష్ట్రంలో సాగుతున్న పరిపాలన, కేంద్రంనుంచి అందుతున్న సహకారం, పునర్వ్యవస్థీకరణ చట్టంలో పెండింగ్‌లో ఉన్న సమస్యల గురించి క్లుప్తంగా వివరించారు. రాష్ట్రపతి సతీమణి మృతి చెందిన సమయంలో పని ఒత్తిడి కారణంగా రాలేకపోయిన కేసీఆర్ ఆ సమయంలో ఎంపీ కల్వకుంట్ల కవితతోపాటు పలువురు శాసనసభ్యులను పంపారు. ఐదునెలల తర్వాత ఢిల్లీ వచ్చిన నేపథ్యంలో ప్రణబ్‌ను కలిసి పరామర్శించారు. రాష్ట్రపతిని కలిసిన సమయంలో కేసీఆర్ వెంట ఎంపీలు జితేందర్‌రెడ్డి, వినోద్‌కుమార్, ప్రత్యేక ప్రతినిధులు వేణుగోపాలాచారి, రామచంద్రు తెజావత్ తదితరులు ఉన్నారు.
హైదరాబాద్ చేరుకున్న సీఎం కేసీఆర్ రెండు రోజుల ఢిల్లీ పర్యటనను ముగించుకుని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బుధవారం సాయంత్రం 7.30 గంటలకు తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంనుంచి నేరుగా తన క్యాంపు కార్యాలయానికి వెళ్ళారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల మదింపుపై అధ్యయనానికి ఏర్పాటుచేసిన నీతి ఆయోగ్ ఉప కమిటీ సమావేశంలో పాల్గొనడంతోపాటు తెలంగాణ రాష్ర్టానికి కేంద్రంనుంచి అందాల్సిన నిధుల విషయంలో ఆయా శాఖల మంత్రులను, ప్రధానిని ఈ రెండు రోజుల్లో సీఎం కలిశారు.