రాష్ట్ర విభజన అనంతరం అనేక అంశాలు ఇంకా పెండింగ్‌లోనే ఉండటంతో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వాటిని సత్వరమే పరిష్కరించాలని మంగళవారం కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసిన టీఆర్‌ఎస్ పార్టీ ఎంపీల బృందం విజ్ఞప్తి చేసింది. టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత జితేందర్‌రెడ్డి నేతృత్వంలో ఈ బృందం.. రెండు రాష్ర్టాల మధ్యగల ఉమ్మడి సంస్థల విషయంలో విభజన చట్టం అమలుకు చర్యలు తీసుకోవాలని విన్నవించింది. -చర్యలు తీసుకుంటామన్న రాజ్‌నాథ్‌సింగ్ -త్వరలో శాఖల అధికారులతో సమావేశం -విభజన అంశాలపైకేంద్ర హోంమంత్రికి టీఆర్‌ఎస్ ఎంపీల విజ్ఞప్తి

దీనిపై సానుకూలంగా స్పందించిన రాజ్‌నాథ్‌సింగ్.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం అమలుకు వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అందుకోసం చట్టం అమలుతో సంబంధం ఉన్న కేంద్ర ప్రభుత్వ శాఖల అధికారులతో త్వరలో సమావేశం నిర్వహిస్తానని టీఆర్‌ఎస్ ఎంపీల బృందానికి ఆయన చెప్పారు. సుమారు అరగంట సేపు జరిగిన ఈ భేటీలో విద్యుత్, నీరు తదితర 15 ప్రధాన అంశాలపై వాస్తవ పరిస్థితులు, క్షేత్రస్థాయి ఇబ్బందులను టీఆర్‌ఎస్ ఎంపీల బృందం ఆయనకు వివరించింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై ఆరు నెలలు కావస్తున్నా పలు సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని తెలిపామని రాజ్‌నాథ్‌తో భేటీ తర్వాత జితేందర్‌రెడ్డి మీడియాకు చెప్పారు. తమ విజ్ఞప్తుల పట్ల హోంమంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. కొన్ని అంశాలు పరిష్కారం కాలేదని చెప్పగానే ఇంకా పూర్తి కాలేదా? అని ఆయన ఆశ్చర్యపోయారని జితేందర్ రెడ్డి వివరించారు. అఖిలభారత సర్వీసుల అధికారుల నుంచి, రాష్ట్రస్థాయి ఉద్యోగుల వరకు విభజన పూర్తి కాక పాలనాపరంగా పలు సమస్యలు ఎదుర్కొంటున్నామని చెప్పామన్నారు.
నీరు, విద్యుత్‌పై ఏపీ అనవసర రాద్ధాంతం తెలంగాణలో విద్యుత్ కొరతను అధిగమించేందుకు శ్రీశైలంలో తాము జలవిద్యుత్ ఉత్పత్తి చేయడాన్ని ఏపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వివాదాస్పదం చేస్తున్నదని హోంమంత్రి దృష్టికి తెచ్చామని జితేందర్‌రెడ్డి తెలిపారు. కృష్ణా బోర్డుకు ఏపీ సర్కార్ లేఖ రాసిందని రాజ్‌నాథ్‌కు తెలిపామన్నారు. ఏపీ ప్రభుత్వం రాయలసీమ వాటా 34 టీఎంసీలైనా 76 టీఎంసీలు వాడుకుని మరీ తెలంగాణను విద్యుత్ ఉత్పత్తి చేయకుండా రాద్ధాంతం చేస్తున్నదని, పైగా ఏపీలోని విద్యుత్ ప్రాజెక్టుల నుంచి చట్టప్రకారం రావాల్సిన వాటా ఇవ్వడం లేదని చెప్పామన్నారు. కృష్ణపట్నం ప్లాంట్‌లో తెలంగాణకు వాటా లేదని వాదిస్తున్నదని కేంద్రమంత్రికి వివరించామని జితేందర్ రెడ్డి చెప్పారు. హిందూజా ప్లాంట్ నుంచి విద్యుత్ పంపిణీ చేయవద్దని ఆ సంస్థ యాజమాన్యాన్ని బెదిరిస్తున్నదని రాజ్‌నాథ్ సింగ్‌కు వివరించామన్నారు.
నిధుల మళ్లింపుతో ఇబ్బందులు సృష్టిస్తున్న ఏపీ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సొసైటీలోని ఉమ్మడి నిధుల నుంచి సుమారు రూ. 420 కోట్లు, హైదరాబాద్‌లోని రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ నుంచి సుమారు రూ.21 కోట్లను మళ్ళించడం ద్వారా ఏపీ ప్రభుత్వం తెలంగాణను ఇబ్బంది పెడుతున్నదని వివరించామని చెప్పారు.
కార్పొరేషన్ల విభజన జాప్యంతో తెలంగాణకు నష్టం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల మధ్య ఉమ్మడిగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల విభజనకు కేంద్రం నియమించిన షీలాబిడే కమిటీ ఇంకా విభజన ప్రక్రియ పూర్తి చేయలేదని హోంమంత్రి దృష్టికి తెచ్చామని జితేందర్ రెడ్డి చెప్పారు. ఈ కమిటీ వివిధ కార్పొరేషన్లు, ఆర్థిక సంస్థల విభజన పూర్తి చేయకపోవడంతో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నదని, కనుక వీటి విభజన ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాల్సిందిగా రాజ్‌నాథ్‌ను కోరినట్లు జితేందర్‌రెడ్డి తెలిపారు.
హైదరాబాద్ నగరంలోని ఉమ్మడి హైకోర్టును విభజించి అవశేష ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాలకు వేర్వేరుగా హైకోర్టులు ఏర్పాటు చేయాలని ప్రధానికి, న్యాయశాఖ మంత్రికి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి చేసిన తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తికి అన్నిచోట్లా సానుకూల స్పందనే వచ్చిందన్నారు. ప్రధాని, న్యాయశాఖ మంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నుంచి క్లియరెన్స్ వచ్చిన ఈ అంశం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వద్ద పెండింగ్‌లో ఉన్నదని వివరించినట్లు చెప్పారు.
రాష్ర్టానికి ప్రత్యేక హోదా, సంస్థల ఏర్పాటుకు చర్యలు తమ రాష్ర్టానికి ప్రత్యేక హోదా కల్పించడానికి చర్యలు తీసుకోవాలని హోంమంత్రిని కోరామని జితేందర్‌రెడ్డి చెప్పారు. 4000 మెగావాట్ల ఎన్టీపీసీ థర్మల్ ప్లాంట్, రైల్‌కోచ్ ఫ్యాక్టరీ, వ్యాగన్ యూనిట్, పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు పూర్తి చేయడంతోపాటు రాష్ట్రంలోని రహదారులను జాతీయ రహదారులతో అనుసంధానానికి చర్యలు తీసుకోవాలని రాజ్‌నాథ్‌కు విజ్ఞప్తి చేశామన్నారు. గిరిజన, ఉద్యానవన విశ్వవిద్యాలయాల ఏర్పాటు, ప్రాణహిత – చేవెళ్లకు జాతీయహోదా, బయ్యారం స్టీల్‌ఫ్యాక్టరీ ఏర్పాటు, కృష్ణా జలాల వివాదానికి ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని రాజ్‌నాథ్‌సింగ్‌ను కోరినట్లు తెలిపారు.
ఆర్థిక పరమైన అంశాలపై రాష్ట్రప్రభుత్వం కేంద్ర పరిశ్రమల శాఖకు అవసరమైన అన్ని వివరాలతో నివేదిక సమర్పించిందని చెప్పారు. కేంద్రం వద్దే పెండింగ్‌లో ఉన్న నివేదికపై తగు ఆదేశాలతో ఆ అంశాన్ని ముగించాలని హోంమంత్రికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసిన వారిలో జితేందర్‌రెడ్డితోపాటు ఎంపీలు బీ వినోద్‌కుమార్, బీబీ పాటిల్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కొత్తా ప్రభాకర్‌రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేకప్రతినిధి రామచంద్రు నాయక్ తదితరులున్నారు.
చర్చలకు సీఎం కేసీఆర్ సిద్ధం : వినోద్‌కుమార్ తెలంగాణ, ఏపీ మధ్య కొన్ని అంశాలు వివాదాస్పదంగా మారి ఘర్షణాత్మక వాతావరణం నెలకొన్నా వాటి పరిష్కారానికి ఏపీ సీఎం చంద్రబాబుతో చర్చించేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సిద్ధమని వినోద్‌కుమార్ తెలిపారు. ఇప్పటికైనా చంద్రబాబు చర్చలకు ముందుకురావాలని కోరారు. విభజనచట్టంలో ఎన్ని అంశాలు చేర్చినా, జాగ్రత్తలు తీసుకున్నా ఆచరణలో ఇబ్బందులు సహజమేనన్నారు. కేసీఆర్ గతంలోనూ చొరవ తీసుకుని చంద్రబాబుతో సమావేశమై పలు అంశాలు చర్చించారని ఆయన గుర్తు చేశారు. గత ఎన్డీఏ ప్రభుత్వం మూడు రాష్ర్టాలు ఏర్పాటు చేసినప్పుడూ సమస్యలు తలెత్తాయని చెప్పారు.