Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

త్వరలో కేసీఆర్ మార్క్ పాలన

-పింఛన్లు, ఇండ్ల పథకం దసరా నుంచే.. – 24గంటలు సరిపోన్నంత పని ఉంది – ఉప ఎన్నిక విజయంతో బాధ్యత పెరిగింది – మెదక్ ఫలితాలు ప్రతిపక్షాలకు చెంపపెట్టు – తెలంగాణలో టీడీపీకి స్థానంలేదని తేలిపోయింది – నెలాఖరులో ఎల్బీ స్టేడియంలో ఘనంగా పార్టీ ప్లీనరీ – గ్రేటర్‌లోనూ నూటికి నూరు శాతం గెలుపు మాదే – విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్

KCR-Press-Meet-on-Medak-bypoll-Results వాస్తవంగా చెప్పాలంటే కేసీఆర్ మార్కుగానీ, టీఆర్‌ఎస్ మార్కు పరిపాలనగానీ తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ప్రారంభమే కాలేదు. అది ప్రారంభమైతే మా ఎదుట ఏ పార్టీలు నిలువయి. ఆ ఆత్మవిశ్వాసం మాకుంది. వంద శాతం మా పని మొదలే పెట్టలేదు. మా ఎజెండా నిర్దేశించుకోవడంలో ఇంకా నిమగ్నమై ఉన్నం. కచ్చితంగా మా ఎజెండా తొందరలోనే ప్రారంభమయితది అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. మెదక్ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి విజయం సాధించిన నేపథ్యంలో ఆయన మంగళవారం తెలంగాణభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ఈ ఉప ఎన్నికలో విజయం ద్వారా ప్రజలు తమపై మరింత బరువు, బాధ్యత పెట్టారని చెప్పారు. ప్రజలకు ఏ మాటలయితే చెప్పామో వంద శాతం వాటిని అమలు చేసి తీరతామని పునరుద్ఘాటించారు. ఉప ఎన్నికలో ఘన విజయాన్ని అందించిన ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఙతలు తెలిపిన ముఖ్యమంత్రి, ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షాలు మితిమీరి చేసిన విమర్శలపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వం ఏర్పడి మూడునెలలు కాకముందే ప్రతిపక్షాలు ప్రతి చిన్న విషయానికి ప్రభుత్వంపై ఎలా ద్రుష్ప్రచారం ఉదహరిస్తూనే, వాటిని తిప్పికొట్టారు. ఉప ఎన్నిక ఫలితాలతో అసలు తెలంగాణలో టీడీపీకి స్థానమేలేదని ప్రజలు తీర్పు ఇచ్చారని వ్యాఖ్యానించారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి ప్రణాళిక ప్రకారం జరగాలేగానీ.. తొందరపాటుతో జరగొద్దని చెప్పారు. పింఛన్లు, ఇండ్ల నిర్మాణంవంటి ప్రభుత్వ పథకాలు దసరా నుంచి మొదలవుతాయని పునరుద్ఘాటించారు.

కేసీఆర్ ఏమన్నారో.. ఆయన మాటల్లోనే.. మెదక్ జిల్లా ప్రజలందరికీ నా పక్షాన, పార్టీ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ప్రభుత్వం మీద, టీఆర్‌ఎస్‌మీద ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటాం. వందశాతం బాధ్యతతో ప్రభుత్వం ముందుకు పోతుందని హామీ ఇస్తున్న. మెదక్ జిల్లా మంత్రి, ఈ ఎన్నికల ప్రచార సారథి హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్, అక్కడికి వెళ్లి పనిచేసిన డిప్యూటీ సీఎం రాజయ్య, ఎమ్మెల్యేలు, కార్యకర్తలకు పేరు పేరునా కృతజ్ఞతలు. కార్యకర్తల బలం, కృషి వల్లనే ఈ గెలుపు సాధ్యమైంది. ఈ ఎన్నికల్లొ తేలిన అంశాలు కొన్ని ఉన్నయి. కొంతమంది చాలా అతిగా చేసిన మాటలు విన్నం. ప్రభుత్వం ఏర్పడి సమయం ఏమాత్రం కాలేదు. కానీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, టీడీపీ, బీజేపీ నాయకులు అతిగా, పనికిమాలిన విధంగా, తప్పుడు విధానాల్లో ప్రచారం చేసేందుకు ప్రయత్నించిండ్రు.

కానీ వాళ్లకి ప్రజలు తగిన బుద్ధి చెప్పిండ్రు. టీడీపీతో జతగట్టిగనందుకు కూడా బీజేపీకి తగిన శాస్తి జరిగింది. రెండు పార్టీలు చావుతప్పి కన్నులొట్టబోయినట్లు డిపాజిట్లు దక్కించుకున్నయి. కొన్ని బాధ కలిగించిన అంశాలు ఏమంటే.. ప్రతి అంశంలో, ప్రభుత్వం అడుగు తీసి అడుగేస్తె కూడ తప్పుపట్టె ప్రయత్నం చేసిండ్రు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం పట్ల బాధ్యత లేకుండా ప్రతి దాన్ని తప్పు పట్టి గోబెల్స్ ప్రచారానికి దిగిండ్రు. వాళ్ల దుష్ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టిండ్రు. సర్వే చేద్దామంటే దాన్ని ద్రుష్ప్రచారం చేసిండ్రు.

ఇంజినీరింగ్ కళాశాలలు, పనికిమాలిన కళాశాలల మీద చర్య తీసుకుంటె దానిని కూడ దుష్ప్రచారం చేసిండ్రు. పేకాట క్లబ్బులు రద్దుచేస్తే చివరకు వాళ్లను కూడా వదిలిపెట్టకుండా ప్రచారానికి వాడుకున్న దౌర్భాగ్య పరిస్థితికి ఈ రెండు పార్టీలు ఒడిగట్టినయి. అట్లనె గృహనిర్మాణంలో అక్రమాల మీద మాట్లాడితె దాన్ని కూడా తప్పుపట్టె ప్రయత్నం చేసిండ్రు. జిల్లాల పునర్వవస్థీకరణ మీద తప్పుడు ప్రచారం చేసిండ్రు. ఈచ్ అండ్ ఎవ్రీ మూవ్ ఆఫ్‌ది గవర్నమెంట్.. ఏది మాట్లాడినా దాంట్లో తప్పులు తీసి, అదేందో జరగబోతుందని ప్రచారం చేయబోతే ప్రజలు చావుదెబ్బ కొట్టిండ్రు. మీ అతి తెలివి పనికిరాదని చెప్పిండ్రు అని ప్రతిపక్ష పార్టీలను, నాయకులను కేసీఆర్ తూర్పారబట్టారు.

టీఆర్‌ఎస్ మూస పార్టీ కాదు ఇదేమన్న సిన్మానా? సెన్సెస్ మార్కెట్టా? దిక్కుమాలిన కథ… ఏం చేస్తరు వందరోజుల! టీఆర్‌ఎస్ ప్రభుత్వం మూస (రొటీన్) ప్రభుత్వం కాదు. తెలంగాణ కొత్తగ ఏర్పడినది. కొత్త రాష్ట్రం ఏర్పడింది. భావి తెలంగాణపట్ల చాలా శ్రద్ధతో జాగ్రత్తగా ఉండాలి. 14-15 ఏండ్లు కొట్లాడి తెలంగాణ తెచ్చిన పార్టీ మాది. అల్లాటప్పా పార్టీ కాదు. ఎక్కడ్నో గాలికి ఆధారపడే పార్టీ కాదు. మేం ఆరోజు ఎన్నికల్ల ఒంటరిగ గెలిచినం. సాధారణ ఎన్నికల్లో ప్రజలు మా మీద సంపూర్ణ విశ్వాసం, గౌరవాన్ని ప్రదర్శించిండ్రు. కాబ్బట్టి తప్పులు చేయడానికి మాకు ఆస్కారం లేదు.

ప్రజలు మా మీద ఉంచిన నమ్మకాన్ని వంద శాతం నెరవేర్చుతుం. కానీ అరాచకంగా, పిచ్చిపిచ్చి పనులు చేయదల్చుకోలె. దసరా నుంచి పథకాలు ప్రారంభమయితయి. దసరా పండుగ నుంచి పింఛన్లుగానీ, ఇండ్లుగానీ ఇస్తం. దసరా నుంచి దీపావళి మధ్య చాలా ఆదేశాలు జారీ కానున్నయి. ప్రజలు ఆశించిన బంగారు తెలంగాణ కోసం అహోరాత్రులు శ్రమిస్తం. మాకు రోజుకు 24 గంటలు సరిపోవన్నంత పని మీద ఉంటం. అన్ని రంగాల్లో ప్రణాళికలు సిద్ధంగ ఉన్నయి. రాబోయే పక్షంరోజుల్లోనే మా కార్యాచరణ ప్రారంభమయితది. నేను జిల్లాల పర్యటన కూడా చేయలె. కేవలం రెండు జిల్లాలే తిరిగిన. మొన్న కాళోజీ కార్యక్రమానికి వరంగల్ పోయిన.

దేశంలో ఏ పార్టీకి లేని ఆదరణ టీఆర్‌ఎస్‌కే దక్కింది దేశంలో ఈరోజు ఏ పార్టీకిరాని ఆదరణ టీఆర్‌ఎస్‌కు వచ్చింది. మోడీ వడోదరలో పోటీ చేసినప్పుడు 5.70 లక్షలు ఉంటె ఇప్పుడు 1.70 లక్షల మెజార్టీ వచ్చింది. దేశంలో ఏ పార్టీకి లేని ఆదరణను ప్రజలు టీఆర్‌ఎస్‌పై చూపిండ్రని అర్థమయితుంది అని అన్నారు.

గ్రేటర్‌లోనూ గులాబీ జెండానే… గ్రేటర్ హైదరాబాద్‌లో వంద శాతం టీఆర్‌ఎస్ విజయదుందుభి మోగించబోతున్నది. హైదరాబాద్‌లో కనీవినీ ఎరుగని రీతిలో రోడ్ల నిర్మాణాన్ని చేపట్టబోతున్నం. మురికివాడలరహిత నగరంగా చేస్తం. ఇండ్లు కూల్చడం మా ఉద్దేశం కాదు. అక్రమంగ ఏదిబడ్తె అది జరగదు. ఒక నియంత్రణ ఉంటది. ఒక క్రమశిక్షణలో ఉంటదని చెప్పడం తప్ప.. ప్రజల ఆస్తులను కూలగొట్టాలనే రాక్షసానందం మాకు లేదు. నగరంలో నాలుగు లక్షల కుటుంబాలు ఉన్నయనె విషయం జీహెచ్‌ఎంసీకి తెల్వదు. ఎంత అధ్వాన్నమైన, ఘోరమైన అభివృద్ధో దీన్ని ఒక్కదాన్ని బట్టె అర్థం చేసుకోవచ్చు. జంట నగరాల్లోని ప్రతి పేదవాడికి ఇండ్లు కట్టె కార్యక్రమం ఉంది. ఫుట్‌పాత్‌ల మీద పండుకునే దౌర్భాగ్యమైన పరిస్థితి ఉండదు. రాబోయే కొద్దిరోజుల్లో అలాంటి అన్ని కార్యక్రమాలు అమలు చేస్తం అని వివరించారు. పాదచారులకు కచ్చితంగా సౌకర్యాలు కల్పిస్తమన్న కేసీఆర్.. అది వారి హక్కు అని స్పష్టం చేశారు. దానికీ మాస్టర్‌ప్లాన్ ఉందన్నారు.

రాష్ర్టానికి కేంద్ర సంపూర్ణ సహకారం ఈ మధ్య ప్రధానమంత్రిని కలిసినపుడు కూడా కచ్చితంగ చెప్పిన. వారు కూడా నాకు హామీ ఇచ్చిండ్రు. 101 శాతం ఒకరికి ఒకవిధంగ, ఒకరికి ఒకవిధంగ ఉండదని చెప్పిండ్రు. దేశంలో అన్ని రాష్ర్టాలు అభివృద్ధి చెందినపుడు దేశం అభివృద్ధి చెందుతది. తెలంగాణకు కూడా నా సంపూర్ణ సహకారం ఉంటదని పీఎం చెప్పిండ్రు. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం మాతో మంచిగుంటదనే నమ్మకం ఉంది అన్నారు.

మేమొచ్చినంకనే రైతులకు ఊరట రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇయ్యలేదు. 6-7 ఏండ్లుగా మా పార్టీ తరఫున పోరాడినం. అయినా ఇయ్యలేదు. మేం వచ్చిన తర్వాత దానిని ఇచ్చినం. ఆర్మూరులో ఎర్రజొన్న రైతులను కాల్చి చంపిండ్రు. లాఠీదెబ్బలు కొట్టిండ్రు. మా ఎమ్మెల్యేలు (జీవన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి) ఆందోళన చేసిండ్రు. ఆమరణ దీక్ష చేసిండ్రు. ఇయ్యలె. మేం వాళ్లకు రూ.11 కోట్లు ఇచ్చినం. ఇంక కోటి తక్కువ బడినయంట. అది కూడా ఇస్తం.

కేజీ టు పీజీ అమలు చేస్తం కేజీ టు పీజీ ఉచిత విద్య చాలా ప్రాధాన్యమున్న కార్యక్రమం. వంద శాతం చేస్తం. తెల్లారేసరికి రాదు. ఇది పెద్ద ప్రాజెక్టు. విద్యావేత్తలు, వైస్‌చాన్స్‌లర్, ఉపాధ్యాయులతో సదస్సు పెడతం. అందరూ కూర్చున్న తర్వాత అవుట్‌పుట్ వస్తుంది. వాళ్లు నిర్ణయం తీసుకుంటరు.

ఘనంగా పార్టీ ప్లీనరీ మంత్రివర్గ విస్తరణ కచ్చితంగా ఉంటుందని సంకేతాలిచ్చిన ముఖ్యమంత్రి అది ఎప్పుడు? ఎట్ల? అనేది మాత్రం రహస్యమన్నారు. ఈ నెలాఖరున ప్లీనరీ పెట్టాలనుకుంటున్నం. ఎల్బీ స్టేడియంల అనుకుంటున్నం. చాలా పెద్ద ఎత్తున 20వేల మంది ప్రతినిధులతో ఏర్పాటు చేస్తం. ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన స్థానిక ప్రజాప్రతినిధులు, ఆ నియోజకవర్గం నుంచి 200-250 మంది ప్రతినిధులు కూడా హాజరయితరు. రెండు, మూడు రోజుల్లో పార్టీ ముఖ్య నాయకులతో కూర్చుని తేదీలను నిర్ణయిస్తం అని చెప్పారు.

త్వరలోనే రుణమాఫీ అమలు రుణమాఫీపై గందరగోళం నెలకొన్న మాట వాస్తవమేనని ముఖ్యమంత్రి అన్నారు. ఆర్థికంగా బలహీనంగా ఉన్న రాష్ట్రం కాదు. మాకున్న వనరులు మాకున్నయి. రీషెడ్యూలు ఇవ్వమంటె రిజర్వు బ్యాంకు అంగీకరించలేదు. మూడు జిల్లాలకు మాత్రమే రీషెడ్యూలు ఇచ్చిండ్రు. వాస్తవానికి కరువు, వరదలు ఉన్నయిగానీ వాళ్లు ఒప్పుకుంటలేరు. ఇప్పుడు బ్యాంకర్లను అడిగినం. మీరివ్వరు… సతాయిస్తుండ్రు, మేం ప్రజలకు మాట చెప్పినం. రాజకీయ ప్రభుత్వంగా మేం మాట నిలబెట్టుకోవాలి. మీరిస్తరా… లేకుంటె మేం బాండ్లు ఇచ్చుకోవాల్న అని నేరుగా ఇప్పుడు బ్యాంకర్ల మీటింగుకు పోయి, రీషెడ్యూలు ఇస్తరా? లేదా? చివరగ అడగబోతున్న. అవసరమైతె పది జిల్లాల రైతు సంఘాలను పిలుస్తం. మా శాసనసభాపక్షం కూర్చుంటం. ఇచ్చిన మాట వందకు వంద శాతం నెరవేర్చుతం… అన్నారు.

సీఎంకు పీఆర్టీయూటీఎస్ శుభాకాంక్షలు ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఘనవిజయం సాధించటంపై పీఆర్టీయూటీఎస్ నాయకులు పీ వెంకటర్‌రెడ్డి, పీ సరోత్తంరెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

నిర్మాణాత్మకంగా సూచనలిస్తేనే గౌరవం ప్రతిపక్షాలు నిర్మాణాత్మక సూచనలిస్తే కచ్చితంగా స్వీకరిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. సీపీఐ, సీపీఎం పార్టీలు ఈ ఎన్నికల్ల మాకు మద్దతునిచ్చినయ్. వాటికి నా పక్షాన, పార్టీపక్షాన, తెలంగాణ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్న. వారు కావచ్చు, ఇంకొందరు కావచ్చు. తొందరపాటుగా ప్రభుత్వమేదో చేయాలని ఆదుర్దా పడుతున్నరు. వాస్తవంగా తెలంగాణ నూతన రాష్ట్రం. ఈ రాష్ర్టానికి ఏం చట్టాలు కావాలి? ఏం శాసనాలు కావాలి? ఎట్ల అవలంబించాలి? ఏ విధంగా ప్రయాణించాలి? ఎక్కడకు చేరుకోవాలి? అనే లక్ష్యాలు, గమ్యాలు చూసుకోవాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒక పొరపాటు జరిగితె తరతరాలు బాధపడ్తయి. అనేక విషయాల్లో చాలా జాగరూకతతో వ్యవహరించాలి. రేపో, మాపో ఫైనాన్స్ కమిషన్ రాబోతున్నది. చాలా నిశితంగా పరిశీలించే మేం ఏదైనా చెప్పాలి. కేంద్రానికి ప్రతిపాదనలివ్వాలి. అంటే చాలా జాగ్రత్తతో, ఒళ్లు దగ్గరపెట్టుకొని ఇయ్యాలి. తెలంగాణ ప్రభుత్వం పేపర్ మీద ఏది కమిట్ చేసినా.. అదే శాశ్వతంగా అమలవుతూ పోతుంది.

అందుకె ఇన్ని సంవత్సరాలు కష్టపడి, త్యాగాలు చేసి, ఇంతమంది అమరుల త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణ విషయంలో ఇష్టమొచ్చినట్లుగా, అడ్డగోలుగా వ్యవహరించొద్దు. నిర్మాణాత్మకమైన, పటిష్ఠమైన అభివృద్ధివైపు తెలంగాణ అడుగులు వేయాల్సిన అవసరముంటది. దానికోసమే మేం కొంత టైం తీసుకుంటున్నం. ఇప్పటికైనా ప్రతిపక్షాలు నిర్మాణాత్మకంగా వ్యవహరించండ్రని ప్రజలు బుద్ధి చెప్పిండ్రు. బీ కన్‌స్ట్రక్టివ్ అపోజిషన్.. వియ్ వెల్‌కం. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా సద్విమర్శలు చేస్తే తప్పకుండా స్వాగతిస్తం. కోడిగుడ్డ మీద ఈకలు పీకినట్లు చేస్తె అదె మీకు బూమెరాంగ్ అయింది. ఇప్పటికైనా కళ్లు తెరిచి, మీ బాధ్యతను గుర్తెరిగి, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తె మీకు గౌరవం అన్నారు.

చంద్రబాబు, మీడియా ఏం చేయలేకపోయిండ్రు చంద్రబాబునాయుడు చేయని ప్రయత్నమంటూ లేదు పాపం. టీడీపీకి తెలంగాణలో స్థానం లేదని ఈ ఎన్నికలతో తేలింది. చంద్రబాబు తెలంగాణకు చాలా డబ్బులు పంపించిండు. వాళ్ల దొంగ డబ్బు దొరికితె కూడా మళ్లీ మేనేజ్ చేసి సాయంత్రం వరకు మళ్లీ డబ్బులు పంపించిండు. టెలీ కాన్ఫరెన్సులు పెట్టి అనేక ప్రయత్నాలు చేసిండు. కానీ వాళ్ల ప్రయత్నాలు నెరవేరలేదు. టీడీపీకి తెలంగాణలో స్థానం లేదనే మాటను కూడా ప్రజలు ఈ ఎన్నికల్ల స్పష్టంగ చెప్పిండ్రు. మూడు నెలల కిందట ఏదైతో చెప్పినమో.. దానిని ఇప్పుడు ప్రజలు ఎండార్స్ చేసిండ్రు.

ప్రతిరోజు ప్రతిపక్షాలు విషం చిమ్మినయి. కొంతమంది పెద్దవాళ్లను తిడ్తె తామేదో పెద్ద వాళ్లమయితమని దుర్మార్గమైన, హీనమైన మాటలు మాట్లాడిండ్రు. ఎన్నికల ప్రచారంల వాడకూడని పదజాలం వాడిండ్రు. కొంత పక్షపాత మీడియా కూడా చాలా ప్రయత్నం చేసింది పాపం. వాళ్లుకూడ ఏం చేయలేకపోయిండ్రు. అయినా ప్రజలు తమ విశ్వాసాన్ని ప్రబలంగా చూపెట్టిండ్రు అని కేసీఆర్ పేర్కొన్నారు. ఫలితాల తర్వాత కూడా టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు తమదే నైతిక విజయమని వ్యాఖ్యానించడంపై స్పందిస్తూ… యాడి నైతిక విజయం? మూడో స్థానమొస్తె నైతిక విజయమా? దాన్ని మీరు (మీడియా) నిర్ణయించాలి అని ఎద్దేవా చేశారు.

ప్రతిపక్షాలది అనవసర రాద్ధాంతం రైతు రుణమాఫీ విషయంలో కూడా చాలా గోల్‌మాల్ చేసిండ్రు. చాలా అబద్ధాలు ప్రచారం చేస్తుండ్రు. మా తల తెగిపడ్డా సరే.. ఒక్కసారి మాట ఇచ్చినమంటె ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అమలు చేస్తం తప్ప వెనక్కిపోయే ప్రసక్తిలేదు. అర్హతలేనివాళ్ల రేషన్‌కార్డులు తీసేస్తమన్నం. దొంగతనంగా ఇండ్లు కట్టినవాళ్ల మీద సీఐడీ విచారణ చేసినం. వాటిని ప్రజలు ఆమోదించిండ్రు. ప్రజలు మంచి కోరుతున్నరు. హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలు కూల్చితేకూడా ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నయి. పటాన్‌చెరు నియోజకవర్గంలోని రామచంద్రాపురంల అక్రమాలను బయటపెడితె దాన్ని కూడా తప్పు పట్టె ప్రయత్నం చేసిండ్రు. మేం రేపు అర్హులందరికీ రేషన్‌కార్డులు ఇచ్చి తీరుతం. ఇప్పుడిచ్చె బియ్యం ఎంతైతె ఉందో.. అంతకంటే ఎక్కువ ఇస్తం. కుటుంబానికి 30 కిలోలు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నం. అర్హులందరికీ ఎట్టిపరిస్థితుల్లో అన్యాయం చేయం.

అనర్హులను ఎట్టిపరిస్థితుల్లో ఉంచం. దానిపై మాకు స్పష్టత ఉంది. జనం కూడా దానికి మద్దతు ఇస్తుండ్రు. రైతు రుణ మాఫీ విషయంలో కూడా తప్పులు బయటపడుతున్నయి. ఒక్కొక్కరు నాలుగు పుస్తకాల మీద రుణం తీసుకుండ్రు. కచ్చితంగా అలాంటి అక్రమాలను పట్టుకుంటం. నిజమైన రైతులకు రుణమాఫీ చేసి తీరుతం. ఇక్కడినుంచి నేను నేరుగా బ్యాంకర్ల మీటింగుకు పోతున్న. వారితో మాట్లాడి.. ఈరోజో రేపో రుణ మాఫీని కూడా మొదలుపెడ్తం.

అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని మాకు తెల్వదా? వెంటనే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలంటూ ప్రతిపక్షాలు చేసిన రాద్ధాంతంపై కేసీఆర్ ఘాటుగా స్పందించారు. ఏం చేసినా తప్పని మాట్లాడే మీకు ప్రజలు ఈరోజు చెంపపెట్టులాంటి సమాధానం చెప్పిండ్రు. తెలంగాణ పునర్నిర్మాణానికి నిర్మాణాత్మకమైన, మంచి సలహాలు ఇస్తే స్వీకరించడానికి సిద్ధంగా ఉంటం. అర్జంటుగ శాసనసభ పెట్టాలని డిమాండు చేసిండ్రు. మాకుండదా శాసనసభ సమావేశాలు పెట్టుకోవాలని? మాకు తెల్వదా? ఇది రాజ్యాంగ శాసనం.

కాకపోతే తెలంగాణ ప్రభుత్వానికి ఒక వెసులుబాటు ఉంది. డిసెంబరు2లోపు బడ్జెట్ ఆమోదించుకోవాలి. అవశేష ఆంధ్రప్రదేశ్ కాబట్టి దానికి ఆ వెసులుబాటు ఇయ్యలె. బాజాప్తా పార్లమెంటులో పాసయిన బిల్లులోనే అది ఉంది. ఫైనాన్స్ కమిషన్ వస్తుంది. మంచీ, చెడు చూసుకోవాలి. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు పెట్టుకోవాలనుకుంటున్నం. కానీ రేపే సమావేశం పెట్టాలి.. ఎల్లుండె పెట్టాలని మాట్లాడుతుండ్రు. ఇప్పటికైనా సరే జ్ఞానం తెచ్చుకుంటె మంచిది అని హితవు పలికారు.

కనురెప్ప కొట్టినంత కరెంటూ పోనివ్వం విద్యుత్తు కొరతపై గత ఎన్నికల ప్రచారంలోనే 86 సభలల్ల చెప్పిన. మూడేండ్లు తిప్పలు తప్పవని చెప్పిన. మూడేండ్ల తర్వాత ఈ తిప్పలె ఉండవు. 2015 సంవత్సరానికి వెయ్యి మెగావాట్ల అదనపు విద్యుత్తు తోడవుతుంది. 2016లో మరో రెండువేల మెగావాట్లు తోడవుతుంది. 36-40 మాసాల తర్వాత కనురెప్ప కొట్టినంతసేపు కూడా కరెంటు పోనివ్వం అని హామీ ఇచ్చారు. వైద్యారోగ్యంతోపాటు కార్మికశాఖ, ఇంకా పలు శాఖలపై సమీక్ష నిర్వహించాల్సి ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. విలేకరుల సమావేశంలో టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కే కేశవరావు, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, డిప్యూటీ సీఎం రాజయ్య, భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, రామలింగారెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మెదక్ ఎంపీగా విజయం సాధించిన కొత్త ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మంచిని కచ్చితంగా స్వీకరిస్తం సెప్టెంబరు 17న మునుపటి మాదిరిగానే పార్టీ కార్యక్రమాలు ఉంటాయని సీఎం చెప్పారు. గతంలో 17 సెప్టెంబరున టీఆర్‌ఎస్ ఎలాంటి కార్యక్రమాలు తీసుకుందో… ఇప్పుడు గూడ గట్లనె ఉంటది. ప్రభుత్వంపరంగా చేయాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. గత ప్రభుత్వాల నుంచి మంచిని కచ్చితంగ స్వీకరిస్తం. చెడును విసర్జిస్తం. ఇది గుడ్డి ప్రభుత్వం కాదు. మంచిని స్వీకరించలేనంత గుడ్డిగ లేం. మంచి జరిగి ఉంటె కచ్చితంగా స్వీకరిస్తం అన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.