Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

త్వరలో పట్టణజ్యోతి

-ప్రజలను భాగస్వామ్యం చేసేందుకే గ్రామజ్యోతి.. -ఆగస్టు 17న గంగదేవిపల్లిలో శ్రీకారం -24 వరకు రాష్ట్రవ్యాప్తంగా గ్రామజ్యోతి వారోత్సవాలు -పుష్కరాల స్ఫూర్తితో సమ్మక్క జాతర, కృష్ణా పుష్కరాలు -గ్రామజ్యోతిపై సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్

KCR review meet on Grama jyothi programme

అభివృద్ధి ప్రక్రియలో ప్రజలను సంపూర్ణ భాగస్వాములను చేసేందుకు త్వరలో పట్టణ జ్యోతి కార్యక్రమం కూడా చేపడతామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఎవరి ఇల్లును వారు దిద్దుకున్న రీతిలోనే ప్రజలు మందుకు వచ్చి వారికి కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు స్వయంగా వారే అమలు చేసుకోవాలని అన్నారు. ప్రభుత్వం వివిధ పథకాల కింద కోట్ల రూపాయలు ఇస్తున్నా గ్రామాల్లో మంచినీళ్ల నల్లా దగ్గర చిన్న చిన్న ప్లాట్‌ఫాంలు కూడా నిర్మాణం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే పంచాయతీరాజ్ ఉద్యమస్ఫూర్తిని చాటేలా ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయాలనే లక్ష్యంతో గ్రామజ్యోతి పథకం చేపట్టామని చెప్పారు. ఇదే రీతిలో త్వరలోనే పట్టణ జ్యోతి పథకం తీసుకువస్తామన్నారు.

గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని, అయితే తమ గ్రామానికి ఏ సదుపాయం కావాలో నిర్ణయించుకునే అధికారం మాత్రం ఆ గ్రామస్తులకే ఇస్తామని చెప్పారు. గురువారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీహెచ్‌ఆర్డీ)లో గ్రామజ్యోతి పథకంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఆగస్టు 17న వరంగల్ జిల్లా గంగదేవిపల్లిలో గ్రామజ్యోతి కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభిస్తున్నామని చెప్పారు. అదే రోజున రాష్ట్రవ్యాప్తంగా గ్రామజ్యోతి వారోత్సవాలు ప్రారంభమై 24వ తేదీ వరకూ జరుగుతాయని పేర్కొన్నారు. మంత్రులనుంచి మొదలుకుని కిందిస్థాయి దాకా నాయకులు, అధికారులు భాగస్వాములై పంచాయతీరాజ్ ఉద్యమ స్ఫూర్తిని చాటి చెప్పాలని పిలుపునిచ్చారు.

గ్రామాలను దత్తత తీసుకోండి సమావేశంలో గ్రామజ్యోతి లక్ష్యాలను వివరించిన సీఎం.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తలా ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని సూచించారు. గ్రామజ్యోతి అంటే గ్రామాల అభివృద్ధికి నిధులు గుప్పించడం కాదు.. అభివృద్ధిలో ప్రతి పౌరుడిని భాగస్వామిని చేయడం. ఎవరి ఇంటి అభివృద్ధి కోసం వాళ్లు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు, ఎవరి ఊరి అభివృద్ధికి వారే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ప్రతి అధికారి ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకోవాలి. ప్రజల భాగస్వామ్యంతో మార్పు సాధించి, మిగతా గ్రామాలకు ఆదర్శంగా నిలవాలి. పంచాయతీరాజ్ ఉద్యమ స్ఫూర్తిని మళ్లీ గ్రామ స్థాయిలో తీసుకురావడానికి కృషి జరపాలి అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

ఆగస్టు 17న వరంగల్ జిల్లా గంగదేవిపల్లిలో గ్రామజ్యోతి కార్యక్రమాన్ని తాను ప్రారంభిస్తానని, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు ఎక్కడికక్కడ ఈ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. ప్రజలను చైతన్యపరిచేందుకు సాంస్కృతిక సారథి కళాబృందాలు కూడా గ్రామాల్లోకి తరలివెళ్లాలని ఆదేశించారు. గ్రామజ్యోతి కింద మొదటి దశలో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టి ప్రజలను భాగస్వాములను చేయాలన్నారు. గ్రామాలకు మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యతను ప్రభుత్వం స్వీకరిస్తుందని, అయితే ఏ గ్రామానికి ఏ సదుపాయం కావాలో దాన్ని ప్రజలే నిర్ణయించాలని సీఎం చెప్పారు.

పంచాయతీరాజ్‌కు పూర్వ వైభవం తెద్దాం అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేసి పంచాయతీరాజ్‌కు పూర్వ వైభవం తేవాలని సీఎం కేసీఆర్ అన్నారు. ఒకనాడు హైదరాబాద్ కేంద్రంగానే దేశంలో మొదటి కమ్యూనిటీ డెవలప్‌మెంట్ మంత్రి ఎస్‌కే డే పంచాయతీరాజ్ సంస్థల విస్తరణ కోసం విశేష కృషి చేశారని గుర్తు చేశారు. దేశంలో పంచాయతీరాజ్, సహకార వ్యవస్థలు రెండూ ఉద్యమాల్లోంచి వచ్చినవేనని అన్నారు. వరంగల్ జిల్లా గంగదేవిపల్లి, నిజామాబాద్ జిల్లా అంకాపూర్‌లాంటి గ్రామాలు పంచాయతీరాజ్ వ్యవస్థకు, కరీంనగర్ జిల్లా ముల్కనూరు సహకార వ్యవస్థకు మంచి ఉదాహరణలని సీఎం చెప్పారు. గంగదేవిపల్లి గ్రామం మాదిరిగా కమిటీలు వేసుకుని ప్రజల భాగస్వామ్యం పెంచాలని సూచించారు.

గ్రామాలకు వెళ్లే అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామజ్యోతి కార్యక్రమం గ్రామ పంచాయతీ కార్యాలయాలకు సంబంధించిన వ్యవహారం కాదని, ప్రతి పౌరుడూ అందులో భాగస్వామ్యం కావాలని విస్తృతంగా ప్రచారం చేయాలని పేర్కొన్నారు. గ్రామసభల్లో ప్రజాప్రతినిధులంతా పాల్గొనేలా చూడాలన్నారు. ప్రతి గ్రామంలో ప్రజలంతా కలసి వచ్చే ఐదేండ్లకోసం ప్లాన్ సిద్ధం చేసేలా చూడాలని సూచించారు. అలా తయారయ్యే ప్రణాళికలకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందన్నారు. గ్రామ ప్రణాళికల కార్యక్రమంతోపాటు ప్రజలంతా కలిసి చెత్త, శిథిలాలు తొలగించడం, పాత బావులు పూడ్పించడం, చిన్నపాటి పనులను శ్రమదానంతో చేయించడం వంటివి చేయాలని అన్నారు.

కోట్లు కుమ్మరిస్తున్నా మిషన్‌కాకతీయ, వాటర్‌గ్రిడ్, సివిల్ సైప్లె, రహదారుల నిర్మాణం, పెన్షన్లు తదితర పథకాల కింద కోట్ల రూపాయలు గ్రామాలకు చేరుతున్నాయి. ఎంపీ కోటా నిధులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, జిల్లా, మండల పరిషత్తు నిధులు, గ్రామ పంచాయతీల నిధులు కోట్ల రూపాయలు చేరుతున్నాయి. అయినా గ్రామాల్లో చిన్నపాటి పనులు కూడా జరగడం లేదని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో కనీసం మంచినీళ్ల నల్లా దగ్గర ఫ్లాట్ ఫారాలు కూడా కట్టడం లేదని అన్నారు. ఈ పరిస్థితిని మార్చాల్సిన అవసరముందని సీఎం చెప్పారు. గ్రామ పంచాయతీల విధులు-బాధ్యతలు అనే అంశంపై విధి విధానాలను రూపొందించాలని, వాటిని కచ్చితంగా అమలు జరిగేలా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు.గ్రామజ్యోతి కార్యక్రమాన్ని గ్రామీణాభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకే చేపడుతున్నాం. ఇది ప్రభుత్వ కార్యక్రమంగా జరిగితే ఫలితం రాదు. ప్రభుత్వం కేవలం ఆర్థిక ప్రేరణగా ఉంటుంది. గ్రామాల అభివృద్ధికి కావాల్సిన సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కానీ నిజంగా మార్పు సాధించాల్సింది ప్రజలే.. వారు ఏం చేయాలో ఎలా ప్లాన్ చేసుకోవాలో అధికారులు చెప్పాలి. జిల్లాల్లో ఉండే అధికారులు మండలానికొకరుగా చేంజ్ ఏజెంట్స్‌గా వ్యవహరించాలి అని సీఎం కోరారు.

ఆర్థిక వనరులు కల్పిస్తాం.. గ్రామపంచాయతీలను బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, పంచాయతీల ఆర్థిక వనరులను పెంచుతామని, అవసరమైన సిబ్బందిని కూడా నియమిస్తామని పేర్కొన్నారు. సీవరేజీ, కమర్షియల్ ట్యాక్స్‌తో పాటు ఇతర పద్ధతుల్లో స్థానిక సంస్థలకు రావాల్సిన డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. క్యాబినెట్ కమిటీ ఆయా మంత్రులతో సమావేశమై రావాల్సిన నిధులు రప్పించుకునే విషయం చర్చించాలన్నారు.

త్వరలో పట్టణ జ్యోతి గ్రామజ్యోతి కార్యక్రమం మాదిరిగానే పట్టణజ్యోతి కార్యక్రమాన్ని కూడా చేపడతామని సీఎం స్పష్టం చేశారు. పట్టణాల్లో కూడా మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో చిత్తశుద్ధి, పట్టుదల ఉన్న ప్రజాప్రతినిధులు, అధికారులు బాగా పనిచేసిన ప్రతిచోట మంచి ఫలితాలు వచ్చాయని, మిగతా చోట్ల కూడా అదే రీతి ఫలితాలు రావాలని అన్నారు. స్థానిక సంస్థలు, వివిధ పథకాల ద్వారా రూ.5వేల కోట్లు ఖర్చు అవుతున్నా స్థిరాస్తులు తయారు కావడంలేదని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

పుష్కరాలను అద్భుతంగా నిర్వహించారు గోదావరి పుష్కరాలను అధికారులు అద్భుతంగా నిర్వహించారు. కలెక్టర్లు, ఎస్పీలు రేయింబవళ్లు కష్టపడ్డారు. పోలీసులు చాలా మర్యాదగా ప్రవర్తించారు. అందరికీ అభినందనలు. ఇదే స్ఫూర్తితో వచ్చే ఏడాది జరిగే మేడారం జాతర, కృష్ణా పుష్కరాలను ఘనంగా నిర్వహించాలి. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తే మంచి ఫలితం ఉంటుందని పుష్కరాలు నిరూపించాయి అని సీఎం చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించిన మిషన్ కాకతీయ గొప్పగా జరిగిందని.. దేశం దృష్టిని ఆకర్షించిందని అన్నారు. నీతి ఆయోగ్ అధికారులు, హైకోర్టు, కేంద్ర మంత్రులు ఈ కార్యక్రమాన్ని అభినందించారని గుర్తు చేశారు. ఇదే స్ఫూర్తితో గ్రామజ్యోతి కార్యక్రమం నిర్వహించాలన్నారు.

పంచాయతీలు ఇతర ఆదాయమార్గాలపై దృష్టి పెట్టాలి: మంత్రి కేటీఆర్ గ్రామ పంచాయతీలు పన్నులు వసూలు చేయడమే కాకుండా, ఇతర ఆదాయ వనరులపై కూడా దృష్టి కేంద్రీకరించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. నిరుపయోగంగా ఉన్న విలువైన ప్రభుత్వ భూములు వినియోగించడం, షాపింగ్ కాంప్లెక్స్‌లు నిర్మించడం, ప్రభుత్వ స్థలాల్లో అడ్వైర్టెజ్‌మెంట్లు, ఇతర ఆదాయ మార్గాలు అన్వేషించాలని అన్నారు. వీటికి జిల్లా స్థాయిలోనే అనుమతి ఇవ్వాలని కేటీఆర్ సూచించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు కే తారక రామారావు, ఈటల రాజేందర్, టీ హరీశ్‌రావు, జోగు రామన్న, తుమ్మల నాగేశ్వర్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మ, వివిధ శాఖల ముఖ్యకార్యదర్శులు, కమిషనర్లు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. గ్రామజ్యోతి పథకంపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి రేమండ్ పీటర్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.