బంగారు తెలంగాణను సాధించుకునే కృషికి ఉద్యోగులంతా చోదక శక్తిగా పని చేయాలని రాష్ట్ర పంచాయత్‌రాజ్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం సచివాలయంలో జరిగిన తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం డైరీ ఆవిష్కరణ సభలో మంత్రి మాట్లాడారు.

-బంగారు తెలంగాణకు టీజీవోలు చోదకశక్తిగా మారాలి -ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు -ఉద్యోగులే ప్రభుత్వానికి మూల స్తంభాలు:డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ -సచివాలయంలో ఘనంగా టీజీవో డైరీ ఆవిష్కరణ స్వరాష్ట్ర సాధనలో నాలుగు కోట్ల ప్రజలతో కలిసి శ్రీనివాస్‌గౌడ్ నేతృత్వంలో టీజీవో తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిందని ప్రశంసించారు.తమది ఉద్యోగుల పక్షపాత ప్రభుత్వమని, వారితో స్నేహపూర్వకంగా ఉంటామని ఆయన చెప్పారు. పదవులంటే తమకు లెక్కలేదని అన్న కేటీఆర్, మంత్రులమైనప్పటికీ తమకే కొమ్ములు రాలేదని గతంలో అన్నా అని పిలిచినట్టే ఇప్పుడూ పిలవవచ్చని అన్నారు. ఉద్యోగులకు త్వరలోనే పీఆర్సీ అమలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రజల, ఉద్యోగుల కష్టసుఖాలు తెలిసిన ఉద్యమ సారథి కేసీఆర్ సారథ్యంలోని ఏడు నెలల ప్రభుత్వం ఎంతో సాధించిందని, వాటర్‌గ్రిడ్, మిషన్ కాకతీయ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను అమలు చేస్తున్నదని చెప్పారు.
ప్రభుత్వం, ఉద్యోగులు కలిసి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశలో అడుగులు వేయాలని అన్నారు. ఉద్యోగులే ప్రభుత్వానికి మూలస్తంభాలని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అభివర్ణించారు. బంగారు తెలంగాణను సాధించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కష్టపడి పని చేస్తున్నారని ఉద్యోగులు ఆయనకు చేదోడువాదోడుగా నిలవాలని కోరారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ తీసుకునే నిర్ణయాలు, కార్యక్రమాలు టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు దడ పుట్టిస్తున్నాయని అందుకే విమర్శలకు దిగుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వం అధికారులు, ఉద్యోగులతో ఫ్రెండ్లీగా వ్యవహరిస్తుందన్నారు.
తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొ కోదండరాం మాట్లాడుతూ ఇక నుంచి రాష్ట్ర పునర్నిర్మాణం కోసం పని చేద్దామని, ప్రజల ఆశలు, ఆకాంక్షలను పరిపూర్ణం చేద్దామని సూచించారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం హక్కుల కోసం డిమాండ్ చేయడం కన్నా బంగారు తెలంగాణ సాధనలో ప్రభుత్వానికి సహకరించడానికే ప్రాధాన్యం ఇస్తున్నదని పార్లమెంటరీ కార్యదర్శి(రెవెన్యూ) వీ శ్రీనివాస్‌గౌడ్ ప్రశంసించారు. డైరీ ఆవిష్కరణ సభకు టీజీఓ అధ్యక్షురాలు వీ మమత అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రేఖానాయక్, టీజీఓ నాయకులు ఎంబీ కృష్ణయాదవ్, ఎస్ సహదేవ్, రాజ్‌కుమార్‌గుప్తా, శ్రావణ్‌కుమార్, టీ యాదగిరి, ఓంప్రకాశ్, సలీం, నవీన్జ్యోతి, మామిడి నారాయణ, గ్రూప్-1 అధికారుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌గౌడ్ పాల్గొన్నారు.