Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

త్వరలోనే రైతు రుణాలు మాఫీ

-ఎన్నికల హామీ అమలుకు కట్టుబడి ఉన్నాం -ఆర్‌బీఐ, ఇతర బ్యాంకర్లతో చర్చలు జరుపుతున్నాం -ఆగస్టు చివర్లో లేదా సెప్టెంబర్ మొదట్లో బడ్జెట్ సమావేశాలు -ఫైనాన్షియల్ సెక్టార్ కాంక్లేవ్ సదస్సులో మంత్రి కేటీఆర్ -ఫైనాన్షియల్ సెక్టార్ సదస్సులో మంత్రి కేటీఆర్

KTR

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ చేసి తీరుతామని పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. రుణాలను రీ షెడ్యూల్ చేస్తారన్న వార్తలు అవాస్తవమని, ప్రతి రైతుకూ రూ.లక్షలోపు రుణాలను త్వరలోనే మాఫీ చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఫిక్కీ ఆధ్వర్యంలో ఐటీసీ కాకతీయ హోటల్‌లో మంగళవారం జరిగిన ఫైనాన్షియల్ సెక్టార్ కాంక్లేవ్ ముగింపు సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు.

రుణమాఫీపై రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ), ఇతర బ్యాంకర్లతో రుణమాఫీపై చర్చలు జరుపుతున్నామని కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. ఆగస్టు చివరివారం లేదా సెప్టెంబర్ తొలివారంలో శాసనసభ బడ్జెట్ సమావేశాలుంటాయని, అందుకోసం మన ఊరు-మన ప్రణాళిక పేరుతో గ్రామస్థాయి నుంచి బడ్జెట్ అంచనాలు సేకరిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని రంగాల అభివృద్ధికి ఊపునిచ్చేలా చక్కని ప్రణాళికతో కూడిన బడ్జెట్‌ను రూపొందించనున్నట్లు పేర్కొన్నారు.

గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పక్కా ప్రణాళికలు రూపొందిస్తామని చెప్పారు. హైదరాబాద్‌ను భారతదేశానికి రెండో ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు. పంచాయితీరాజ్ సంస్థలకు అధికారాలు బదలాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్న ఆయన, పంచాయతీరాజ్ సంస్థను పునరుద్ధరిస్తామని చెప్పారు. బ్యాంకర్లు, బీమా, ఐటీ సంస్థలతో కలిసి పేదరిక నిర్మూలనకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సూక్ష్మరుణ సంస్థలతో సామాజిక సమస్యలు తలెత్తి అత్మహత్యలు కూడా జరిగాయని, వాటిని దృష్టిలో ఉంచుకొని ఈ సంస్థలను సంస్కరించి గ్రామీణ ప్రాంతాల్లో రుణాలిచ్చే ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు.

ఐమాక్స్ ఎండీ ఆర్ రఘోత్తమరావు మాట్లాడుతూ ఫైనాన్స్ రంగం ప్రజల అవసరాలు, డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఐటీ అన్ని శాఖలకు వెన్నెముకలాంటిదని, అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని ఫ్యాప్సీ బ్యాంకింగ్ కమిటీ చైర్మన్ జీ శ్రీనివాస్ తెలిపారు. ఈ సదస్సులో కెనరా బ్యాంకు సీఎండీ ఆర్‌కే దూబే, పలువురు ఆర్థిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.