-గ్రామీణ తెలంగాణ గుండె చప్పుడు గులాబీ పార్టీ -పరిషత్ ఎన్నికల్లో రికార్డుస్థాయి విజయాలు -సీఎం కేసీఆర్ పథకాలతో బంపర్ మెజార్టీ -రాష్ట్రంలోని మొత్తం 32 జెడ్పీలకు అన్నింటా గెలుపు -445కుపైగా ఎంపీపీ అధ్యక్ష స్థానాలు టీఆర్‌ఎస్‌కే!
పోచంపల్లికి అభినందనలు ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిని బుధవారం టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అభినందించారు. కేటీఆర్‌ను వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర సీనియర్ నాయకులు పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆధ్వర్యంలో కలిశారు. దేశచరిత్రలో నిలిచిపోయే మెజార్టీ గెలుపు సాధించిన జిల్లా నాయకత్వం పనితీరుపై కేటీఆర్ హర్షం వ్యక్తంచేశారు.
పల్లెల్లో గులాబీ జెండా రెపరెపలాడింది. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం తొలిసారి జరిగిన స్థానికసంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్ చరిత్ర సృష్టించింది. తెలంగాణ ఉద్యమ సమయంలోనే ఎక్కువ సర్పంచ్‌లు, ఎంపీటీసీలను గెలుచుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి.. అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణస్థాయిలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఆవిర్భవించిందని వరుస ఎన్నికలు నిరూపించాయి. ఆ పట్టు ఇసుమంతైనా తగ్గలేదని తాజా పరిషత్ ఎన్నికల ఫలితాలు రుజువుచేశాయి. ఏకంగా రాష్ట్రంలోని అన్ని జెడ్పీ పీఠాలను ఒకే పార్టీ కైవసంచేసుకోవటం, అవికూడా అధికారంలో ఉన్న పార్టీకే దక్కడం దేశ రాజకీయ చరిత్రలో ఇదే తొలిసారిగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. 32 జెడ్పీ పీఠాలపై గులాబీ కండువాలే నిండుగా కనువిందు చేయనున్నాయి. మరోవైపు మండల పీఠాల్లోనూ అదే వాతావరణం కనిపిస్తున్నది. ఇప్పటివరకు ఉన్న లెక్కలు, అంచనాల ప్రకారం 445కుపైగా మండల పరిషత్ అధ్యక్ష స్థానాల్లో టీఆర్‌ఎస్ నాయకులు ఆసీనులుకానున్నారు. 2001 స్థానిక సంస్థల ఎన్నికల పోరుతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన టీఆర్‌ఎస్.. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించటానికి కొద్దిరోజుల ముందు జరిగిన ఎన్నికల్లో ఘనవిజయం సాధించి రాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. తదుపరి గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో 99 డివిజన్లలో గులాబీ పతాకాన్ని ఎగురవేసి, రాజధానిలోనూ తన పట్టును చూపించింది. ఆర్నెళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాలకుగాను 88 స్థానాలను ఏకపక్షంగా గెలుచుకొని తెలంగాణలో ఇంటిపార్టీకే ప్రజల మద్దతు ఉందని తేల్చిచెప్పింది. తాజాగా ప్రాదేశిక ఎన్నికలతో టీఆర్‌ఎస్ తన విజయాన్ని సంపూర్ణం చేసుకున్నట్లయ్యింది.
కనీస స్థానాలు సాధించని ప్రతిపక్షాలు రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు పల్లె ఓటర్లను టీఆర్‌ఎస్‌వైపు నడిపించాయి. తామే ప్రత్యామ్నాయమని చెప్పుకొన్న పార్టీలు గౌరవప్రదమైన సంఖ్యలో కూడా స్థానాలను సాధించలేకపోయాయి. కాంగ్రెస్ ఎంతగానో ఆశలు పెట్టుకున్నా.. ఫలితాలు ఆ పార్టీ ఆశలపై నీళ్లు కుమ్మరించాయి. ఇక బీజేపీ నామమాత్రపు ఫలితాలు సాధించి సరిపెట్టుకున్నది. వామపక్షాలదీ దాదాపు అదే పరిస్థితి. కోదండరాం నాయకత్వంలోని తెలంగాణ జనసమితి ఉనికి చాటుకునే ప్రయత్నంకూడా చేయలేకపోయింది. మొత్తంగా ప్రజాసంక్షేమం టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని గ్రామీణ ఓటర్లు గుర్తించారు. దేశం మెచ్చిన పథకాలను అమలుచేస్తున్న కేసీఆర్‌కు పూర్తి అండగా నిలిచారు.
ప్రజాసంక్షేమానికే పట్టంగట్టిన ఓటరు రాష్ట్రంలో అన్నివర్గాల సంక్షేమంకోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశవ్యాప్త గుర్తింపు సాధించిన విషయం తెలిసిందే. పలు రాష్ర్టాలు తెలంగాణ పథకాలను కాపీ కొట్టాయి. దేశంలోనే సంచలన పథకమైన రైతుబంధును కేంద్ర ప్రభుత్వం పలు మార్పులు చేసి అమల్లోకి తీసుకువచ్చింది. ఇలా రాష్ట్రంలో నాలుగున్నరేండ్లలో సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన అనేక ప్రజాసంక్షేమ పథకాలు చరిత్రకెక్కాయి. గులాబీ దండును ఓటర్లు తమ హృదయాల్లో నిలుపుకొనేలా చేశాయి. ఫలితమే.. అసెంబ్లీ ఎన్నికలు మొదలు.. తాజాగా స్థానిక ఎన్నికలదాకా ప్రతి ఎన్నికల్లో ప్రజలంతా సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. గతంలో ఏ పార్టీకి రానంతగా మెజార్టీని స్థానిక ఎన్నికల్లో కట్టబెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు కుటుంబం యూనిట్‌గా అన్నట్టు అమలయ్యాయి. రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్ల పెంపు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఆరోగ్యశ్రీ, కంటి వెలుగు కార్యక్రమం, డబుల్ బెడ్‌రూం ఇండ్లు, ఆరోగ్యలక్ష్మి, అమ్మ ఒడి, కేసీఆర్ కిట్స్ వంటి పథకాలు అర్హులైన ప్రతి ఇంటికి అందాయి. ఇవేకాకుండా.. ధరణి వెబ్‌సైట్‌ను ఏర్పాటుచేసిన సీఎం కేసీఆర్.. భూ రికార్డుల ప్రక్షాళనచేశారు.
ఏండ్లతరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపారు. గ్రామస్థాయిలో భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా.. శాశ్వత పరిష్కారం కోసం సరికొత్త తరహాలో ప్రణాళిక సిద్ధంచేస్తున్నట్టు సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన.. రైతుల్లో విశ్వాసాన్ని నింపింది. ఇక అభాగ్యులకు అండగా ఉండేందుకు ఉద్దేశించిన ఆసరా పింఛన్లను కేసీఆర్ ప్రభుత్వం రెట్టింపుచేసింది. పెరిగిన పింఛన్లను లబ్ధిదారులు జూలై నెల నుంచి అందుకోనున్నారు. వృద్ధులు, వితంతువులు, గీత, నేత కార్మికులు, ఒంటరి మహిళలు, బోదకాలు బాధితులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్థులకు రూ.2016, దివ్యాంగులు, వృద్ధ కళాకారులకు రూ.3016 చొప్పున పంపిణీచేయనున్నారు. పరిషత్ ఎన్నికల ప్రచారంలో ఈ సంక్షేమ కార్యక్రమలన్నింటినీ ప్రజలకు వివరించడంలో టీఆర్‌ఎస్ నేతలు సఫలమయ్యారు. సంక్షేమ కార్యక్రమాలతోపాటు తాగునీటి ఇబ్బందులు తీర్చిన మిషన్ భగీరథ, గ్రామాల్లో చెరువులకు పూర్వవైభవం తెప్పించేందుకు చేపట్టిన మిషన్ కాకతీయ వంటి కార్యక్రమాలు.. తెలంగాణను కోటి ఎకరాల మాగాణంలా మార్చేందుకు సిద్ధమవుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు, ఇతర సాగునీటి యజ్ఞాలు టీఆర్‌ఎస్‌కు తిరుగులేని ప్రచారాస్ర్తాలుగా నిలిచాయి. వ్యక్తిగత విమర్శలు చేయడం తప్ప.. మరే ప్రచార అంశాలు లేని ప్రతిపక్షాలు.. టీఆర్‌ఎస్ ప్రభంజనంలో కొట్టుకుపోయాయి.