-రూ.200కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చిన గోయెంకా గ్రూపు -20 ఎకరాల్లో ఏర్పాటు.. వెయ్యిమందికి ప్రత్యక్షంగా ఉపాధి -మార్కెట్ ధరకే రైతుల ఉత్పత్తుల కొనుగోలు -బస్సుల తయారీ పరిశ్రమకు అశోక్ లేలాండ్ సుముఖత -పారిశ్రామిక పార్కుల నిర్మాణంలో శ్రేయీ భాగస్వామ్యం -సిమెంట్ పరిశ్రమకు అవకాశాలపై ఎమామీ ఆరా -3.5 లక్షల చ.అడుగుల్లో టీ హబ్ రెండో దశ -మంత్రి కేటీఆర్ కోల్‌కతాలో ఒకరోజు పర్యటన -పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ

మెదక్ జిల్లా తూప్రాన్‌లో అతి పెద్ద ఆహార (ఫుడ్ ప్రాసెసింగ్) పరిశ్రమ రాబోతున్నది. ఈ రంగంలో దేశంలోనే ప్రతిష్ఠాత్మక సంస్థ అయిన ఆర్పీ సంజీవ్ గోయెంకా గ్రూపు రూ.200 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. సోమవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కోల్‌కతా పర్యటనలో.. గ్రూపు చైర్మన్ సంజీవ్ గోయెంకాతో సమావేశమయ్యారు. మెదక్ జిల్లా తూప్రాన్ వద్ద 20 ఎకరాల్లో ఈ ఆహార పరిశ్రమను గోయెంకా గ్రూపు ఏర్పాటుచేయనున్నది. ఈ పరిశ్రమ ద్వారా ఈ-విటా, టూ-యమ్మీ బ్రాండ్లను తయారు చేయనున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్.. ఫుడ్ ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ రంగాల్లో తెలంగాణ రైతులకు సహకారం అందించాల్సిందిగా గోయెంకాను కోరారు. తమ ఉత్పత్తులను మార్కెట్ ధరకు అమ్ముకొనేలా స్థానిక రైతుల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసేందుకు గోయెంకా గ్రూపు అంగీకరించింది. తెలంగాణ ప్రభుత్వ విధానాలు, రాష్ట్రంలో ఉన్న వనరులు, అవకాశాలను గుర్తించి రూ.200 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన సంజీవ్ గోయెంకా గ్రూపునకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఈ పరిశ్రమ ఏర్పాటు ద్వారా దాదాపుగా వెయ్యిమందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
ప్రముఖ పారిశ్రామికవేత్తలతో భేటీ
కోల్‌కతా పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్.. మరికొందరు ప్రముఖ పారిశ్రామికవేత్తలను కలిశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని వారిని కోరారు. ఇక్కడ అవకాశాలు, వనరులు, పారిశ్రామిక విధానాన్ని మంత్రి వారికి వివరించారు. ఈ సందర్భంగా ఆటోమొబైల్ రంగంలో ప్రఖ్యాత సంస్థ అశోక్‌లేలాండ్ తెలంగాణలో బస్సుల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయటానికి సుముఖత వ్యక్తం చేసిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. శ్రేయీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ హేమంత్ కనోరియాతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. మౌలికవసతుల రంగంలో భారీ పెట్టుబడులు కలిగిన ఈ గ్రూప్ తెలంగాణలో చేపట్టేందుకు అవకాశం ఉన్న ప్రాజెక్టుల వివరాలను అందజేశారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో చేపడుతున్న మౌలికవసతుల ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం కావాలని కోరారు. తమ ప్రభుత్వం ఫుడ్‌పార్కుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యమిస్తున్నదని, దీనికోసం ముందుకు రావాలని కోరారు. రాష్ట్రంలో ఏర్పాటుచేయనున్న పారిశ్రామిక పార్కులకు ఆర్థిక సహకారం అందించే అవకాశాలను పరిశీలిస్తామని హేమంత్ కనోరియా తెలిపారు. మంత్రి సూచన మేరకు త్వరలో జపాన్, చైనా, కొరియా దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలతో తెలంగాణలో పెట్టుబడుల కోసం ఒక సమావేశాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు సహకరిస్తామని కనోరియా తెలిపారు. ఎమామీ జాయింట్ చైర్మన్ ఆరెస్ గోయెంకాతో మంత్రి జరిపిన భేటీ కూడా సఫలమైంది. తెలంగాణలో సిమెంట్, బయో-ఇంధనం, ఎఫ్‌ఎమ్సీజీలకు ఉన్న అవకాశాలు, సౌకర్యాల గురించి కేటీఆర్‌ని గోయెంకా అడిగి తెలుసుకున్నారు. బెంగాల్‌లోని పారిశ్రామికవేత్తలు బెంగాల్ బయట తమ వ్యాపార విస్తరణను తెలంగాణతో ప్రారంభించాలని మంత్రి కోరారు.
సీఐఐ ఆధ్వర్యంలో సమావేశం సాయంత్రం కోల్‌కతాలో ప్రముఖ పెట్టుబడిదారులతో సీఐఐ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి కే తారక రామారావు ప్రసంగించారు. తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమలకు అందిస్తున్న సహకారాన్ని వివరించారు. వినూత్నమైన విధానాల ద్వారా రాష్ట్రంలో పరిశ్రమలకు, రాష్ట్రంలోకి పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే కంపెనీలకు తాము ఇస్తున్న సహకారంపై సుదీర్ఘంగా వివరించారు. తెలంగాణ ఏర్పడిన తరువాత అంతర్జాతీయ దిగ్గజాలైన యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఉబెర్, సేల్స్‌ఫోర్స్, హనీవెల్, బోయింగ్, లాక్‌హీడ్ మార్టిన్ వంటి సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాయని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన స్టార్టప్ ఎకోసిస్టమ్ అయిన టీ హబ్ రెండోదశను మూడున్నర లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అభివృద్ధిచేస్తున్నామని మంత్రి బెంగాల్ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు వివరించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో మౌలిక సౌకర్యాలను కల్పిస్తున్నామని ఆయన వివరించారు. ఐటీ ఎగుమతుల ద్వారా రాష్ట్రం నిరుడు రూ.87వేల కోట్లు ఆర్జించిందని తెలిపారు. మేకిన్ తెలంగాణ నినాదం ద్వారా ఉత్పాదకరంగానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నదని తెలిపారు. తెలంగాణలో పెట్టుబడులకు ముందుకొస్తే సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ కూడా ఉన్నారు.