Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

టీఆర్‌ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్..

-పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం -తొలుత గుడిమళ్లపై సానుకూలత -పలు సమీకరణాలతో కొత్త పేరు -గుడిమళ్లకూ సముచితస్థానం కల్పిస్తానని హామీ

Pasunuri Dayakar వరంగల్ లోక్‌సభ స్థానానికి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పసునూరి దయాకర్ పేరు ఖరారు చేశారు. వివిధ సమీకరణలు పరిగణనలోకి తీసుకున్న అనంతరం దయాకర్‌కు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఓటు వేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి సాధారణ కార్యకర్తగా పనిచేసిన పసునూరి దయాకర్ ప్రస్తుతం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. గత రెండు ఎన్నికల్లో వర్ధన్నపేట నియోజకవర్గానికి ఇన్‌చార్జిగా పనిచేశారు. వరంగల్ జిల్లా సంగెం మండలం బొల్లికుంట గ్రామానికి చెందిన పేద దళిత కుటుంబంలో జన్మించిన దయాకర్ 2001లోనే టీఆర్‌ఎస్‌లో చేరారు.

కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ తెలంగాణ తల్లి విగ్రహాలను ఊరూరా ప్రతిష్ఠించటంలో ప్రముఖపాత్ర వహించారు. దయాకర్ అభ్యర్థిత్వానికి జిల్లా శ్రేణుల మద్దతుకూడా లభించింది. అందరి అభిప్రాయాలూ పరిగణనలోకి తీసుకున్నాకే అభ్యర్థి విషయంలో అంతిమ నిర్ణయం తీసుకున్న సీఎం, దయాకర్‌ను గెలిపించుకోవాలని ఆ జిల్లా ముఖ్యనేతలకు సూచించారు. కాగా ఓరుగల్లు పోరుకు ముందుగా అభ్యర్థిని ప్రకటించి టీఆర్‌ఎస్ ఎన్నికల శంఖారావం పూరించింది. ఇప్పటికే ఏడుగురు మంత్రులకు ఏడు నియోజకవర్గాల ప్రచార బాధ్యతలను కూడా అప్పగించిన సంగతి తెలిసిందే. ఇక ప్రతిపక్ష శిబిరం గందరగోళంలో ఉంది. టీడీపీ-బీజేపీల్లో ఏ పార్టీ అభ్యర్థి నిలబడాలో తేలని స్థితి ఉండగా, కాంగ్రెస్ తన అభ్యర్థి ఎవరో తేల్చుకోలేకపోతున్నది.

గుడిమళ్లకు సముచితస్థానమిస్తా.. ఇదిలా ఉంటే వరంగల్ స్థానంలో పార్టీ అభ్యర్థిత్వానికి మొదట్లో గుడిమళ్ల రవికుమార్ పేరు ప్రముఖంగా వినిపించింది. గురువారం పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో కూడా ఆయన పేరు వినిపించింది. దాదాపుగా ఆయన పేరు ఖాయమైనట్టుగానే ప్రచారం జరిగింది. అయితే సామాజిక సమీకరణాలు, స్థానిక సమీకరణాల కారణంగా రవికుమార్ స్థానంలో పసునూరి దయాకర్ పేరు తెరపైకి వచ్చింది. అభ్యర్థిని అధికారికంగా ప్రకటించటానికి ముందు సీఎం జిల్లా నాయకులు, పార్టీ ముఖ్యులతో మరోసారి సమావేశమై విపులంగా చర్చించారు. చివరకు దయాకర్ పేరు ఖరారు చేశారు. రవికుమార్ ఎలాంటి నిరాశకు గురికావాల్సిన అవసరం లేదని, పార్టీపరంగా-ప్రభుత్వపరంగా ప్రముఖపాత్ర కల్పిస్తాననీ, ఏదైనా మంచి పోస్టు ఇస్తాననీ సీఎం ఆయనకు భరోసా ఇచ్చారు.

కార్యకర్తకు దక్కిన ఆదరణ ఆవిర్భావం నుంచి పనిచేసిన వారికే ఉప ఎన్నికలో అవకాశం ఇస్తామని ఇచ్చిన హామీని కేసీఆర్ నెరవేర్చారు. 2001నుంచే పార్టీ వెంట నడిచిన పసునూరికి వరంగల్ అవకాశం ఇచ్చారు. కళల పట్ల చిన్నప్పటి నుంచి అభిరుచిని పెంచుకున్న దయాకర్ హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూలో బీఏ ఫైన్ ఆర్ట్స్ చేశారు. పార్టీ అధినేత కేసీఆర్ తెలుగుతల్లితో తెలంగాణకు ఏం సంబంధం అని నినదించిన సమయంలో తెలంగాణ తల్లి విగ్రహాలను ఊరూరా ప్రతిష్టించే పనికి శ్రీకారం చుట్టారు. దాదాపు వెయ్యిదాకా తెలంగాణ తల్లి విగ్రహాలను ఆయన స్వయంగా తయారుచేశారు.

ఒక్కో విగ్రహానికి కనీసం రూ.30 వేలు ఖర్చు అయినా అధినేత ఆదేశాలతో అడిగిన వారికి లేదనకుండా నిర్ణయించిన ధరలో వ్యత్యాసం ఉన్నా సరే వాటిని అందించి అందరి అభిమానాన్ని చూరగొన్నారు. సాధారణ కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి జిల్లా, రాష్ట్ర స్థాయికి ఎదిగారు. పార్టీ యుజవన విభాగం జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి జిల్లాలో యువకుల్ని పార్టీలోకి ఆకర్షించారు. పార్టీ వర్దన్నపేట నియోజకర్గ ఇన్‌చార్జిగా రెండు పర్యాయాలు పనిచేశారు.

2009లో ఉద్యమ అవసరాల రీత్యా మాజీ మంత్రి జీ విజయరామారావుకు, 2014లో ప్రస్తుత ఎమ్మెల్యే అరూరి రమేశ్‌కు టిక్కెట్ ఇచ్చినా అధినేత నిర్ణయాన్ని శిరసావహించి వారి గెలుపునకు కృషి చేశారు. ఇతర పార్టీలు రెచ్చగొట్టేందుకు యత్నించినా పార్టీకి ద్రోహం చేయనని స్పష్టం చేశారు. ఇన్నాళ్లకు ఆయనకు అధినేత సముచిత స్థానం ఇచ్చి మాట నిలబెట్టుకున్నారని పార్టీశ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. దయాకర్ అభ్యర్థిత్వం పార్టీ ఆవిర్భావంనుంచి పనిచేసిన వారికి సానుకూల సంకేతాలు పంపిందని అంటున్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.