Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే..తెలంగాణ బంగారు తునకే

– నిజాం షుగర్స్ వాపస్ తీసుకుంటాం – సింగూరు నీళ్లను చెరనుంచి విడిపిస్తాం – కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తాం – లక్ష లోపు పంటరుణాలన్నీ మాఫీ – మూడు లక్షలతో సొంతిల్లు కట్టిస్తా.. – మేలిమి ముత్యం మోతె గ్రామం – మళ్లీ దీవించండి.. సర్కారు ఏర్పాటుచేస్తా – మోతె గ్రామంలో ముడుపువిప్పుతూ కేసీఆర్

Kcr 29-Mar-14

టీఆర్‌ఎస్‌ను అధికారంలోకి తేవడం ద్వారా తెలంగాణను బంగారు తునకగా తీర్చిదిద్దుకోగలుగుతామని ఆ పార్టీ అధినేత కే చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వంతోనే కోటి ఎకరాలకు సాగునీరు, పేదలకు అన్ని హంగులతో కూడిన సొంతిళ్లు, ఉచిత నిర్బంధ విద్య, లక్ష రూపాయలలోపు పంట రుణాల మాఫీ సాధ్యమవుతుందని కేసీఆర్ స్పష్టం చేశారు.

తెలంగాణ సాధన కోసం ఊరంతా ఒక్కటై టీఆర్‌ఎస్‌కు బాసటగా నిలిచిన నేపథ్యంలో 2001లో నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం మోతె గ్రామంలోని మట్టిని ముడుపుకట్టుకొని తీసుకెళ్లిన కేసీఆర్ ఆ మట్టిమూటను హెలికాప్టర్‌లో శుక్రవారం మోసుకొచ్చారు. వేద పండితుడి మంత్రోచ్ఛారణ మధ్య గ్రామ చావిడి వద్ద ముడుపు మట్టిని మోతె మట్టిలో కలిపారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తేనే తెలంగాణ ప్రజల బతుకులు మారుతాయని తేల్చి చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడితే ఒనగూరే ప్రయోజనాలపై ఆయన మాటల్లోనే… తెలంగాణ కోసం 2001 ఏప్రిల్ 21న టీఆర్‌ఎస్ పెట్టిన. అప్పుడు ఒక్కోన్నే బయల్దేరిన. ఒంటరోన్నేనని ఎగతాలిచేసిండ్రు. పార్టీ పెట్టిన 15 రోజులకే మోతె అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములు ఒక్కటై నిలిచిండ్రు. ఊరూరంతా తెలంగాణ కోసం ఆంధ్ర పార్టీలను ఊర్లకు రానియ్యలేదు. ఆ సన్నివేశం నాకు కొండంత అండనిచ్చింది. మే 4న మేలిమి ముత్యం మోతె ప్రజలను కలుసుకునెతందుకు మీ దగ్గరికి వచ్చిన. అప్పుడు మోతె జ్వలితజ్వాలగా వెలిగింది. నా గుండెల నిండా ధైర్యం పెరిగింది. అప్పటి స్థానిక ఎన్నికల్లో మోతె తెలంగాణకు తొవ్వచూపింది.

మోతె మట్టిని ముడుపుగట్టి ఇంటికి తీసుకపోయిన. అప్పుడు ప్రత్యర్థి రాజకీయ పార్టీలు బలంగా ఉండే. తికమక చేసుడు మొదలుపెట్టినై. బక్కాయనతో ఏమైతదని ఎగతాలి చేసినై. మోతె మట్టి మూటను చూసి ధైర్యం తెచ్చుకున్న. బలం పెంచుకున్న. రాజకీయ అవరోధాలు వచ్చినప్పుడల్లా మోతె మట్టిని చూసి వజ్రం తునకగా భావించిన. మోతె మట్టి సాక్షిగా ముందుకు సాగిన. అప్పుడు అనేకమంది నాతో వచ్చి చేరిండ్రు. అప్పుడే చెప్పిన. మోతె మట్టిని తెలంగాణ అంతటా బావుల్లో కలిపిరావాలన్న. అంత బలముంది ఈ మట్టిలో. బతుకున్నంతకాలం ఇది నా గ్రామం. కేసీఆర్ ఊరిది. ఉద్యమాన్ని గుండెలకు అద్దుకున్న మోతె ఇది. మోతె మట్టినిచ్చి, నెత్తిన తిలకం దిద్ది తెలంగాణ కోసం ముందుకు సాగమని ఆశీర్వదించి పంపింది మీరు. తెలంగాణ తెచ్చి వచ్చిన ఈడికి. మళ్లీ నన్ను ఆశీర్వదించి పంపుండ్రి. తెలంగాణ ప్రభుత్వం తీసుకొని మళ్లీ మీ దగ్గరికొస్తా. అందరితో కలిసి మాట్లాడతా. మీతోనే రోజంతా గడుపుతా. మన సర్కార్ వస్తే గౌరవంగా బతుకుతం.

Kcr(1) 29-Mar-14

మొన్నటి వరకు పేదలకు ఒకరూం ఇచ్చి ఇదే వైకుంఠమన్నరు. ఇదే కైలాసమన్నరు. బలహీన వర్గాల గృహమని మురిసిపొమ్మన్నరు. ఈడుకొచ్చిన ఆడబిడ్డ తానం చేసొస్తే సింగిల్ రూంలో ఎట్ల సర్దుకుంటరు? గొర్రెలు, బర్రెలు యాడ కట్టేస్తరు? పండుకున్న పిల్లల మొఖాలమీద మూత్రం పోసినా పట్టించుకోలేదు. మనమే అధికారంలోకి వస్తే పూర్తి సబ్సిడీతో 3లక్షలు ఖర్చుపెట్టి రెండు బెడ్‌రూమ్‌లు, బాత్‌రూమ్, లావెట్రీతో కూడిన మంచి ఇంటిని 125 గజాల్లో కట్టిస్తం. ఫస్ట్ కాలనీ మోతెలోనే కట్టిస్తా. ఎన్ని వేలమందికైనా ఎనకకొచ్చేదిలేదు. కాలనీ ఇనాగరేషన్‌కు నేనే వస్తా. మోతె కేసీఆర్ గుండెల్లో ఉంది. గోదావరి నీళ్లతో పొలాలు తడుపమంటున్నరు. గోదారేకాదు ఏదిపడితే అది మోతెకు నడుచుకుంట వస్తది. గుత్ప నీళ్లను ఊరికి మళ్లిస్తా. సస్యశ్యామలం చేస్తా. మోతెలోనే పసుపు పరిశోధన కేంద్రాన్ని పెట్టిస్తా. కలెక్టరే రాసిచ్చిన కాగితానికి దిక్కులేదు. ఎర్రజొన్న రైతులకు 11కోట్ల రూపాయల బాకీలు ఇయ్యమంటే ఇస్తలేరు. అధికారంలోకి ఎవరొచ్చినా ముక్కుపిండి బకాయిలు కట్టిస్తా. మోతెను అద్భుతంగా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా. మోతెకు ఏమిచ్చినా తక్కువే.

నా చర్మం వొలిచి చెప్పులు కుట్టిచ్చినా తక్కువే. 14 ఏళ్ల కిందట తెలంగాణ మోత మోగించింది మోతె. నాలో ధైర్యాన్ని నింపి పంపిన గడ్డ ఇదీ. మీరిచ్చిన ధైర్యంతోనే కొట్లాడి, ఢిల్లీని ఒప్పించి తెలంగాణ ఇవ్వకతప్పని పరిస్థితిని తెచ్చిన. మనం అధికారంలోకి వస్తే ఆర్మూర్ ప్రాంతంతో పాటు అన్ని నియోజకవర్గాల్లో లక్ష ఎకరాల చొప్పున సాగులోకి తెస్తా. కోటి ఎకరాలకు సాగునీరు ఇప్పిస్తా. వంద సంవత్సరాల కిందట ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు నిజాంసాగర్. అప్పుడు దాన్నిమించిన ప్రాజెక్టేలేదు. 3లక్షల ఎకరాలకు నీళ్లు అందేవి. దానిపైన సింగూర్ కట్టి నిజాంసాగర్‌కు ఇవ్వాల్సిన నీటిని హైదరాబాద్‌కు హక్కుబుక్తం చేసిండ్రు. సింగూర్ నీటిని చెరవిడిపించాలి. ఆ నీళ్లంటినీ నిజామాబాద్‌కు మలపాలి. పాత ఆయకట్టుకంతా మళ్లా నీళ్లు పారాలే. గుత్ప సామర్థ్యాన్ని పెంచి అదనపు ఆయకట్టుకు నీళ్లు ఇప్పించుకుందాం. టీఆర్‌ఎస్‌తోనే ఉచిత నిర్బంధ విద్య అమలవుతుంది. ప్రతీ మండలంలో జనాభా లెక్కన ఐదారు ఆదర్శ ఆశ్రమ పాఠశాలలను ఏర్పాటు చేస్తా. 10-15 ఎకరాల్లో ప్లేగ్రౌండ్స్, స్విమ్మింగ్‌ఫూల్స్, అవసరమైన భవన సముదాయాలను నిర్మింపజేస్తా. ఇప్పుడున్నట్లు ఒక్కో డార్మెట్‌లో 50 మంది ఉండటానికి వీల్లేదు. ఒక్కో రూమ్‌లో నలుగురు విద్యార్థులే ఉంటరు. వాళ్లకు అటాచ్డ్ బాత్‌రూమ్ ఉంటది. సీబీఎస్‌ఈ సిలబస్ ఉంటది. ఎమ్మెల్యేలు, మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీల పిల్లలు కూడా ఇదే స్కూళ్లలో చదివే పరిస్థితి వస్తది. ఒక్కో ఆశ్రమ పాఠశాలలో 600 నుంచి వెయ్యి మంది ఉండెటందుకు మంచి వసతులు ఏర్పాటు చేస్తా. తెలంగాణ రాష్ట్రంలో మొదటి ఆశ్రమ పాఠశాలను కూడా మోతెలోనే మొదలుపెట్టిస్తా. రైతులు, పేదలు, సాధారణ ప్రజలు పిల్లల చదవుల పట్ల రంది పడకుండా చూస్తా. పిల్లల చదువు బాధ్యత సర్కారే చూసుకుంటది. లక్షదాకా రుణమాఫీ చేపిస్తా. దీనికి ఏడాదికి 12వేల కోట్ల రూపాయలు ఖర్చు అయితయి. మన రాష్ట్రం బడ్జెట్‌లో అది పెద్దదేమికాదు. ఆసియా ఖండంలోనే అద్భుతంగా నిజాంషుగర్ ఫ్యాక్టరీని కట్టిండ్రు. చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఫ్యాక్టరీకి ఉన్న 17వేల ఎకరాల భూములను పప్పు ఫలహారాల కింద పంచిపెట్టింది. మన సర్కార్ మళ్లా ఆ ఫ్యాక్టరీని వాపస్ తీసుకుంటది. ఎన్‌ఎస్‌ఎఫ్‌కు గౌరవం పెంచుతది.

KCR(02) 29-Mar-14

నిజామాబాద్‌లో చెరకు పరిశోధన కేంద్రం పెట్టిస్తా. చెరకు సాగును, దిగుబడిని పెంచిపిస్తా. ప్రతి ఎకరాల్లో వంద టన్నుల దిగుబడి సాధించే విధంగా ప్రోత్సాహం అందిస్తా. టీఆర్‌ఎస్ గెలిస్తేనే ఈ పనులన్నీ అయితయి. గాడిదకు గడ్డేసి ఆవులకు పిండితే పాలస్తయా? 14 ఏళ్ల నుంచి తెలంగాణ కోసం రాత్రింబవళ్లు కొట్లాడిన. నేను బతికుండగానే, నా కళ్లముందే తెలంగాణ పిల్లలకు కొలువులు కాకపోతే ఏం లాభమని 14 ఎఫ్ రద్దు కోసం కొట్లాడిన. ఆమరణ దీక్షకు దిగిన. 11 రోజులకు నా పానం దెబ్బతిన్నది. దీక్ష విరమించుకోకుంటే కోమాలోకి పోతవని డాక్టర్లు చెప్పిండ్రు. అయినా భయపడలేదు. సచ్చినా సరే తెలంగాణ సాధించాలనే పట్టుదలతో దీక్ష చేపట్టిన. సావునోట్లో నేను తలపెట్టినప్పుడు వాళ్లు మంత్రి పదవుల్లో కులుకుతున్నరు. తెలంగాణ సమాజమంతా ఒక్కటై దీక్షకు మద్దతుగా నిలిచింది. కేంద్రం దిగొచ్చింది. తెలంగాణ ఇస్తమని మాటిచ్చింది. తెలంగాణ కోసం ఒకటా రెండా ఎన్ని చేస్తే ఫలితం సాధించినం! రాకాసులతో కొట్లాడిన. ఈ గోకాసురులు లెక్కనా! టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే అద్భుతాలు సాధించగలుగుతాం. జిల్లా నుంచి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకుంటం. నిజామాబాద్ అంతా ప్రతి అంగుళం పోచారానికి తెలుసు. నిజామాబాద్‌కు ఏం చేయాల్నో అది చేస్తాం. రాష్ట్రం వచ్చిందని సంతోషపడి, సంబురాలు చేసుకుంటేనే సరిపోదు. కొత్తరాష్ట్రం, కొత్త నాయకత్వం, కొత్త పంథా అనే స్లోగన్‌తో ముందుకు సాగుదాం. అప్పుడే తెలంగాణను బంగారు తునకగా తీర్చిదిద్దుకోగలుగుతాం. కేరళ నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లిన వాళ్లను అక్కడి ప్రభుత్వాలు ఆదుకుంటున్నయ్. ఇక్కడ మాత్రం కనీస శవాన్ని కూడా తెచ్చి ఇచ్చే దిక్కులేకుండాపోయింది. మన పొలాలకు నీళ్లులేకనే గల్ఫ్ గోసలు. గల్ఫ్ బాధితులను గుండెలో పెట్టుకొని ఆదుకుంటాం. 14 ఏళ్ల కిందట దీవించి పంపినట్లు దీవించుండ్రి. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆశీర్వదించండి. మోతె కోసం ప్రత్యేకంగా పీఏను ఏర్పాటు చేస్తా. అర్ధరాత్రి అపరాత్రి వచ్చినా మోతె ప్రజలకు నా ఇంట్లో చోటుంటది. మీకు నేనే కాపలాదారునిగా ఉంటా అని కేసీఆర్ ఉద్వేగభరితంగా ప్రసంగించారు. ఈ సభలో ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి, హన్మంత్‌షిండే, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు వేముల సురేందర్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి కరిమెళ్ల బాపురావు, బాల్కొండ నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రశాంత్‌రెడ్డి, నిజామాబాద్ పార్లమెంట్ పార్టీ ఇన్‌చార్జి బిగాల గణేష్‌గుప్త, పార్టీ నేతలు ఏఎస్ పోశెట్టి, కొత్తూరు లకా్ష్మరెడ్డి, జీవన్‌రెడ్డి, బస్వా లక్ష్మినర్సయ్య, ప్రకాశ్‌గౌడ్, మోతె రాజేందర్‌రెడ్డి, మార గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

హెలికాప్టర్‌లో మోతెకు నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మోతె గ్రామానికి కేసీఆర్ శుక్రవారం హెలికాప్టర్‌లో బయలుదేరి వెళ్ళారు. ఎన్నికల ప్రచార నిమ్తితం తెప్పించిన హెలికాప్టర్ గురువారం సాయంత్రం ఎర్రవల్లి ఫాంహౌస్‌కు రాగా, శుక్రవారం ఉదయం హెలికాప్టర్‌తో పలుసార్లు ట్రయల్స్ నిర్వహించారు. మధ్యాహ్నం మోతె గ్రామంలో ముడుపు విప్పడానికి హెలికాప్టర్‌లో కేసీఆర్ బయలుదేరారు. తాను మోతె గ్రామంలో ముడుపు విప్పడానికి వెళ్తున్నానని విలేకరులకు చెప్తూ హెలికాప్టర్ ఎక్కారు. ఆయన వెంట రాజకీయ కార్యదర్శి శెరి సుభాష్‌రెడ్డి ఉన్నారు.

మోతె స్ఫూర్తికి గులాబీ బాస్ సలాం మహోన్నత లక్ష్యానికి, అపారమైన ఆలోచనకు ఓ సాధారణ ప్రాంతంలోనే బీజం పడింది. అంతగా లోకంపోకడ తెలియని ఆ గ్రామం ఓ అసాధారణమైన నిర్ణయాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. తెలంగాణ సమాజం ఆశ్చర్యపోయేలా ఐక్యత రాగంతో గులాబీ జెండాతో సింగారించుకున్న ఆ గ్రామం మోతె. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలోని మోతె గ్రామం తెలంగాణ ఉద్యమానికి వేదికైంది. స్ఫూర్తిగా నిలిచింది. అప్పుడే ఆవిర్భవించిన టీఆర్‌ఎస్‌కు మోతె అండదండగా నిలిచింది. అప్పుడే రాబోతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్‌లలో అన్ని స్థానాలను ఏకగ్రీవంగా ఎన్నుకొని గ్రామ కమిటీ టీఆర్‌ఎస్ పక్షాన నిలిచింది. ఇది ఓ చరిత్ర. ఆ స్ఫూర్తితో గులాబీ దళపతి 2001, మే 4న మోతె గ్రామానికి వచ్చారు. కొద్ది రోజుల క్రితమే పురుడు పోసుకున్న ఆ పార్టీకి గ్రామ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఎడ్లబండ్లపై ఎదురెళ్లి స్వాగతం పలికి.. గ్రామ నడిబొడ్డున సమావేశాన్ని పెట్టారు. మేమున్నాం.. మీతోనే నడుస్తాం.. రాష్ట్రం సాధించే వరకు గ్రామం మీ వెంటే ఉంటుంది అన్న భరోసా ఇచ్చింది మోతె. ఆ గ్రామ కమిటీ చూపిన తెగువ కేసీఆర్‌కు ఎంతో బలాన్నిచ్చింది. ఆ గ్రామ ప్రజల తెలంగాణ వాంఛను ప్రత్యక్షంగా చూసిన కేసీఆర్ చలించిపోయారు. మోతె గ్రామ నడిబొడ్డులోని మట్టిని చేతబట్టి గ్రామస్తుల సాక్షిగా ప్రమాణం చేశారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన గడ్డ మోతె. ఏకగ్రీవంగా టీఆర్‌ఎస్‌కు మద్దతుపలికి ప్రజాప్రతినిధులను ఇచ్చి అక్కున చేర్చుకున్న మోతె రుణం తీర్చుకోలేనిది. మీరిచ్చిన స్ఫూర్తితో ఈ మట్టిని చేతబట్టి చెబుతున్న. మూటగట్టి తీసుకొస్తాను. తెలంగాణ రాష్ట్రంలోనే మళ్లీ మోతె గ్రామానికి వచ్చి మట్టి మూటను విప్పి ఇచ్చిన మాటను నిలుపుకుంటాను. ఎందరో దుష్ట శక్తులు అడ్డుపడ్డ ఈ మట్టిని చూసి ధైర్యం తెచ్చుకుంటా. తెలంగాణ సాధనకు మీరిచ్చిన మనోధైర్యంతో వెళ్తున్న అంటూ ఆనాడు మోతె గడ్డపై చెప్పిన మాటల్ని నిజం చేసిన కేసీఆర్ శుక్రవారం 28న మూటగట్టిన మోతె మట్టి మూటను విప్పారు.

 

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.