Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ మేధో మథనం

తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సాకారం చేయడం కోసం నడుం కట్టారు. అప్పటికి శాసనసభ్యుడిగా, డిప్యూటీ స్పీకర్‌గా కొనసాగుతున్న కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 2001 ఏప్రిల్‌ 27న డిప్యూటీ స్పీకర్‌ పదవికి, శాసన సభ సభ్యత్వానికీ, టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయటమే కాకుండా.. జలదృశ్యం వేదికగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటును ప్రకటించారు.

ఇది ఆనాడొక సాదా సీదా సంఘటన. నేడది అపురూపమైన చారిత్రక ఘట్టం. టీఆర్‌ఎస్‌ ఏర్పాటు నిర్ణయం హడావిడిగా జరిగింది కాదు. ఏడాది పాటు లోతైన చర్చలు, సాధ్యాసాధ్యాలు, సంపూర్ణ అధ్యయనం తర్వాత ఒక చారిత్రక అవసరంగా పార్టీని స్థాపించారు. మొక్కవోని ఆత్మవిశ్వాసంతో త్యాగాలకు, సుదీర్ఘ ఉద్యమానికి సన్నద్ధమై వ్యూహాత్మక రాజకీయ నైపుణ్యంతో రాష్ట్ర సాధన కోసం టీఆర్‌ఎస్‌ను కేసీఆర్‌ స్థాపించారు.

ఈ గడ్డపై తెలంగాణ బిడ్డలు రెండవ శ్రేణి పౌరులుగా అన్నివిధాలా అవమానాలను భరిస్తూ బతుకాల్సి వచ్చేది. తెలంగాణ యాస పట్ల వెటకారం, ఆహారపుటలవాట్లు, సంస్కృతి, సంప్రదాయాలు, కట్టుబాట్ల పట్ల చిన్న చూపు లాంటి అంతులేని వివక్ష. తెలంగాణ వైతాళికుల పట్ల అగౌరవం వెరసి తెలంగాణ ప్రజలు ‘తెలంగాణ వాళ్ళం’ అని చెప్పుకోలేని నిస్సహాయ స్థితి. నల్లగొండ జిల్లా ప్రజలను ఫ్లోరైడ్‌ కాటేస్తున్నా, మహబూబ్‌నగర్‌ జన జీవితం వలసలతో ఛిద్రమౌతున్నా, ఆదిలాబాద్‌ అంటురోగాలకు బలై పోతున్నా పట్టించుకునేవారు లేరు. తెలంగాణ అంటే సాగునీరు, తాగు నీటికి గోస. ఎప్పుడుంటదో, పోతదో తెలియని కరెంటు, బడులు లేని గోస, అధ్వాన్నమైన రోడ్లతో గోస, కనీస సౌకర్యాలు లేని దవాఖానలతో గోస వెరసి తెలంగాణ బతుకే అరిగోస అయ్యింది. తెలంగాణ బతుకు బొంబాయి, దుబాయి, బొగ్గుబాయిల పాలయ్యింది. అప్పుల భారంతో తెలంగాణ రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే లక్ష రూపాయల పరిహారం కోసమేననే పరిహాసం.. నాటి పాలకులది!

పార్టీలు ఏవైనా అధికారం సీమాంధ్రుల గుప్పిట్లోనే. ప్రభుత్వ ఖజానా నింపడంలో సింహభాగం తెలంగాణ నుంచైనా వడ్డింపులన్నీ ఆంధ్ర ప్రాంతానికే. తెలంగాణకు మాత్రం విదిల్చేది ఎంగిలి మెతుకులు. అవినీతి, అక్రమం, అణచివేత, అవహేళన, అన్యాయం, అవమానం, దోపిడీలతో తెలంగాణను పీల్చి పిప్పిచేసి, తెలంగాణ అస్థిత్వాన్ని ప్రశ్నార్థకం చేసి సర్వనాశనం చేయడమే ఆంధ్రా పాలకుల లక్ష్యం. ఈ విషయాలన్నింటినీ సింహావలోకనం చేసుకున్న కేసీఆర్‌, చంద్రబాబు దుర్మార్గపు పాలనలో పార్టీ కంటే, పదవి కంటే ప్రజా శ్రేయస్సే ముఖ్యమని తలచారు. తెలంగాణ దుస్థితిని రూపుమాపి తెలంగాణ బతుకు చిత్రాన్ని మార్చడమే తెలంగాణ ఉద్యమ అంతిమ లక్ష్యమని, అందుకు పరిష్కారం పార్టీ స్థాపనే సరైనదనే నిర్ణయానికి వచ్చారు.

మన ప్రాంతానికి జరుగుతున్న అన్యాయం నుంచి న్యాయం కోసం సాగే ఉద్యమంలో ఏ ప్రాంతానికి, ఇతర ప్రాంత వ్యక్తులకు నష్టం, కష్టం కలిగించినా అది సహేతుకం కాదన్నారు. ప్రజల మధ్య విద్వేషాలు పెంచే ఉద్యమానికి తాను సారథ్యం వహించబోనని ప్రకటించారు. గాంధీజీ ప్రబోధించిన శాంతియుత, దీర్ఘకాలిక ఉద్యమమే తన పంథా అని చెప్పిన మానవతావాది కేసీఆర్‌. గతంలో తెలంగాణ ఉద్యమాన్ని భుజాలకు ఎత్తుకొని, ఆదరించి ఓట్ల వర్షం కురిపించిన ప్రజలు నిజాయితీతో, పట్టుదలతో ఉద్యమాన్ని కొనసాగిస్తే వారిలో మళ్ళీ విశ్వాసం కలిగించవచ్చని కేసీఆర్‌ భావించారు. ఆ విశ్వాసంతో ఎన్నికల్లో కొన్ని లోక్‌సభ స్థానాలు గెలుచుకొని పార్లమెంట్‌ లోపల, పార్లమెంట్‌ వెలుపల ఢిల్లీ కేంద్రంగా తెలంగాణకు జరిగిన, జరుగుతున్న అన్యాయాలను, అవమానాలను అన్ని పార్టీలకు వివరించడం ద్వారా ఆయా పార్టీల సానుభూతిని, మద్దతును కూడగట్టారు. తద్వారా సంకీర్ణ ప్రభుత్వాలను ప్రభావితం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకోవచ్చనే నమ్మకం కేసీఆర్‌కు కుదిరింది.

టీఆర్‌ఎస్‌ పార్టీ వల్లే ఢిల్లీలో తెలంగాణకు సముచిత గుర్తింపు, గౌరవం దక్కింది. గడిచిన 40 ఏండ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో రెండు పార్టీలు (టీడీపీ, టీఆర్‌ఎస్‌) స్థాపించబడి అధికారాలు చేపట్టాయి. ఈ పార్టీలు స్థాపించబడిననాడు ఒకేరకమైన పరిస్థితులు లేవు. భిన్న పరిస్థితుల్లో ఈ పార్టీలు స్థాపించబడ్డాయి. ఎన్టీఆర్‌ టీడీపీ స్థాపించే నాటికి పూర్తి సానుకూల పరిస్థితులుండగా, కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ స్థాపించే నాటికి పరిస్థితులన్నీ ప్రతికూలం.

సీఎం పదవి రెండవసారి చేపట్టిన చంద్రబాబు ఢిల్లీలో చక్రం తిప్పుతూ ఎదురులేని విధంగా ఒకవైపుండగా, 1999 ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిస్తే తానే ముఖ్యమంత్రినని నమ్మిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరొక వైపు ఉన్నారు. టీడీపీ, కాంగ్రెస్‌ రెండు బలమైన పార్టీలు- రెండు బలమైన సామాజిక వర్గాలకు చెందిన హేమాహేమీలైన పై ఇద్దరు నాయకులు ముందున్నారు. ధన బలం, ప్రసార మాధ్యమాల తోడున్న వారందరు తెలంగాణను తీవ్రంగా వ్యతిరేకించే కాలంలో, తెలంగాణకు అనుకూలంగా ఏ ఒక్క అంశం లేని ప్రతికూల పరిస్థితుల్లో రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీ ఒక సాహసం. కారు చీకటిలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఏర్పాటు ఒక మలుపు. ఈ సాహసోపేతమైన నిర్ణయం కేసీఆర్‌ ఆషామాషీగా చేసింది కాదు. 1985లో శాసనసభ్యుడిగా గెలిచింది మొదలు ఒక కంట తెలంగాణకు జరుగుతున్న అన్యా యం, అవమానాలను సునిశితంగా గమనించారు. సమగ్రమైన సమాచారం, సంపూర్ణ అవగాహనతో, సమయం, సందర్భం కోసం ఎదురుచూస్తున్న వేళ చంద్రబాబు ప్రభుత్వ విద్యుత్‌ ధరల పెంపు నిర్ణయంతో.. కేసీఆర్‌ మనసులో అప్పటికే బలంగా నాటుకున్న తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ బీజం టీఆర్‌ఎస్‌ పార్టీ స్థాపన రూపేణా మొగ్గ తొడిగింది. లోక్‌సభలో ఒక సభ్యుడి సంఖ్య కూడా అత్యంత కీలకంగా మారిన సంకీర్ణ శకం తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటుకు బలమైన ఆలంబనగా నిలిచి వేయి ఏనుగుల బలాన్నిచ్చింది.

ఇదే సమయంలో క్షేత్రస్థాయిలో తెలంగాణ నవతరానికి తెలంగాణ గతంలో ఒక రాష్ట్రంగా కొనసాగిందనే విషయం తెలియదు. తెలంగాణ పెద్దల మనస్సులలో రాష్ట్రం కావాలనే భావన ఉన్నప్పటికీ, తెలంగాణ రాష్ట్రం అసాధ్యం అనే అభిప్రా యం స్థిరపడి ఉంది. కారణం.. తెలంగాణ ఉద్యమ అంశాన్ని గతంలో నాయకులు తమ రాజకీయ ప్రయోజనాలకు దోహదపడే ఉపకరణంగా ఉపయోగించుకున్నారు. అందుకే గత అనుభవాల దృష్ట్యా తెలంగాణ అనడానికి ప్రజలు సిద్ధంగా లేరు. వీటికి తోడు తెలంగాణ అనడమే తీవ్రమైన నేరంగా పరిగణించే ప్రభుత్వ అణచివేత. తెలంగాణ ప్రజలలో బలపడి ఉన్న ఈ విశ్వాసరహిత స్థితిని అధిగమించాలి. ప్రజల్లో నాటుకొని ఉన్న ఈ అభిప్రాయాన్ని చెరిపేసి, ప్రజల్లో విశ్వాసం కల్పించడమే ఉద్యమ గమనానికి సోపానంగా కేసీఆర్‌ తలచారు. శత్రువుల దుష్ప్రచారాన్ని ఎదుర్కొనే దివ్యాస్త్రంగా అప్పటివరకు ఉద్యమం సాగించిన నాయకుల స్వార్థ వైఖరికి భిన్నంగా తనకున్న పదవులకు తృణప్రాయంగా కేసీఆర్‌ రాజీనామాలు ప్రకటించారు. ఈ త్యాగపూరిత చర్యతో ప్రజలను ఆకట్టుకొని, ఆ రాజీనామాలను ఆమోదింపజేసుకొని ప్రజల్లో విశ్వాస బీజాలు నాటారు.

తెలంగాణ ఉద్యమకారులంటే పదవుల ఎరకు లొంగేవారనే భావనతో చంద్రబాబు- టీఆర్‌ఎస్‌ ఏర్పాటు కాకుండా ఉండటానికి చేయని ప్రయత్నం లేదు. పదవి ఎరచూపి కేసీఆర్‌ వ్యక్తిత్వాన్ని మాలిన్యపర్చాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. గతంలో తెలంగాణ ఉద్యమ నాయకుల పదవీ లాలస తెలంగాణ ప్రజల పాలిట శాపంగా మారిందని కేసీఆర్‌కు తెలుసు. ఇలాంటి నేతల బలహీనతలను ఆంధ్ర నాయకత్వం గోరంతను కొండంతలుగా చేసిన దుష్ప్రచారం వల్ల తెలంగాణ ప్రజానీకంలో తెలంగాణ రాజకీయ ఉద్యమకారుల పట్ల అపనమ్మకం ఏర్పడింది. రాష్ట్ర ఏర్పాటు పట్ల విశ్వాసం సన్నగిల్లింది. తనపై కూడా ఇలాంటి ప్రయత్నం, ప్రచారం జరుగుతుందని ముందే ఊహించిన కేసీఆర్‌ ఎలాంటి తప్పునకు అవకాశం ఇవ్వలేదు. భౌతికదాడులకు గురవుతారనే బెదిరింపులను కేసీఆర్‌ ఖాతరు చేయలేదు. అంతేకాకుండా.. ‘సర్‌ పే కఫన్‌ బాంద్‌ కే నిక్లా హూ’ అని గర్జించిన ధీశాలి.

కుట్రలేవీ ఫలించకపోగా, చివరి అతి తెలివి ప్రయత్నం పెట్టబోయే పార్టీ ఆఫీసుకు భవనం ఎవరూ అద్దెకు ఇవ్వకుండా చంద్రబాబు అడుగడుగునా ఇబ్బందులు సృష్టించాడు. హిమాయత్‌నగర్‌, నారాయణగూడ, అశోక్‌నగర్‌, బర్కత్‌పురా, ఖైరతాబాద్‌, బషీర్‌బాగ్‌, లక్డీకాపూల్‌, హైదరాబాద్‌ నడిగడ్డ మీద తెలంగాణ బిడ్డలకు అడ్డా దొరకకుండా ఇంటి యజమానులను బెదిరించే నీచానికి పూనుకున్నాడు. ఇలాంటి సంక్లిష్ట స్థితిలో తెలంగాణ తొలి తరం ఉద్యమ నాయకుడు, కురువృద్ధులు కొండా లక్ష్మణ్‌ బాపూజీ అండతో కార్యాలయాన్ని జలదృశ్యంలో ఏర్పాటు చేసుకోవడానికి ఆశీర్వదించి, సహకరించారు.

తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమానికి కేసీఆర్‌ పట్టుదలతో, పకడ్బందీ ఏర్పాట్లతో ముందుకు సాగుతున్నాడని తెలుసుకున్న భిన్న భావజాలాలు కలిగిన పెద్దలు, 1969 ఉద్యమకారులు, 2000వ సంవత్సరం నాటి తెలంగాణ వాదులు, మేధావులు, విద్యావంతులు, యువకులు, కవులు, కళాకారులు కేసీఆర్‌ వైపు చూశారు. వీరిలో కొందరు కేసీఆర్‌ ఆహ్వానం మేరకు, మరికొందరు వారంతట వారుగా వచ్చి చర్చలలో భాగస్వాములయ్యారు. కొందరు కేసీఆర్‌ చేపట్టబోయే ఉద్యమ పంథాతో ఏకీభవించారు, మరికొందరు విభేదించారు. ఉద్యమం హింసాయుతంగా మాత్రమే శీఘ్రగతిన ఎక్కువ మందిని ఆకర్షించగలదని తద్వారా తెలంగాణ రాష్ట్రం త్వరితగతిన సాకారం అవుతుందన్న వాదనలను కేసీఆర్‌ కరాఖండిగా ఖండించారు. ప్రజలను చైతన్యపర్చుకుంటూ, సమీకరించుకుంటూ, కుట్రలు, కుతంత్రాలను ఎదుర్కొంటూ, పార్టీని రక్షించుకుంటూ, పార్టీని ఎన్నికల్లో గెలిపించుకుంటూ ముందుకు సాగాలని అన్నారు. అధికార పదవులను చేపడుతూ, పదవులను కూడా ఉద్యమ వ్యాప్తికి ఉపయోగించుకోవాలన్నారు. పార్లమెంట్‌లో తెలంగాణ వాదాన్ని బలంగా వినిపిస్తూ, ఇతర పార్టీల మద్దతు కూడగట్టి, కూటమి ప్రభుత్వాలను ప్రభావితం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకోవాలన్నారు. అందుకే తక్షణ ప్రతిఫలాన్ని ఆశించే కొందరు నాయకులు కేసీఆర్‌ విధానంతో పనిచేయలేమని, మరికొందరు ఒడిదుడుకులు ఎదురైనప్పుడు నిష్క్రమించారు.

టీఆర్‌ఎస్‌ ఏర్పడేనాటికి ఉద్యమ కార్యాచరణలో భాగస్వాములు కావాలనుకుంటున్న వారితో చర్చల సందర్భంగా సహచరులు లేవనెత్తే అనుమానాలను కేసీఆర్‌ నివృత్తి చేసేవారు. ప్రతి రోజు అనేక గంటలపాటు, రోజుల తరబడి, పండితులైనా , పామరులైనా, ఇద్దరైనా, చాలా మందైనా, రేయింబవళ్లు ఓపికతో చర్చించేవారు. తన విషయ పరిజ్ఞానంతో ప్రతి ఒక్కరికి సంతృప్తి కలిగించి, విశ్వాసం పాదుకొలిపి వచ్చిన వారిలో అత్యధికులను ఉద్యమ కార్యోన్ముఖులను చేసిన దిట్ట కేసీఆర్‌. తెలంగాణ ప్రజలను ఒక శక్తిగా మలిచి రాజకీయ నైపుణ్యంతో తెలంగాణ సాధించాలని భావించిన కేసీఆర్‌, అధికారం కోసం దేనికైనా సిద్ధపడే కాంగ్రెస్‌, టీడీపీలు తన ఉచ్చులో చిక్కే వ్యూహాన్ని టీఆర్‌ఎస్‌ స్థాపన కంటే ముందే రచించారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ఓట్లు.. గెలుపు-ఓటములు నిర్ణయించే శక్తిగా ఎదగడం ద్వారా అనివార్యంగా రాజకీయ అధికారం కోసం టీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్‌, టీడీపీలు పొత్తుకు సిద్ధమవుతాయి. తాను విధించే షరతులకు ఒప్పుకొని విజయం సాధించాక, షరతులకు కట్టుబడి తెలంగాణ రాష్ట్రం సాకారం అయితే కథ సుఖాంతం.

అందుకు భిన్నంగా వ్యవహరించే వారికి ద్రోహిగా ముద్ర! ఈ విధమైన ద్రోహం 2004 ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌, 2009 ఎన్నికలలో టీడీపీ చేసింది. ఇలా కాంగ్రెస్‌, టీడీపీలు చేసిన ద్రోహం వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు నిఖార్సయిన ఏకైక పార్టీ టీఆర్‌ఎస్‌ మాత్రమేననే సంపూర్ణ నమ్మకం తెలంగాణ ప్రజల్లో బలంగా నాటుకున్నది. తర్వాత కాలంలో దీన్ని నిజం చేయడంలో కేసీఆర్‌ కనబర్చిన చతురత అనన్య సామాన్యమైనది. (వ్యాసకర్త: శ్రీ సిరికొండ మధుసూదనాచారి, తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక సభ్యులు)

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.