-ఒకేవ్యక్తిగా కేసీఆర్ తెలంగాణ కోసం ఉద్యమించిండు -పదవులను త్యాగంచేసి ప్రజల కోసం జెండా పట్టిండు -స్వరాష్ట్ర సాధన కోసం పోరాడిన మాపైనే నిందలా? -విపక్షాలు నోరు దగ్గర పెట్టుకోవాలి -సిరిసిల్లలో పార్టీ సభ్యత్వ నమోదుకార్యక్రమంలో మంత్రి కేటీఆర్

దశాబ్దాల దోపిడీ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలిగించిన కే చంద్రశేఖర్‌రావు నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీయే రాష్ట్రానికి శ్రీరామరక్ష అని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. నాడు పదవులను తృణప్రాయంగా త్యాగంచేసి ఒకేఒక్కడుగా కేసీఆర్ తెలంగాణ ప్రజల కోసం జెండా చేతపట్టారని చెప్పారు. ఆ సమయంలో ఆయన వద్ద మజిల్ పవర్ లేదు, మనీ పవర్ లేదు, మీడియా పవర్ లేదని.. సంకల్ప బలంతోనే నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని పేర్కొన్నారు. అలాంటి కేసీఆర్‌పై ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రపాలకులకు జీహుజూర్ అంటూ మోకరిల్లిన కాంగ్రెస్, బీజేపీ నేతలు విమర్శలు చేస్తే ఊరుకొనేది లేదని హెచ్చరించారు. తిరగబడాల్సి వస్తే ప్రధాని, కేంద్రమంత్రులనూ వదిలేదిలేదని మండిపడ్డారు. శుక్రవారం సిరిసిల్లలోని పద్మనాయక కల్యాణ మండపంలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నాడు అన్ని పార్టీల నాయకులు, బడా సేట్లు అందరూ తెలంగాణను వద్దన్నవారేనని విమర్శించారు. 2001 ఏప్రిల్ 27న టీఆర్ఎస్ను స్థాపించిన కేసీఆర్.. రాష్ట్రాన్ని సాధించేదాక ఎత్తిన జెండాను దింపితే రాళ్లతో కొట్టి చంపండి అంటూ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. అనేక ప్రతికూల పరిస్థితుల మధ్య, ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ తెలంగాణ కలను సాకారం చేశారని చెప్పారు.
పదవులు శాశ్వతం కాదు పదవులు శాశ్వతం కాదని.. కన్నతల్లి లాంటి టీఆర్ఎస్ను కంటికి రెప్పలా కాపాడుకోవడమే ముఖ్యమని కేటీఆర్ ఉద్బోధించారు. తెలంగాణలోని కోటి కుటుంబాలు మనవేనని.. లక్ష్యానికి మించి పార్టీ సభ్యత్వాలను నమోదు చేయించాలని సూచించారు. సంక్షేమ పథకాలు లబ్ధిపొందుతున్న బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకొనేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను కడుపులో పెట్టుకుని కాపాడుకోవాలని నాయకులకు సూచించారు. సోషల్‌మీడియా లో ప్రచారం అవుతున్న అవాస్తవాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తలకు త్వరలో గుర్తింపుకార్డులు ఇస్తామని.. బీమా సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు. వేములవాడ, సిరిసిల్లను రెండుకండ్లలా అభివృద్ధి చేస్తానన్నారు. మార్చిలో పార్టీ పునర్నినిర్మాణం జరుగుతుందని, ప్రతిఒక్కరూ కష్టపడి సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని.. జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానం లో నిలుపాలని పిలుపునిచ్చారు. 300 మంది యువకులు పార్టీలో చేరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, టీఆర్ఎస్ జిల్లా ఇంచార్జి కర్ర శ్రీహరి, రాష్ట్ర ప్రధానకార్యదర్శి బండి రమేశ్, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, సిరిసిల్ల జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ తదితరులు పాల్గొన్నారు.

టీ కాంగ్రెస్, టీ బీజేపీ కేసీఆర్ భిక్ష కేసీఆర్ రాష్ట్రం సాధించడం వల్లే టీ కాంగ్రెస్, టీ బీజేపీ అధ్యక్ష పదవులు వచ్చాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆ రెండు పదవులు కేసీఆర్ పెట్టిన భిక్ష అని విమర్శించారు. ఆంధ్రా నాయకుల ముందు చేతులు కట్టుకుని ఊడిగం చేసిన మీరు సీఎం కేసీఆర్‌ను విమర్శించడం హాస్యాస్పదంగా ఉన్నదన్నారు. రెండు ఎన్నికల్లో గెలవంగనే మిడిసిపడుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు అహర్శిశలు శ్రమిస్తున్న కేసీఆర్‌పై అవాకులు చెవాకులు పేలితే సహించబోమని హెచ్చరించారు. ముఖ్యమంత్రులనే ఉరికించిన చరిత్ర టీఆర్ఎస్ పార్టీదేనని, మా సహనానికి ఓపికకు హద్దుంటుందని స్పష్టంచేశారు. కేంద్రమంత్రులే తెలంగాణ ప్రభుత్వ పథకాలను కీర్తిస్తుంటే ఇక్కడి సన్నాసులు విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉన్నదన్నారు.
సహనాన్ని అసమర్థతగా భావించొద్దు ఈ 20 ఏండ్ల కాలంలో టీఆర్ఎస్ చరిత్రలో ఎన్నో విజయాలు సాధించాం అని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్.. జిల్లా కేంద్రంలోని పద్మనాయక కల్యాణమండపంలో పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. చిన్న చిన్న విజయాలకే ఎగిరెగిరి పడుతున్న బీజేపీ నేతలకు తగిన సమయంలో బుద్ధి చెప్తామన్నారు. సహనాన్ని అసమర్థతగా భావిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. తెలంగాణ కాంగ్రెస్, తెలంగాణ బీజేపీ ఏర్పడ్డాయంటే అది కేసీఆర్ భిక్ష అని తెలిపారు. సీఎం కేసీఆర్‌ను ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. నాటి ముఖ్యమంత్రులను ఉరికించిన చరిత్ర టీఆర్ఎస్ పార్టీకి ఉంది. ఆ విషయాన్ని బీజేపీ నాయకులు మరిచిపోవద్దు.. ప్రధానమంత్రి, కేంద్రమంత్రులను కూడా వదిలిపెట్టాం. మాటలు మాట్లాడే పరిస్థితి వస్తే.. తాము మీ కంటే ఎక్కువగా మాట్లాడుతామని హెచ్చరించారు. ఈ 20 ఏండ్లలో అనేక ఘటనలు చూశాం. అన్ని పరిస్థితులను నిలదొక్కుకొని ఈ స్థాయికి వచ్చామని కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ర్టాన్ని సాధించి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ నిలబెట్టారు అని పేర్కొన్నారు.
కేసీఆర్ పరిపాలనాదక్షుడు అని కేంద్రమంత్రులే చెప్పారు. వందశాతం సాగు, తాగునీరు ఇస్తున్న ఏకైక రాష్ర్టం తెలంగాణ అని కేంద్రం చెప్పిందన్నారు. ఆనాడు కాంగ్రెస్ 9 గంటల కరెంట్ అని చెప్పి.. ఏ ఒక్క రోజు కూడా 6 గంటల కరెంట్ కూడా ఇవ్వలేదన్నారు. అర్ధరాత్రి కరెంట్ ఇచ్చి రైతుల ప్రాణాలతో చెలగాటమాడారు అని ధ్వజమెత్తారు. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వంలో 24 గంటల కరెంట్ ఇస్తున్నామని తెలిపారు. దేశంలో 24 గంటల కరెంట్ ఇస్తున్న రాష్ర్టం తెలంగాణ మాత్రమే అని స్పష్టం చేశారు. రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీలతో రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే అని తేల్చిచెప్పారు.
ప్రతి గ్రామంలో అందర్నీ కలుపుకుపోవాలన్నారు. టీఆర్ఎస్ పార్టీ అందరి పార్టీ అని పేర్కొన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు విషయంలో అగ్రభాగాన ఉండాలని స్థానిక కార్యకర్తలకు కేటీఆర్ పిలుపునిచ్చారు.