Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

టీఆర్‌ఎస్ గెలుపు ఖాయం

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపును ఎవరూ ఆపలేరని, నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల పట్టభద్రుల అభ్యర్థి దేవీప్రసాద్ గెలుపు ఖాయని ప్రచారంలో పాల్గొన్న మంత్రులు, నేతలు పేర్కొంటున్నా రు.

Palla-Rajeshwar-Reddy-election-Campaign-in-Khammam02

-టీడీపీ, బీజేపీకి ఓట్లేస్తే ఖమ్మం జిల్లాను నిండా ముంచేస్తరు -బీజేపీకి ఓటు వేస్తే బాబుకు వేసినట్లే.. -పల్లా రాజేశ్వర్‌రెడ్డికి వేస్తే సీఎం కేసీఆర్‌కు వేసినట్లు -భారీ నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు -అత్యధిక మెజార్టీతో గెలిపించాలి: ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి -పోరాట పటిమ గల దేవీప్రసాద్‌నే గెలిపించాలి: హోంమంత్రి నాయిని -నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయండి: ఎమ్మెల్సీ అభ్యర్థి దేవీప్రసాద్

అందుకు తగ్గట్టుగానే ప్రచారానికి వెళ్లిన ప్రతిచోటా తెలంగాణ ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన టీఆర్‌ఎస్ అభ్యర్థులకు అన్ని వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తున్నది. అభ్యర్థులు అడగకముందే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వాకర్స్, పెన్షనర్స్, లాయర్లు తొలి ప్రాధాన్యత ఓటు టీఆర్‌ఎస్‌కే వేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నారు. అభ్యర్థులకు సంపూర్ణ మందతు తెలుపుతూ స్వయంగా కలిసి సన్మానిస్తూ అభిమానాన్ని చాటుతున్నారు.

మచ్చలేని నేత దేవీప్రసాద్: హోంమంత్రి నాయిని టీఆర్‌ఎస్ అభ్యర్థి గెలుపును ఎవరూ ఆపలేరని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని మల్కాజిగిరి మినీట్యాంక్ బండ్‌పై హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించిన దేవీప్రసాద్ మచ్చలేని నాయకుడని కొనియాడారు. బంగారు తెలంగాణగా తీర్చి దిద్దాలంటే దేవీప్రసాద్ లాంటి పోరాట పటిమ గలవారు కావాలన్నారు.

రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ నగరం మినీ ఇండియా లాంటిదని, ఇక్కడ అన్ని ప్రాంతాల వారు స్వేచ్ఛగా ఉండవచ్చన్నారు. దేవీప్రసాద్‌కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆమోదం తెలపాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆయన రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌లో ముఖ్యకార్యకర్తలతో సమావేశమై దేవీప్రసాద్ తరపున ప్రచారం చేయాలని చెప్పారు.

టీఆర్‌ఎస్ అడ్‌హక్ కమిటీ గ్రేటర్ కన్వీనర్ మైనంపల్లి హన్మంతరావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలన పట్ల గ్రేటర్ ప్రజలు పూర్తి సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రాంతాలకు అతీతంగా అందరు ఇక్కడ స్వేచ్ఛగా ఉండవచ్చని, ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా సీఎంగా తాను రక్షణగా ఉంటానని హామీ ఇవ్వడంపై ఇతర ప్రాంతాల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కరుడు గట్టిన టీడీపీ వాదులుగా ఉన్న శకుంతలనాయుడు, శోభారాణి, భానుమతి లాంటి వారు సీఎం కేసీఆర్‌ను కలిసిన తర్వాత మనసు మార్చుకుని బంగారు తెలంగాణ కోసం కృషి చేస్తామని ప్రతిన బూనారన్నారు. ఈ సందర్భంగా దేవీప్రసాద్‌ను గెలిపించి తీరుతామని ప్రతిజ్ఞ చేయించారు. దేవీప్రసాద్ మాట్లాడుతూ రాష్ర్టాభివృద్ధికి కేసీఆర్ చేస్తున్న కృషికి అందరం తోడుగా నిలవాలన్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు కనకారెడ్డి, సంజీవరావు, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నాగేందర్‌గౌడ్, నాయకులు బద్దం పరశురాంరెడ్డి, ఏకే మురుగేశ్, వెంకన్న, శ్రీనివాస్‌గౌడ్, నక్క ప్రభాకర్‌గౌడ్ పాల్గొన్నారు.

టీడీపీకి డిపాజిట్ రాదనే బీజేపీకి మద్దతు: మంత్రి హరీశ్‌రావు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలకు ఓటు వేస్తే ఖమ్మం జిల్లాను నిండా ముంచుతారని భారీనీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. బుధవారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి, కొత్తగూడెంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాక సమావేశంలో హరీశ్‌రావు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. చంద్రబాబు తన పార్టీ అభ్యర్థిని నిలబెడితే డిపాజిట్ కూడా రాదని భావించి బీజేపీకి మద్దతు తెలిపాడని ఎద్దేవాచేశారు. బీజేపీకి ఖమ్మం జిల్లాలో పట్టుమని పదిమంది నాయకులు, శ్రేణులు లేరన్నారు. టీడీపీ, బీజేపీ కలిసి ఖమ్మం జిల్లాను సర్వనాశనం చేశాయని, ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని పట్టభద్రుల ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు వస్తున్నాయని నిలదీశారు. బీజేపీకి ఓటు వేస్తే చంద్రబాబుకు ఓటు వేసినట్లేనని, అదే పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ఓటు వేస్తే సీఎం కేసీఆర్‌కు ఓటు వేసినట్లేనని పేర్కొన్నారు.

టీడీపీ, బీజేపీ కుమ్మక్కై రాత్రికి రాత్రి జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రాలో కలుపుకున్నాయని, ఇంకా రెండు మండలాలను కబ్జా చేసేందుకు కుట్రలు పన్నుతున్నాయని ధ్వజమెత్తారు. మేధావులు ఒకసారి ఆలోచించాలని, ఖమ్మం జిల్లాను ముంచిన బీజేపీ, టీడీపీలను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. విడిపోయిన తర్వాత కూడా చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడని, అన్యాయంగా దిగువ సీలేరు విద్యుత్ ప్రాజెక్టును ఆంధ్రాలో కలపుకున్నారని దుయ్యబట్టారు. ఆంధ్రాలో పంటలను కాపాడేందుకు సీఎం కేసీఆర్ స్వయంగా సాగర్ నుంచి నీటిని విడుదల చేసి ఆదుకుంటే మనకు విభజన చట్టం ప్రకారం రావాల్సిన కరెంట్‌ను ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారన్నారు.

బాబూ నీతులు చెప్పడం మానుకో: మంత్రి తుమ్మల తెలంగాణపై కుట్రలు చేస్తూనే మరో వైపు నీతులు చెప్తున్నారని రోడ్లు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏపీ సీఎం చంద్రబాబుపై విరుచుకపడ్డారు. ఆంధ్రా రైతులు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని గ్రహించి నేనే సీఎం కేసీఆర్‌తో సంప్రదించి మంత్రి హరీశ్‌రావుతో చర్చించి సాగర్ నీరు విడుదల చేయిస్తే చంద్రబాబు తానే కేసీఆర్‌తో మాట్లాడి నీటిపై చర్చించమని పేర్కొనడం హాస్యాస్పందంగా ఉందన్నారు.

ఒక రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీకి మాత్రమే స్థానం ఉంటుందని, మరోక ప్రాంతీయ పార్టీకి రాష్ట్రంలో స్థానం లేదని స్పష్టంచేశారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్‌కు అంకితం చేస్తానని పేర్కొన్నారు. పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకట్రావు మాట్లాడుతూ గత పట్టభద్రుల ఎన్నికల్లో కంటే అత్యధిక మెజార్టీతో పల్లాను గెలిపించాలని విజ్ఞప్తిచేశారు. అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి పట్టభద్రులకు, టీఆర్‌ఎస్‌కు పట్టభద్రులకు మధ్య వీడదీయరాని బంధం ఉందన్నారు. రాష్ట్ర సాధన ఉద్యమం జరిగింది పట్టభద్రుల కోసమేనన్నారు. పట్టభద్రులు అత్యాధిక మెజార్టీతో తనను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, మదన్‌లాల్, తాటి వెంకటేశ్వర్లు, జెడ్పీచైర్‌పర్సన్ కవిత, ఎమ్మెల్సీ లక్ష్మీనారాయణ, డీసీసీబీ చైర్మన్ విజయ్‌బాబు, జిల్లా అధ్యక్షుడు రాజేందర్ పాల్గొన్నారు.

పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గెలిపించాలి: గాదరి కిషోర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించాలని పార్లమెంటరీ కార్యదర్శి గాదరి కిషోర్ పిలుపునిచ్చారు. బుధవారం నల్లగొండ జిల్లా తిరుమలగిరిలో బైక్‌ర్యాలీ, మార్నింగ్‌వాక్‌తో ప్రచారం నిర్వహించారు. అనంతరం ఇంటింటి ప్రచారం నిర్వహించి పల్లాను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

టీఆర్‌ఎస్‌కు మద్దతుగా త్వరలో టీజీవీఎస్ బస్సుయాత్ర శాసనమండలి ఎన్నికల్లో టీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులకు మద్దతుగా తెలంగాణ గిరిజన విద్యార్థి సంఘం (టీజీవీఎస్) ఆధ్వర్యంలో బస్సుయాత్ర చేపట్టనున్నట్లు టీజీవీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎల్ నెహ్రూనాయక్ తెలిపారు. ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన టీఎన్జీవో నేత దేవీప్రసాద్‌ను, విద్యార్థులతోపాటు 22 రోజులు జైలు జీవితం గడిపిన పల్లా రాజేశ్వర్‌రెడ్డిలను పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ బరిలోకి దింపిందని, వారిని గెలిపించాలని ఆయన పట్టభద్రులకు పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్ ఓయూలోని ఆర్ట్స్ కళాశాల ఆవరణలో టీజీవీఎస్ కార్యకర్తలు నిర్వహించిన సమావేశానికి ముఖ్యఅతిథిగా నెహ్రూనాయక్ హాజరై మాట్లాడారు. బంగారు తెలంగాణ నిర్మా ణం సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమన్నారు.

బస్సుయాత్ర వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. సమావేశంలో టీజీవీఎస్ ఉపాధ్యక్షుడు మధునాయక్, నేతలు కృష్ణనాయక్, లింగ, లక్ష్మణ్, లింగ న్న, వెంకన్న, రెడ్యా, రామోజీ, నరేశ్, భద్రం పాల్గొన్నారు.

ఓటు హక్కు వినియోగంపై హెల్ప్ డెస్క్ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ తన ఓటు హక్కును వినియోగించుకోవాలని పట్టభద్రుల నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి దేవీప్రసాద్ పిలుపునిచ్చారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల శాసనమండలికి గతంలో జరిగిన ఎన్నికల్లో 25శాతం ఓట్లు మాత్రమే పొలవడం దురదృష్టకరమన్నారు.సరియైన సమాచారం లేక ఓటింగ్‌కు దూరమయ్యే వారికి తగిన సమాచారం ఇవ్వడానికి రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ హెల్ప్ డెస్క్‌ను ప్రారంభించడం అభినందనీయమన్నారు. ఈ హెల్ప్ డెస్క్ కేవలం మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్‌కు సంబంధించిన ఓటర్ల వివరాలు మాత్రమే తెలుస్తాయని తెలిపారు. అవసరమైన వారు 040-24657830, 040-24657831, 040-24657832, 040-24657833 నంబర్లకు ఫోన్ చేసి వివరాలు పొందవచ్చని, ఇవి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయని దేవీప్రసాద్ తెలిపారు.

దేవీప్రసాద్‌కు పెరుగుతున్న మద్దతు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పట్టభద్రుల శాసనమండలి సభ్యుడిగా పోటీ చేస్తున్న దేవీప్రసాద్‌కు మద్దతు పెరుగుతున్నది. బుధవారం ప్రచారానికి వెళ్లిన ప్రతిచోటా ఏకగ్రీవ తీర్మానాలు చేసి దేవీప్రసాద్‌ను గెలిపించుకుంటామని ప్రతిజ్ఞలు చేశారు. స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్‌టీయూ) దేవీప్రసాద్‌ను గెలిపించడానికి కృషి చేస్తామని తీర్మానం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు రాజిరెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కమిటీ సమావేశమై మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లా కమిటీలతో ఎవరికి మద్దతు ఇద్దామనే దానిపై చర్చించి రాష్ట్ర కమిటీ దేవీప్రసాద్‌కు సంపూర్ణ మద్దతును ప్రకటించింది. దేవీప్రసాద్‌ను వారి కార్యాలయానికి రప్పించుకుని సన్మానించి మద్దతును ప్రకటించారు.

తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మామిడి నారాయణ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కమిటీ సుదీర్ఘంగా చర్చించి దేవీప్రసాద్‌కు మద్దతు ప్రకటించాలని తీర్మానం చేశారు. వారి కార్యాలయంలో దేవీప్రసాద్‌ను సన్మానించి మద్దతును ప్రకటించారు. టీఎన్జీవో సంఘం హైదరాబాద్ శాఖ కస్తూరి వెంకటేశ్వర్లు అధ్యక్షతన సమావేశమై దేవీప్రసాద్‌ను గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిదని నిర్ణయానికి వచ్చారు. ఈ విషయాన్ని దేవీప్రసాద్‌కు తెలిపి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

దేవీప్రసాద్‌కు టీఎస్‌టీయూ సంపూర్ణ మద్దతు తెలియచేస్తున్నదని ఆ సంఘం అధ్యక్షుడు చందూరి రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి భుజంగరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ టూరిజం కార్పొరేషన్ కాంట్రాక్ట్ ఉద్యోగులు అధ్యక్షుడు సబ్బు రాజమౌళి సారధ్యంలో టీఎన్జీవో ఆఫీసులో దేవీప్రసాద్‌ను కలిసి మద్దతు తెలిపారు. దేవాలయాల సిబ్బంది సంఘం అధ్యక్షుడు మోహన్, జాయింట్ సెక్రటరీ వెంకటేశ్వరగుప్తా సారథ్యంలో ఉద్యోగులు దేవీప్రసాద్‌కు తమ సంఘీభావం తెలియచేశారు.

అడ్వకేట్ జేఏసీ ప్రతినిధులు సంజయ్, సుధీర్‌ల ఆధ్వర్యంలో లాయర్లు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా దేవీప్రసాద్ మాట్లాడుతూ ఉద్యోగుల, ఉపాధ్యాయుల డిమాండ్లు అన్నీ పరిష్కారమవుతాయని హమీఇచ్చారు. తనను ఎన్నుకుంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. మల్కాజిగిరి పార్క్, ట్యాంక్‌బండ్ వద్ద వాకర్స్‌కు ఉన్న సమస్యలను స్థానిక ఎమ్మెల్యే సహకారంతో పరిష్కరిస్తానని చెప్పారు. కార్యక్రమాల్లో ఎస్‌టీయూ ప్రధాన కార్యదర్శి భుజంగారావు, కోశాధికారి జగన్మోహన్, మాజీ అధ్యక్షుడు బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.