గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఆరు దశాబ్దాలుగా తెలంగాణ అంధకారంగా మారింది. అటువంటి ప్రాంతమంతటా ఇప్పుడు టీఆర్‌ఎస్ ప్రభుత్వం వెలుగులు నింపుతున్నది.. అరువై ఏండ్లలో జరగని అభివృద్ధిని కేవలం ఐదేండ్లలో చేసి చూపుతాం. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా మార్చేందుకు అహర్నిశలు పాటుపడుతున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కూడా ప్రజలు ఆశీర్వదిస్తారు. గ్రేటర్‌లో వార్ వన్ సైడ్‌గానే ఉంటది అని వ్యవసాయ, పశు సంవర్థక శాఖల మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ధీమాగా చెప్పారు. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా నమస్తే తెలంగాణకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు.

-ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. -హైదరాబాద్‌ను విశ్వనగరంగా మారుస్తాం -నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో మంత్రి పోచారం
రాష్ట్రం సుభిక్షంగా మారుతుంది.. తెలంగాణ ప్రభుత్వం దేశంలో మరే రాష్ట్రంలో లేనటువంటి గొప్ప సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. మిషన్ భగీరథతో కాకతీయుల, నిజాం కాలం నాటి చెరువులకు పూర్వవైభవం రావడంతో పాటు భవిష్యత్‌లో యావత్తు తెలంగాణ పాడి పంటలతో విరాజిల్లుతది. కల్యాణలక్ష్మి-షాదీముబారక్ పథకం పేదింటి ఆడబిడ్డల పెండ్లి కష్టాలను తీరుతున్నది. పింఛన్ పథకంతో వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఆత్మగౌరవంతో కూడిన ఆసరా అందుతున్నది. పేదల కల అయిన డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రభుత్వం కట్టించి ఉచితంగా ఇస్తున్నది. 125 గజాల్లోపు ప్రభుత్వ ఆక్రమిత స్థలాలను పేదలకు ఉచితంగా క్రమబద్ధీకరించింది. హాస్టల్ విద్యార్థులకు సన్న బియ్యంతో భోజనం, అంగన్‌వాడీలకు ఆరోగ్యలక్ష్మితోపాటు తాగేందుకు నీళ్లు, ఉండేందుకు ఇండ్లు, అభివృద్ధికి నిధులు, నిరుద్యోగులకు ఉద్యోగాలు.. ఇలా అనేక పథకాలను కేవలం19 నెలల వ్యవధిలోనే అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నాయకత్వంలో తెలంగాణ సుభిక్షంగా మారుతుంది.
గ్రేటర్ వార్ వన్ సైడే.. కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా పెద్దసంఖ్యలో టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. దీంతో గ్రేటర్ ఎన్నికలలో ప్రతిపక్షాలకు అభ్యర్థులే దొరకని పరిస్థితి ఏర్పడింది. ప్రతిపక్ష నాయకులు టికెట్లను అమ్ముకున్నారని ఆ పార్టీల్లో ఉన్నవారే చెప్తున్నారు. ఈ పరిస్థితిలో గ్రేటర్ పోరులో వార్ వన్ సైడే ఉంటది. వరంగల్, మెదక్ ఉప ఎన్నికల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే గ్రేటర్‌లో వస్తాయి. టీఆర్‌ఎస్ పార్టీ మేయర్ పీఠంను కైవసం చేసుకోవడం ఖాయం.
ప్రజలు ఆదరిస్తున్నారు.. కేసీఆర్ ప్రభుత్వం కుల, మత, ప్రాంత భేదాలు లేకుండ అందరికీ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. కాబట్టే ఈ ప్రభుత్వాన్ని అన్ని వర్గాల ప్రజలు ఆదరిస్తున్నారు.
భద్రత పెరిగింది.. గతంతో పోల్చితే హైదరాబాద్‌లో ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ పెరిగింది. నగరంలోని ప్రతీ వీధిలో, బస్తీలో సీసీ కెమేరాలను ఏర్పాటు చేయడంతో పాటు పోలీసులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వాహనాలను సమకూర్చి గస్తీని బాగా పెంచినం. మహిళల రక్షణకు 100 షీటీమ్స్‌ను ఏర్పాటు చేసినం. దీంతో మహిళలపై నేరాలు, వేధింపులు తగ్గాయి.
గొంతు తడి ఆరనివ్వం.. గతంలో వేసవి వస్తే చాలు నీటి కష్టాలు ఉండేవి. నగర ప్రజల గొంతు తడి ఆరి పోయేది..కానీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎండాకాలం ఇంకా రాక ముందే నగరానికి గోదావరి నీళ్లు తెచ్చింది. వచ్చే ఐదేండ్లలోపల్నే రాష్ట్రమంతా ఇంటింటికి నల్లా నీళ్లిస్తామని లేకుంటే ఓట్లడుగమని సీఎం కేసీఆర్ శపథం చేశారు. ఇంత ధైర్యం దేశంలో ఏ నాయకుడికీలేదు.
ప్రజలకు బకాయిల భారం లేకుండా చేసినం.. నగరంలోని పేద ప్రజలపై భారం లేకుండా చేయాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ రూ.600 కోట్ల విద్యుత్, ఆస్తి, నీటి పన్నుల బకాయిలను ఏక కాలంలోనే మాఫీ చేశారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇలాంటిది చేయలేదు. పని చేస్తున్న పార్టీ ఏదీ? పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నది ఏది? అనే విషయం నగర ప్రజలకు తెలుసు. అందుకే అన్ని ఎన్నికల్లో గెలుపు టీఆర్‌ఎస్‌దే అవుతుంది.