-కేసీఆర్‌ను ఎదుర్కొనే దమ్ములేకే పార్టీలన్నీ ఒక్కటైనాయి -రాహుల్, చంద్రబాబు పొత్తును 52% ప్రజలు తిరస్కరించారు -మహేశ్వరం, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో కేటీఆర్ రోడ్‌షో
సీఎం కేసీఆర్‌ను ఒంటరిగా ఎదుర్కొనే దమ్ము, ధైర్యంలేకనే పార్టీలన్నీ ఒక్కటై పోటీకి దిగాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు ఎద్దేవాచేశారు. టీఆర్ఎస్ గెలుపును ఎవ్వరూ ఆపలేరని ధీమా వ్యక్తంచేశారు. తాజాగా ఓ ఆంగ్ల చానల్ సర్వే ఇదే విషయం చెప్పిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాహుల్, చంద్రబాబుల పొత్తును 52శాతం ప్రజలు తిరస్కరించిన్రు అని స్పష్టంచేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, ఎల్బీనగర్ నియోజకవర్గాల అభ్యర్థులు తీగల కృష్ణారెడ్డి, ముద్దగౌని రామ్మోహన్‌గౌడ్‌కు మద్దతుగా శుక్రవారం హైదరాబాద్‌లోని పలుప్రాంతాల్లో మంత్రి కేటీఆర్ రోడ్‌షోలు నిర్వహించారు. పహాడీషరీఫ్‌లో మొదలైన రోడ్‌షో షాహీన్‌నగర్, బాలాపూర్, మల్లాపూర్, జిల్లెలగూడ, కర్మన్‌ఘాట్, సరూర్‌నగర్, కొత్తపేట, ఆర్కేపురం, ఎల్బీనగర్, మన్సూరాబాద్, సహారాఎస్టేట్స్, వనస్థలిపురం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో గంగా జమునా తహజీబ్ సం స్కృతి కొనసాగుతున్నదంటే అది సీఎం కేసీఆర్ ఘనతేనని చెప్పారు. టీఆర్ఎస్ ఆధ్వర్యంలోనే ఓల్డ్‌సిటీ అభివృద్ధి చెందిందన్నారు. రికార్డుస్థాయిలో ైఫ్లెఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించిన ఘనత టీఆర్ఎస్దేనని వివరించారు. మైనార్టీల సంక్షేమం కోసం రూ.2,200 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. టీఆర్ఎస్ను కూల్చేందుకు చంద్రబాబు చేస్తున్న కుట్రలను పట్టించింది అసదుద్దీన్ ఒవైసీనే అని చెప్పారు.
కేసీఆర్ నాయకత్వాన్ని బలోపేతం చేద్దాం నాలుగున్నరేండ్లుగా మత సామరస్యాన్ని, శాంతిభద్రతలను కాపాడుకొంటూ రాష్ర్టాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. దానిని అదేవిధంగా కొనసాగించాలంటే కేసీఆర్‌లాంటి నాయకుడు అవసరం. తీగల కృష్ణారెడ్డి లాంటి మంచిమనిషి మనకుకావాలి. ఆయనను అధిక మెజార్టీతో గెలిపించాలి. కృష్ణారెడ్డిని గెలిపించడం ద్వారా కేసీఆర్ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసే అవకాశం మీకొచ్చిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

కాంగ్రెస్ అంటే.. కర్ఫ్యూ.. మాయమాటలు చెప్పి, గతంలో మతకల్లోలంచేసి ఆఖరికి ముఖ్యమంత్రి పదవి కోసం ఓల్డ్‌సిటీలో వందలమందిని చంపించిన పార్టీ కాంగ్రెస్. వాళ్ల అవసరాల కోసం ప్రజల ప్రాణాలను కూడా తీసేందుకు వెనుకాడని పార్టీ కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటే కర్ఫ్యూ.. అలాంటి పార్టీ ఓట్లను ఎలా అడుగుతోందని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఏర్పడ్డ టీడీపీ దానితో పొత్తుపెట్టుకోవడం విడ్డూరమన్నారు. కూటమి పేరుతో కేవలం కేసీఆర్‌ను ఓడించేందుకు ఏకమయ్యాయని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకున్నట్టే. అక్కాచెల్లెళ్లు జరజాగ్రత్త. కాంగ్రెసోళ్లు తులం బంగారం ఇస్తరు! ఓట్లకోసం ఎంతకైనా దిగజారుతున్నరు. ఇంటికిరాయి కడతం.. సోఫాకవర్లు కుడతం.. గోరుముద్దలు తినిపిస్తం.. బాసండ్లు తోముతం.. పిల్లలకు డైపర్లు మారుస్తామంటున్రు.. ఆఖరికి పెండ్లికానోళ్లకు పిల్లల్ని కూడా చూస్తరేమో అని ఆయన ఎద్దేవాచేశారు. ఈరోజు కరంటు వచ్చింది. శాంతిభద్రతలు వచ్చినయి. గరీబోళ్లు ఎవరైనా అందరికీ లాభం చేకూరే పనులు చేస్తున్నాం.
ఇట్లాంటి ప్రభుత్వాన్ని నడుపుకుంటేనే భవిష్యత్‌లో బంగారు తెలంగాణను నిర్మించుకోగలుతామని మంత్రి కేటీఆర్ వివరించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పేరుతో రూ.లక్షా116లు ఆడబిడ్డ పెండ్లికి సాయం అందిస్తున్నం. సర్కారు దవాఖానలో ప్రసూతి అయితే రూ.12 వేలు ఇస్తున్నం. దాంతోపాటే రూ.రెండువేల విలువైన కేసీఆర్కిట్లు పంపిణీచేస్తున్నం. అమృతాహారాన్ని పంపిణీ చేస్తున్నం. అం దుకే మాతా శిశు మరణాలు తగ్గినయి అని మంత్రి పేర్కొన్నారు. ఎనిమిదివందల గురుకుల పాఠశాలలు ఏర్పాటుచేసుకున్నం. ఒక్కొక్క విద్యార్థిపైన రూ.లక్షా 20 వేలు ఖర్చుచేస్తున్నం. రాష్ట్రవ్యాప్తంగా మూడు లక్షలమంది పిల్లలకు ఇంగ్లిష్ మీడియంలో విద్యాబుద్ధులు చెప్పించుకుంటున్నం. ఇన్ని మంచిపనులు చేస్తూ కేసీఆర్ ప్రభుత్వం అభివృద్ధిపథంలో దూసుకుపోతుంటే కొందరి కండ్లు మండుతున్నయని కేటీఆర్ చెప్పారు. మిషన్ భగీరథ 90 శాతం పూర్తయ్యింది. మిగతాది కూడా పూర్తయితది. మురికినీటి వ్యవస్థను తప్పకుండా పరిష్కరించుకుందాం. ఈ తతంగమంతా పూర్తైన తర్వాత తీగల కృష్ణారెడ్డితోనే కొబ్బరికాయ కొట్టించి సమస్యను పరిష్కరించుకుందాం అని కేటీఆర్ భరోసా ఇచ్చారు.

హయత్‌నగర్ వరకు మెట్రోను పొడిగిస్తాం ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఆరు స్కైవేలు, అండర్‌పాస్‌లను పూర్తిచేశాం. రూ.1600 కోట్లతో ఎల్బీనగర్ను అభివృద్ధిచేశాం. సరూర్‌నగర్ చెరువు సుందరీకరణ కోసం రూ.16 కోట్లు వెచ్చించాం. రూ.541 కోట్లతో నగరంలోని అన్ని చెరువులను అభివృద్ధిచేశాం. రూ.327 కోట్లతో నియోజకవర్గంలో తాగునీటి సమస్యను పరిష్కరించాం. ఎల్బీనగర్ నుంచి నాగోల్ మెట్రోను అనుసంధానిస్తాం. హయత్‌నగర్ వరకు దానిని పొడిగించాల్సి ఉన్నదని మంత్రి కేటీఆర్ ఈ ప్రాంత అభివృద్ధికి సాగించినకృషిని వివరించారు. కొత్తపేట డివిజన్ పరిధిలో 317 మందికి పట్టాలు పంచామని.. గత ప్రభుత్వాల హయాంలో తీరని సమస్యలను నాలుగేండ్ల్ల పాలనలో పరిష్కరించామని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. ఈ రోడ్‌షోకు ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభించింది. పార్టీ శ్రేణులు మంత్రి కేటీఆర్‌పై పూలవర్షం కురిపించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ అభ్యర్థి రామ్మోహన్‌గౌడ్, ఎమ్మెల్సీ సలీం, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, స్థానిక కార్పొరేటరు పాల్గొన్నారు.
వెల్లువలా జనం సీఎం సభలు గ్రాండ్ సక్సెస్ సీఎం కేసీఆర్ సభలకు జనంవెల్లువలా తరలివస్తున్నారు. దారులన్నీ గులాబీమయంగా మారుతున్నాయి. ప్రజలు స్వచ్ఛందంగా పాదయాత్రలు, బైక్‌ర్యాలీల ద్వారా చేరుకొంటున్నారు. శుక్రవారం ఉమ్మడి వరంగల్, సూర్యాపేట జిల్లాల్లో సీఎం సభలకు లక్షల సంఖ్యలో తరలివచ్చి సీఎం కేసీఆర్‌కు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వరంగల్‌రూరల్ జిల్లా నర్సంపేట, మహబూబాబాద్ జిల్లాలోని మహబూబాబాద్, మరిపెడ, సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట, తుంగతుర్తి, జనగామ జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన సభల్లో సీఎం ప్రసంగించారు. కాంగ్రెస్, టీడీపీ పాలనల్లో జరిగిన జీవన విధ్వంసాన్ని తనదైన శైలిలో సీఎం వివరిస్తున్నంత సేపు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. టీఆర్ఎస్ అభ్యర్థులు పెద్దిసుదర్శన్‌రెడ్డి, శంకర్‌నాయక్, రెడ్యానాయక్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిలను అఖండ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తిచేయగా ప్రజలు చప్పట్ల ద్వారా అంగీకారాన్ని తెలిపారు. సూర్యాపేట, తిరుమలగిరిలో నిర్వహించిన సభలకు ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో రెండు కిలోమీటర్ల మేర జనం వేచి ఉండి కేసీఆర్ ప్రసంగాన్ని ఆలకించారు. తుంగతుర్తి నియోజకవర్గ ప్రజాఆశీర్వాదసభను తిరుమలగిరిలో నిర్వహించగా పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు. సూర్యాపేటలో జగదీశ్‌రెడ్డి, తుంగతుర్తిలో గ్యాదరి కిశోర్‌కుమార్ గెలుపు ఖాయమైందని ఆయా సభల్లో సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.
సీఎం సభల్లో హైలైట్స్ -నర్సంపేటలో ప్రసంగం మొదలు పెట్టగానే పటాకులు కాల్చడంతో కొద్దిసేపు ఆపాలని సీఎం కేసీఆర్ కోరారు. -తెలంగాణకు చంద్రబాబు అవసరమా అని ప్రశ్నించగానే పెద్దగా వద్దువద్దు అంటూ నినాదాలు చేశారు. -పలువురు చెట్లమీది నుంచి మీటింగ్‌ను వీక్షించారు. -మహబూబాబాద్ సభలో సీఎం కేసీఆర్ 20 నిముషాల పాటు మాట్లాడారు -జనగామ సభకు జనం భారీగా తరలిరావటంతో మైదానం నిండిపోయింది. దీంతో రోడ్డుపైనే నిలుచొని జనం సీఎం సభను వీక్షించారు. -కాంగ్రెస్ వాళ్లు నీళ్ల ఫ్యాక్టరీలు పెడితే మనం ఇంటింటికీ నల్లాలు బిగిస్తున్నం అని సీఎం అనటంతో ప్రజలు హర్షధ్వానాలు చేశారు. -సూర్యాపేట సభలో తెలంగాణకు అడ్డుపడ్డ చంద్రబాబు దరిద్రం మనకింకా కావాల్నా అని సీఎం కేసీఆర్ అనటంతో వద్దు.. వద్దు అంటూ జనం నినదించారు. -ఎన్నికల తర్వాత పంచాయతీ ఎలక్షన్లు పెడుతున్నం.. 3500 పంచాయతీల్లో గిరిజనులే సర్పంచులు అనటంతో పెద్ద ఎత్తున కేరింతలు కొట్టారు. -తిరుమలగిరిలో నిర్వహించిన తుంగతుర్తి నియోజకవర్గ సభకు మహిళలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు -తుంగతుర్తి నుంచి గ్యాదరి కిశోర్ విజయం ఖాయం అనటంతో సభికులు చప్పట్లు కొట్టారు. -సభాప్రాంగణంలో ఆంధ్రాకుకూడా సీఎం కేసీఆర్ పాలన కావాలంటూ ఏపీకి చెందిన ఓ అభిమాని బ్యానర్కట్టారు.