గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ సరళి గులాబీ శిబిరంలో జోష్ నింపింది. ప్రచార దశనుంచే అన్ని పార్టీల కంటే ముందున్న టీఆర్ఎస్, పోలింగ్ సరళిని బట్టి ఫలితాల్లోనూ అగ్రగామిగా నిలుస్తుందనే విశ్వాసం కనిపించింది. పోలింగ్ తర్వాత వెలువడ్డ అన్ని సర్వేల్లోనూ టీఆర్ఎస్ ఘన విజయం సాధించి… సొంతంగా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటుందని స్పష్టం కావటంతో గులాబీ శిబిరంలో ఆనందానికి హద్దులేదు. తమ అంచనాలు ఈ ఎగ్జిట్‌పోల్స్‌లో ప్రతిబింబించాయంటూ పార్టీ నేతలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. మునుపటికంటే పోలింగ్ శాతం కొంచెం పెరగడం ఫలితాలపై వారి ఆసక్తిని మరింత పెంచుతున్నది.
-ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలపై హర్షాతిరేకాలు -శివారుల్లో పోలింగ్ శాతం మెరుగవడంపై నేతల్లో ఆనందం
కొత్త చరిత్ర లిఖిస్తాం.. టీఆర్ఎస్ పార్టీ దేశంలో ఒక కొత్త రాష్ర్టాన్ని తీసుకువచ్చి చరిత్ర గతిని మార్చింది. అదేరీతిగా ఈ నెల ఐదో తేదీ గ్రేటర్ ఎన్నికల ఫలితాల ప్రకటన రోజున మరో కొత్త చరిత్రను లిఖించనుంది.. పోలింగ్ అనంతరం నిర్వహించిన ఏడు రకాల ఎగ్జిట్‌పోల్ సర్వేల్లోనూ టీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధించి సొంతంగా మేయర్ పీఠంపై గులాబీ జెండాను ఎగురవేయబోతున్నదని తేలింది. సీఎం కేసీఆర్ నాయకత్వం, కార్యదక్షతపై ప్రజల్లో నమ్మకం ఉండటం వల్లనే గ్రేటర్లో ఈ స్థాయి విజయం సాధ్యమవుతున్నది. పోలింగ్ శాతం కాస్త పెరగడం కొంతమేర ఆనందాన్నిచ్చినా.. ఇంకా పెరిగితే బాగుండేది. పోలింగ్ ప్రశాంతంగా జరిగినప్పటికీ.. చివరి నిమిషంలో మజ్లిస్-కాంగ్రెస్, మజ్లిస్-టీఆర్ఎస్ మధ్య జరిగిన సంఘటనలు దురదృష్టకరం.. – పోలింగ్ ముగిసిన అనంతరం మీడియాతో మంత్రి కే తారకరామారావు
ఉదయం నుంచే..: వాస్తవానికి మంగళవారం ఉదయం పోలింగ్ సరళి చూసినపుడే పార్టీ శ్రేణుల్లో హుషారు నెలకొంది. 150 డివిజన్లనుంచి సాయంత్రం వరకు వచ్చిన అంచనా ఉత్తేజాన్ని నింపింది. ఎన్నికల ప్రకటన నాటినుంచే టీఆర్ఎస్ నేతల్లో తాము సొంతంగానే మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని ధీమా ఉండేది. మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోనట్లయితే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి కేటీఆర్ సవాల్ కూడా విసిరారు. అయితే గత ఎన్నికల్లో అనుభవాలరీత్యా పోలింగు శాతంపై పార్టీ నేతల్లో మొదటి నుంచి కాస్త ఆందోళన ఉండింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మీడియాతో మాట్లాడిన సందర్భంలో ఓటింగ్ శాతం పెరిగేలా ఓటర్లు చైతన్యవంతులై తమ మీద ఉన్న అపవాదును తొలగించుకోవాలని కోరారు. ప్రచార పర్వంలో టీఆర్ఎస్ పార్టీ అడుగడుగునా ఓటర్లలో చైతన్యం నింపే కార్యక్రమాలు చేపట్టింది. మంత్రి కేటీఆర్ వివిధ వర్గాలతో జరిపిన సమావేశాల్లో ఏ పార్టీకి వేసినా ఫర్వాలేదు..ఓటు మాత్రం వేయండని కోరుతూ వచ్చారు. ఈ శ్రమ మంగళవారం జరిగిన పోలింగులో కొంతమేర ఫలించినట్లుగా స్పష్టమవుతున్నది. గత చరిత్రను బట్టి పోలింగ్ పెరుగుతుందా లేక తగ్గుతుందా అనే అనుమానాలున్న పరిస్థితిలో 2009 గ్రేటర్ ఎన్నికల్లో నమోదైన 42.92 శాతం పోలింగ్‌ను దాటి ఈ దఫా 45-46 శాతానికిపైగా పోలింగు జరగడం టీఆర్ఎస్ శిబిరానికి ఆనందం కలిగించింది.
శివార్లలో పాగా: పోలింగ్ శాతం ఎక్కడెక్కడ పెరిగిందనే దానిపైనా నేతలు ప్రాథమికంగా విశ్లేషణ చేసినట్లు తెలిసింది. ప్రధానంగా శివారు ప్రాంతాల్లో ఎక్కువగా పోలింగ్ శాతం నమోదవడం పార్టీ ఘన విజయంపై గులాబీ పార్టీలో మరింత నమ్మకాన్ని పెంచింది. ప్రస్తుతం టీఆర్ఎస్లో ఉన్న నగర ఎమ్మెల్యేల్లో ఎక్కువమంది శివారు ప్రాంతాల్లోనే ఉన్నారు. ఇప్పుడు వారి వారి నియోజకవర్గాల్లోనే పోలింగ్ శాతం పెరగడం విశేషం. గతంలో టీడీపీ-బీజేపీ కూటమికి బలమున్నట్లుగా ప్రచారం జరిగే ప్రాంతాల్లోనూ ఈసారి టీఆర్ఎస్వైపు మొగ్గు కనిపించినట్లు పార్టీ అంతర్గత విశ్లేషణలో తేలింది.
గ్రేటర్ పోలింగ్ సరళితో టీఆర్ఎస్ సొంతంగా మేయర్ పీఠాన్ని దక్కించుకుంటుందనేది ఖాయమైందని టీఆర్‌ఎస్‌వర్గాలు ధీమా వ్యక్తం చేశాయి. పోలింగు ముగిసిన తర్వాత నిర్వహించిన ఏడు రకాల సర్వేలు ఈ నమ్మకాన్ని బలపరిచాయి. ఒక సర్వే వందకుపైగా స్థానాలు అధికార పార్టీకి కట్టబెడితే… మిగిలినవన్నీ 75-92 మధ్య ఫలితాలుంటాయని స్పష్టం చేశాయి. సగటున అన్ని సర్వేల్లో 70-75 తక్కువ కాకుండా డివిజన్లను టీఆర్ఎస్ పార్టీ గెలుచుకోనుందని వెల్లడి కావడంతో టీఆర్ఎస్ శిబిరంలో ఆనందం రెట్టింపైంది.
పోలింగ్ శాతం గతం కంటే పెరగడం, అందునా అది శివారు ప్రాంతాల్లోనే ఎక్కువగా నమోదు కావడంతో పార్టీ గెలుచుకునే స్థానాల సంఖ్య ఇంతకంటే పెరుగుతుందని కూడా పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.. ఎగ్జిట్‌పోల్స్‌లో టీఆర్ఎస్ హవా ఉన్నట్టు వెల్లడి కావటంతో మంత్రి కేటీఆర్‌కు ముందస్తు అభినందనల వెల్లువెత్తాయి. మంగళవారం సాయంత్రం తెలంగాణభవన్‌లో ప్రెస్‌మీట్‌కు వచ్చిన మంత్రి కేటీఆర్‌కు పార్టీ నేతలు పెద్ద ఎత్తున అభినందనలు తెలిపారు.