-వారి సమిష్టి కృషితోనే అధికారంలోకి టీఆర్ఎస్ -బీమా సొమ్ము ఇవ్వడంతో అనుబంధం తీరిపోదు -అన్ని విషయాల్లో ఎప్పటికీ పార్టీ అండగా ఉంటుంది -ప్రమాదంలో మృతిచెందిన కార్యకర్తల కుటుంబాలకు -బీమాచెక్కుల పంపిణీలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ -1,581 కుటుంబాలకు రూ.31.62 కోట్లు చెల్లించామని వెల్లడి -బాధితులతో సహపంక్తి భోజనం.. ఆత్మీయ పలుకరింపు -జెండా మోసినవారికి ఆ జెండానే నీడనిచ్చిందని వ్యాఖ్య

వారిని విధి వంచించింది. అకాల మృత్యువై వారి ఇంటి వెలుగును ఆర్పేసింది. కొడుకును కోల్పోయిన వృద్ధులు, భర్తను కోల్పోయిన మహిళలు, తండ్రిని పోగొట్టుకున్న పిల్లలు.. ఇట్లా అక్కడికి వచ్చిన వారందరూ అండ కోల్పోయినవారే! ప్రమాదవశాత్తూ మృతిచెందిన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు ఒక్కొక్కరికి రెండు లక్షల ప్రమాద బీమా చెక్కుల పంపిణీ సందర్భంగా వారందరూ బుధవారం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావుతో కలిసి మాట్లాడుతుంటే వాతావరణం నిజంగానే ఉద్విగ్నభరితంగా మారింది. వారు ఏ జెండానైతే మోశారో ఆ జెండానే ఈ రోజు వారికి నీడనిచ్చింది. కొందరు కన్నీళ్లను ఆపుకోలేకపోయారు. వారిని కేటీఆర్ అనునయిం చి, పార్టీ అన్ని విధాలా ఆదుకుంటుందని భరో సా ఇచ్చారు. దాదాపు మూడు గంటలపాటు వారితో ఇంటి మనిషిలా గడిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కార్యకర్తల కుటుంబాలకు పార్టీ ఎల్లప్పుడూ అండంగా ఉంటుందని చెప్పారు. కార్యకర్తల సమిష్టి కృషితోనే ఈ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నదని చెప్పారు. ప్రమాద బీమా ద్వారా ఇప్పటివరకు 1,581 మంది కార్యకర్తల కుటుంబాలకు రూ.31.62 కోట్లు చెల్లించినట్టు తెలిపారు. కార్యకర్తలందరినీ సీఎం కేసీఆర్ కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారని చెప్పా రు. దేశంలో ఒకట్రెండు పార్టీలే కార్యకర్తలకు ప్రమాద బీమా అమలుచేస్తున్నాయని తెలిపారు.

ఈ ఏడాది 60 లక్షల మంది పార్టీ కార్యకర్తల కోసం ప్రమాద బీమా ప్రీమియం రూ.11.5 కోట్లు చెల్లించామని పేర్కొన్నారు. మీ కుటుంబ పెద్ద ఈ రోజు మనమధ్య లేకపోయినా, పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందనే విశ్వాసం నింపాలనే ఉద్దేశంతో కొంతశ్రమయినా హైదరాబాద్‌కు ఆహ్వానించాం అని తెలిపారు. బీమా సొమ్ము ఇవ్వడంతోనే మీతో మా అనుబంధం తీరిపోయిందని పొరపాటున కూడా అనుకోవద్దన్నారు. అన్నివిషయాల్లో పార్టీ అండగా ఉంటుందని భుజంతట్టారు. ఏ కార్యకర్త కుటుంబానికైనా ఇలాంటి చెక్కు ఇవ్వాల్సి వస్తే నాయకులే స్వయంగా వారింటికి వెళ్లాలని, విశ్వాసాన్ని కల్పించి.. కష్టసుఖా ల్లో పాలుపంచుకోవాలని సూచించారు. ఇంకా ఇబ్బందులుంటే పరిష్కరించేందుకు కృషిచేయాలని కోరారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు వారిని యోజకవర్గాల్లో చెక్కు ఇచ్చే సందర్భాన్ని సాధారణ వ్యవహారంలా కాకుండా, పార్టీ తరఫున ఓ కార్యక్రమం నిర్వహించి దీన్ని వ్యవస్థీకృతం చేయాలని చెప్పారు. దీంతో ఆ కుటుంబానికి.. పార్టీతో, నాయకులతో శాశ్వతంగా అనుబంధం ముడిపడుతుందని, ఆ కుటుం బం కూడా తమ ఇంటి పెద్ద చేసిన పనిని పార్టీ గుర్తించిందనే భావనతో ఉంటారని వివరించారు. ఏ ప్రాంతీయపార్టీకి లేనంత 60 లక్షల మంది సభ్యత్వం టీఆర్ఎస్కు ఉన్నదన్నారు.

బాధిత కుటుంబాలతో మమేకం బీమా చెక్కులను అందజేశాక మృతిచెందిన ప్రతి కార్యకర్త కుటుంబసభ్యులను కేటీఆర్ ఆత్మీయంగా పలుకరించారు. ప్రతి ఒక్కరి దగ్గరికివెళ్లి యోగక్షేమాలు, కుటుంబ జీవనం సాగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. సహపంక్తి భోజనంచేసి, మేమున్నామనే భరో సా కల్పించారు. కార్యక్రమంలో విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీలు శంభీపూర్‌రాజు, శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే సైదిరెడ్డి, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గట్టు రాంచందర్‌రావు, నాయకుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి, పార్టీ ఇన్సూరెన్స్ విభాగం పర్యవేక్షకులు కావేటి లక్షీనారాయణ, టీవీఆర్శాస్త్రి (బాబాయ్) తదితరులు పాల్గొన్నారు.