– తెలంగాణను పట్టించుకోని కాంగ్రెస్, టీడీపీలకు అర్హత లేదు – ఏడు మండలాలను ఏపీలో కలిపిన బీజేపీని ఎవరూ నమ్మరు –మేధావులైన పట్టభద్రులు పల్లాను అధిక మెజార్టీతో గెలిపించాలి -నల్లగొండలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ పిలుపు – నల్లగొండ నుంచే రికార్డు మెజార్టీ రావాలి: మంత్రి జగదీశ్‌రెడ్డి

సమైక్యరాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ ఏనాడూ తెలంగాణ ప్రజలు, ప్రాంతం గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు.. అలాంటి పార్టీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న వాళ్లకు ఓట్లడిగే అర్హత లేదు. తెలంగాణ ప్రాంతాన్ని విభజించి చంద్రబాబు మాటలు విని ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో కలిపిన బీజేపీ మోసం ఇక్కడి పట్టభద్రులకు తెలియదా? అలాంటి బీజేపీ నుంచి ఓట్లడిగితే పట్టభద్రులు నమ్మే పరిస్థితిలో లేరు. రాష్ట్రంలో ఓట్లడిగే అర్హత ఒక్క టీఆర్ఎస్ పార్టీకే ఉంది అని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ చెప్పారు.
నల్లగొండ- ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. పల్లా గెలపును కోరుతూ విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శి గాదరి కిశోర్, అభ్యర్థి పల్లారాజేశ్వర్రెడ్డితో కలిసి శుక్రవారం నల్లగొండలో ఆయన ప్రచారం నిర్వహించారు. ఉదయం నుంచి మంత్రి జగదీశ్‌రెడ్డి పార్టీ నేతలతో కలిసి పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఓట్లు అభ్యర్థించారు. తర్వాత డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ ఎస్బీఆర్, స్టార్ ఫంక్షన్‌హాళ్లలో ఏర్పాటు చేసిన సమావేశాల్లో మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతున్నదన్నారు. రాష్ట్రంలో 60 ఏండ్లకాలంలో జరగని అభివృద్ధి కేవలం తొమ్మిది నెలల్లో జరిగిందన్నారు. సీఎం కేసీఆర్ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ర్టాన్ని ప్రగతి పథకంలో నడిపిస్తున్నారన్నారు. త్వరలో లక్ష ఉద్యోగాలను భర్తీ చేసేదిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తున్నదన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించి జీవనవిధానాన్ని మెరుగుపర్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తొమ్మిదినెలల కాలంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఆ ఫలాలను పేదలకు అందించే చర్యలు తీసుకుంటున్నదన్నారు. పట్టభద్రులంటే మేధావులని, మేధావుల తీర్పు విపక్షాలకు చెంపపెట్టులా ఉండాలన్నారు. తర్వాత విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ పల్లా గెలుపు ఖాయమని, మెజార్టీ భారీగా ఇవ్వాలన్నారు. నల్లగొండ నుంచే రికార్డు మెజార్టీ రావాలని పట్టభద్రులను కోరారు.
పార్లమెంటరీ కార్యదర్శి గాదరి కిషోర్ మాట్లాడుతూ ఉద్యమపార్టీ టీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్న పల్లా రాజేశ్వరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రులను కోరారు. టీఆర్ఎస్ దళితుల పక్షాన పనిచేస్తున్న పార్టీ అని, ఇన్నాళ్లూ దళితుల కోసం ఏ పాలకులు ఆలోచించలేదన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సారథ్యంలో అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతోనే బరిలో నిలిచినట్లు తెలిపారు. కార్యక్రమంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎమ్మెల్సీ పూల రవీందర్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ బాలునాయక్, టీఆర్ఎస్ నల్లగొండ నియోజకవర్గ ఇన్చార్జి దుబ్బాక నర్సింహారెడ్డి, రావుల శ్రవణ్‌కుమార్‌రెడ్డి, చాడ కిషన్‌రెడ్డి పాల్గొన్నారు.
పోటీ నుంచి తప్పుకొన్న రమణనాయక్ – పల్లా రాజేశ్వర్‌రెడ్డికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటన నల్లగొండ-వరంగల్-ఖమ్మం శాసనమండలి నియోజకవర్గ అభ్యర్థిగా బరిలోకి దిగిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రమణనాయక్ పోటీ నుంచి తప్పుకున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి మద్దతు ప్రకటించారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసిన రమణనాయక్ టీఆర్ఎస్ అభ్యర్థి విజయానికి కృషి చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.