Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

టీఆర్‌ఎస్‌.. నాకు టికెట్‌ ఇవ్వడంలో రాజకీయలబ్ధి కోణం లేదు

-నమస్తే తెలంగాణ ప్రత్యేక ఇంటర్వ్యూలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవి
-తెలంగాణ బిడ్డల్ని గౌరవించే క్రమంలోనే నాకు ఎమ్మెల్సీ టిక్కెట్టు
-రాజకీయలబ్ధికే అయితే పీవీకి బీజేపీ భారతరత్న ఇవ్వొచ్చు కదా!
-35 ఏండ్ల విద్యారంగ అనుభవాన్ని పట్టభద్రుల కోసం ఉపయోగిస్తా
-మాజీ ప్రధాని పీవీకి, సీఎం కేసీఆర్‌కు ఎన్నెన్నో పోలికలున్నాయి
-నాయన దేశాన్ని గట్టెక్కించారు.. కేసీఆర్‌ తెలంగాణను కాపాడారు
-బాపు బాటలో నడుస్తున్నది టీఆర్‌ఎస్సే.. అందుకే ఆ పార్టీలో చేరా
-నాయనకు జరిగిన అన్యాయాన్ని తెలుగు ప్రజలెన్నటికీ మరువలేరు

సురభి వాణీదేవి.. 35 ఏండ్లుగా విద్యారంగంలో సేవలు అందిస్తున్నారు.. దాదాపు లక్షన్నర మంది గ్రాడ్యుయేట్లను తయారుచేసి.. వారికాళ్లపై వారు నిలదొక్కుకొనేలా తీర్చిదిద్దారు. మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు కూతురు ఆమె. ఇప్పుడు టీఆర్‌ఎస్‌ తరఫున హైదరాబాద్‌- రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల స్థానానికి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ పోటీ విద్యావేత్తలతో వివిధ అంశాలపై చర్చించేందుకు.. తద్వారా పట్టభద్రుల సమస్యలను పరిష్కరించడానికి తనకు దొరికిన మంచి అవకాశంగా భావిస్తున్నానని వాణీదేవి అన్నారు. తన తండ్రి పీవీ నరసింహారావుకు.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మధ్య ఎంతో సారూప్యత ఉన్నదని.. ఇద్దరు కూడా ప్రజలకోసం తపించేవారేనని అభిప్రాయపడ్డారు. వారికోవలోనే ఇప్పటివరకు ఒక విద్యాసంస్థకే పరిమితమైన తనకు.. ఇకపై రాష్ట్రంలో విద్యారంగానికి సేవ అందించే అవకాశం లభించినట్టుగా భావిస్తున్నానని చెప్పారు.

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడుతున్నందుకు మీకు అభినందనలు. ఈ వయసులో, ఇన్నేండ్ల తర్వాత, రాజకీయాల్లోకి వస్తున్నారెందుకు?
వాణి: నేను ఇన్నేండ్లూ రాజకీయాలకు దూరంగా ఏమీలేను. నిశ్శబ్దంగా ఉన్నానంతే. ప్రధాని పీవీకి చేదోడువాదోడుగా ఉన్నది నేనే. అందువల్ల రాజకీయాలు నాకు కొత్తకాదు. చాలాసార్లు చాలా ఆఫర్లు వచ్చాయి. కుటుంబ బాధ్యతలు, ఇతరత్రా కారణాల వల్ల వద్దనుకున్నాను.

పీవీ ఉన్నప్పుడు, ఆ తర్వాత కూడా ఆయన కుటుంబ సభ్యులు ప్రత్యక్ష రాజకీయాలపై, పదవులపై పెద్దగా ఆసక్తి చూపలేదు. మరి మీరెందుకు ఇలా?
ఇది పదవులపై ఆశతో కాదు. టీఆర్‌ఎస్‌ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అడిగినప్పుడు అది సరైన సందర్భంగా, మంచి అవకాశంగా అనిపించింది. విద్యావంతులకు ప్రాతినిధ్యం వహించే అవకాశం నా వృత్తికి చాలా దగ్గరైనది.

మాజీ ప్రధాని పీవీ కూతురైనందుకే మీకు ఈ అవకాశం దక్కిందా?
అదొక కారణమైతే కావచ్చు. పీవీ మహా వటవృక్షమే అయినా మమ్మల్నందర్నీ ఎవరిమీద ఆధారపడకుండా సొంతకాళ్లపై నిలబడేలా పెంచారు. నాకు నేనుగా జీవితంలో నిలదొక్కుకున్న సఫల మహిళను. సుదీర్ఘ కాలంగా విద్యా సంస్థలను విజయవంతంగా నడిపిస్తున్నాను. దేశవిదేశాలు తిరిగి విద్యా వ్యవస్థను అధ్యయనం చేశాను. తెలంగాణ గడ్డమీద పుట్టిన ఉద్ధండులు చాలామందిని కేసీఆర్‌ పదవులతో సత్కరించారు. ప్రజా వాగ్గేయకారుడు గోరటి వెంకన్న తదితరులే అందుకు ఉదాహరణ. అదేరీతిలో నా అనుభవాన్ని, ట్రాక్‌ రికార్డును చూసే నన్ను అభ్యర్థిగా ఎంపిక చేశారనుకుంటున్నా.

అంటే పీవీ నాటి కాంగ్రెస్‌ ఇప్పుడు లేదంటారా?
మా నాన్న జీవితాంతం ఆ పార్టీకి విధేయంగా ఉన్నారు. ప్రపంచం భారత్‌ను మరచిపోతున్న సమయంలో.. ప్రపంచ చిత్రపటంలో మన దేశాన్ని నిలిపిన మహానుభావుడు ఆయన. దశాబ్దాలపాటు దేశానికి సేవచేసిన వ్యక్తికి ఆ పార్టీ ఇచ్చిన గౌరవం ఏమిటో అందరికీ తెలుసు. నేను దాన్ని విమర్శించను. ప్రజాహితం కోసం జీవితాన్ని అంకితంచేసిన మనిషికి అటు కాంగ్రెస్‌ నుంచి, ఇటు బీజేపీ నుంచి, రావాల్సినంత గుర్తింపు గానీ, ఇవ్వాల్సినంత గౌరవంగానీ లభించలేదన్న బాధ మాత్రం మా కుటుంబంలో, తెలుగు ప్రజల్లో ఉన్నది. మా మనసుకు తగిలిన ఆ గాయం ఎప్పటికీ మానదు. కేవలం తెలుగువారైనందుకే దక్షిణాదికి చెందిన తొలి ప్రధాని పీవీని ఆ పార్టీలు పట్టించుకోలేదు. వాటి వైఖరికి భిన్నంగా.. కేసీఆర్‌, తెలంగాణ ప్రభుత్వం గత ఆరేండ్లుగా పీవీకి ఎంతో గౌరవం ఇస్తుండటాన్ని మేము గమనించాం. రాజకీయాలకు అతీతంగా ఎంతో అభిమానంతో శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానంకూడా చేశారు. తేడా మనకు తెలుస్తున్నది కదా!

మీ సేవలు వాడుకోవాలనుకొంటే ఎమ్మెల్సీగా నామినేట్‌ చేయవచ్చు కదా! పోటీ ఉన్నచోట బరిలోకి దింపడమెందుకు?
ప్రజల్లోకి వెళ్లి, వాళ్ల విశ్వాసం పొంది, నిరూపించుకుని రావాలని బాపు ఎప్పుడూ చెప్తూఉండేవారు. ఆయన కూడా ఎన్నడూ మరో మార్గంలో పదవులు చేపట్టలేదు. అసెంబ్లీకి, లోక్‌సభకు పోటీచేసి ప్రజాక్షేత్రంలో మాత్రమే తన దక్షతను నిరూపించుకున్నారు. ఆయన బిడ్డనైన నేను మరో మార్గాన్ని ఎలా ఎంచుకుంటాను!

మరి నాన్నపై తెలంగాణ గురించి ఎప్పుడూ మాట్లాడలేదు అనే ముద్ర ఉన్నది. మీరేమో ఫక్తు తెలంగాణ పార్టీలో చేరారు కదా!
నాయన ప్రజావాది. దేశానికి విధేయుడు. ప్రజలకు మేలు జరుగుతుందనుకున్నప్పుడు ఆయన దేన్నైనా ధిక్కరించారు. ఆర్థిక సంస్కరణలే అందుకు పెద్ద ఉదాహరణ. ప్రజలకు నష్టం జరుగుతుందనుకున్నప్పడు పదవులు కూడా వదులుకున్నారు. నాయనగారు ఎటువంటి స్టెప్‌ తీసుకున్నా కూడా ప్రజా హితమే దాని పరమార్థం. అప్పుడున్న పరిస్థితుల్లో అటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే రక్తపాతం జరుగొద్దు. చాలావరకు ఆయన చాణక్యనీతి మనకు అర్థంకాదు. అర్థం చేసుకోలేనివాళ్లు ఏవేవో ముద్రలు వేస్తుంటారు. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తెలంగాణ సమస్యలు, బాధల గురించి మా నాయన ఎన్నోసార్లు ప్రస్తావించేవారు. ఒక్క గొల్ల రామవ్వ కథ చాలు తెలంగాణపై పీవీ అనురక్తి ఎంతటిదో చెప్పడానికి! ప్రజలు.. ప్రజలు.. ప్రజలు అని చివరిదాకా నాయిన పడ్డ తపనను నేను దగ్గరినుంచి చూశాను. ప్రధాని పదవి చేపట్టేనాటికే నాయనకు ఆపరేషన్‌ అయింది. గృహస్థాశ్రమం నుంచి వానప్రస్థంలోకి పోదామనుకుంటున్న సమయంలో ప్రధాని పదవి రూపంలో దేశానికి సేవచేసే అవకాశం వచ్చింది. తన ఆరోగ్యాన్ని, వయసును, ఆలోచనను కూడా పక్కనబెట్టి పీవీ ప్రధాని పదవి చేపట్టారు. ఆయన ప్రధాని పదవి అలంకరించేనాటికి ఇక్కడ రెడ్‌కార్పెట్‌ ఏమీ లేదు. చాలా సమస్యలున్నాయి. సాంఘికంగా, ఆర్థికంగా, సామాజికంగా దేశం ఎంత క్లిష్టపరిస్థితుల్లో ఉన్నదో అందరికీ తెలుసు. సొంత పార్టీలోనే కుంపటి, అసమ్మతివాదం.

ప్రతికూల పరిస్థితుల్లో నెగ్గుకొస్తూ, మైనార్టీ ప్రభుత్వాన్ని ఐదేండ్లపాటు నడపడం అద్భుతమైన విషయం. అప్పుడు మాకు ప్రతిరోజూ విషమ పరీక్షే. ఆయన ఆరోగ్యం ఎంత సున్నితమైందో మాకు తెలుసు. ముండ్ల సింహాసనాన్ని అధిష్ఠించి ఐదేండ్లపాటు పాలించి పట్టుదలతో దేశాన్ని గట్టెక్కించారు నాయన. నాన్నతో సన్నిహితంగా మెలిగిన నేను ఆ వాతావరణం మొత్తాన్నీ గమనించాను. 1969 నుంచి తెలంగాణ ఉద్యమాన్ని నేను దగ్గరగా పరిశీలిస్తున్నా. కేసీఆర్‌ ప్రాణాలతోటి పోరాడి.. రాదనుకున్న రాష్ట్రాన్ని సాధించారు. నాయినలాగే అనేక సమస్యలతో ఉన్న రాష్ట్రాన్ని ఒడ్డున పడేస్తున్నరు. గత ఆరేండ్లుగా ముఖ్యమంత్రిచేస్తున్న అనేక కార్యక్రమాలను పరిశీలించిన. తెలంగాణ ప్రజలు గౌరవంగా బతకడానికి , తలెత్తుకొని తిరగడానికి ముఖ్యమంత్రి అనేక చర్యలు తీసుకొన్నారు. ఆరేండ్ల క్రితం ఎట్లుండె.. ఇప్పుడెట్లున్నది తెలంగాణ! నాయనగారెట్లాగైతే క్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని ఉద్ధరించిండో, మన ముఖ్యమంత్రికూడా అదే చేస్తున్నరు. తెలంగాణను సాధించిన మహానుభావుడు కేసీఆర్‌. అట్లాంటి మనిషి, మీ సేవలు మాకు అవసరం, పోటీ చేయండన్నప్పుడు.. అది కూడా నా సబ్జెక్టు (విద్య) అయినప్పుడు ఎలా కాదనగలను? విద్యావేత్తలతో నేను ఇంటరాక్ట్‌ అయ్యేందుకు, దీన్నొక మంచి అవకాశంగా భావిస్తున్నా. పట్టభద్రుల బాధలు, సమస్యలు నాకు బాగా తెలుసని ఆయన అనుకొని ఉంటారు. కేసీఆర్‌గారు చాలా దూరదృష్టిగల వ్యక్తి. ఎవరు ఏమిటి.. వారికున్న నైపుణ్యాలేమిటి? దానిని ఎలా ఉపయోగించుకోవాలి? అనేది ఆయనకు బాగా తెలుసు.

ఉద్యోగాల భర్తీపై ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చడం లేదని, ఖాళీలున్నా నింపడం లేదనీ ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు?
విమర్శలు, నిరుత్సాహపర్చడం ఎప్పుడూ ఉంటాయి. ప్రజలందరినీ సంతృప్తిపర్చటం కష్టమే. మనమంతా విద్యాధికులం. ఒక్కసారి ఆలోచించాలి. మన రాష్ట్రం ఏర్పాటై ఎన్నాళ్లయిందో గమనించాలి. ఆరేండ్ల పసిగుడ్డు తెలంగాణ. అందులోనూ తొలి ఏడాది ఏడాదిన్నర పంపకాలతోనే సరిపోయింది. కోర్టు కేసులు వగైరా సరేసరి. నాలుగున్నరేండ్ల నుంచే మనం నిలదొక్కుకుంటున్నం. ఒకేసారి అన్నీ చేయలేం. రాష్ట్రంలో లక్షా ముప్పై వేల ఉద్యోగాలు కల్పించారు. లక్షల ఉద్యోగాలు కల్పించే కంపెనీలను రాష్ర్టానికి తీసుకొచ్చారు. ఉపాధి కల్పనకు హైదరాబాద్‌లో, ఊర్లలో మంచి వాతావరణం తెచ్చినారు. ఇక్కడ నుంచి వలసలు ఆగిపోయి, ఇతర రాష్ర్టాల నుంచి ఇక్కడికి వలస వస్తున్నారంటే అభివృద్ధి జరిగినట్టే కదా!

మీకు ప్రధాన ప్రత్యర్థి ఎవరు?బీజేపీనా, కాంగ్రెసా, ఇంకెవరైనానా?
ఇలాంటి వాటిని నేను నమ్మను. నోరు మంచిదైతే ఊరు మంచిదైతదనేవారు మా నాయన. నాకున్న అనుభవంతో, అధికార పార్టీ అండతో సేవ చేయాలనే తలంపు ఉన్నది. మద్దతివ్వాలని ప్రజలను కోరుతున్న. 35 ఏండ్లుగా విద్యారంగంలో నాకు అనుభవమున్నది. నా కాళ్లపై నేను నిలదొక్కుకోవడమే కాదు; వేలమంది యువకులు నిలదొక్కుకునేలా చేసిన. యువతరం ఎదుర్కొంటున్న సమస్యలు, బాధలు నాకు తెలుసు. నాకు అవకాశమిస్తే, ప్రభుత్వ సహకారంతో వాటిని పరిష్కరించగలుగుతాననే నమ్మకమున్నది. అందుకే నాకు ప్రథమ ప్రాధాన్య ఓటేయాలని అడుగుతున్న. నా వ్యక్తిత్వం, క్రమశిక్షణ, ఇన్నేండ్లుగా నేను చేసిన పనే నాకు కొలమానం.

పట్టభద్ర ఓటర్లలో యువజనులూ ఎక్కువమంది ఉన్నారు. సమస్యలూ వారికే ఎక్కువ. వయసు విషయంలో మీకు, వాళ్లకు చాలా గ్యాప్‌ ఉంది. ఎలా కనెక్ట్‌ కాగలుగుతారు?
పట్టభద్రులంటే ఏ వయసువారైనా కావొచ్చు. నేను 35 ఏండ్ల నుంచి విద్యారంగంలో ప్రొఫెసర్‌గా, విద్యాసంస్థల నిర్వాహకురాలిగా ఉన్నాను. నా కాలేజీల ద్వారా దాదాపు లక్షన్నర మంది గ్రాడ్యుయేట్లు జీవితంలో నిలదొక్కుకునేలా తర్ఫీదునిచ్చాను. నేను ప్రతి సంవత్సరం ఒక కొత్త తరాన్ని చూస్తుంటాను. అందువల్ల లాయర్లకన్నా, రాజకీయ నాయకుల కన్నా, పట్టభద్రుల గురించి నాకే ఎక్కువ తెలుసు. విద్యారంగంలో నాకున్న అనుభవంతో, అనుబంధంతో వారి సమస్యలను నేనే సరైన రీతిలో పరిష్కరించగలను. ఇక తెలంగాణ ఉద్యమంలో ప్రభుత్వ ఉద్యోగులది కీలక పాత్ర. ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. ఉద్యమంలో వారుచేసిన సేవలకు స్వరాష్ట్రంలో గుర్తింపు ఉన్నది. శ్రీనివాస్‌గౌడ్‌ వంటివారు మంత్రులు కూడా అయినరు. నేను మహబూబ్‌నగర్‌ కోడలిని. ఆ జిల్లాపై సంపూర్ణ అవగాహన ఉన్నది. ఆరేళ్ల స్వపరిపాలనలో పాలమూరు ఎలా పచ్చబడిందీ గమనించిన. నేను చదువుకుంది, స్థిరపడింది హైదరాబాద్‌లో. రంగారెడ్డి జిల్లాతోనూ నాకు అనుబంధమున్నది.

పట్టభద్ర ఓటర్లకు మీరిస్తున్న సందేశం ఏంటి?
చదువు అనేది ఒక విశ్వాసం. డిగ్రీ పొందడం ఒక ఎత్తయితే సమాజం పట్ల మీ దృక్పథం, నడవడిక మరో ఎత్తు. నా ఎరుకలో రోడ్లు పట్టుకుని తిరుగుతున్న గోల్డ్‌ మెడలిస్ట్‌లూ ఉన్నారు. అత్తెసరు మార్కులతో పాసై మంచిస్థాయిలో ఉన్నవారూ ఉన్నారు. నేను కూడా సాధారణ విద్యార్థినే. కాబట్టి మంచి మాట, మంచి నడవడిక, నిజాయితీ, జరుగుతున్న సంఘటలపై యుక్తాయుక్త వివేచన ముఖ్యం. విద్యతో సాధించలేనిది ఈ ప్రపంచంలో ఏదీ లేదనడానికి నిదర్శనం మా నాన్నగారే. ఆవేశంతో కాదు; ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి.

అందుకోసం నాకు ఓటేయండి..ప్రశ్న: మీకు ఎందుకు ఓటెయ్యాలి?
ప్రశ్నించేవారు ఉంటూనే ఉంటారు. కానీ ప్రజల సమస్యలను పరిష్కరించేవారు అవసరం. అధికారంలో ఉండే పార్టీ నాయకురాలిగా పట్టభద్రుల సమస్యల్ని నేను పరిష్కరించగలుగుతా. రెండోది పీవీగారి అమ్మాయిగానే కాకుండా సొంత వ్యక్తిత్వంతో సమాజంలో గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తిని. మూడోది.. 35 ఏండ్లుగా విద్యావృత్తిలో ఉంటూ ఎంతోమంది విద్యావంతులను ఈ సమాజానికి, దేశానికి అందించిన. ఇన్నాళ్లూ సురభి ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌కే పరిమితమైన నా సేవలను తెలంగాణ విద్యారంగానికి విస్తృతం చేసే అవకాశంగా భావిస్తున్నాను. గ్రాడ్యుయేట్స్‌ సమస్యలు నాకు తెలిసినంతగా నా ప్రత్యర్థుల్లో ఎవరికీ తెలియవని అనుకుంటున్నాను. బాగా మాటలు వచ్చి వాదించేవాళ్లు కాదు.. సమస్యకు పరిష్కారం చూపేవాళ్లు కావాలి. అందుకే మొదటి ప్రాధాన్యత ఓటు నాకే వేయమని కోరుతున్నా.

రాజకీయ లబ్ధికోసమైనా భారతరత్న ఇవ్వచ్చు కదా! శత జయంతి ఉత్సవాలను రాజకీయ లబ్ధి కోసం వాడుకొనేందుకే మీకు ఎమ్మెల్సీ టికెట్‌ ఇచ్చారనే విమర్శపై ఏమంటారు?
నిరుడు ఇదే సమయానికి నాన్నగారి శతాబ్ది ఉత్సవాలు ఎలా చేయాలి? ఎవరు పట్టించుకుంటారు? అని మథనపడ్డాం. కుటుంబ సభ్యులమే కమిటీగా ఏర్పడి ఒక్కో నెలకు ఒక్కో కార్యక్రమం నిర్వహించాలని ప్రణాళిక వేసుకున్నాం. కానీ ప్రభుత్వం ఎంత దివ్యంగా చేస్తున్నదో ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రతి విషయాన్ని స్వయంగా తానే పర్యవేక్షిస్తున్నారు. నాన్నగారికి ఇది అరుదైన గుర్తింపు. కేవలం రాజకీయాల కోసమే అయితే ఇలా ఎవరూచేయరు. అయినా శతజయంతి ఉత్సవాలు ఎప్పుడో మొదలయ్యాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పుడు వచ్చాయి. నన్ను ఎప్పుడు అభ్యర్థిగా ప్రకటించారో మీరు గమనించే ఉంటారు. కొంతసేపు వారి వాదనే నిజమనుకుందాం. మరి రాజకీయలబ్ధి కోసమైనా బీజేపీ ప్రభుత్వం మా బాపుకు భారతరత్న ప్రకటించవచ్చు కదా! సర్దార్‌ పటేల్‌ తరహాలో భారీ విగ్రహం, స్మారకం నిర్మించవచ్చు కదా!

మా బాపు ఈ దేశానికి ఏం తక్కువ చేశారు?
పీవీగారికి ఇప్పటికీ భారతరత్న ఇవ్వకపోవడం పట్ల ఆవేదన ఉన్నదా?
తప్పకుండా ఉన్నది. ఇప్పుడు ఏవేవో మాట్లాడటం కాదు. ముందు భారతరత్న ఇచ్చి మాట్లాడండి. దేశాన్ని గట్టెక్కించడానికి ఆయనచేసిన కృషి అంతాఇంతా కాదు. ఒకరకంగా చెప్పాలంటే భారతదేశానికి గాంధీజీ స్వాతంత్య్రం తెస్తే.. ఆర్థిక స్వాతంత్య్రం తెచ్చింది మాత్రం కచ్చితంగా పీవీనే. దేశ ఆర్థిక, రాజకీయ రంగాలను ‘1991కి ముందు 1991 తర్వాత’ అని పిలుస్తుంటారు. ఆర్థిక సంస్కరణలు మొదలుకుని, అణు పరీక్షలకు సిద్ధంచేసే దాకా.. మా బాపు ఈ దేశానికి ఏం తక్కువచేశారు?

అద్దంలో ఆకాశమా?
ప్రశ్న: పీవీ ప్రభ అంతా కరీంనగర్‌కే పరిమితమని, హైదరాబాద్‌లో అదేమీ పనిచేయదని బీజేపీ అభ్యర్థి అంటున్నారు?
ఆకాశాన్ని అద్దంలో బంధించాలనుకోవడం, ఎవరెస్టు భారీతనాన్ని కాన్వాసుపై గీయాలనుకోవడమంటే ఇదే. కరీంనగర్‌కో, వరంగల్‌కో, తెలంగాణకో, ఆంధ్రప్రదేశ్‌కో, భారత్‌కో పరిమితమైన వ్యక్తిత్వం కాదు పీవీది. ఆయన విశ్వమానవుడు. స్కాలర్‌ ప్రైంమినిస్టర్‌. వారివి పరిపక్వత లేని మాటలు. విచారకరం. వాళ్ల విజ్ఞతకే వదిలిపెడుతున్న. బతికున్నప్పుడు, చనిపోయాక, చివరికి ఇప్పుడు ఆయన ఆత్మను కూడా సాధిస్తున్నరు!

మా నాన్నకు కేసీఆర్‌కు ఎన్నో పోలికలు
ప్రశ్న: పీవీగారు జీవితాంతం కాంగ్రెస్‌లో ఉన్నారు. మీరేమో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఎలా సమర్థించుకుంటారు?

-మా బాపు ఏ పార్టీలో ఉండేవారన్నది కాదు.
-ఆయన పాటించిన విలువల్ని ఎవరు అనుసరిస్తున్నారన్నదే ముఖ్యం.
-మా బాపు రైతు, కేసీఆర్‌ రైతు. మా నాయినకు వ్యవసాయంపై ఆసక్తి. కేసీఆర్‌కూ అంతే.
-ప్రతి అంగుళం భూమికీ నీళ్లందాలని మా బాపు తపించారు. కేసీఆర్‌ దాన్ని చేసి చూపించారు.
-తెలంగాణలో పేదలకు గౌరవం దక్కేలా గుంటెడో, ఎకరమో భూమి ఉండాలని పీవీ భూ సంస్కరణలు తెచ్చారు.
-పేదవాడి భూమి పండాలని కేసీఆర్‌ కాళేశ్వరం నీళ్లు పారించారు.
-మా నాయిన ఆర్థిక సంస్కరణలు తెచ్చి దేశాన్ని నిలబెట్టారు.
-కేసీఆర్‌ ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించారు.
-పరిపాలనలో మా నాన్న సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. కేసీఆర్‌ కూడా అంతే. మా బాపు మంచి వక్త. కేసీఆర్‌ కూడా గొప్ప వక్త.
-మానాన్న టెక్నాలజీతో పేదల కష్టాలు దూరం చేయాలని ఆరోజుల్లోనే అనుకునేవారు. కేసీఆర్‌ ఇప్పుడు టెక్నాలజీతో పరిపాలనను ప్రజల ముంగిటికి తెస్తున్నారు.
-మా బాపు ఎన్ని పదవులెక్కినా, ఎన్ని భాషలు నేర్చినా తెలంగాణ యాస మరువలేదు. కేసీఆర్‌ అందమైన తెలంగాణ యాసలో మాట్లాడుతారు.
-మా నాన్న ధార్మికుడు. కేసీఆర్‌ పరమ ఆస్తికుడు. ధర్మాన్ని, మతాన్ని రాజకీయాలతో ముడిపెట్టకూడదని మా నాన్న అనేవాడు.
-రాజకీయాలకు, పథకాలకు కులమతాలు అంటగట్టకూడదని కేసీఆర్‌ అంటారు. మా నాన్న సాహితీవేత్త. కేసీఆర్‌ సాహిత్యాభిలాషి. ఇలా చెప్పుకొంటూపోతే పీవీకి, కేసీఆర్‌కు మధ్య వంద పోలికలు చెప్పొచ్చు.

ఒక్కమాటలో చెప్పాలంటే.. పీవీ దేశాన్ని రక్షించారు.
కేసీఆర్‌ తెలంగాణ తెచ్చి, దాన్ని కాపాడుతున్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.