-రాష్ట్రంలో ప్రగతి రథచక్రాలు ముందుకే -సోదిలో లేకుండా పోనున్న విపక్షాలు -తెలంగాణ.. గులాబీ వనమై వికసిస్తుంది -ఎవరికీ అందనంత ఎత్తులో సీఎం కేసీఆర్ -తేల్చిచెప్పిన ఆజ్‌తక్, వీడీపీ అసోసియేట్స్ సర్వేలు -రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై 64% ప్రజల సంతృప్తి -సీఎం కేసీఆర్‌కు 43% జనాదరణ ఉందన్న ఆజ్‌తక్ -51% ఓటర్లు కేసీఆర్ మళ్లీ సీఎం కావాలన్నారన్న వీడీపీ -రాబోయే ఎన్నికల్లో 80 సీట్లు టీఆర్ఎస్కేనని వెల్లడి

రాబోయే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్కే ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు! కేసీఆరే మళ్లీ ముఖ్యమంత్రి కావాలని తీర్మానించుకున్నారు! ప్రజలు ముళ్ల కంపల కలయికను కాదు.. గులాబీ వన వికాసాన్ని కోరుకుంటున్నారు! ఇది ఎవరో ఆషామాషీగా చెప్పింది కాదు.. దేశవ్యాప్తంగా పేరున్న ఆజ్‌తక్- ఇండియాటుడే మీడియా గ్రూపు, వీడీపీ అసోసియేట్స్‌లు వేర్వేరుగా నిర్వహించిన సర్వేల సారాంశం!! అంతేకాదు.. తెలంగాణలో టీఆర్ఎస్ తిరుగులేని రాజకీయ శక్తిగా రూపాంతరం చెందిందని మరోసారి స్పష్టమయింది. నాలుగేండ్ల క్రితం ప్రస్థానం ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ప్రగతిరథ చక్రాలు మున్ముందుకే సాగుతాయని ఆజ్‌తక్-ఇండియాటుడే, వీడీపీ అసోసియేట్స్ సర్వేలు తేల్చిచెప్పాయి. గడిచిన నాలుగేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించబోతున్నదని కుండబద్దలు కొట్టాయి.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కేసీఆర్‌కు మద్దతుగా 43శాతం ఓటర్లు నిలుస్తారని ఆజ్‌తక్-ఇండియాటుడే సర్వే తేల్చింది. మరోవైపు వీడీపీ అసోసియేట్స్ నిర్వహించిన సర్వేలో 51% ఓటర్లు కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకున్నారు. రాబోయే ఎన్నికల్లో కారు టాప్‌గేరులో దూసుకుపోతుందని చెప్పేందుకు ఈ సర్వేల ఫలితాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
రాష్ట్రంలో టీఆర్ఎస్కు 80 సీట్లు లభిస్తాయని వీడీపీ అసోసియేట్స్ సర్వే పేర్కొంది. ఓటింగ్ శాతాలపరంగా చూసినా, సీట్లపరంగా చూసినా, ముఖ్యమంత్రి అభ్యర్థి రీత్యా చూసినా టీఆర్ఎస్కు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు ఎవ్వరూ దరిదాపుల్లో కూడా లేకపోవడం విశేషం.
ప్రజాదరణ విషయంలో కేసీఆర్‌కు 43% మద్దతు పలుకగా, పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి 18%, బీజేపీ నేత కిషన్‌రెడ్డికి 15%, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి 4% మద్దతు ఉందని ఆజ్‌తక్ సర్వేలో వెల్లడైంది. త్వరలో ఎన్నికలు జరిగే రాష్ర్టాల నేతల్లోనూ కేసీఆర్‌కు అత్యధిక జనాదరణ లభించడం విశేషం. రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కారు పనితీరుపై 64% ప్రజలు తమ సంతృప్తిని వ్యక్తంచేశారని ఆజ్‌తక్ సర్వే తెలిపింది. తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రతిపక్షాలకు అందనంత ఎత్తున కేసీఆర్ ఉన్నారని ఆజ్‌తక్- ఇండియాటుడే- యాక్సిస్ మై ఇండియా గ్రూపు ఎండీ ప్రదీప్‌గుప్తా చెప్పారు.
ఏపీలో జగన్! ఆంధ్రప్రదేశ్ సీఎం ఎన్ చంద్రబాబునాయుడు ప్రజాదరణ కోల్పోతున్నారని ఆజ్‌తక్ సర్వే వెల్లడించింది. వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డికి 43% ప్రజాదరణ ఉన్నట్టు తేలిందని పేర్కొంది.
కొత్తగా జనసేన పేరుతో పార్టీ పెట్టిన సినీనటుడు పవన్‌కల్యాణ్‌కు కేవలం 5% మాత్రమే జనాదరణ ఉందని తెలిపింది. చంద్రబాబు పనితీరు బాగుందని 33%, ఫర్వాలేదని 18% ప్రజలు చెప్పగా.. 36% మంది పాలన బాగాలేదని చెప్పారని పేర్కొంది.
మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీనే.. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో శివరాజ్‌సింగ్ చౌహాన్ మళ్లీ సీఎం అవుతారని 46% మంది పేర్కొన్నారని ఆజ్‌తక్ సర్వే తెలిపింది. కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియాకు 32శాతం ప్రజల మద్దతు ఉందని వెల్లడించింది. ఛత్తీస్‌గఢ్‌లో ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ పీఠానికి ముప్పేమీ లేదని సర్వే పేర్కొన్నది. కాబోయే ముఖ్యమంత్రి ఎవరన్న ప్రశ్నకు 41శాతం మంది రమణ్‌సింగ్ పేరును చెప్పగా.. మరే పార్టీ నాయకుడు కూడా దరిదాపుల్లో కూడా లేరు.
రాజస్థాన్‌లో పోటాపోటీ! రాజస్థాన్‌లో అధికార బీజేపీకి గడ్డు పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆజ్‌తక్ సర్వే వెల్లడించింది. కాబోయే ముఖ్యమంత్రి ఎవరన్న ప్రశ్నకు వసుంధరరాజేకు మద్దతుగా 35% మంది నిలువగా, అంతే శాతం ప్రజలు కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్‌ను కోరుకున్నారు.
గులాబీ వనమే రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం గులాబీవనమై వికసిస్తుందని వీడీపీ అసోసియేట్స్ నిర్వహించిన సర్వేను బట్టి తెలుస్తున్నది. టీఆర్ఎస్కు 80 స్థానాలు, కాంగ్రెస్‌కు 20, ఎంఐఎంకు 8, బీజేపీకి 7, ఇతరులకు 4 స్థానాలు వస్తాయని ఈ సర్వే తేల్చింది. ఓటింగ్ శాతాల పరంగా చూస్తే.. టీఆర్ఎస్కు 41శాతం ఓటింగ్ లభిస్తుందని పేర్కొంది. కాంగ్రెస్‌కు 27%, బీజేపీకి 10%, ఎంఐఎంకు 6%, టీడీపీకి 4%, సీపీఐకి 2%, టీజేఎస్‌కు 2%, వైసీపీకి 1%, సీపీఎంకు 1%, ఇతరులకు 3% శాతం ఓట్లు పోలవుతాయని సర్వే అంచనా వేసింది. ఎవరికి ఓటు వేయాలో ఇంకా నిర్ణయించుకోనివారు మరో మూడుశాతం ఉన్నారని తెలిపింది. సర్వేకోసం తెలంగాణను గ్రేటర్ హైదరాబాద్, ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణగా విభజించిన వీడీపీ అసోసియేట్స్.. గ్రేటర్లో టీఆర్ఎస్కు 42%, ఉత్తర తెలంగాణలో 41%, దక్షిణ తెలంగాణలో 39% ఓట్లు లభిస్తాయని అంచనావేసింది.
కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావే తదుపరి ముఖ్యమంత్రి కావాలని 51% ఓటర్లు కుండబద్దలు కొట్టడం విశేషం. ఈ రేసులో మరే పార్టీ నాయకుడూ కేసీఆర్‌కు దరిదాపుల్లో లేకపోవడం గమనార్హం. రెండోస్థానంలో ఉన్న పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని నూటికి పది మంది మాత్రమే సీఎంగా కోరుకున్నారు.
రేవంత్‌రెడ్డి సీఎం కావాలని 6%, కోదండరాం సీఎం కావాలని 4% మంది మాత్రమే కోరుకోవడం గమనార్హం. రాబోయే ఎన్నికల్లో అభివృద్ధి, మౌలిక సదుపాయల కల్పన ప్రాతిపదికగా ఓటేస్తామని 28% మంది పేర్కొనగా, వ్యవసాయరంగం అభివృద్ధి ఆధారంగా ఓటేస్తామని 19%, ఉపాధి, ఉద్యోగాల కల్పన ప్రాతిపదికగా ఓటేస్తామని 17% మంది పేర్కొన్నారు. మరో ఆసక్తికర అంశం.. రాబోయే ఎన్నికల్లో ఓటర్లను ప్రధానంగా ప్రభావితం చేసేది ఏమిటన్న ప్రశ్నకు 25% మంది ముఖ్యమంత్రి అభ్యర్థిని, 24% మంది ఎమ్మెల్యే అభ్యర్థిని చూసి ఓటేస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఆధారంగా ఓటేస్తామని 20% ఓటర్లు పేర్కొనగా, కేంద్ర ప్రభుత్వ పనితీరు ఆధారంగా ఓటేస్తామని 6%, తెలంగాణ సెంటిమెంట్‌తో ఓటేస్తామని 8%, ఇతర అంశాలతో ఓటేస్తామని 17% ఓటర్లు పేర్కొన్నారు.
వందస్థానాల్లో విజయం.. వట్టిమాట కాదు.. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ సెంచరీ కొడుతుందని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ తరచూ చెప్తున్నది వట్టిమాట కాదని సర్వేల ఫలితాలు స్పష్టంచేస్తున్నాయి. ఇంకా ఎన్నికల కోలాహలం మొదలుకాకముందే ఈ స్థాయిలో ఫలితాలున్నాయంటే.. ఎన్నికల సమయానికి అనుకున్న స్థాయిలో వందకుపైగా స్థానాలు టీఆర్ఎస్ గెల్చుకోవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. రాష్ట్రంలో నవంబర్‌లో ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్నారు. అప్పటికి పార్టీ అభ్యర్థుల ప్రచార కార్యక్రమాలు జోరందుకుంటాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రచార రంగంలోకి దిగుతారు.
యాభై రోజుల్లో 100 సభల్లో ఆయన పాల్గొనబోతున్నారు. వీటన్నింటి నేపథ్యంలో పార్టీకి వచ్చే సీట్ల సంఖ్య కూడా గణనీయంగా పెరుగడం ఖాయంగా కనిపిస్తున్నదని వారు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అనేక గ్రామాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు ప్రకటిస్తూ ప్రజల ఏకగ్రీవ తీర్మానాల పరంపర కొనసాగుతుండటాన్ని, తమ ఇంటి గోడలపై తాము టీఆర్ఎస్ అభ్యర్థులకే ఓటేస్తామని రాస్తుండటాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న కాంగ్రెస్.. ఎన్ని ముఠాలు కట్టినా, తెలంగాణ ప్రజలు ఆ పార్టీని ఎన్నికల్లో మట్టికరిపించడం ఖాయమని తేల్చి చెప్తున్నారు.