Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

టీఆర్ఎస్ రాజ్య‌స‌భ అభ్య‌ర్థులు వీరే.. వారి నేప‌థ్య‌మిది..

టీఆర్ఎస్ రాజ్య‌స‌భ అభ్య‌ర్థుల పేర్ల‌ను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. టీఆర్ఎస్ పార్టీ రాజ్య‌స‌భ అభ్య‌ర్థులుగా న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక ఎండీ దీవ‌కొండ దామోద‌ర్ రావు, హెటిరో అధిప‌తి డాక్ట‌ర్ బండి పార్థ‌సార‌థి రెడ్డి, వద్దిరాజు ర‌విచంద్ర‌(గాయ‌త్రి ర‌వి) పేర్ల‌ను సీఎం కేసీఆర్ వెల్ల‌డించారు.

బండా ప్ర‌కాశ్ ఎమ్మెల్సీగా ఎన్నిక‌వ‌డంతో.. ఆయ‌న త‌న రాజ్య‌స‌భ స‌భ్య‌త్వానికి రాజీనామా చేయ‌డంతో ఆ స్థానం ఖాళీ అయింది. ఇక ధ‌ర్మ‌పురి శ్రీనివాస్, కెప్టెన్ ల‌క్ష్మీకాంత‌రావు ప‌ద‌వీ కాలం ముగియ‌డంతో మ‌రో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంతో మూడు స్థానాల‌కు అభ్య‌ర్థుల పేర్ల‌ను కేసీఆర్ ప్ర‌క‌టించారు. టీఆర్ఎస్ పార్టీకి త‌గినంత‌ సంఖ్యా బలం ఉండటంతో ఈ మూడు రాజ్యసభ సీట్లు అధికార పార్టీకే దక్కనున్నాయి. బండ ప్రకాశ్ రాజీనామాతో అయిన సీటుకు రేపటిలోగా, మిగతా రెండు సీట్లకు ఈ నెల 24లోపు నామినేషన్ వేయాలి.

దీవ‌కొండ దామోద‌ర్ రావు జీవిత నేప‌థ్యం..
జ‌గిత్యాల జిల్లా బుగ్గారం మండ‌లం మద్దునూరుకు చెందిన దీవ‌కొండ దామోద‌ర్ రావు తెలంగాణ ఉద్య‌మం ప్ర‌స్థానంలో తొలినాళ్ల నుంచి నేటి ముఖ్య‌మంత్రి.. నాటి ఉద్య‌మ నాయ‌కుడు కేసీఆర్ వెంట న‌డిచిన వ్య‌క్తుల్లో ఒక‌రు. 2001 నుంచి టీఆర్ఎస్ పార్టీలో ప‌లు హోదాల్లో ప‌ని చేశారు. పొలిట్ బ్యూరో స‌భ్యుడిగా, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా, పార్టీ సెక్ర‌ట‌రీ – ఫైనాన్స్‌గా వ్య‌వ‌హ‌రించారు. తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్ర మ‌లిద‌శ ఉద్య‌మంలో క్రియాశీల పాత్ర పోషించిన టీ న్యూస్, న‌మ‌స్తే తెలంగాణ ప‌త్రిక‌ల స్థాప‌న‌లో ఆయ‌న‌ది ప్ర‌ధాన భూమిక‌. తెలంగాణ‌కు సొంత మీడియా సంస్థ‌లు ఉండాల‌ని నాటి ఉద్య‌మ నేత కేసీఆర్‌కు వ‌చ్చిన ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా రెండు మీడియా సంస్థ‌ల‌ను నెల‌కొల్ప‌డంలో దామోద‌ర్ రావు త‌న స‌హ‌కారం అందించారు. తెలంగాణ బ్రాడ్ కాస్టింగ్‌(టీ న్యూస్ చానెల్‌)కు తొలి మేనేజింగ్ డైరెక్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించిన దామోద‌ర్ రావు.. ప్ర‌స్తుతం డైరెక్ట‌ర్‌గా కొన‌సాగుతున్నారు. తెలంగాణ ఉద్య‌మం ఉవ్వెత్తున కొన‌సాగుతున్న స‌మ‌యంలోనే తెలంగాణ ప‌బ్లికేష‌న్స్‌ను ఏర్పాటు చేయాల‌ని సీఎం కేసీఆర్ త‌ల‌చిన వెంట‌నే దాని ఏర్పాటుకు చ‌ర్య‌లు తీసుకున్నారు. తెలంగాణ ప‌బ్లికేష‌న్స్‌(న‌మ‌స్తే తెలంగాణ‌, తెలంగాణ టుడే దిన‌ప‌త్రిక‌లు) కు చైర్మ‌న్, మేనేజింగ్ డైరెక్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 1958 ఏప్రిల్ 1న జ‌న్మించిన దామోద‌ర్ రావుకు భార్య‌, కూతురు, కుమారుడు ఉన్నారు.

పార్థ‌సార‌థిరెడ్డి.. ఫార్మ‌సీ టు పార్ల‌మెంట్‌..
ఖ‌మ్మం జిల్లా స‌త్తుప‌ల్లికి చెందిన బండి పార్థ‌సార‌థిరెడ్డి హెటిరో డ్ర‌గ్స్ వ్య‌వ‌స్థాప‌కుడు. వేంసూరు మండ‌లం కందుకూరు గ్రామంలో జ‌న్మించిన పార్థ‌సార‌థిరెడ్డి కందుకూరులో డిగ్రీ పూర్తి చేసి ఓ ప్ర‌యివేటు కంపెనీలో ప‌ని చేస్తూనే హెటిరో సంస్థ‌ను స్థాపించారు. త‌న సంస్థ ద్వారా దాదాపు ప‌ది వేల మందికి పైగా ఉద్యోగుల‌కు ఉపాధి క‌ల్పిస్తున్నారు. స్వ‌గ్రామ‌మైన కందుకూరులో క‌ల్యాణ‌మండ‌పం, సాయిబాబా దేవాల‌యాన్ని నిర్మించారు. ప‌లు విద్యాసంస్థ‌లు స్థాపించి విద్యావేత్త‌గా సేవ‌లందిస్తున్నారు. ఖ‌మ్మం జిల్లాలోని ప‌లు గ్రామాల్లో జ‌రిగే అనేక కార్య‌క్ర‌మాల‌కు గుప్తదానాలు చేస్తార‌ని పార్థ‌సార‌థిరెడ్డికి పేరు ప్ర‌తిష్ట‌లున్నాయి. ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో విరివిగా పాల్గొనే పార్థ‌సార‌థిరెడ్డికి భార్య‌, కుమారుడు ఉన్నారు.

వ‌ద్దిరాజు ర‌విచంద్ర నేప‌థ్యం..
వ‌ద్దిరాజు ర‌విచంద్ర 1964, మార్చి 22న మ‌హ‌బూబాబాద్ జిల్లా కేస‌ముద్రం మండ‌లం ఇనుగుర్తి గ్రామంలో జ‌న్మించారు. ఈయ‌న‌కు భార్య విజ‌య‌ల‌క్ష్మి, కూతురు గంగా భ‌వాని, కుమారుడు సాయి నిఖిల్ చంద్ర ఉన్నారు. గ్రానైట్ వ్యాపారం నిర్వ‌హిస్తున్నారు. తెలంగాణ గ్రానైట్ క్వారీ ఓన‌ర్స్ అసోసియేష‌న్ రాష్ట్ర అధ్య‌క్షులుగా కొన‌సాగుతున్నారు. తెలంగాణ మున్నూరుకాపు ఆల్ అసోసియేష‌న్ జేఏసీ గౌర‌వ అధ్య‌క్షులుగా ఉన్నారు. త‌న సొంతూరులో బ‌డులు, గుడులు, ర‌హ‌దారులు, తాగునీటి సదుపాయాలు, విద్యుత్ సౌక‌ర్యాల‌ను క‌ల్పించి.. గ్రామ‌స్తుల హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు. ఇక ప్ర‌తి పండుగ‌కు త‌న వంతు ఆర్థిక సాయం చేసి.. అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగేలా స‌హ‌క‌రించారు.

మేడారం ఆల‌య అభివృద్ధికి త‌న వంతు ఆర్థిక సాయం చేశారు. 2016 లో జ‌రిగిన జాత‌ర సంద‌ర్భంగా రూ. 3.5 కోట్లు వెచ్చించి అమ్మ‌వార్ల గ‌ద్దెలు, క్యూలైన్ల‌కు గ్రానైట్ రాళ్లు, స్టీల్ రెయిలింగ్‌తో ఆధునీక‌రించారు. 2018లో సుమారు రూ. 20 ల‌క్ష‌లు వెచ్చించి మ‌రికొన్ని క్యూలైన్ల‌ను ఆధునీక‌రించారు. వివిధ ప్రాంతాల నుంచి 122 ర‌కాల పూల‌ను తీసుకొచ్చి అమ్మ‌వారి గ‌ద్దెల చుట్టూ అలంక‌రించారు.

ఖ‌మ్మం గ్రానైట్ ప‌రిశ్ర‌మ‌కు గాయ‌త్రి ర‌వి క్వారీలే జీవ‌నాధారం అని చెప్పొచ్చు. ఖ‌మ్మంలో సుమారు 500 స్లాబ్ ఫ్యాక్ట‌రీలు, వాటిలో 2000 క‌ట్ట‌ర్లు, 150 టైల్స్ ఫ్యాక్ట‌రీలు, మ‌రో 10 ఎక్స్‌పోర్ట్ యూనిట్‌లు మ‌నుగ‌డ సాగిస్తున్నాయి. ఈ ఫ్యాక్ట‌రీల‌పై ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా సుమారు ల‌క్ష మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. ఇంత‌టి భారీ ప‌రిశ్ర‌మ‌కు 60 నుంచి 70 శాతం ముడి గ్రానైట్.. గ్రాయ‌త్రి గ్రానైట్ సంస్థ నుంచే స‌ర‌ఫ‌రా అవుతోంది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.