Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

టీఆర్‌ఎస్ శంఖారావం

-1 నుంచి 11 వరకు లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశాలు
-కార్యకర్తలకు నిర్దేశించనున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
-16 సీట్ల గెలుపు లక్ష్యంగా ప్రణాళిక
-మండలిలో ప్రభుత్వ విప్, టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డి

మరికొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు విడుదల కానున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల శంఖారావం పూరించడానికి సిద్ధమైంది. గత నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయాన్ని నమోదుచేసిన టీఆర్‌ఎస్.. అదే దూకుడును లోక్‌సభ ఎన్నికల్లోనూ ప్రదర్శించడానికి సన్నద్ధమవుతున్నది. రాష్ట్రంలో 16 లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలను సిద్ధంచేయడానికి లోక్‌సభ నియోజకవర్గాల సన్నాహక సమావేశాలను నిర్వహించనున్నారు. మార్చి 1 నుంచి 11 వరకు ఈ సమావేశాలు జరుగుతాయి. కనీసం 15 వేల మందితో ఈ సమావేశాలను నిర్వహించనున్నారు. వీటన్నింటికీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు హాజరవుతారు. అసెంబ్లీ ఎన్నికల కంటే ఎక్కువ మెజార్టీ వచ్చేవిధంగా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని, ఈ సమావేశాల తర్వాతే లోక్‌సభ ఎన్నికల అభ్యర్థులను ప్రకటిస్తారని పార్టీ ప్రధాన కార్యదర్శి, మండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో పార్టీ కార్యదర్శి గట్టు రాంచందర్‌రావుతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల తర్వాత సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించబోతున్నారన్నారు.

ఎన్నికల తర్వాత ప్రాంతీయపార్టీలు కేంద్రంలో ప్రధానభూమిక నిర్వహిస్తాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 17 స్థానాల్లో 16 స్థానాలు గెలుచుకునే విధంగా పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ వ్యూహాన్ని, ప్రణాళికను సిద్ధంచేశారని తెలిపారు. కేంద్రంలో ఎన్డీయేకు 200 సీట్లు కూడా రావని, కాంగ్రెస్ పార్టీ పెద్ద సైజు ప్రాంతీయ పార్టీగా మారిందని అన్నారు. ఈ రెండు పార్టీలకు కేంద్రంలో స్పష్టమైన మెజార్టీ రాదని పల్లా చెప్పారు. ఒకప్పుడు దేశంలో గుజరాత్, కేరళ మోడల్‌గా ఉండేవని, ప్రస్తుతం తెలంగాణ మోడల్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని చెప్పారు. డిజిటల్ విలేజ్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతుబీమా, టీఎస్‌ఐపాస్, శాంతిభద్రతలు.. ఇలా అనేక పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని తెలిపారు. వ్యవసాయం, పారిశ్రామికరంగాల్లో దేశంలో ఎవరూచేయని విధంగా సీఎం కేసీఆర్ పథకాలను అమలుచేస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ కిట్, షాదీముబారక్, కల్యాణలక్ష్మి లాంటి ఎన్నో పథకాలను అమలుచేశారన్నారు. ఇటీవల హైదరాబాద్ వచ్చిన 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్‌కే సింగ్.. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రశంసించారని గుర్తుచేశారు. సీఎం ముందుచూపు, అవగాహనను ఆర్థిక శాస్త్రవేత్తలు ప్రశంసించారని తెలిపారు.

మాదే మెజార్టీ
ఎమ్మెల్యే కోటాలో జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌పార్టీకి మెజార్టీ లేదంటూ కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలపై పల్లా స్పందించారు. టీఆర్‌ఎస్, ఎంఐఎంలకు కలిపి 98 మంది సభ్యులున్నారని, ఐదుగురు అభ్యర్థులకు కలిపితే 19.6 ఓట్లు వస్తున్నాయని, కాంగ్రెస్ పార్టీకి ఉన్నది 19 ఓట్లేనని చెప్పారు. కాంగ్రెస్‌తో పొత్తులేదని ఇటీవలే చంద్రబాబు ప్రకటించారని, ఇక వారితో కలిపి లెక్కలు ఏ విధంగా వేసుకుంటారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో బలం లేనప్పుడు పోటీచేయకుండా ఉంటే గౌరవప్రదంగా ఉంటుందని అన్నారు.

ప్రతిరోజూ రెండు సమావేశాలు.
మార్చి ఒకటోతేదీ మినహా ప్రతిరోజు రెండు సన్నాహక సమావేశాలు జరుగుతాయని పల్లా తెలిపారు. ఉదయం 10.30 గంటలకు మొదటి సమావేశం జరుగుతుంది. రెండో సమావేశాన్ని మధ్యాహ్నం 2.30 గంటలకు నిర్వహిస్తారు. మహాశివరాత్రి పండుగ సందర్బంగా మార్చి 4, 5 తేదీల్లో సమావేశాలను నిర్వహించడం లేదు. దాదాపు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోనే సభలు నిర్వహిస్తున్నారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి దాదాపుగా రెండువేల మంది హాజరుకానున్నారు. మొత్తం 15వేల మందితో ఒక్కో నియోజకవర్గసభ జరుగనుంది. సమావేశం అనంతరం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అక్కడే బస కూడా చేసే అవకాశమున్నది. అక్కడి ముఖ్యనాయకులను కూర్చోబెట్టి సమన్వయం చేస్తారు. పార్టీ విజయానికి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారు. సన్నాహక సమావేశాలకు జిల్లా మంత్రి, లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఇంచార్జి కార్యదర్శులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, పట్టణ స్థానిక సంస్థల ప్రతినిధులు, గ్రామస్థాయి పార్టీ అధ్యక్షులు, గ్రామ రైతుసమన్వయ సమితి కోఆర్డినేటర్లు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామసర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యులు, నియోజకవర్గ స్థాయి నాయకులు హాజరుకానున్నారు.

టీడీపీ ఓటమిని సర్వేలే చెప్పాయి
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ఓడిపోబోతున్నదనేది సర్వే సంస్థలన్నీ చెప్పిన విషయాన్నే టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారని, దానికి టీడీపీ నేతలకు వణుకెందుకని పార్టీ కార్యదర్శి గట్టు రాంచందర్‌రావు ప్రశ్నించారు. చంద్రబాబు ప్రస్ట్రేషన్‌లో ఏదేదో మాట్లాడుతున్నారని అన్నారు. ఏపీలో టీడీపీ 44 శాతం నుంచి 32 శాతానికి ఓట్లు పడిపోతున్నాయని సర్వేలన్నీ చెప్పాయని తెలిపారు. ముసుగు వేసుకున్నది చంద్రబాబేనని, పొద్దున బీజేపీతో సాయంత్రం కాంగ్రెస్‌తో పొత్తు పోవడం ఆయనకే అలవాటన్నారు. చంద్రబాబునాయుడు ఏనాడైనా ఒంటరిగా పోటీచేశారా అని ఎద్దేవాచేశారు. ఆంధ్రలో కూడా కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు అమలుకావాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. చంద్రబాబును కలిసిన తెల్లవారే ములాయంసింగ్ బీజేపీకి జై అన్నారని, శివసేన కూడా బీజేపీతోపొత్తు పెట్టుకున్నదని తెలిపారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఏపీలో పర్యటిస్తే అభ్యంతరం చెప్పడాన్ని ఆయన ప్రశ్నించారు.

కరీంనగర్‌లో తొలి సమావేశానికి ఏర్పాట్లు
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ముఖ్యకార్యకర్తలు, నాయకులతో మార్చి ఒకటిన సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నట్టు ఎంపీ బీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. కరీంనగర్‌లోని ఎస్సారార్ కళాశాలలో నిర్వహిస్తున్న ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యకార్యకర్తలు, నాయకులు పది వేల మందితో ఈ సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. సమావేశం జరిగే ఎస్సారార్ కళాశాల మైదానాన్ని ఆదివారం కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పలువురు నాయకులతో కలిసి పరిశీలించారు. సమావేశానికి ముఖ్యకార్యకర్తలు, నాయకులు సకాలంలో హాజరుకావాలని పిలుపునిచ్చారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.