Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

నేటి నుంచి టీఆర్‌ఎస్ శిక్షణ తరగతులు

-గులాబీ సాగరంగా.. నాగార్జునసాగర్ -ముందే చేరుకున్న సీఎం కేసీఆర్ -రహదారిపై స్వాగత తోరణాలు -పరిసరాలను పరిశీలిస్తూ నెమ్మదిగా ముందుకుసాగిన సీఎం కాన్వాయ్ -విజయవిహార్‌లో తరగతుల ఏర్పాట్ల పరిశీలన -ఉదయం పది గంటలకు ప్రారంభ సమావేశం.. – ముఖ్య అతిథులుగా హనుమంతరావు, లింగ్డో – ప్రతి అంశానికి రెండు గంటల సమయం.. -రాత్రి తొమ్మిది వరకు కొనసాగనున్న శిక్షణ

KCR visit to Nagarjunasagar

ప్రజాప్రతినిధులకు అనేక అంశాలపై విస్తృత అవగాహన కల్పించడంతోపాటు ప్రజలకు మరింత చేరువయ్యేందుకుగాను తెలంగాణ రాష్ట్ర సమితి నిర్వహిస్తున్న రాజకీయ శిక్షణ తరగతులు మరికొన్ని గంటల్లో మొదలు కానున్నాయి. నాగార్జునుడి సాన్నిహిత్యంలో.. కృష్ణమ్మ చెంత.. భారీ ఏర్పాట్ల మధ్య ఈ తరగతులు శనివారం ఉదయం ప్రారంభం కానున్నాయి. మూడు రోజులపాటు జరగనున్న ఈ శిక్షణ కార్యక్రమాలకు ముందు రోజే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతోపాటు తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయ శిక్షణ తరగతులకు సర్వం సిద్ధమైంది.

శనివారం ఉదయం విజయవిహార్‌లోని సమాగమం కాన్ఫరెన్స్ హాల్‌లో పది గంటలకు ప్రారంభ సమావేశం నిర్వహించనున్నారు. గంట వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిసింది. దీనికి ముఖ్య అతిథులుగా ప్రముఖ ఆర్థికవేత్త సీహెచ్ హనుమంతరావు, కేంద్ర ఎన్నికల సంఘం మాజీ ప్రధాన కమిషనర్ లింగ్డో హాజరవుతున్నారు. వీరిద్దరితో పాటు వేదికపై రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, పార్టీ పార్లమెంటరీ నాయకులు కే కేశవరావు (రాజ్యసభ), జితేందర్‌రెడ్డి (లోక్‌సభ), అస్కి (అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా) డైరెక్టర్ జనరల్ రవికాంత్ ఆసీనులవుతారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలనతో శిక్షణ తరగతులను ప్రారంభిస్తారు. తొలుత ముఖ్య అతిథులు ప్రసంగించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమం అనంతరం విరామం ఇస్తారు.

రాత్రి దాకా తరగతులు విరామం తర్వాత తిరిగి అందరూ కాన్ఫరెన్స్ హాల్‌లో సమావేశం కానున్నారు. అనంతరం అంశాలవారీగా శిక్షణ తరగతులు కొనసాగుతాయి. మొదటి రోజు ఐదు అంశాలపై తరగతులు నిర్వహిస్తారు. ప్రతి అంశానికి రెండు గంటల సమయం కేటాయించనున్నారు. తొలి గంటలో సంబంధిత వక్త, నిపుణుడి లెక్చర్ ఉంటుంది. ఆతర్వాత ప్రజాప్రతినిధులు తమ సందేహాలను వ్యక్తం చేయడం, నిపుణులతో ముఖాముఖి ఉంటుంది. శనివారం తొలి రోజు కావడం, ప్రారంభ సమావేశం ఉన్న దరిమిలా తరగతులు ఆలస్యంగా మొదలు కానున్నాయి. ఈ నేపథ్యంలో రాత్రి తొమ్మిది దాటిన తర్వాత కూడా తరగతులు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తొలిరోజు అంశాలు మొదటిరోజు శిక్షణ తరగతులు నిర్వహించే అంశాలు ఇలా ఉన్నాయి… – ప్రజాస్వామ్యం – డాక్టర్ రవీంద్రశాస్త్రి, రిటైర్డ్, ప్రొఫెసర్ ఉస్మానియా యూనివర్సిటీ – సెంట్రల్‌ఫర్ గుడ్ గవర్నెన్స్ (సుపరిపాలన) జే లక్ష్మి, కార్తిక్ (సీజీజీ ప్రోగ్రాం మేనేజర్లు) – గ్రీన్ కవర్, ఫారెస్ట్, పర్యావరణ సంబంధిత అంశాలు, విపత్తుల నిర్వహణ కే తిరుపతయ్య, ఐఎఫ్‌ఎస్ అధికారి, ఎంసీహెచ్‌ఆర్‌డీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ – వ్యర్థాల నిర్వహణ – అస్కి డైరెక్టర్ జనరల్ రవికాంత్ – గ్రామీణాభివృద్ధి కే తిరుపతయ్య, ఐఎఫ్‌ఎస్ అధికారి, ఎంసీహెచ్‌ఆర్‌డీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ – పట్టణాభివృద్ధి – ప్రొఫెసర్ శ్రీనివాసచారి, అస్కి సెంటర్ డైరెక్టర్

రెండోరోజు మరో ఐదు అంశాలు మొదటి రోజు ఐదు అంశాలుకాగా.. రెండో రోజు 3వ తేదీన కూడా మిగిలిన ఐదు అంశాలపై శిక్షణ తరగతులు జరగనున్నాయి. రెండో రోజు ఉదయం 9 గంటలకే తరగతులు మొదలుకానున్నట్లు తెలిసింది.

రెండో రోజు అంశాలిలా ఉన్నాయి… -పరిశ్రమలు, గనులు, ఐటీ – డాక్టర్ సురేందర్‌రెడ్డి, అస్కి మాజీ డైరెక్టర్ -శాంతిభద్రతలు – ఎం మహేందర్‌రెడ్డి, హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ -పార్లమెంటరీ ప్రక్రియ, శాసనసభ విధానాలు – ఎస్ రాజాసదారాం, అసెంబ్లీ కార్యదర్శి -వ్యవసాయం – డాక్టర్ ప్రవీణ్‌రావు, ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయ ప్రత్యేక అధికారి -ఎకానమీ, తెలంగాణ ఆర్థిక పరిస్థితులు జీడీ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు మంత్రులు, ప్రజాప్రతినిధులందరూ సాగర్‌కు చేరుకున్నారు. దీంతో రాష్ట్ర పాలన యంత్రాంగం అంతా నాగార్జునుడి చెంతనే కొలువుదీరింది. హైదరాబాద్ నుంచి నాగార్జునసాగర్ వరకు రహదారితోపాటు సాగర్ కూడా సరికొత్త శోభను సంతరించుకుంది.

టీఆర్‌ఎస్ శిక్షణ తరగతుల సందర్భంగా నాగార్జునసాగర్‌లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సాగర్‌లోని విజయవిహార్‌లో ఉన్న సమాగమం హాలులో తరగతుల నిర్వహణకు అన్ని ఏర్పాట్లుచేశారు. హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యంకోసం ప్రత్యేక లైన్ తీసుకున్నారు. భారీ స్క్రీన్ ఏర్పాటుచేశారు. విజయవిహార్‌లోని సూట్‌లో సీఎం కేసీఆర్‌కు బస ఏర్పాటు చేశారు. సరోవర్‌లో మంత్రులు, జెన్‌కో అతిథి గృహంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బసకు ఏర్పాట్లు చేశారు. బుద్ధవనం, ప్రాజెక్టు హౌస్, యూత్ హాస్టల్, ఇతర అతిథి గృహాలన్నీ కూడా వీఐపీ వెంట వచ్చిన వారికోసం కేటాయించారు. సీఎం కేసీఆర్ శుక్రవారం సాయంత్రమే నాగార్జునసాగర్ చేరుకున్నారు.

సీఎం క్యాంపు కార్యాలయం నుంచి సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో బయలుదేరిన ఆయన.. సాగర్‌కు చేరుకోవడానికి రెండున్నర గంటల సమయం పట్టింది. సాధారణంగానైతే సీఎం వస్తుండటంతో ట్రాఫిక్ పూర్తిగా నిలిపేస్తారు. దీంతో చాలా తక్కువ సమయంలోనే సాగర్‌కు చేరుకునే అవకాశముంటుంది. కానీ, కేసీఆర్ కాన్వాయ్ గంటకు 80 కిలోమీటర్ల కంటే తక్కువ వేగంతోనే ముందుకు కదిలింది. హైదరాబాద్ నుంచి బయలుదేరడం మొదలు పరిసరాలను పరిశీలించుకుంటూ ముందుకు సాగారు. మునుగోడు, దేవరకొండ, నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లోని పరిస్థితులను తెలుసుకునేందుకే నెమ్మదిగా కాన్వాయ్ వెళ్లినట్లుగా తెలుస్తున్నది.

భారీ స్వాగత ఏర్పాట్లు.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు హైదరాబాద్-నాగార్జునసాగర్ రహదారిపై భారీ ఎత్తున స్వాగతం లభించింది. సీఎం క్యాంపు కార్యాలయం నుంచి మెట్టుగూడ, తార్నాక, ఉప్పల్, ఎల్బీనగర్ మీదుగా సీఎం కాన్వాయ్ రాష్ట్ర రహదారిపైకి ప్రవేశించింది. ఈ మార్గం పూర్తిగా గులాబీ జెండాలు, ఫ్లెక్సీలతో నిండిపోయింది. ఇబ్రహీంపట్నంవద్ద స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితోపాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. అక్కడ వాహనం దిగిన సీఎం కేసీఆర్ బొకే తీసుకున్న వెంటనే తిరిగి వాహనంలోకి ఎక్కారు. ఆ తర్వాత రహదారి వెంట జిల్లా మంత్రి జీ జగదీశ్‌రెడ్డి, నల్లగొండ జెడ్పీ చైర్మన్ బాలూనాయక్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పార్టీ నేత తేర చిన్నపరెడ్డి,ఎమ్మెల్యేవేములవీరేశం తదితరులు సీఎంకు స్వాగతం పలికే ఫ్లెక్సీలు భారీగా ఏర్పాటు చేశారు.

వస్తూనే ఏర్పాట్లను పరిశీలించిన సీఎం ముఖ్యమంత్రి కేసీఆర్ సాగర్‌లోని విజయవిహార్‌కు సాయంత్రం ఏడు గంటలకు చేరుకున్నారు. తొలుత తనకోసం ఏర్పాటుచేసిన సూట్‌లోకి వెళ్లి.. ఫ్రెషప్ అయ్యారు. వెంటనే కాన్ఫరెన్స్ హాల్ సమాగమంకు వెళ్లి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జలగం వెంకట్రావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఏర్పాట్లను వివరించారు. అనంతరం విజయవిహార్‌లో సీఎం కేసీఆర్ కలియ తిరిగారు. మంత్రుల బస కోసం ఏర్పాటు చేసిన గదులను కూడా పరిశీలించారు. ఆ తర్వాత రాత్రి 8.30 గంటల ప్రాంతంలో భోజనం చేసిన ఆయన.. ఆపై పలువురు మంత్రులు, పార్టీ ముఖ్యులతో సమావేశమయ్యారు.

నిష్ణాతులతో శిక్షణ కార్యక్రమం నాగార్జునసాగర్: మూడు రోజులపాటు నిర్వహించే టీఆర్‌ఎస్ రాజకీయ శిక్షణ తరగతులలో పలువురు నిష్ణాతులు వివిధ అంశాలపై బోధిస్తారని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి సముద్రాల వేణుగోపాలాచారి చెప్పారు. శుక్రవారం నాగార్జున సాగర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శిక్షణ కార్యక్రమం పూర్తిగా పార్టీది అయినందున.. ఖర్చు పెట్టే ప్రతి పైసా పార్టీదేనని స్పష్టంచేశారు. ముఖ్యమంత్రి బస, భోజన ఏర్పాట్లకు అయ్యే ఖర్చును సైతం పార్టీనే భరిస్తుందని తెలిపారు. సీఎం, మంత్రుల వంటి వీఐపీలు ఉన్నందున పోలీసు శాఖ బందోబస్తు నిర్వహిస్తున్నదని చెప్పారు. శిక్షణ మూడు రోజులు కూడా దేశ, రాష్ట్ర ఆర్థిక అంశాల మీద ప్రధానంగా సాగుతుందని చెప్పారు.

దేశ వ్యాప్తంగా నరేంద్ర మోదీ ప్రవేశ పెట్టిన స్మార్ట్‌సిటీల తరహాలోనే.. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం వరంగల్, కరీంనగర్ వంటి పట్టణాలను ఆ స్థాయిలో అభివృద్ధి చేయనున్నారని పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులు ప్రజలతో మమేకమవుతూ పని చేయాలని.. ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలన్నీ కూడా అర్హులకు అందేలా చూడాలని నిష్ణాతులతో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు వేణుగోపాలాచారి వివరించారు. టీఆర్‌ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు పేర్వారం రాములు మాట్లాడుతూ.. యువ ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. టీఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధులందరు ప్రజలకు చేరువ కావడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని చెప్పారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.