-కేసీఆర్ పాలనలో అన్నిరంగాల్లో అభివృద్ధి -బీసీల్లో కలుపాలన్న 17 కులాల కల సాకారం -బీసీల కోసం కొత్తగా 261 గురుకులాలు, 19 కాలేజీలు -కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసేందేమీలేదు -దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు -మీడియాతో బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల

బీసీలు జీవితాంతం టీఆర్ఎస్ వెన్నంటే ఉంటారని బీసీ సంక్షేమం, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బీసీలకు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా గుర్తింపుఇచ్చారని.. ఉన్నతవర్గాలకు దీటుగా అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. కేంద్రప్రభుత్వం బీసీలకు ఏంచేసిందో చెప్పాలని బీజేపీ నేతలను ప్రశ్నించారు. బుధవారం తెలంగాణభవన్‌లో ఆయ న మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీసీలు సీఎం కేసీఆర్‌ను దైవ సమానులుగా భావిస్తున్నారని.. ఆయన తమవద్ద ఎందుకు పుట్టలేదా అని పలురాష్ట్రాల ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రజలు కేసీఆర్ నాయకత్వం కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. బీసీలకు కేంద్రం ప్రభుత్వం చేసిందేమీ లేదని.. అలాంటప్పుడు వారు బీజేపీవైపు ఎలా ఉండగలరో చెప్పాలని ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు లక్ష్మణ్‌ను ప్రశ్నించారు. బీసీలు బీజేపీ దరికూడా చేరరని అన్నారు. బీసీలు వేరు టీఆర్ఎస్ వేరు కాదని.. భూమ్మీద టీఆర్ఎస్ ఉన్నంతకాలం ఆ పార్టీ వెన్నంటే ఉంటారని, కేసీఆర్ వెంటే నడుస్తారని చెప్పారు.
బీసీల కోసం 18ఏండ్లలో రూ.16,200 కోట్లు కేటాయిస్తే.. కేసీఆర్ సీఎం అయ్యాక ఆరేండ్లలోనే రూ.26,900 కోట్లు కేటాయించారని గుర్తుచేశారు. తమను బీసీల్లో కలపాలనే 17 కులాల కలను కేసీఆర్ సాకారంచేశారని చెప్పారు. ఉమ్మడిరాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో 19 మాత్రమే బీసీ గురుకులాలు ఉండగా.. నేడు 261 బీసీ గురుకులాలు, 19 గురుకుల కాలేజీలు ఉన్నాయని తెలిపారు. సిరిసిల్ల ఉరిసిల్లగా ఉండేదని.. కానీ నేడు అక్కడ నేతన్నకు చేతినిండా పనిదొరుకుతున్నదని చెప్పారు. యాదవులకు గొర్రెలు, మత్స్యకారులకు చేపపిల్లలను ఉచితంగా పంపిణీ చేశామన్నారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటుచేయాలని కోరినా ప్రధానమంత్రి స్పందించడం లేదని విమర్శించారు. కేంద్రం లో బీసీ మంత్రిత్వశాఖ కోసం సీఎం కేసీఆర్.. వివిధ రాష్ర్టాలతో మాట్లాడి కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తున్నారని చెప్పారు.
చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ.. బీసీలు ఆర్థికంగా ఎదిగేందుకు ఎన్నోపథకాలను రూపొందించారన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమపథకాల లాంటి వి బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడైనా అమలుచేస్తున్నారా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ.. లక్ష్మణ్‌కు బీజేపీలో ఒక డమ్మీపోస్టు ఇచ్చారని, ఒకవేళ ఆ పోస్టుకు పవర్ ఉంటే బీసీల హక్కులు, డిమాండ్లకోసం పోరాడాలని డిమాండ్‌చేశా రు. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ మతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకోవాలనుకోవడం బీజేపీ వారికి అలవాటేనని అన్నారు. ప్రధాని మోదీ ఓబీసీ అయిఉండి ఆ వర్గాలకు చేసిందేమీలేదని ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్నారు.