ఉద్యోగుల స్థానికత, సీమాంధ్ర ఉద్యోగులు ఇస్తున్న నివేదికల్లోని వాస్తవాలను తెలుసుకునేందుకు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో వార్‌రూం ప్రారంభమైంది. తెలంగాణభవన్‌లో ఒక రూంలో వార్‌రూం ఏర్పాటు చేశారు. -వెబ్సైట్, మెయిల్ఐడీలకు ఫిర్యాదులు చేయండి -జూన్ రెండు తరువాత ఉద్యోగుల పంపిణీపైనే దృష్టి: హరీశ్‌రావు

శనివారం నుంచి వార్‌రూం పని ప్రారంభిస్తుంది. టీఆర్ఎస్ నేత హరీశ్‌రావు నేతత్వంలో పనిచేసే ఈ వార్‌రూం కమిటీలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ స్వామిగౌడ్, రిటైర్డ్ ఐఏఎస్‌లు ఉన్నారు. ఉద్యోగులు యూనిట్ల వారీగా అక్కడున్న సీమాంధ్ర ఉద్యోగుల వివరాలను సవివరంగా ఈ వార్‌రూంకు అందజేయవచ్చు. జూన్ రెండు తరువాత ప్రభుత్వం ఏర్పాటవుతున్నందున ఆ తరువాత ఈ కమిటీ ప్రభుత్వానికి ఒక నివేదికను అందజేస్తారు. నివేదిక ఆధారంగా ప్రభుత్వం సీమాంధ్ర ఉద్యోగులను ఆంధ్రకు పంపేందుకు చర్యలు తీసుకోనున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.
www.trswarroom.org అనే వెబ్‌సైట్‌కు, [email protected] ఈమెయిల్‌కు ఫిర్యాదులు అప్లోడ్ చేయవచ్చని తెలిపారు. శుక్రవారం ఈ వార్‌రూంను హరీశ్‌రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగుల పంపకాలపై ఏమైనా ఫిర్యాదులుంటే వార్‌రూంకు వివరాలు అందజేయాలని, మోహమాటానికి పోకుండా ఉపాధ్యాయులు, రెవెన్యూ ఉద్యోగులు, గ్రూప్ 2 ఉద్యోగులందరూ సీమాంధ్ర ఉద్యోగుల వివరాలు అందజేయాలని కోరారు. వెబ్సైట్లో ఏమైనా వివరాలు పంపాలనుకున్నా జిరాక్స్‌లు అప్లోడ్ చేయవచ్చని తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఇష్టం వచ్చినట్లుగా, నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఉద్యోగుల స్థానికతపై కేసీఆర్ రాజకీయాల కోసమే మాట్లాడుతున్నారని అంటున్నారని, ఇన్నాళ్లూ వారు ప్రభుత్వంలో ఉండి రాజకీయాల కోసమే నిర్ణయాలు తీసుకున్నారా..? అని ప్రశ్నించారు. ఉద్యోగుల స్థానికతపై జూన్ 2న కాంగ్రెస్, టీడీపీల నైజం బయటపడుతుందని అన్నారు.