Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

టీఆర్‌ఎస్‌దే ప్రభంజనం

-స్థానాల్లో విజయం.. కూటమికి పరాభవమే
-ప్రతిపక్షాల కన్నా రెండున్నర రెట్లు ఎక్కువ సీట్లు టీఆర్‌ఎస్‌కు..
-34 నుంచి 37.5కు ఓట్లశాతాన్ని పెంచుకున్న గులాబీ పార్టీ
-గ్రేటర్ హైదరాబాద్‌లో కారుజోరు.. నవంబర్ 12-18 తేదీల మధ్య సర్వే
-ఎన్నికల నాటికి 100 సీట్లు దాటే అవకాశముందంటున్న నిపుణులు
-కాంగ్రెస్-టీడీపీ పొత్తును తిరస్కరించిన 52.44శాతం ప్రజలు
-తెలంగాణలో తెలుగుదేశం కనుమరుగే
-మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి తేల్చిచెప్పిన టైమ్స్‌నౌ-సీఎన్‌ఎక్స్ సర్వే

ఎన్ని కూటములు కట్టినా, ఎందరు పొత్తులు పెట్టుకున్నా.. తెలంగాణ రాష్ట్ర సమితి జైత్రయాత్ర కొనసాగుతుందని జాతీయసంస్థల సర్వేలు స్పష్టంచేస్తున్నాయి. తెలంగాణ గడ్డమీద టీఆర్‌ఎస్‌ను తప్ప మరోపార్టీని ఆదరించేది లేదని ప్రజలు కుండబద్దలు కొడుతున్నారు. డిసెంబర్ 7న జరిగే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ మరోసారి ప్రభంజనం సృష్టిస్తుందని టైమ్స్‌నౌ-సీఎన్‌ఎక్స్ ప్రీపోల్ సర్వే తేల్చిచెప్పింది. కూటమికి పరాభవం తప్పదని పేర్కొంది. గత ఎన్నికలతో పోల్చితే టీఆర్‌ఎస్ ఓట్లశాతం 37.55కు పెరిగిందని తెలిపిన సర్వే.. గులాబీపార్టీ 70 సీట్లను కైవసం చేసుకుంటుందని వెల్లడించింది. ఎన్నికలనాటికి వందసీట్లకు పైగా ఆ పార్టీ సాధిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక రాహుల్-చంద్రబాబు పొత్తును ఇక్కడి ప్రజలు నిర్దంద్వంగా తిరస్కరిస్తున్నట్లు వెల్లడైంది. ఈ నెల 12-18 తేదీ మధ్య రాష్ట్రవ్యాప్తంగా 4,800మంది ఓటర్ల నుంచి అభిప్రాయాలను సేకరించిన టైమ్స్‌నౌ-సీఎన్‌ఎక్స్.. శుక్రవారం సర్వే వివరాలను ప్రకటించింది. సర్వే అంచనాలు.. వాస్తవ ఫలితాలకు మూడు శాతం తేడా ఉండవచ్చునని తెలిపింది.

తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్‌కు అధికారాన్ని అందించిన గత ఎన్నికల్లో.. గులాబీ పార్టీ 34.3 శాతం ఓట్లను సాధించింది. ఈ సారి ఆ ఓట్లు 3.25శాతం పెరిగి 37.55శాతానికి చేరుతాయని సర్వే అంచనా వేసింది. కాంగ్రెస్‌కు 27.98శాతం ఓట్లు మాత్రమే దక్కే అవకాశముందని పేర్కొన్నది. టీడీపీ 5.66 శాతం, ఎంఐఎం 4.10 శాతం, బీజేపీ 11 శాతం ఓట్లు సాధిస్తుండగా, వారికన్నా ఇతరులు అత్యధిక శాతం ఓట్లు (17.81శాతం) పొందుతారని సర్వేలో వెల్లడైంది. నవంబర్ 18నాటి అంచనాల ఆధారంగా.. టీఆర్‌ఎస్ 70 స్థానాలను కైవసం చేసుకుంటుందని తేలింది. ఇదంతా కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించకముందు పరిస్థితి. ఈ నెల 19నుంచి ఆయన ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తుండటంతో.. టీఆర్‌ఎస్‌కు మరో 10 నుంచి 20శాతం ఓట్లు పెరుగవచ్చని, 100 స్థానాల వరకు ఆ పార్టీ గెలిచే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక కాంగ్రెస్-టీడీపీ కూటమి మొత్తంగా 33 స్థానాలకే పరిమితమవుతుందని టైమ్స్‌నౌ-సీఎన్‌ఎక్స్ తెలిపింది. తెలంగాణలో టీడీపీ కనుమరుగయ్యే పరిస్థితి ఉన్నదని తెలిపింది. ఆ పార్టీ రెండు స్థానాల్లో మాత్రమే గెలిచే అవకాశముందని, ఎంఐఎం 8, బీజేపీ 3, ఇతరులు ఐదు స్థానాల్లో గెలువవచ్చునని సర్వే అంచనా వేసింది.

కూటమిని అంగీకరించని ప్రజలు
ఈ సర్వేను బట్టి రాహుల్‌గాంధీ-చంద్రబాబు చేతులుకలుపడాన్ని తెలంగాణ సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తున్నది. తెలంగాణ వ్యతిరేక పార్టీగా ముద్ర ఉన్న టీడీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం ద్వారా ఈ ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీశారని 52.44 శాతం మంది బలంగా నమ్ముతున్నారు. కేవలం 33.1శాతంమంది మాత్రం అలాంటిదేమీ లేదని చెప్పారు. ఇక తెలంగాణలో టీడీపీ కనుమరుగైనట్టే కనిపిస్తున్నది. 2014 ఎన్నికల్లో 14.7శాతం ఓట్లను సాధించిన ఆ పా ర్టీ.. తాజా సర్వేలో కేవలం 5.66ఓట్లశాతం దక్కించుకుంది. నాలుగేండ్లలో 9.04 శాతం ఓట్లను కోల్పోవడం మారుతున్న ఓటరు ఆలోచనలకు అద్దం పడుతున్నది అని విశ్లేషించింది.

తిరుగులేని నేత.. కేసీఆర్
తెలంగాణలో కేసీఆర్ నాయకత్వానికి తిరుగులేదని టైమ్స్‌నౌ-సీఎన్‌ఎక్స్ పేర్కొన్నది. కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని ఎక్కువమంది ఓటర్లు కోరుకుంటున్నట్లు తెలిపింది. తెలంగాణ ఏర్పాటులో టీఆర్‌ఎస్ ప్రముఖ పాత్ర పోషించిందని మెజారిటీ ఓటర్ల అభిప్రాయం. తెలంగాణ చాంపియన్ కేసీఆరేనని ప్రజలు స్పష్టంచేస్తున్నారు. కేసీఆర్ వల్లే తెలంగాణ సాధ్యమైందని 45.73శాతంమంది చెప్పడం గమనార్హం అని టైమ్స్‌నౌ తెలిపింది. కాగా, రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ అని 32.9శాతం మంది ఓటర్లు భావిస్తున్నారు. ఇక తెలంగాణలో కాబోయే సీఎం ఎవరనే ప్రశ్నకు.. కేసీఆరేనని ముక్తకంఠంతో చెప్పారు.

45.27శాతం మంది కేసీఆర్ తమ తదుపరి సీఎంగా ఉండాలని కోరుకోగా.. 30.55శాతం మంది ఉత్తమ్‌కుమార్ రెడ్డిని తమ చాయిస్‌గా చెప్పారు. ఇక తెలంగాణ జనసమితి నేత కోదండరాంను కేవలం 3.37శాతం మంది మాత్రమే సమర్థించారు. అదేసమయంలో.. ప్రధానిగా ఎవరు కోరుకుంటున్నారన్న ప్రశ్నకు మోదీ, రాహుల్ మధ్య జనాభిప్రాయంలో పెద్దగా తేడా కనిపించలేదు. 33.61శాతం మంది మోదీ మళ్లీ ప్రధానికావాలని అభిప్రాయపడగా, 30శాతం మంది రాహుల్‌కు ఓటేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేక కూటమిలో టీఆర్‌ఎస్ చేరాలని కోరుకుంటున్న వారి సంఖ్య 42.39శాతం కాగా, 30.7శాతం మంది కూటమికి దూరంగా ఉండాలని అభిప్రాయపడుతున్నారు.

గ్రేటర్‌లో టీఆర్‌ఎస్ దూకుడు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టీఆర్‌ఎస్ గణనీయంగా పుంజుకుందని టైమ్స్‌నౌ-సీఎన్‌ఎక్స్ సర్వే తెలిపింది. మొత్తం 24 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 2014లో టీఆర్‌ఎస్ మూడు సీట్లను గెలుచుకోగా, ఈ సారి ఆ సంఖ్య మూడురెట్లు పెరుగుతుందని తెలిపింది. టీఆర్‌ఎస్ 9 స్థానాల్లో విజయం సాధించనుండగా, ఎంఐఎం-8, కాంగ్రెస్-3, బీజే పీ-3, టీడీపీ ఒక్క సీటును గెలుచుకుంటాయని అంచనా వేసింది. 2014లో తొమ్మిది మంది శాసనసభ్యులను గెలిపించుకున్న టీడీపీకి.. ఈసారి ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటు దక్కతుండటం గమనార్హం. ఇక దక్షిణ తెలంగాణలోని 41 అసెంబ్లీ స్థానాలకుగాను టీఆర్‌ఎస్-21, కాంగ్రెస్-17, టీడీపీ-1, ఇతరులు-2 స్థానాలను గెలిచే అవకాశముంది.

సీఎం సూర్యాపేటకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారు
సీఎం కేసీఆర్ సూర్యాపేట నియోజకవర్గానికి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారు. 2014 ఎన్నికల ప్రచారంలో నన్ను మంత్రిని చేస్తానని, సూర్యాపేటను జిల్లాను చేస్తానని హామీ ఇచ్చారు.. అన్న మాట ప్రకారం రెండూ చేశారు. అడగకుండానే మెడికల్ కళాశాలను వరంగా ఇచ్చారు. సూర్యాపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.3,500 కోట్ల నిధులను కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది. మిషన్ భగీరథలో భాగంగా నాగార్జునసాగర్ నుంచి నీటిని తీసుకువచ్చి సూర్యాపేట ప్రజల దాహార్తిని తీర్చుతున్నాం.
-సూర్యాపేట సభలో టీఆర్‌ఎస్ అభ్యర్థి, మంత్రి జీ జగదీశ్‌రెడ్డి

సీఎం చొరువతోనే మహబూబాబాద్ జిల్లా
మహబూబాబాద్ జిల్లాలో గిరిజనులు అధికంగా ఉన్నారు.. కచ్చితంగా జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరాను. కాని జిల్లాల ఏర్పాటు కమిటీ ఒప్పుకోలేదు. సీఎం కేసీఆర్‌ను ఒప్పించి మానుకోట జిల్లాగా ఏర్పాటు చేసుకున్నాం.
– మహబూబాబాద్ సభలో టీఆర్‌ఎస్ అభ్యర్థి శంకర్‌నాయక్

మరోసారి సీఎం అయ్యేది కేసీఆరే
దేశంలో ఎక్కడా లేని ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుంది. మరోసారి సీఎం అయ్యేది కేసీఆరే. సెగ్మెంట్ పరిధిలో రూ.400 కోట్లతో రోడ్లు నిర్మించాం.
-మరిపెడ సభలో డోర్నకల్ టీఆర్‌ఎస్ అభ్యర్థి రెడ్యానాయక్

అభివృద్ధి వైపు నిలబడాలి
60 ఏండ్ల హత్యారాజకీయాలను వదిలి.. తుంగతుర్తి నియోజకవర్గం ప్రజలంతా నాలుగేండ్ల అభివృద్ధి వైపు నిలుచొని నన్ను ఆశీర్వదించాలి. తుంగతుర్తి నియోజకవర్గాన్ని సీఎం కేసీఆర్ నాయకత్వంలో రూ.1600 కోట్లతో అభివృద్ధి చేశాం.
-తిరుమలగిరి సభలో తుంగతుర్తి టీఆర్‌ఎస్ అభ్యర్థి గ్యాదరి కిశోర్‌కుమార్

కేసీఆర్ నేతృత్వంలో అభివృద్ధి ఉద్యమం
కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర సాధన ఉద్యమం జరిగింది. ఇప్పుడు ఆయన నేతృత్వంలో నే అభివృద్ధి ఉద్యమం జరుగుతున్నది. అభివృద్ధి, సంక్షేమ పథకాలను మరింత వేగంగా ప్రజల్లోకి తీసుకవెళ్లి ఈ ప్రాంతాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు ఈ ఎన్నికల్లో నన్ను ఆశీర్వదించాలి.
-నర్సంపేట సభలో టీఆర్‌ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్‌రెడ్డి

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.