Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే కేసీఆర్‌కు వేసినట్టే

-విలువల్లేని పార్టీలకు ఓట్లు వేయొద్దు
-టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే కేసీఆర్‌కు వేసినట్టే
-కాంగ్రెస్‌కు ఓటేస్తే ఢిల్లీ చుట్టూ తిరుగుతరు..
-టీడీపీకి ఓటేస్తే అమరావతికి పోతరు
-మన ఆత్మగౌరవాన్ని అమరావతికి తాకట్టు పెడుదామా?
-తెలంగాణ స్వాభిమానానికి ప్రతీక కేసీఆర్
-మహాకూటమి గెలిస్తే కాళేశ్వరం పూర్తవుతుందా?
-ప్రాజెక్టులపై కేసులేసినవాళ్లను ప్రజలు నమ్మడంలేదు
-గుళ్లో లింగాన్నీ మింగే రకం కాంగ్రెస్ నేతలు
-ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామన్న బీజేపీ హామీ ఏమైంది?: మంత్రి కే తారకరామారావు
-అగ్రవర్ణాల్లోని పేదలకు ప్రత్యేక కార్యాచరణకు హామీ
-టీఆర్‌ఎస్‌లో చేరిన కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల ఆర్యవైశ్యులు

తెలంగాణ స్వాభిమానానికి నిలువెత్తు ప్రతీక అయిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకవైపు, ఢిల్లీ గులాములు, అమరావతి బానిసలు మరోవైపు ఎన్నికల బరిలో నిలుచున్నారని రాష్ట్ర ఐటీ పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల విషయంలో ఉద్యమనాయకుడిగా, ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఏనాడూ రాజీపడలేదని, తమకోసం కేసీఆర్ దేవుణ్ణయినా ఎదిరిస్తారని ప్రజలు బలంగా నమ్ముతున్నారని కేటీఆర్ చెప్పారు. టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే ఆ ఓటు కేసీఆర్‌కు పోతుందన్న విశ్వాసం ప్రజల్లో కనిపిస్తున్నదని తెలిపారు. ఒకవేళ పొరపాటున టీడీపీకి ఓటేస్తే అధికారాన్ని అమరావతిలో చంద్రబాబు పాదాల దగ్గర పెడతారని, కాంగ్రెస్‌కు ఓటేస్తే ఢిల్లీ పెద్దల చుట్టూ తిరగడంతోనే సరిపోతుందని పేర్కొన్నారు. కొన్ని ఎమ్మెల్యేల పదవులకు తెలంగాణ ఆత్మగౌరవాన్ని అమరావతిలో తాకట్టు పెడుదామా అని ప్రశ్నించారు. రానున్న రోజుల్లో అగ్రవర్ణాల్లోని పేదలకు ప్రత్యేక కార్యాచరణ అమలుచేయాలని సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారన్నారు. ఆదివారం తెలంగాణభవన్‌లో కామారెడ్డి, ఎల్లారెడ్డ్డి నియోజకవర్గాలకు చెందిన పలువురు ఆర్యవైశ్య సంఘం నాయకులు, కాంగ్రెస్ పార్టీ నేతలు మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయన గులాబీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టును ఆపాలని కేంద్రానికి 30 లేఖలు రాసిన ఏపీ సీఎం చంద్రబాబు, మహాకూటమి గెలిస్తే ఆ ప్రాజెక్టును సాగనిస్తడా అని ప్రశ్నించారు. కోటి ఎకరాల తెలంగాణ సాకారం కాకపోగా రైతుల నోట్లో మట్టి కొడతారన్నారు. అన్ని విలువలకు తిలోదకాలు ఇచ్చి కాంగ్రెస్, టీడీపీ, ఇతరపార్టీలు పొత్తు పెట్టుకొంటున్నాయన్నారు. తెలంగాణ ప్రజలు ఆ పార్టీల మాయలో పడొద్దని చెప్పారు. గతంలో టీఆర్‌ఎస్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా, అది తెలంగాణ ప్రజల ప్రయోజనాలను ఉద్దేశించి పెట్టుకొన్నదేనని స్పష్టంచేశారు. మన రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టులకు అడ్డుపడుతున్న చంద్రబాబుతో పొత్తు పెట్టుకొని తెలంగాణకు అన్యాయం చేయడానికి సిద్ధమవుతున్నారని కాంగ్రెస్‌ను మంత్రి కేటీఆర్ విమర్శించారు.

ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇస్తున్న హామీలు అమలుచేయాలంటే దక్షిణ భారతదేశంలోని ఆరు రాష్ర్టాల బడ్జెట్ కావాలని తెలిపారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పేదవాడికోసం ఒక్క పథకాన్ని కూడా ప్రవేశపెట్టలేకపోయిందని చెప్పారు. రాష్ట్ర విభజన చట్టంలోని హామీలనొక్కదాన్ని కూడా అమలుచేయలేదన్నారు. తాము అధికారంలోకి వస్తే ప్రతి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామన్న హామీ నెరవేర్చలేదని ఎద్దేవాచేశారు. గత ఎన్నికల్లో నరేంద్రమోదీపై నమ్మకంతో ఓటేస్తే.. పెద్ద నోట్ల రద్దుతో మన డబ్బులు మనం తీసుకోవడానికి బ్యాంకుల ముందు క్యూ కట్టాల్సివచ్చిందన్నారు.

నాలుగేండ్లలో 453 పథకాలు
టీఆర్‌ఎస్ ప్రభుత్వం గత నాలుగేండ్లలో 453 కొత్త పథకాలను ప్రవేశపెట్టిందని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఆయుష్మాన్ భారత్ పథకం విషయంలో రాష్ట్రంపై బురద చల్లాలనుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే అమలవుతున్న ఆరోగ్యశ్రీ ద్వారా రాష్ట్రంలో 80 లక్షల మందికి అర్హత ఉంటే ఆయుష్మాన్ భారత్ ద్వారా 25 లక్షల మందికే అర్హత లభిస్తుందని వివరించారు. ఉద్యమ సమయంలో ఆరెస్యూ నుంచి ఆర్‌ఎస్సెస్ వరకు అందరినీ ఏకంచేశామని, ఇప్పుడు మాత్రం బద్ధశత్రువులు ఒక్కటయ్యారన్నారు. ఎట్టికైనా.. మట్టికైనా మనవాడు ఉండాలంటూ జయశంకర్ సారు చెప్పిన మాటల్ని గుర్తుంచుకోవాలని కోరారు.

షబ్బీర్ అలీకి పరాభవం తప్పదు
కామారెడ్డిలో కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీకి మరోసారి పరాభవం తప్పదని మంత్రి కేటీఆర్ అన్నారు. దీనిపై ఆయనకు కూడా స్పష్టత ఉందని చెప్పారు. కోదండరాం పార్టీ అడ్రస్ లేని సంస్థ అని, ఇప్పుడు ఆయన కాంగ్రెస్ మనిషి అయ్యాడని పేర్కొన్నారు. అమరుల ఆకాంక్షలకు అనుగుణంగానే పొత్తు పెట్టుకుంటున్నామని చెప్తున్న కోదండరాం.. ఏ అమరుడు తనను కాల్చిన వారితోనే పొత్తు పెట్టుకొమ్మని చెప్పాడో వివరించాలన్నారు. 119 సీట్లలో పోటీచేస్తామని చెప్పి ముష్టి మూడు సీట్ల కోసం కాంగ్రెస్ చుట్టు పొర్లుదండాలు పెడుతున్నారని ఎద్దేవాచేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అన్ని సీట్లను టీఆర్‌ఎస్ పార్టీ గెలుస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తంచేశారు.

చంద్రబాబు సాగనిస్తడా?
కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకోవడానికి చంద్రబాబు కేంద్రానికి 30 లేఖలు రాశాడని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఒకవేళ మహాకూటమి గెలిస్తే ఆ ప్రాజెక్టులను చంద్రబాబునాయుడు ముందుకుపోనిస్తడా అని ప్రశ్నించారు. గతంలో కేంద్రంలో, రాష్ట్రంలో, మహారాష్ట్రలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రాజెక్టులకు అంతర్రాష్ట్ర అనుమతులు ఎందుకు తీసుకురాలేదో సమాధానం చెప్పాలని నిలదీశారు. కాంగ్రెస్ నేతలు ద్రోహులని, ప్రాజెక్టులపై 186 దొంగకేసులు వేశారని, వాటిని కోర్టుల్లో తేల్చుకున్నామని, ఇక ప్రజాకోర్టులో తేల్చుకోవడానికి సిద్ధమయ్యామని చెప్పారు. గుడిని, గుడిలోని లింగాన్ని మింగే నాయకులు కాంగ్రెస్ నేతలని విమర్శించారు. ఎల్లారెడ్డి తాజామాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి గ్రామం నుంచి టీఆర్‌ఎస్‌లో చేరడానికి పెద్దఎత్తున ముందుకు వస్తున్నారని తెలిపారు. కామారెడ్డి తాజామాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలతో మంచి సంబంధాలు ఉన్నవారు ఆర్యవైశ్యులని, వారు టీఆర్‌ఎస్‌లోకి రావడం శుభపరిణామమని పేర్కొన్నారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపీ బాల్క సుమన్, మాజీ మంత్రి నేరేళ్ల ఆంజనేయులు, ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్‌రెడ్డి, తాజామాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, చింత ప్రభాకర్, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి బక్కి వెంకటయ్య, నిజామాబాద్ డీసీఎంఎస్ చైర్మన్ ముజీబీద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌లో చేరినవారిలో హరీందర్, కొండా హన్మాండ్లు, కంచర్ల లింగం, గిరిధర్ , మామిండ్ల అంజన్న, నర్సింగరావు, కొక్కండ రవీందర్, కొండు బైరన్న, ఎం రమేశ్ తదితరులున్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.