-అయినా ఎన్నికలను తేలికగా తీసుకోవద్దు -ప్రచారంలో జోరు పెంచండి -స్థానిక అవసరాలకు తగ్గట్టుగా మ్యానిఫెస్టోలను ప్రకటించండి -కాంగ్రెస్, బీజేపీలకు అభ్యర్థులు లేరు -వాళ్లకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు -మున్సిపాలిటీలను ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యం -ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలి -మిషన్ భగీరథతో పుష్కలంగా మంచినీరు -మున్సిపల్ అభ్యర్థులతో టెలికాన్ఫరెన్స్‌లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు

మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితికి పోటీయే లేదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. అయినప్పటికీ.. ఎన్నికలను తేలికగా తీసుకోకుండా ప్రచారాన్ని మరింత ఉధృతం చేయాలని అభ్యర్థులకు పిలుపునిచ్చారు. ఎన్నికల్లో పార్టీ తరపున పోటీచేస్తున్న అభ్యర్థులతో మంత్రి కేటీఆర్ గురువారం తెలంగాణ భవన్ నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రచారం నిర్వహించాల్సిన తీరుపై దిశానిర్దేశంచేశారు. గత ఆరేండ్లుగా ప్రజలకు ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధి వారి అనుభవంలో ఉన్నాయని.. వాటిని మరోసారి వివరిస్తే వారు ఓటేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
పింఛన్లు మొదలుకొని, కేసీఆర్ కిట్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, జిల్లాల వికేంద్రీకరణ, సాగునీటి ప్రాజెక్టులు వంటి పథకాలను అభ్యర్థులకు గుర్తుచేశారు. పట్టణాల్లోని ప్రధాన సమస్య అయిన తాగు నీటి కొరతను తగ్గించామని, మిషన్ భగీరథలో భాగంగా బల్క్‌వాటర్ సైప్లె ద్వారా ఇది సాధ్యమైందని చెప్పారు. పట్టణాల్లో 3.75 లక్షల ఎల్ఈడీ లైట్లు ఏర్పాటుచేయడం ద్వారా మున్సిపాలిటీలపైన విద్యుత్ బిల్లుల భారం తగ్గిందని చెప్పారు. పట్టణాలకు బడ్జెట్లో ప్రత్యేక నిధులు ఇస్తున్నామని వివరించారు. ఇప్పటికే యూఎఫ్ఐడీసీ ద్వారా రూ.2500 కోట్లతో పట్టణాల అభివృద్ధికి నిధులు ఇచ్చామని పేర్కొన్నారు. ప్రతి పట్టణానికి నర్సరీ ఏర్పాటుచేయడంతోపాటు, హరితహారం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నామన్నారు.
రాష్ట్రంలోని అన్ని పురపాలికలను దేశంలోనే ఆదర్శవంతమైన మున్సిపాలిటీలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో కొత్త పురపాలకచట్టాన్ని తీసుకువచ్చామని, దీనిద్వారా పౌరులకు పారదర్శకమైన, వేగవంతమైన సేవలను అందిస్తామని చెప్పారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ తిరుగులేని విజయం ఖాయమని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తంచేశారు. కాంగ్రెస్, బీజేపీలు అభ్యర్థులు లేక, అన్నిచోట్ల పోటీపడలేకపోయాయని చెప్పారు. ఆయా పార్టీల క్యాడర్‌లోనూ ఉత్సా హం కనిపించడంలేదన్నారు. ఈ రెండు పార్టీలకు పట్టణాల్లో ఓట్లు అడిగే నైతికహక్కు లేదని, కాంగ్రెస్ హయాంలో చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, ఖర్చుచేసిన నిధులను పోల్చుకొంటే.. టీఆర్ఎస్ ప్రభుత్వం పది రెట్లు పట్టణాలకోసం కేటాయించిందని చెప్పారు. కాంగ్రెస్ చేసిన అభివృద్ధికి, టీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని బేరీజువేసుకొని ఓట్లు వేయాల్సిందిగా ప్రజలను కోరాలని కేటీఆర్ అభ్యర్థులకు సూచించారు. కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటికీ.. బీజేపీ ఇప్పటిదాకా ఒక్కరూపాయి కూడా ప్రత్యేక నిధులను పట్టణాలకు తేలేకపోయిందన్నారు.
ప్రచారంలో అలసత్వం వద్దు పార్టీ అభ్యర్థులు గెలుపు మనదే అన్న ధీమాతో ప్రచారంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించవద్దని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. పార్టీ బీ ఫారం కోసం ప్రయత్నంచేసిన తోటి నాయకులను కలుపుకొని ఐక్యంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. వార్డుల్లో ఉన్న పార్టీ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాలు వెంటనే ఏర్పాటుచేయాలని, పార్టీ అభ్యర్థులు ఈ నాలుగు రోజుల్లో కనీసం మూడు నుంచి ఐదుసార్లు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాల సమాచారాన్ని అందించి ఓట్లు అడగాలని చెప్పారు. ప్రతి వార్డు.. పట్టణాల అవసరాల మేరకు స్థానిక మ్యానిఫెస్టోలను విడుదలచేయాలన్నారు.
ఎన్నికల పర్యవేక్షణ లో భాగంగా కేంద్ర పార్టీ కార్యాలయం ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటుందని, ఎక్కడైనా సమన్వయం అవసరం అయితే పార్టీ సహకరిస్తుందని హామీ ఇచ్చారు. ప్రస్తు తం అందుతున్న నివేదికల ప్రకారం టీఆర్ఎస్ పార్టీ విజయం తథ్యమన్నారు. ఫలితాల తర్వా త గెలిచిన అభ్యర్థులతో సమావేశమవుతానని కేటీఆర్ తెలిపారు. టెలికాన్ఫరెన్స్ ద్వారా ఉమ్మడి పది జిల్లాల నుంచి ఒక్కో అభ్యర్థితో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడా రు. నిజామాబాద్, రామగుండం, మహబూబాబాద్, మహబూబ్‌నగర్ సహా పలు మున్సిపాలిటీల నుంచి పోటీచేస్తున్నవారినుంచి సమాచారాన్ని తెలుసుకొన్నారు. ప్రచారం జరుగుతున్న తీరు, ప్రజల నుంచి వస్తున్న స్పందన, నాయకుల సహకారం, సమన్వయం తదితర అంశాలపై చర్చించారు.
నా తరఫున మాట ఇవ్వండి పురపాలకశాఖ మంత్రిగా కూడా ఉన్న కేటీఆర్ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులతో మాట్లాడుతున్నపుడు వారికి ఎదురవుతున్న సమస్యలపై ప్రధానంగా దృష్టిసారించారు. సమస్యల పరిష్కారానికి హామీలు ఇవ్వాలని, వాటిని నెరవేర్చే బాధ్యత తనదని చెప్పారు. జవహర్‌నగర్‌లో డంపింగ్‌యార్డు గురించి అభ్యర్థుల తో మాట్లాడుతూ.. డంపింగ్‌యార్డు సమస్య శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకోబోతున్నట్టు చెప్పారు. ప్రభుత్వం దగ్గర రూ.150 కోట్లతో దీనికి సంబంధించిన ప్రణాళిక ఉన్నద ని చెప్పాలని అక్కడి నేతలకు చెప్పారు. టెలికాన్ఫరెన్స్‌లో పాల్గొన్నవారందరూ చెప్పేది సావధానంగా విని వారికి పార్టీ తరఫున గెలుపు వ్యూహాలను వివరించారు.

మతకోణం దేశానికి మంచిదికాదు -ఎన్నార్సీ అమలుపై రాష్ట్రప్రభుత్వానికి సమాచారం లేదు -సీఏఏపై మా వైఖరిని పార్లమెంట్‌లోనే చెప్పాం -మున్సిపోల్స్‌లో బీజేపీకి అభ్యర్థులు కూడా లేరు -మీడియాతో ఇష్టాగోష్ఠిలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
దేశ ప్రజలను మతప్రాతిపదికన విభజించడం సరికాదని.. పౌరులను మతకోణంలో చూడటం దేశానికే మంచిదికాదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. ఎన్నార్సీ అమలుపై ప్రస్తుతానికి రాష్ర్టానికి ఎలాంటి సమాచారం లేదని, సీఏఏపై తమ వైఖరిని పార్లమెంట్‌లోనే స్పష్టంచేశామని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో టీఆర్ఎస్ బరిలో నిలిచిందని.. బీజేపీకి కనీసం అభ్యర్థులు కూడా దొరుకలేదని చెప్పారు. కొత్త మున్సిపల్ చట్టం ద్వారా పారదర్శకమైన పాలన అందించాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
మంత్రి కేటీఆర్ గురువారం తెలంగాణభవన్‌లో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఎన్నార్సీపై దేశ ప్రజలకు ఉన్న అనుమానాలు, అపోహలను నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైనే ఉన్నదని అన్నారు. ఎన్నార్సీ, ఎన్పీఏ అమలుపై తనకు తెలిసినంతవరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం లేదని.. అందిన తర్వాత వీటిపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ఇతర రాష్ట్రాలు తీసుకునే నిర్ణయాలు తమపై ప్రభావం చూపలేవని.. తెలంగాణ రాష్ట్ర అవసరాలకు అనుగుణంగానే సీఎం కేసీఆర్ నిర్ణయం ఉంటుందని చెప్పారు.
సీఏఏపై ఇప్పటికే పార్లమెంట్లో స్పష్టమైన వైఖరిని ప్రకటించామని తెలిపారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు రాజ్యసభలో, లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు దిగువసభలో సీఏఏను వ్యతిరేకించారని గుర్తుచేశారు. కొత్త మున్సిపల్ చట్టం ద్వారా ప్రజలకు పారదర్శక పాలన అందుతుందని, ఇంటి అనుమతులు అవినీతిరహితంగా అందేలా బీపాస్ విధానాన్ని తీసుకొచ్చినట్టు కేటీఆర్ చెప్పారు. పట్టణాలకు పెద్ద ఎత్తున నిధులు విడుదల చేశామని, ప్రధానమైన తాగునీరు, కరంటు, తదితర సమస్యలను పరిష్కరించామని తెలిపారు. ఎన్నికలు పూర్తయ్యాక పట్టణ ప్రగతిని అమలు చేస్తామని వివరించారు. పంచాయతీలకు ఇచ్చినట్టే పట్టణాలకు కూడా నిధులు ఇస్తామని.. ఏడాదికి రూ.216 కోట్లు ఇచ్చేందుకు రాష్ట్రప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నదన్నారు.
మరోసారి బయటపడ్డ కాంగ్రెస్, బీజేపీ పొత్తు రాష్ట్రంలో జరుగుతున్న పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీల పొత్తు మరోసారి బయటపడిందని మంత్రి కేటీఆర్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలోనూ రెండుపార్టీలూ కొన్నిచోట్ల ఇలాగే చేశాయని తెలిపారు. మున్సిపోల్స్‌లో టీఆర్ఎస్ సింహభాగం స్థానాలను దక్కించుకుంటుందని ధీమా వ్యక్తంచేశారు. బీజేపీ తరఫున పోటీచేయడానికి కనీసం అభ్యర్థులు లేరని ఎద్దేవాచేశారు. కాంగ్రెస్ కూడా చాలాస్థానాల్లో అభ్యర్థులను నిలుపలేకపోయిందని అన్నా రు. రెండు జాతీయపార్టీల పరిస్థితి ఒకేలా ఉన్నదని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ అన్నిస్థానాలకు నామినేషన్ వేసిందని.. స్థానిక ఎమ్మెల్యేలు బీ ఫారాలు జారీచేశారని తెలిపారు. ఒక్కోస్థానంలో అభ్యర్థుల నుంచి పోటీ ఎక్కువగా ఉండటంతో టికెట్టు దక్కనివారికి సర్దిచెప్పాల్సి వచ్చిందని అన్నారు. రాజకీయభవిష్యత్‌పై భరోసా కల్పించడంతో చాలామంది పార్టీ అభ్యర్థుల గెలుపునకు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.